అమెరికా
అధ్యక్షుడు ఒబామా భారత సందర్శన పుణ్యమా అని ఆయన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్
గురించి మీడియాలో ఎన్నో ఆసక్తికరమైన కధనాలు వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో దశాబ్దకాలం
క్రితం నేనూ మా ఆవిడా అమెరికాలోని సియాటిల్ కు వెళ్ళినప్పుడు ఆ విమానం ఎక్కి కలయ
తిరిగే ఓ అపూర్వ అవకాశం లభించింది. ఆ వివరాలను అప్పట్లో నా బ్లాగులో 'అమెరికా అనుభవాలు'
అనే శీర్షికతో అనేక భాగాలుగా రాసి నిక్షిప్తం
చేసాను. అదే ఇది:
"ప్రపంచ
ప్రసిద్ధ కంపెనీలయిన మైక్రోసాఫ్ట్ , బోయింగ్ ప్రధాన కార్యాలయాలు సియాటిల్ లోనే వున్నాయి. ఇన్ఫోసిస్ తరపున
బోయింగ్ విమానాల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్న మా అబ్బాయి సందీప్ ఏర్పాటుచేసిన
ప్రత్యేక అనుమతి పత్రాలతో ఒక రోజు బోయింగ్
కర్మాగారానికి వెళ్ళాము. అనేక వందల ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ ఫ్యాక్టరీని ప్రవేశ
రుసుముతో సందర్శించే వీలు కల్పించారు. ఎంతో భద్రత అవసరమయిన ఈ కర్మాగారాన్ని
సందర్శించేందుకు ఉత్సాహపడే పర్యాటకులను ప్రవేశ రుసుముతో అనుమతించడం ద్వారా టూరిజంను
వారు ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్
ని కూడా ఇదేవిధంగా సందర్శించే వీలు వుందని విన్నాను.
"మిగిలిన
సందర్శకులతో కలిపి మమ్మల్ని కూడా ప్రత్యేక బస్సుల్లో లోపలకు తీసుకు వెళ్లారు.
అన్నీ చూపించి విషయాలను విశద పరిచేందుకు వెంట గైడ్లు కూడా వున్నారు.
అసలు
బోయింగ్ విమానమే ఎంతో పెద్దగా వుంటుంది. అలాటిది వాటిని తయారు చేసే ఫాక్టరీ యెంత
పెద్దగా వుంటుందో ఊహించుకోవచ్చు. విడి భాగాలను తయారు చేసి వాటినన్నిటినీ ఒకచోట
చేర్చి విమానాన్ని నిర్మించే వివిధ దశలను మేము కళ్ళారా చూసాము. అంతేకాకుండా
బోయింగ్ విమాన నిర్మాణం ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపే డాక్యుమెంటరీని
కూడా ప్రదర్శించారు. ఈ కర్మాగారం ఆవరణలోనే పెద్ద పెద్ద రన్ వే లతో కూడిన
విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు.
"రైట్
సోదరులు కనుక్కున్న తొలి విమానం నుంచి ఇంతవరకు తయారయిన అధునాతన యుద్ధ విమానాలు, ప్రయాణీకుల విమానాలు, సరకుల రవాణా విమానాలు, హెలికాప్టర్లు వుంచిన ఒక ప్రదర్శనశాల కూడా వుంది. అమెరికా అధ్యక్షుడి
అధికారిక విమానం ‘ఎయిర్
ఫోర్స్ వన్’ పాత
మోడల్ కూడా అక్కడ వుంది. సందర్శకులు అందులోకి ఎక్కి కాక్ పిట్ తొ సహా ప్రెసిడెంట్
కోసం విమానంలో ఏర్పాటు చేసిన పడక గది, సమావేశ మందిరం, పత్రికా
విలేఖరులతో మాట్లాడే హాలు అన్నీ చూడవచ్చు. టెలిఫోన్, టెలెక్స్, కంప్యూటర్, ఇంటర్నెట్, టీవీ మొదలయిన అత్యాధునిక
సమాచార పరికరాలన్నీ అందులో వున్నాయి.
"అమెరికా
ప్రెసిడెంట్ విమానంలోకి ఎక్కి అన్నీ చూడడం అన్నది నిజంగా ఒక మరపురాని అనుభూతి.
ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తూ వున్నానంటే – ఈ దేశంలో పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెప్పడానికే.
నిజానికి బోయింగ్ విమానాల కర్మాగారం రక్షణ అవసరాల దృష్ట్యా నిషేధిత ప్రదేశమయినా
టికెట్లు పెట్టి మరీ ప్రజలకు చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఏటా ఎన్నో వేలమంది
దీన్ని సందర్శిస్తూ వుంటారు. (2004)
NOTE: Courtesy Image Owner
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి