(Published by 'SURYA' telugu daily in its edit page on 04-01-2015, SUNDAY)
భారత ప్రభుత్వం ఇక 'భారతీయ పాలన' అందించబోతోందా?
అవునననే అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర
మోడీ.
గత ఆగస్టులో ఎర్రకోట బురుజులమీద నుంచి ఇచ్చిన పంద్రాగస్టు సందేశంలో, ప్రణాళికా సంఘాన్ని
రద్దుచేసి దాని స్థానంలో మరో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నట్టు మోడీ తన మనసులో మాట బయట పెట్టారు. తరువాత ఢిల్లీ
లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు
తాజాగా నూతన సంవత్సరం తొలి రోజున 'నీతి ఆయోగ్' అనే పేరుతొ సరికొత్త సంస్థను ఏర్పాటు చేసారు. 'నీతి' అనేది, 'నేషనల్
ఇన్ష్టి ట్యూషన్ ఫర్ ట్రాన్స్
ఫార్మింగ్ ఇండియా' అనే ఆంగ్ల
నామానికి సంక్షిప్త రూపం. దీనితో అరవై
అయిదేళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రణాళికా సంఘానికి చరమగీతం పాడినట్టయింది. భారత
దేశపు ప్రధమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆలోచనతో అలనాడు రూపుదిద్దుకుని,
ఇన్నేళ్ళుగా జరిగిన దేశాభివృద్ధిలో తనకంటూ
ఒక చారిత్రిక స్థానాన్ని సముపార్జించుకున్న ప్రణాళికా సంఘం, చివరికి ప్రధాని మోడీ కొంగొత్త ఆలోచనకు అనువుగా చరిత్ర పుటల్లో కలిసిపోయింది. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ సారధులు కొత్త
కొత్త ఆలోచనలు చేయడం, సరికొత్త పధకాలకు రూపకల్పన చేయడం పరిపాటే. కానీ, ఏళ్ళతరబడి
తమ ఉనికిని చాటుకుంటూ వస్తున్న కొన్ని వ్యవస్థలను సమూలంగా మార్చివేసి, నూతన
వ్యవస్థలకు అంకురార్పణ చేయడానికి చాలా బలమైన రాజకీయ సంకల్పం అవసరం. మోడీ ఆ పనిచేసి చూపారు. గతంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ఆధ్వర్యంలో సంకీర్ణ
ప్రభుత్వం నడిపిన అప్పటి ప్రధాని వాజ్ పాయ్ కూడా ప్రణాళికా సంఘం జోలికి పోకపోవడం
గమనార్హం. ఇప్పుడా ఘనత మోడీ ఖాతాలో చేరింది.
ప్రణాళిక సంఘం పని తీరు గురించి ఇటీవలి కాలంలో
ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయినప్పటి నుంచి విభిన్న అబిప్రాయాలు వ్యక్తం అవుతూ
వచ్చాయి. ఇది చాలా మంచి వ్యవస్థ అనేవారితో పాటు, ఇదొక వ్యర్ధ వ్యవస్థ అనీ, అజాగళస్థనమనీ
చులకనగా మాట్లాడిన వాళ్ళూ వున్నారు. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చేయడానికి తప్ప
దీనివల్ల ఎలాటి ప్రయోజనం లేదని వాదించే వారి అభిప్రాయం పట్లే మోడీ మొగ్గు చూపారని
అనుకోవాలి. తాను ప్రతిపాదించిన కొత్త
వ్యవస్థ పట్ల కూడా ఆయన బాగా నమ్మకం పెంచుకున్నట్టు ప్రధాని ట్వీట్ చేసిన ట్విట్టర్ సందేశం తెలుపుతోంది. ఈ
అంశంపై కేంద్ర క్యాబినెట్ చేసిన తీర్మానం కూడా అదే తీరును వ్యక్తపరచింది.
ప్రభుత్వానికి దశ, దిశ నిర్దేశించే బాధ్యత కొత్త వ్యవస్థకు అప్పగించారు.
దేశాభివృద్ధికి భారతీయత జోడించడం ఇందులోని నవ్యత్వం. ఈ తీర్మానాన్ని రూపొందించేటప్పుడు
మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అమ్బెర్ద్కర్, స్వామీ వివేకానంద దీన్ దయాళ్ ఉపాద్యాయ
వంటి మహనీయుల స్పూర్తిదాయక ప్రవచనాలను సూక్తులను పేర్కొనడం జరిగింది. అన్నింటికంటే
ముఖ్యంగా భారత దేశ పాలనావ్యవస్తలో సమాఖ్య స్పూర్తికి పెద్ద పీట వేయడం ఈ కొత్త
సంస్థ ఏర్పాటులోని ప్రధాన ఉద్దేశ్యం.
రాష్ట్రాలకు సముచితమైన పాత్ర ఉండేలా,
జాతీయ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేయడం ఈ సంస్థ బాధ్యతల్లో ఒకటి. గ్రామా
స్థాయి నుంచి ప్రణాళికలకు రూపకల్పన చేయాలన్నది మరో లక్ష్యం. సహకార సమాఖ్య (ఫెడరల్)
స్పూర్తిని కొనసాగిస్తూ, కేంద్ర ప్రభుత్వానికీ, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒకే
విధమైన జాతీయ ఎజెండాను తయారు చేయాలన్నది కూడా ఈ సంస్థ లక్ష్యాల్లో వుంది.
విభిన్న ఆలోచనలకు వేదికగా దీని తయారు చేసేందుకు ఈ
సంస్థ పరిధిని చాలా విస్తృతం చేసారు. ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వుండే ఈ సంస్థలో విభిన్న
రంగాలకు చెందిన వారు సభ్యులు గా వుంటారు. సీయీవో, ఉపాధ్యక్షులను ప్రధాని
నియమిస్తారు. అయిదుగురు శాశ్వత సభ్యులు
వుండే ఈ 'నీతి ఆయోగ్' లో ఇద్దరు సభ్యులను యూనివర్సిటీలనుంచి, ప్రసిద్ధ పరిశోధన
సంస్థల నుంచి ఎంపిక చేస్తారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల
లెఫ్ట్ నెంట్ గవర్నర్లు పాలకమండలిలో సభ్యులుగా వ్యవహరిస్తారు.
పొతే, కాలం చెల్లిన సంస్థగా మోడీ సర్కారుచేత
ముద్ర వేయించుకుని కాలగతిలో కలిసిపోయిన ప్రణాళికాసంఘం (యోజనా ఆయోగ్) చరిత్ర కూడా
చిన్నదీ కాదు, తీసివేసేంత అల్పమైనదీ కాదు. మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ
ప్రణాళికా సంఘాన్ని1950 మార్చినెలలో కేబినేట్ తీర్మానం ద్వారా ఏర్పాటు
చేసారు. అప్పట్లో నెహ్రూ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారున్నారు. కానీ
నెహ్రూ వాటిని ఖాతరు చేయకుండా తాను అనుకున్న
రీతిలోనే ముందుకు సాగిపోయారు. ఆ నాటినుంచి ప్రణాళికా సంఘ ప్రయాణం అరవై అయిదేళ్లుగా
నల్లేరు మీది బండిలా సాగిపోయింది. పన్నెండు పంచవర్ష ప్రణాళికలకు ఇది రూపకల్పన
చేసింది. సుమారు రెండువందల లక్షల కోట్ల
రూపాయల నిధుల వ్యయానికి పచ్చ జెండా చూపింది. దేశంలో వ్యవసాయ విప్లవానికీ, భారీ
పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేసి మిశ్రమ ఆర్ధిక విధానాలతో నవ భారత నిర్మాణానికి గట్టి
పునాది వేసింది.
ధిగ్గనాధీరులయిన వారు ఈ సంఘానికి ఉపాధ్యక్షులుగా
పనిచేశారు. పదేళ్ళపాటు వరుసగా పనిచేసిన గౌరవం గుల్జారీ నందాకు, మాంటెక్ సింగ్ ఆహ్లూ
వాలియాకు దక్కింది. శ్రీయుతులు కృష్ణమాచారి, సీ ఎం త్రివేది, అశోక్ మెహతా, సీ.
సుబ్రహ్మణ్యం, పీ ఎన్ హక్సర్, ఎన్డీ తివారి, ఎస్ బీ చవాన్, పీసీ సేథీ, మన్మోహన్
సింగ్, పీ. శివశంకర్, మోహన్ దారియా, జస్వంత్ సింగ్, కేసీ పంత్ మొదలైనవారు ప్లానింగ్ కమీషన్ ఉపాధ్యక్షులుగా సేవలు అందించిన
వారిలో వున్నారు.
నెహ్రూ నెలకొల్పిన ప్రణాళికా సంఘాన్ని రద్దు
చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సహజంగానే జీర్ణించుకోలేకపోయింది. నవభారత నిర్మాణ
సారధిగా సత్సంకల్పంతో నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం దేశ పురోగతిలో ఎంతో
గొప్ప పాత్ర పోషించిన విషయాన్ని మోడీ
ప్రభుత్వం విస్మరించిందనీ, కేవలం ప్రజల మనస్సుల్లో నుంచి నెహ్రూ ఇందిరాగాంధీల
స్మృతిని చెరిపివేసే దురుద్దేశ్యంతోనే సంస్కరణల పేరుతొ ఇటువంటి సమూల మార్పులకు
శ్రీకారం చుడుతోందని ఆరోపించింది. సీపీఎం, సీపీఐ నాయకులు కూడా కాంగ్రెస్ తో గొంతు
కలిపారు.
యాదృచ్చికమే కావచ్చు కానీ, నెహ్రూ స్మృతిని విస్మృతం
చేసేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలకు మద్దతు ఇస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్
పటేల్ వంటి కాంగ్రెస్ నాయకులకు ఇస్తున్న గౌరవం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల
పట్ల చూపడం లేదనిపించే దృష్టాంతాలు
కానవస్తున్నాయి. నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా నిర్వహించే అంశంలో మోడీ సర్కారు
అనుసరించిన విధానాన్ని విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. అలాగే మహాత్మా గాంధీ
దక్షిణాప్రికా నుంచి భారత దేశానికి తిరిగివచ్చిన రోజును వందేళ్ళ వేడుకగా
అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద పెద్ద వాణిజ్య ప్రకటనలు జారీ చేయడాన్ని, సర్దార్
పటేల్ కు 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' పేరుతొ మొత్తం ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహాన్ని నెలకొల్పడానికి మోడీ ప్రయత్నం
చేయడాన్ని ఉదహరిస్తూ, గాంధీ, పటేల్ వంటి కాంగ్రెస్ నాయకుల పట్ల అనుసరిస్తున్న ఉదార
వైఖరి నెహ్రూ విషయంలో ప్రదర్శించడం లేదన్నది వారు చేస్తున్న ప్రధాన ఆరోపణ.
రాజకీయాల్లో ఆరోపణలే కాని వివరణలు వుండవు. అది
వారికీ తెలుసు. వీరికీ తెలుసు. (02-01-2015)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి