టీవీ చర్చల విరామ సమయంలో లేదా చర్చలకు, ముందూ
తరువాత జరిగే తేనీటి సమావేశాల్లో రాజకీయ నాయకుకులు అనేక ఆసక్తికరమైన విశేషాలు
చెబుతుంటారు. వాటిల్లో నిజం పాలెంతో తెలియదు కాని, విన్నప్పుడు నిజమేనేమో
అనిపించేలా వుంటాయి ఆ కబుర్లు. అలాటి ఉదంతం
ఒకటి.
చాలా ఏళ్ళ కిందటి సంగతి. అధికార పార్టీలో పైకి వచ్చిన నాయకుడొకరు, అప్పుడప్పుడే పైకి
వస్తున్న మరో ఛోటా నాయకుడికి గిరీశంలా రాజకీయ గీతాబోధ చేసాడిలా.
'నాయనా! రాజకీయాల్లో పైకి రావడానికి ఎన్నో
కావాలి. కానీ నా అనుభవం మీద చెబుతున్నాను. అన్నింటిలోకి అతి ముఖ్యమైనది మీడియా
మేనేజిమెంటు'
'మేనేజిమెంటు అంటే ఏమిటి గురువుగారూ?' అడిగాడు
చోటా నాయకుడు.
'అది తరువాత చెబుతా కాని మన జిల్లా రిపోర్టర్
పలానా వాడు వున్నాడు చూసావు కదా. అతడికేదో డబ్బవసరం పడినట్టువుంది. నేను ఇచ్చానని
చెప్పి ఈ ఇరవై వేలు అతడికి ఇచ్చిరా. అలాగే,
మన సీఎం గారి కారు డ్రైవర్ వున్నాడు తెలుసు కదా! అతడింటికి వెళ్ళి ఈ ఇరవై వేలూ నేనిచ్చానని చెప్పి ఇచ్చేసిరా' అన్నాడు.
ఛో.నా., బ. నా. చెప్పినట్టే వెళ్ళి చెప్పిన పని చప్పున
చేసేసి తిరిగొచ్చిఆ సంగతి చెప్పాడు. చెప్పి తన మనసులో తొలుస్తున్న సందేహం బయట
పెట్టాడు.
'రిపోర్టర్ కు ఇవ్వమన్నారు. సరే. బాగుంది. వాళ్ళకు
మనతో, మనతో వాళ్లకు సవాలక్ష పనులుంటాయి. కానీ సీ ఎం గారి కారు డ్రైవర్ సంగతే నా
మట్టి బుర్రకు అర్ధం అయి చావలేదు'
'అదేమరి. నేర్చుకో అని చెప్పింది అందుకే. సీఎం గారిని మన పార్టీ
కార్యకర్తలు ఎక్కడ కలుస్తారు ? ఆయన కారు ఎక్కుతున్నప్పుడో, దిగుతున్నప్పుడో కదా! మామూలు వాళ్ళకి అవకాశం అలాటప్పుడే దొరుకుతుంది. మరి ఆయన కంట్లో పడాలంటే సీఎం గారి కారు కాసేపు అక్కడే ఆగాలి. ఆగాలి అంటే డ్రైవర్ కారు ఆపాలి. ఆపాలి
అంటే డ్రైవర్ ని మనం మంచి చేసుకోవాలి. అప్పుడే, మనం కనబడగానే, డ్రైవర్ కాలు, కాసేపు బ్రేక్ మీద నొక్కిపెడతాడు. అర్ధం
అయిందా? సమ్జే! అండర్ స్టాండ్!' అన్నాడు
అన్ని భాషల్లో బ. నా.
'అయింది మహాప్రభో!' అనేసాడు ఛో.నా.
(తోకటపా: ఎవరా ఛో.నా. ? ఎవరా బ.నా.? ఇంతకీ ఎవరా
రిపోర్టర్? ఇలాటి ప్రశ్నలు దయచేసి అడక్కండి. చెప్పినాయన చెప్పలేదు. అలా అడిగే
అలవాటులేని నేనూ అడగలేదు, విని వూరుకున్నంత సుఖం మరోటి లేదు)
NOTE: Cartoon Courtesy SREE BAPU
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి