మండుటెండలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర
కారు ఓ బస్ స్టాప్ పక్కన ఆగింది. మూడు
నాలుగు నిమిషాలన్నా వేచి ఉండక తప్పదు. కారు ఏసీ అయినా ఎండ పీడ తగ్గించుకోవడానికి సీట్లోనే
పక్కకి జరిగి కూర్చుంటుంటే ఆ దృశ్యం కళ్ళబడింది. ద్విచక్ర వాహనం మీద మొగుడూ పెళ్ళాం,
ఇద్దరు చిన్న పిల్లలు, ఎడ పిల్ల మరీ చంటిది. తల్లి బండి దిగి పిల్లల్ని కాసేపయినా
నీడను నిలుపుదామని బస్ స్టాప్ షెల్టర్ కిందకు వెళ్ళింది. ఎండ దెబ్బకు తట్టుకోలేక చంటిది
గుక్కపట్టి ఏడుస్తోంది. ఆ పిల్ల నెత్తికి ఓ గుడ్డచుట్టి తెచ్చుకున్న సీసాలో నీళ్ళు
ఆ పసిదాని మాడు మీద చల్లుతోంది. పెద్ద పిల్ల దప్పిక ఆపుకోలేక అమ్మ చేతిలో సీసా
లాక్కుని ఆబగా తాగుతోంది.
ఈ లోగా పచ్చ లైటు వెలిగింది. తండ్రి
సైగ చేయడంతో తల్లి గాభరాగా పిల్లలతో వచ్చి ఆ బండి ఎక్కలేక అవస్థ పడుతోంది. వెనక
నుంచి అదేపనిగా హారన్లు. దాంతో అవిడ గాభరా మరింత పెరిగింది.
మరి యెంత అవసరం వుండి ఇంత ఎండ పూటన
ప్రయాణం పెట్టుకున్నారో తెలవదు. ఆ బాధ కంటే, వెనుకవాళ్ళ అసహనం మరింత బాధ
పెట్టింది. నిమిషం తాళలేని ఓపికలేని జీవితాలాయె!
2 కామెంట్‌లు:
మనుష్యులలో అసహనం ఎంతగా పెరిగిపోయిందో తరచు కనిపిస్తూనే ఉంటుంది ఈనాటి సమాజంలో.
ఎప్పుడో ఓ చోట చదివినది గుర్తొచ్చింది. ప్రపంచంలో అతి తక్కువ least / shortest time-gap ఏదంటే ట్రాఫిక్ సిగ్నల్ పచ్చలైటు రాగానే మన కారు వెనకనున్న కారుడ్రైవర్ తన హారన్ మోగించడానికి పట్టే టైము 🙂. చెప్పడం సరదాగానే చెప్పినా ఏమాత్రం సత్యదూరం కాదనిపిస్తుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి