4, జనవరి 2015, ఆదివారం

ఆఫ్ ది రికార్డ్


టీవీ చర్చల విరామ సమయంలో లేదా చర్చలకు, ముందూ తరువాత జరిగే తేనీటి సమావేశాల్లో రాజకీయ నాయకుకులు అనేక ఆసక్తికరమైన విశేషాలు చెబుతుంటారు. వాటిల్లో నిజం పాలెంతో తెలియదు కాని, విన్నప్పుడు నిజమేనేమో అనిపించేలా వుంటాయి ఆ కబుర్లు.  అలాటి ఉదంతం ఒకటి.
చాలా ఏళ్ళ కిందటి సంగతి. అధికార  పార్టీలో  పైకి వచ్చిన నాయకుడొకరు, అప్పుడప్పుడే పైకి వస్తున్న మరో ఛోటా నాయకుడికి గిరీశంలా రాజకీయ గీతాబోధ చేసాడిలా.



'నాయనా! రాజకీయాల్లో పైకి రావడానికి ఎన్నో కావాలి. కానీ నా అనుభవం మీద చెబుతున్నాను. అన్నింటిలోకి అతి ముఖ్యమైనది మీడియా మేనేజిమెంటు'
'మేనేజిమెంటు అంటే ఏమిటి గురువుగారూ?' అడిగాడు చోటా నాయకుడు.
'అది తరువాత చెబుతా కాని మన జిల్లా రిపోర్టర్ పలానా వాడు వున్నాడు చూసావు కదా. అతడికేదో డబ్బవసరం పడినట్టువుంది. నేను ఇచ్చానని చెప్పి ఈ ఇరవై  వేలు అతడికి ఇచ్చిరా. అలాగే, మన సీఎం గారి కారు డ్రైవర్ వున్నాడు తెలుసు కదా! అతడింటికి వెళ్ళి ఈ ఇరవై వేలూ  నేనిచ్చానని చెప్పి ఇచ్చేసిరా' అన్నాడు.
ఛో.నా.,  బ. నా. చెప్పినట్టే వెళ్ళి చెప్పిన పని చప్పున చేసేసి తిరిగొచ్చిఆ సంగతి చెప్పాడు. చెప్పి తన మనసులో తొలుస్తున్న సందేహం బయట పెట్టాడు.
'రిపోర్టర్ కు ఇవ్వమన్నారు. సరే. బాగుంది. వాళ్ళకు మనతో, మనతో వాళ్లకు సవాలక్ష పనులుంటాయి. కానీ సీ ఎం గారి కారు డ్రైవర్ సంగతే నా మట్టి బుర్రకు  అర్ధం అయి చావలేదు'
'అదేమరి.  నేర్చుకో అని చెప్పింది అందుకే. సీఎం గారిని మన పార్టీ కార్యకర్తలు ఎక్కడ కలుస్తారు ? ఆయన కారు ఎక్కుతున్నప్పుడో, దిగుతున్నప్పుడో కదా!  మామూలు వాళ్ళకి  అవకాశం అలాటప్పుడే   దొరుకుతుంది. మరి ఆయన కంట్లో పడాలంటే సీఎం గారి  కారు కాసేపు అక్కడే  ఆగాలి. ఆగాలి అంటే డ్రైవర్ కారు ఆపాలి. ఆపాలి అంటే  డ్రైవర్ ని మనం  మంచి చేసుకోవాలి.  అప్పుడే, మనం కనబడగానే, డ్రైవర్  కాలు, కాసేపు బ్రేక్ మీద నొక్కిపెడతాడు. అర్ధం అయిందా? సమ్జే!  అండర్ స్టాండ్!' అన్నాడు అన్ని భాషల్లో  బ. నా.
'అయింది మహాప్రభో!'  అనేసాడు ఛో.నా.
(తోకటపా: ఎవరా ఛో.నా. ? ఎవరా బ.నా.? ఇంతకీ ఎవరా రిపోర్టర్? ఇలాటి ప్రశ్నలు దయచేసి అడక్కండి. చెప్పినాయన చెప్పలేదు. అలా అడిగే అలవాటులేని నేనూ అడగలేదు, విని వూరుకున్నంత సుఖం మరోటి లేదు)
NOTE: Cartoon Courtesy SREE BAPU

బుద్దొచ్చింది దేవుడా బుద్దొచ్చింది


ఏకాంబరం ఎంతో ఏకాగ్రతతో తపస్సు చేసాడు. అతడి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై  వరం కోరుకొమ్మన్నాడు పరమేష్టి.
'పరమేశా! మా ఆవిడ పరమ బద్ధకస్తురాలు. నేను పగలల్లా ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తాను. ఆవిడేమో టీవీలో సీరియళ్ళు చూస్తూ ఎంచక్కా కాలక్షేపం చేస్తుంటుంది. ఒక్కరోజు మేమిద్దరం పరకాయ ప్రవేశం చేసేలా అనుగ్రహించు. నేను పడే కష్టం ఏమిటో ఆవిడకు తెలిసిరావాలి' అన్నాడు ఆత్రంగా. 'ఓస్ ఇంతేనా' అంటూ వరం ఇచ్చేసి పరమేశ్వరుడు కైలాసం వెళ్లాడు.
ఆ రాత్రి కలలు కంటూ నిద్రపోయిన ఏకాంబరం, తెల్లారి లేచేసరికి, ఒక ఆడదానిగా కళ్ళు తెరిచాడు.
మొహం కూడా కడుక్కోకుండానే వంటింట్లోకి వెళ్ళి మొగుడికి బ్రేకఫాస్ట్ తయారు చేసాడు. పిల్లల్ని లేపి మొహాలు కడిగించాడు. స్నానాలు చేయించి స్కూలు యూనిఫారాలు వేయించి టిఫిన్ తినిపించి, మధ్యాహ్న భోజనం బాక్సుల్లో సర్ది, వాళ్లని స్కూల్లో దింపి, తిరిగివస్తూ పచారీ సామాను దుకాణంలో ఇంటికి కావలసినవి కొనుక్కుని తిరిగివచ్చేసరికి ఇంట్లో తీరికలేని పని సిద్దంగా వుంది. ఉతకాల్సిన దుస్తులు వాషింగు మెషిన్ లో వేసి, అంట్ల గిన్నెలు కడిగి, ఇల్లంతా తుడిచి అన్నం పళ్ళెం ముందు పెట్టుకునేసరికి పిల్లలు ఇంటికి వచ్చే సమయం అయింది. ఆదరాబాదరాగా నాలుగు ముద్దలు నోట్లో కుక్కుకుని, స్కూలుకి వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి బట్టలు మార్పించి నాలుగు తినుబండారాలు వాళ్ల  ముందు పెట్టి, ఉతికిన బట్టలు ఇస్త్రీ చేసి టైం చూసుకుంటే  సాయంత్రం ఆరుగంటలు. ఆయన ఆఫీసునుంచి ఇంటికి వచ్చే సమయం. లేచివెళ్ళి వేడిగా పకోడీలు చేసి, కాఫీ డికాక్షన్ సిద్దం చేసేసరికి ఉస్సురుస్సురంటూ పతి దేవులు తయారు. మళ్ళీ వొంటిట్లో దూరితే రాత్రి భోజనాలు తయారుచేసే పని. కుక్కర్ స్టవ్ మీదకు ఎక్కించి చూస్తే పెరుగు తోడుకోలేదు. అది లేకపోతే పిల్లలకు ముద్ద దిగదు. పరుగు పరుగున బజారుకు వెళ్ళి డబ్బా పెరుగు కొనుక్కువచ్చి పిల్లలకు తినిపించి పడుకోబెట్టేసరికి రెండో మూడో పెగ్గులు బిగించిన భర్తగారు ఆవురావురుమంటూ అన్నానికి సిద్ధం. ఆయనకు పెట్టి, నాలుగు మెతుకులు తాను కొరికి, అంట్ల పళ్ళేలు సింకులోవేసి, వంటిల్లు తుడిచి చీరె మార్చుకుని, తలలో పూలు తురుముకుని  పడక గది చేరేసరికి పదిగంటలు. నడుం వాలుద్దామంటే మొగుడు వూరుకునే మొగుడు కాదాయె.   అలా రోజంతా అందర్నీ కనుక్కుంటూ, అందరికీ అన్నీ చేసిపెట్టి, చూసిపెట్టి కునుకుతీసి లేచేసరికి మళ్ళీ బండెడు పని,  ఇంటెడు చాకిరీ చెప్పాపెట్టకుండా తయారు.
'అమ్మో యేమో అనుకున్నాను. భార్యలు కాలు మీద కాలు వేసుకుని టీవీలు చూడడమే వాళ్ల పని అనుకున్నా కాని, వాళ్లకు  వొళ్ళు విరిగే ఇంత పని వుంటుందని కలలో కూడా అనుకోలేదు' ఏకాంబరం  ఆలోచనలు ఇలా సాగుతుండగానే అతగాడికి  పరమేశ్వరుడు ఇచ్చిన ఒక్క రోజు వరం జ్ఞాపకం వచ్చి ఓకే! ఒక్క రోజే  కదా! ఇవ్వాల్టితో పీడా పోతుందని సంతోషించాడు. కాని అది ఎంతో సేపు నిలవలేదు. తూరుపు తెల్లారుతున్నా చీరే జాకెట్ తో తన ఆకారం ఏమీ మారకపోవడం గమనించి, కంగారు పడిపోయి మళ్ళీ పరమేశ్వర ప్రార్ధన మొదలు పెట్టాడు. కాపోతే ఈసారి అట్టే ఆలశ్యం చేయకుండా దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. రోజు గడిచిపోయిందనీ, ముందు చెప్పిన విధంగా తిరిగి తనకు పాత మగ రోజులు ప్రసాదించమనీ కోరాడు. అందుకు ఆయన నోరారా నవ్వుతూ ఇలా అన్నాడు.
'నీ కోరిక తీరాలంటే మరో తొమ్మిది నెలలు ఆగాలి. రాత్రి నీకు నెలతప్పి గర్భవతివయ్యావు. అంచేత ఆడవాళ్ళు పడే ప్రసవ వేదన యెంత భయంకరంగా వుంటుందో అదీ తెలుసుకునే మహ్హత్తర వరం నీకు అదనంగా ఇస్తున్నాను' అంటూ అదృశ్యం అయిపోయాడు. ఏకాంబరం కొయ్యబారిపోయాడు.
నీతి: దేవుడు తేరగా దొరికాడని లేనిపోని వరాలు కోరరాదు


(నెట్లో కనిపించిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner 

3, జనవరి 2015, శనివారం

పీకే - 47



(దేవుడ్ని నమ్మని శ్రీ నరిసెట్టి ఇన్నయ్య గారికి, దేవుడ్ని నమ్మే నాలాటి వారికి ఇది అంకితం)
దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.
వున్నాడని నమ్మేవాళ్ళంటారు.
దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ ఆ పేరుతొ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు. నాకయితే ఇద్దరూ కరక్టే అనిపిస్తుంది.
దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు.
వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, దేవుడంటే నమ్మకం లేని వీళ్ళను ఆ భగవంతుడూ  కనుక్కోడు. దేవుడ్ని నమ్మే వీళ్ళనూ ఆ దేవుడూ  పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, లేదా దేవుడికోసం పోట్లాడడం వీరికీ, వారికీ బొత్తిగా తెలియదు కాబట్టి.
దేవుడున్నాడో లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు. నమ్మనివాళ్లదీ నమ్మకమే. నమ్మే వాళ్లదీ నమ్మకమే.  
అందుకే అంటారు, తొక్కితే రాయి  మొక్కితే సాయి అని. అంతా నమ్మకమే.
దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.

దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు,  వారు నాస్తికులు కావచ్చు కాని భగవంతుడో మరొకడో ఏ పేరు అయితేనేం తమకంటే  సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని సందేహపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు, పందొమ్మిదో రీలు తరువాత కానీ 'సిరికిన్ చెప్పడు....తరహాలో' ఏనుగు రక్షణకు రాడు.
దేవుడ్ని నమ్మని గోరాగారు దేవుడు లేదు అనేవాడు. లేదు ఏమిటండి లేడు అనాలిగా అంటే అసలు లేనివాడు పుంలింగం అయితే ఏమిటి స్త్రీ లింగం అయితే ఏమిటని ఎదురు ప్రశ్న వేసేవారు. ఆయన వ్యక్తిత్వశోభ ముందు అలా చెల్లిపోయింది. కాకపోతే ఇప్పుడు బెజవాడ నాస్తిక కేంద్రం వారికి గోరానే దేవుడు. ఆ మాటకొస్తే దేవుళ్ళందరూ ఇలా అవతరించిన వాళ్ళేనేమో. వాళ్ల వాళ్ల కాలంలో తమ గుణగణాలచేత విఖ్యాతులయిన వాళ్లు తదనంతర కాలంలో దేవుళ్ళుగా కొలవబడ్డారేమో.
కానీ ఒక విషయంలో నాకు దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ)
నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటానని దేవుడు  ఎంత మొత్తుకున్నా వినేదెవరు?
చెట్టులో, పుట్టలో అంతటా నేనే అన్నా విన్నదెవరు?
చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారాయన్ని.
మా చిన్నప్పుడు వంటింట్లో గోడమీద ఎర్రగా ఓ చదరంలో వేంకటేశ్వర స్వామి నామాలు వుండేవి. అదే అందరికీ పూజాగృహం. స్నానం చేసిన తరువాత అక్కడ నిలబడి ఓ దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడో! పూజ రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.

పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!
పోతే, ఈ దేవుడి సమస్యకు ఒకటే పరిష్కారం.
దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.
నమ్మని వాళ్లు అదేదో అంతర్జాతీయ సమస్య  అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమపని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం తగ్గిపోతుంది. 
సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు. నిజానికి మనమే ఆయనకు సమస్య.



NOTE: Courtesy Image Owner 

రచన వెనుక రహస్యం.


1975 నాటి మాట. బెజవాడ ఆంధ్ర జ్యోతిలో పనిచేస్తున్నరోజులు. అప్పటికే హైదరాబాదుకు మకాం మార్చిన ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారికి ఓ ఆలోచన వచ్చి బెజవాడలో అసిస్టెంట్ ఎడిటర్ గా వున్న నండూరి రామమోహన రావు గారిని సంప్రదించారు. అనుదినం జరిగే సంఘటనలపై స్పందించి నాలుగు లైన్లలో హస్యస్పోరకంగా వుండే గేయాన్ని రాయించాలని వారి ఉద్దేశ్యం. రాయగలరా అని అడక్కుండా రాయండి అనేసారు రామ్మోహన రావు గారు నాతొ. ఆవిధంగా మొదలయ్యాయి ఆంద్ర జ్యోతి దినపత్రికలో ఎడిట్ పేజీలో కార్టూన్లవంటి నా వాక్టూన్లు. చిత్రకారుడు రమణ గారు ఓ చిన్న చిత్రాన్ని దానికి జోడించేవారు.
ఆరోజుల్లో గోరాగారి కూరగాయల ఉద్యమం మొదలయింది. బెజవాడ గవర్నర్ పేటలోని రాఘవయ్య పార్కులో కార్యక్రమం. వ్యవసాయ శాఖ మంత్రి ఏసీ సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిధి. పూలదండల బదులు కూరగాయల దండలు వేయాలనేది గోరాగారి ఉద్యమం. కూరగాయలు పెంచితే ప్రజలకు ఉపయోగం అనేది ఆయన సిద్దాంతం. సరే సభ మొదలయింది. కూరగాయలతో చేసిన దండలు వేసారు, పుష్ప గుచ్చాల బదులు కాలీ ఫ్లవర్, క్యాబేజీలతో రూపొందించిన గుచ్చాలు అందించారు. సుబ్బారెడ్డి గారు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే రకం. మనసులో  దాచుకుండే మనిషి కాదు. అయన  మాట్లాడుతూ, గోరాగారి ఉద్దేశ్యం మంచిదే  అయినా మనిషి మానసిక ఆనందానికి పూలతోటలు కూడా అవసరమన్నారు. పూల చెట్లు పీకి వాటి స్థానంలో కూరగాయల మొక్కలు పెంచేబదులు, కాలువగట్ల మీద, వృధాగా వున్న ప్రాంతాలలో  కూరగాయల పాదులు వేస్తె నలుగురుకీ ఉపయోగం అన్నట్టు ప్రసంగించారు. ఆ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని నేను వాక్టూన్ రాసాను. అదే ఇది.
కాయ 'గోరా'లు
కూరగాయలు పెంచండని శ్రీ గోరా
ఇచ్చిన పిలుపును విని, మా శ్రీవారా
రోజంతా పట్టుకు పలుగూ పారా
పెరడంతా తవ్వేస్తే రాత్రికి వొళ్ళు పట్టేది నేనా వారా

(జూన్, 11, 1975 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక)


ఈ దినసరి వాక్టూన్ల రచనావ్యాసంగం నేను జ్యోతిని వొదిలిపెట్టి హైదరాబాదు ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో విలేకరిగా చేరేవరకు నిరవధికంగా అనుదినం కొనసాగింది.   

NOTE: Courtesy Image Owner 

విమాన ప్రమాదం - ప్రత్యక్ష ప్రసారం



విమాన ప్రమాదాలు, అదృశ్యాలు గురించి వరస సమాచారాలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో 2009 లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం బ్లాక్ బాక్స్ ఆధారంగా యూ ట్యూబ్ లో లభ్యమవుతోంది. విమానం గాలిలోకి లేచిన కొద్ది నిమిషాల్లోనే పక్షులు డీకొన్న కారణంగా ఒక నదిలో కూలిపోయిన దృశ్యాలు ఇందులో వున్నాయి.


జనవరి పదిహేనవ తేదీన న్యూయార్క్ నగరంలోని లా గార్దియా ఎయిర్ పోర్ట్ నుంచి యుయస్ ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ బస్ విమానం, వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్ కు బయలుదేరింది. అయితే మూడు నిమిషాలు కూడా  గడవకముందే ఆ విమానాన్ని పక్షులు డీకొన్నాయి. ఫలితంగా ఇంజిన్ శక్తి దెబ్బతిన్నది. ప్రమాదాన్ని సకాలంలో పసికట్టిన విమాన సిబ్బంది దగ్గరలో ఎలాటి విమానాశ్రయం లేకపోవడంతో తెగించి విమానాన్ని మన్హాటన్ సిటీ దాపున హడ్సన్ నదిలో దింపారు. విచిత్రం ఏమిటంటే ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం జరక్కపోవడం. అందులోని  155 మంది ప్రయాణీకులు, సిబ్బంది  సురక్షితంగా బయట పడ్డారు.  తరువాత ఆ విమాన సిబ్బందిని అత్యుత్తమ పురస్కారంతో గౌరవించారు.
ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది లింక్ లో చూడవచ్చు.


NOTE: Courtesy youtube



2, జనవరి 2015, శుక్రవారం

పేరు మారినా తీరు మారునా?

(Published by 'SURYA' telugu daily in its edit page on 04-01-2015, SUNDAY)

భారత  ప్రభుత్వం ఇక 'భారతీయ పాలన' అందించబోతోందా? అవునననే అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ.
గత ఆగస్టులో ఎర్రకోట బురుజులమీద నుంచి ఇచ్చిన  పంద్రాగస్టు సందేశంలో, ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి దాని స్థానంలో మరో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నట్టు  మోడీ తన మనసులో మాట బయట పెట్టారు. తరువాత ఢిల్లీ లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు తాజాగా నూతన సంవత్సరం తొలి రోజున 'నీతి ఆయోగ్' అనే పేరుతొ సరికొత్త  సంస్థను ఏర్పాటు చేసారు. 'నీతి' అనేది, 'నేషనల్ ఇన్ష్టి ట్యూషన్ ఫర్  ట్రాన్స్ ఫార్మింగ్  ఇండియా' అనే   ఆంగ్ల నామానికి సంక్షిప్త రూపం.  దీనితో అరవై అయిదేళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రణాళికా సంఘానికి చరమగీతం పాడినట్టయింది. భారత దేశపు ప్రధమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆలోచనతో అలనాడు రూపుదిద్దుకుని, ఇన్నేళ్ళుగా జరిగిన  దేశాభివృద్ధిలో తనకంటూ ఒక చారిత్రిక స్థానాన్ని  సముపార్జించుకున్న  ప్రణాళికా సంఘం,  చివరికి ప్రధాని  మోడీ కొంగొత్త  ఆలోచనకు అనువుగా చరిత్ర పుటల్లో  కలిసిపోయింది.  ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ సారధులు కొత్త కొత్త ఆలోచనలు చేయడం, సరికొత్త పధకాలకు రూపకల్పన చేయడం పరిపాటే. కానీ, ఏళ్ళతరబడి తమ ఉనికిని చాటుకుంటూ వస్తున్న కొన్ని వ్యవస్థలను సమూలంగా మార్చివేసి, నూతన వ్యవస్థలకు అంకురార్పణ చేయడానికి చాలా బలమైన రాజకీయ సంకల్పం  అవసరం. మోడీ ఆ పనిచేసి చూపారు.  గతంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం నడిపిన అప్పటి ప్రధాని వాజ్  పాయ్ కూడా ప్రణాళికా సంఘం జోలికి పోకపోవడం గమనార్హం. ఇప్పుడా ఘనత మోడీ ఖాతాలో చేరింది.


ప్రణాళిక సంఘం పని తీరు గురించి ఇటీవలి కాలంలో ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయినప్పటి నుంచి విభిన్న అబిప్రాయాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. ఇది చాలా మంచి వ్యవస్థ అనేవారితో పాటు, ఇదొక వ్యర్ధ వ్యవస్థ అనీ, అజాగళస్థనమనీ చులకనగా మాట్లాడిన వాళ్ళూ వున్నారు. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చేయడానికి తప్ప దీనివల్ల ఎలాటి ప్రయోజనం లేదని వాదించే వారి అభిప్రాయం పట్లే మోడీ మొగ్గు చూపారని అనుకోవాలి. తాను  ప్రతిపాదించిన కొత్త వ్యవస్థ పట్ల కూడా ఆయన బాగా నమ్మకం పెంచుకున్నట్టు ప్రధాని  ట్వీట్ చేసిన ట్విట్టర్ సందేశం తెలుపుతోంది. ఈ అంశంపై కేంద్ర క్యాబినెట్ చేసిన తీర్మానం కూడా అదే తీరును వ్యక్తపరచింది. ప్రభుత్వానికి దశ, దిశ నిర్దేశించే బాధ్యత కొత్త వ్యవస్థకు అప్పగించారు. దేశాభివృద్ధికి భారతీయత జోడించడం ఇందులోని నవ్యత్వం. ఈ తీర్మానాన్ని రూపొందించేటప్పుడు మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అమ్బెర్ద్కర్, స్వామీ వివేకానంద దీన్ దయాళ్ ఉపాద్యాయ వంటి మహనీయుల స్పూర్తిదాయక ప్రవచనాలను సూక్తులను పేర్కొనడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యంగా భారత దేశ పాలనావ్యవస్తలో సమాఖ్య స్పూర్తికి పెద్ద పీట వేయడం ఈ కొత్త సంస్థ ఏర్పాటులోని  ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్రాలకు సముచితమైన పాత్ర  ఉండేలా, జాతీయ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేయడం ఈ సంస్థ బాధ్యతల్లో ఒకటి. గ్రామా స్థాయి నుంచి ప్రణాళికలకు రూపకల్పన చేయాలన్నది మరో లక్ష్యం. సహకార సమాఖ్య (ఫెడరల్) స్పూర్తిని కొనసాగిస్తూ, కేంద్ర ప్రభుత్వానికీ, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒకే విధమైన జాతీయ ఎజెండాను తయారు చేయాలన్నది కూడా ఈ సంస్థ లక్ష్యాల్లో వుంది.
విభిన్న ఆలోచనలకు వేదికగా దీని తయారు చేసేందుకు ఈ సంస్థ పరిధిని చాలా విస్తృతం చేసారు. ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వుండే ఈ సంస్థలో విభిన్న రంగాలకు చెందిన వారు సభ్యులు గా వుంటారు. సీయీవో, ఉపాధ్యక్షులను ప్రధాని నియమిస్తారు. అయిదుగురు శాశ్వత  సభ్యులు వుండే ఈ 'నీతి ఆయోగ్' లో ఇద్దరు సభ్యులను యూనివర్సిటీలనుంచి, ప్రసిద్ధ పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేస్తారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్ నెంట్ గవర్నర్లు పాలకమండలిలో సభ్యులుగా వ్యవహరిస్తారు.
పొతే, కాలం చెల్లిన సంస్థగా మోడీ సర్కారుచేత ముద్ర వేయించుకుని కాలగతిలో కలిసిపోయిన  ప్రణాళికాసంఘం (యోజనా ఆయోగ్) చరిత్ర కూడా చిన్నదీ కాదు, తీసివేసేంత అల్పమైనదీ కాదు. మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని1950 మార్చినెలలో కేబినేట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేసారు. అప్పట్లో నెహ్రూ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారున్నారు. కానీ నెహ్రూ వాటిని ఖాతరు చేయకుండా తాను అనుకున్న రీతిలోనే ముందుకు సాగిపోయారు. ఆ నాటినుంచి ప్రణాళికా సంఘ ప్రయాణం అరవై అయిదేళ్లుగా నల్లేరు మీది బండిలా సాగిపోయింది. పన్నెండు పంచవర్ష ప్రణాళికలకు ఇది రూపకల్పన చేసింది. సుమారు రెండువందల లక్షల  కోట్ల రూపాయల నిధుల వ్యయానికి పచ్చ జెండా చూపింది. దేశంలో వ్యవసాయ విప్లవానికీ, భారీ పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేసి మిశ్రమ ఆర్ధిక విధానాలతో నవ భారత నిర్మాణానికి గట్టి పునాది వేసింది.
ధిగ్గనాధీరులయిన వారు ఈ సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. పదేళ్ళపాటు వరుసగా పనిచేసిన గౌరవం గుల్జారీ నందాకు, మాంటెక్ సింగ్ ఆహ్లూ వాలియాకు దక్కింది. శ్రీయుతులు కృష్ణమాచారి, సీ ఎం త్రివేది, అశోక్ మెహతా, సీ. సుబ్రహ్మణ్యం, పీ ఎన్ హక్సర్, ఎన్డీ తివారి, ఎస్ బీ చవాన్, పీసీ సేథీ, మన్మోహన్ సింగ్, పీ. శివశంకర్, మోహన్ దారియా, జస్వంత్ సింగ్, కేసీ పంత్ మొదలైనవారు  ప్లానింగ్ కమీషన్ ఉపాధ్యక్షులుగా సేవలు అందించిన వారిలో వున్నారు.
నెహ్రూ నెలకొల్పిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సహజంగానే జీర్ణించుకోలేకపోయింది. నవభారత నిర్మాణ సారధిగా సత్సంకల్పంతో నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం దేశ పురోగతిలో ఎంతో గొప్ప పాత్ర పోషించిన విషయాన్ని  మోడీ ప్రభుత్వం విస్మరించిందనీ, కేవలం ప్రజల మనస్సుల్లో నుంచి నెహ్రూ ఇందిరాగాంధీల స్మృతిని చెరిపివేసే దురుద్దేశ్యంతోనే సంస్కరణల పేరుతొ ఇటువంటి సమూల మార్పులకు శ్రీకారం చుడుతోందని ఆరోపించింది. సీపీఎం, సీపీఐ నాయకులు కూడా కాంగ్రెస్ తో గొంతు కలిపారు.
యాదృచ్చికమే కావచ్చు కానీ, నెహ్రూ స్మృతిని విస్మృతం చేసేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలకు మద్దతు ఇస్తున్నట్టుగా కేంద్ర  ప్రభుత్వం మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి కాంగ్రెస్ నాయకులకు ఇస్తున్న గౌరవం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల  పట్ల చూపడం లేదనిపించే దృష్టాంతాలు కానవస్తున్నాయి. నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా నిర్వహించే అంశంలో మోడీ సర్కారు అనుసరించిన విధానాన్ని విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. అలాగే మహాత్మా గాంధీ దక్షిణాప్రికా నుంచి భారత దేశానికి తిరిగివచ్చిన రోజును వందేళ్ళ వేడుకగా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద పెద్ద వాణిజ్య ప్రకటనలు జారీ చేయడాన్ని, సర్దార్ పటేల్ కు 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' పేరుతొ మొత్తం ప్రపంచంలోనే  అతి ఎత్తయిన విగ్రహాన్ని నెలకొల్పడానికి మోడీ ప్రయత్నం చేయడాన్ని ఉదహరిస్తూ, గాంధీ, పటేల్ వంటి కాంగ్రెస్ నాయకుల పట్ల అనుసరిస్తున్న ఉదార వైఖరి నెహ్రూ విషయంలో ప్రదర్శించడం లేదన్నది వారు చేస్తున్న  ప్రధాన ఆరోపణ.

రాజకీయాల్లో ఆరోపణలే కాని వివరణలు వుండవు. అది వారికీ తెలుసు. వీరికీ తెలుసు. (02-01-2015)

31, డిసెంబర్ 2014, బుధవారం

HAPPY NEW YEAR – 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                     


"వొత్తిలా వెలగండి
కత్తిలా మెరవండి
కొత్త ఏడాదిలో
ఎత్తుగా ఎదగండి                           
                                                             "అత్తరువు గంధమై
                                                             చిత్తరువు చందమై
                                                             కొత్త ఏడాది
                                                             మిము హత్తుకోవాలి!"
                 
      

నిర్మలాదేవి - భండారు శ్రీనివాసరావు 

(NIRMALADEVI & BHANDARU SRINIVASRAO)