1, డిసెంబర్ 2016, గురువారం

మోడీ గెలవాలి


నల్లధనంపై మొదలు పెట్టిన పోరాటంలో నరేంద్ర మోడీ గెలవాలి. గెలిచి తీరాలి. ఇది మోడీ అభిమానులు కోరుకుంటున్నదే కాదు ఆయన్ని నరనరాన ద్వేషించే వాళ్ళు  సైతం ఇదే  కోరుకుంటున్నారు. ఎందుకంటే మోడీ ఈ ప్రయత్నంలో  విఫలం అయితే ఆ ప్రభావం ఆయనకూ, ఆయన పార్టీకి మాత్రమే  కాదు యావత్  దేశానికీ చుట్టుకుంటుంది. ప్రపంచ దేశాల్లో ఈనాడు ఎన్నదగిన ఆర్ధిక శక్తిగా ఎదుగుతూ వస్తున్న భారత దేశం కొన్ని దశాబ్దాలు వెనక్కు పోతుంది. మళ్ళీ కోలుకోవాలన్నా, కనీసం ఈనాడు వున్న స్తితికి చేరుకోవాలన్నా ఏండ్లూపూ౦డ్లూ పట్టే ప్రమాదం వుంది. కారణం మోడీ స్వారీ చేస్తున్నది భయంకరమైన, జాతిని పీల్చి పిప్పి చేస్తున్న నల్లధనం అనే రక్కసి పులి మీద. మోడీ జయిస్తే పరవాలేదు. కానీ పులిదే పై చేయి అయితే, పరవాలేదు అని చెప్పుకోవడానికి కూడా ఏమీ మిగలదు. నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ చెప్పినా, విధి వశాత్తు రాజకీయాల్లోకి వచ్చిన సుప్రసిద్ధ ఆర్ధిక వేత్త మన్మోహన్ సింగ్ చెప్పినా ఇదే!

అభిమాన దురభిమానాలు పక్కనబెట్టి, రాజకీయాలకు అతీతంగా  మోడీ విజయం సాధించాలని మనసారా కోరుకుందాం. మనకోసం కాదు మన దేశ భవిష్యత్తు కోసం. భవిష్యత్ తరాల భద్రతకోసం. 

గుర్తుకొస్తున్నాయి ....


డెబ్బయ్యవ దశకంలో బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేసే రోజుల్లో జీతం నెలకు నికరంగా కోతలు పోను తొంభయ్ రూపాయలు. గ్యాస్ సిలిండర్ పాతిక లోపు. వూళ్ళో  అందరికీ గ్యాస్  కొరత వున్నా జర్నలిష్టు ఉద్యోగం కాబట్టి ఫోను చేయగానే గంట వ్యవధిలో కొత్త సిలిండరు పంపేవాళ్ళు. అది సరే కాని పాతిక పరకలమాటేమిటి? అదే కదా అసలు సమస్య జర్నలిష్టులకు. ‘ఐ నో పీఎం, ఐ నో సీఎం’ కబుర్లు ఇక్కడ ఉడకవు.
ఆఫీసులో సహోద్యోగి ఉపేంద్ర దగ్గరలోనే వుండేవాళ్ళు. ఇలాంటి అవసరం పడితే తప్ప ఒకళ్ళ గడప తొక్కే రకం కాదు నేను. వచ్చిన పని నేను పనిమాలా  చెప్పకపోయినా, నా మొహం చూసి ఆయన  ఇట్టే కనుక్కునేవాడు. లోపలకు వెళ్లి ఓ పాతిక రూపాయలు తెచ్చి నా చేతిలో పెట్టేవాడు. అప్పటికి గండం గడిచేది. సిలిండర్ ఇంటికి వచ్చేది. వున్నది ఇద్దరమే కనుక మరో మూడు నెలల వరకు ఉపేంద్ర గారి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వుండేది కాదు.
మళ్ళీ ఇన్నేళ్ళకు డబ్బు అవసరం పడింది. ఈసారి వింత  ఏమిటంటే, అప్పు అడిగేవాడిదగ్గరా డబ్బుకు లోటు లేదు. అప్పు ఇచ్చేవాడి దగ్గరా డబ్బుకు కరువు లేదు. వున్న చిక్కల్లా ఆడబ్బు వారిద్దరి దగ్గరా  లేదు. బ్యాంకులో వుంది. కానీ అది అవసరానికి ఆదుకునేట్టు లేదు.

ప్రైవేటు గ్యాస్ కంపెనీలు ఆన్ లైన్ పేమెంట్ ఏర్పాట్లు చేశాయంటున్నారు. ఎంతయినా దేశం అంటే కాస్త భక్తి కదా!అంచేత  పబ్లిక్ రంగం గ్యాస్ కంపెనీలను నమ్ముకున్నాము. వాళ్ళేమో  మాలాగే పాతకాలం బాపతు. ఏం చేస్తాం!       

ఎవరు చేసిన ఖర్మ....


చిన్నతనంలో చేసిన తప్పులు గుర్తుకు వస్తున్నాయి.
“అక్కయ్య ఉత్తరం రాసింది. కాస్త చదివి పెట్టరా!” అంటూ కార్డు ముక్క చేతిలో పెడుతూ అడిగేది అమ్మ. భారత భాగవతాదులు ఆమెకు కంఠతా వచ్చు. కానీ చదవలేదు, రాయలేదు. ఓ బెల్లం ముక్క ఆశ పెడితే కానీ కార్డులో ఏముందో చదివి పెట్టేవాణ్ని కాదు. అప్పుడు అమ్మ నాతొ యెంత అవస్థ పడిందో ఇదిగో ఇప్పుడు అరవై ఏళ్ళ తరువాత తెలిసివస్తోంది.
కంప్యూటర్ మీద పనిచేయడం రాదా అంటే వచ్చు. అది మధ్యలో మొరాయిస్తే ఏం చేయాలో తెలియదు. పిల్లల్ని అడిగితే కాదనరు కానీ వాళ్ళ తొందర్లో వాళ్ళు వుంటారు. తమకు తెలిసింది చెబుతారు. తలకు ఎక్కకపోయినా తెలిసినట్టు తలూపుతాము. ఎందుకంటే ఎంతయినా వాళ్ళకంటే పెద్దవాళ్ళం కదా!
మొబైల్ బిల్లు కట్టాలి. పిల్లలు చెప్పినట్టే అన్ని స్టెప్పులు వేస్తాం. చివర్లో ఓటీపీ అంటుంది. మొబైల్ కు వస్తుంది. అది చూసుకుని మళ్ళీ కంప్యూటర్లో తల దూర్చేసరికి టైం అయిపోతుందో ఏమో మళ్ళీ కొత్త ఓటీపీ అంటుంది. ఈసారి సరిగానే సరి చూసుకుని టైప్ చేసి సబ్మిట్ నొక్కుతాము. అమ్మయ్య పనయి పోయిందని సంతోషపడేలోగా ఎర్ర్రర్ అని వస్తుంది. కధ మళ్ళీ మొదలు.
ఇంతకీ  డబ్బు పోయినట్టా, అసలుకే పోయినట్టా!  కొత్త మనాది మనదవుతుంది.

అమ్మా! ఎక్కడున్నావమ్మా! అప్పుడు ఏడిపించినందుకు ఇప్పుడు నవ్వుకుంటున్నావా తల్లీ!  

30, నవంబర్ 2016, బుధవారం

భయమా! గౌరవమా!


పూర్వం సినిమాహాళ్ళలో విధిగా జాతీయ గీతం వేసేవాళ్ళు. జనం అందరూ గౌరవపురస్సరంగా లేచి నిలబడేవారు. ఆ తరువాత అ పద్దతికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు సుప్రీం ఆదేశం అంటున్నారు. చూడాలి.
వెనుక మాస్కోలో వున్నప్పుడు ఒక జోక్ చెప్పుకునేవారు (పెరిస్త్రోయికా కాలంలో)
సోవియట్ యూనియన్ లో స్టాలిన్ హవా నడిచేరోజుల్లో ప్రతి సినిమా హాల్లో ఆటకు ముందు స్టాలిన్ బొమ్మ వేసేవాళ్ళు. వెంటనే జనం అందరూ లేచి సాల్యూట్ చేసేవాళ్ళు.
ఒకరోజు స్టాలిన్ సినిమాకి వెడితే యధాప్రకారం జనం నిలబడి సాల్యూట్ చేశారు. అది తనే కనుక స్టాలిన్ నిలబడలేదు. గర్వంగా పక్కవాడితో అన్నాడు.
“స్టాలిన్ అంటే అంత గౌరవమా!” అని.
చీకట్లో గుర్తుపట్టలేదు కాబోలు జవాబు ఇలా వచ్చింది.

“గౌరవమా పాడా! భయం. నిలబడకపోతే సైబీరియా మంచు ఎడారుల్లో ఒదులుతాడు ఆ  పాపిష్టోడు.”     

మంచికోసం అయితే మార్పు మంచిదే!


స్వాతంత్రం  వచ్చిన  పదేళ్లకు 1957 లో దేశంలో డెసిమల్ పద్దతిలో కొత్త నాణేలను ప్రవేశ పెట్టారు. మా చిన్న తనంలో తళతళ మెరిసే నయా పైసాలు వచ్చాయి. జనాలకు కొత్త నాణేలు  అలవాటు అయ్యేవరకూ అప్పటివరకు చెలామణీ లో వున్న అర్ధరూపాయలు, పావలాలు, బేడలు, అణాలు,అర్ధణాలు, కాణీలు, చిల్లు కాణీలను కూడా చెలామణీ లోనే ఉంచారు. కాలక్రమంలో అవి కనుమరుగయిపోయాయి. అలాగే తూకాలకు వాడే  వీసెలు, తులాల  స్థానంలో కిలోగ్రాములు, శేర్లు, గిద్దెల స్థానంలో లీటర్లు రంగప్రవేశం చేసాయి. దూరాలకు వాడే మైలురాళ్ళ కొలమానాన్ని కిలోమీటర్లు ఆక్రమించాయి. అప్పటికి దేశంలో నూటికి తొంభయి శాతం జనాభా అంగుష్ఠ మాత్రులు. అంటే నిశానీదారులు. వేలి ముద్ర తప్ప సంతకం చేయడం కూడా రాని నిరక్షరాస్యులు. అయినా మార్పును సంతోషంగా ఆహ్వానించారు. ఎలాటి ఇబ్బందీ లేకుండా అలవాటు పడ్డారు.
స్వతంత్ర భారతంలో వచ్చిన మరో గొప్ప మార్పు ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడడం. వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించారు. మొదట్లో పోటీలో వున్న ప్రతి పార్టీకీ (అభ్యర్ధికీ) ఒక్కో గుర్తు కేటాయించేవారు. కాంగ్రెస్ పార్టీకి  కాడి జోడెడ్లు, కమ్యూనిష్టులకు కంకీ కొడవలి, సుత్తీ కొడవలి ఇలా. ప్రతి గుర్తుకూ విడివిడిగా బ్యాలెట్ బాక్సులు ఉండేవి. ఖాళీ కిరోసిన్ డబ్బాలకు కాగితం అంటించి దానిపై పార్టీ గుర్తు అతికించే వారు. తరువాత ప్రతి డబ్బాను తెరిచి ఓట్లు లెక్కబెట్టి ఫలితం ప్రకటించేవాళ్ళు. దరిమిలా బ్యాలెట్ పత్రాలు వచ్చాయి. అభ్యర్దులందరి పేర్లు ఒకే బ్యాలెట్ పై వుండేవి. తరువాత పేర్లు కూడా తీసేసి కేవలం గుర్తులు మాత్రమే ఉంచేవాళ్ళు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటువేసిన తరువాత దాన్ని బ్యాలెట్ పెట్టెలో వేసేవాళ్ళు. ఆ తరువాత ఎలక్ట్రానిక్  ఓటింగ్ మిషన్లు వచ్చాయి. ఓటర్లలో అధిక శాతం నిరక్షరాస్యులు అయినప్పటికీ కాలం తెస్తున్న మార్పులకు బాగా అలవాటుపడ్డారు. కొత్త విషయాలను సులువుగా గ్రహించడానికి చదువు అక్కరలేదని నిరక్షర భారతం పలుపర్యాయాలు నిరూపించి చూపింది.
ఇంతేనా అంటే ఇంకా వుంది.
పూర్వం టూరింగు టాకీసుల్లోనే కాకుండా, మంచి సినిమా థియేటర్లలో కూడా జనాలు చుట్టలు, బీడీలు, సిగరెట్లు తాగేవాళ్లు. పొగతాగరాదు అని స్లయిడ్లు వేసేవాళ్ళు కానీ ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు. తరువాత ఎయిర్ కండిషన్  ధియేటర్లు వచ్చాక సినిమా హాల్లో పొగతాగ కూడదు అనే సంగతిని సామాన్య జనం ఒకరిని చూసి మరొకరు నేర్చుకున్నారు. జరిమానాలు, శిక్షల బెదిరింపుల వల్లకాదు. అంటే ఏమిటి? మార్పును ఆహ్వానించే తత్వం జనంలోనే  వుంది. వాళ్ళు మార్పుకు ఏనాడు వ్యతిరేకులు కాదు.
ఇప్పుడు డబ్బు మార్పిడికి సెల్ ఫోన్లు వాడమంటున్నారు. తప్పకుండా వాడుతారు. అయితే ఇంతకు  ముందు చెప్పిన వాటికీ దీనికీ ఓ స్థూలమైన తేడా వుంది. అవి జనం చేతులో వున్నాయి. ఇదలా కాదు. ఇంటర్నెట్ అవసరం. అదీ ఎలాంటి అవాంతరాలు లేకుండా.
నెట్ ఉపయోగించడానికి జనం సిద్ధంగానే వున్నారు. అయితే నెట్ అందరికీ అందుబాటులో ఉందా అనేదే అసలు ప్రశ్న.     

ఏలికలు సమాధానం చెప్పాలి.

29, నవంబర్ 2016, మంగళవారం

నాకు పరిష్కారం దొరికింది. కానీ......


ఇరవై ఒక్క రోజుల అనుభవం నన్ను కాస్తో కూస్తో ‘నెట్’ అక్షరాస్యుడిని చేసింది. పిల్లల సాయంతో మొత్తానికి నా బ్యాంకు ఖాతాను నా మొబైల్ ఫోనుతో అనుసంధానం చేయగలిగాను. ఊబెర్ అనాలో ఒబెర్ అనాలో ఏదైతేనేం ఒక కారు బుక్ చేసి దిగాల్సిన చోట దర్జాగా దిగిపోయాను. జేబులో చేయి పెట్టేపని లేకుండానే ట్రాన్సాక్షన్ చిటికెలో జరిగిపోయింది. దిగుతూ డ్రైవర్ మొహంలోకి చూసాను. దిగాలుగా వున్నాడు. కదిలిస్తే కధ చెప్పాడు.
“పెద్ద నోట్ల రద్దుకు పూర్వం అందరూ టాక్సీ ఫేర్ చెల్లించి దిగి పోయేవాళ్ళు. ఇప్పుడందరూ ఇలా పే చేసేసి  వెళ్ళిపోతున్నారు. వెనక డీసెల్ కొట్టించుకోవడానికి పాసింజర్లు ఇచ్చే పైకం డబ్బులు ఉండేవి. ఇప్పుడా డబ్బులు మా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. డ్రా చేసుకోవాలంటే ఓ పూట పనిపోతోంది. పెట్రోలు బంకుల్లో మాకు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. చేసారేమో తెలవదు. ‘చేతుల్లో ఎప్పుడూ  స్మార్ట్ ఫోన్లు వుంటాయి, ఈ మాత్రం తెలవదా’ అంటే తెలవదు సారూ”  

ఏం చెప్పను? నాదీ అదే పరిస్తితి.

28, నవంబర్ 2016, సోమవారం

ఫస్ట్ కామెంట్


పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, కొద్దిసేపటి క్రితం ముగిసిన  విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు గమనిస్తే, ఆర్ధిక గణాంకాలను ఆశువుగా పేర్కొన్న తీరును పరిశీలిస్తే  ఆయన ఈ అంశంపై చాలా కసరత్తు చేసినట్టు,  సంపూర్ణ అవగాహనతో వున్నట్టు మొదటి అభిప్రాయం కలుగుతుంది.
ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు అధికారికంగా ఓ పక్క ప్రకటిస్తూనే మరో పక్క వినయపూరితమైన హెచ్చరిక చేశారు.
“నూటికి నూరు శాతం అవినీతి రహిత, వందకు వంద శాతం నల్ల ధనం రహిత భారతం లక్ష్యంగా ఈ పధకం అమలు జరగాలి. అప్పుడే ఇది సఫల ప్రయోగం అనిపించుకుంటుంది. లేదా విఫల ప్రయోగం అనే అపప్రధను మోయాల్సి వుంటుంది. అలా జరగడం జాతికి మేలు చేయదు” అని స్పష్టంగా చెప్పారు.

ఈ నిర్ణయం అమలు పర్యవేక్షణకు కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నేతృత్వం అప్పగించడం పై అడిగిన ప్రశ్నకు ‘మంచిదేగా’ అంటూ ఇచ్చిన కేసీఆర్ సమాధానం హుందాగా వుంది.