సూర్యదేవర
రామచంద్రరావు అంటే చాలామందికి తెలియకపోవచ్చు, యస్.ఆర్. రావు అంటే గుర్తురాక పోవచ్చు.
కానీ, సూరత్ మునిసిపల్ కమీషనర్ రావు అనగానే చప్పున గుర్తొస్తారు ఈ 1978 బ్యాచ్
గుజరాత్ క్యాడర్ ఐ.ఏ.యస్. అధికారి. తదనంతర కాలంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో సహా కేంద్రంలో
సయితం ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. అయితే, సూరత్ మునిసిపల్ కమీషనర్ గా పనిచేసిన కాలమే
ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టింది.
1994 లో సూరత్
పట్టణాన్ని ప్లేగ్ వ్యాధి అతలాకుతలం చేసింది. అసలే సూరత్ కు దుర్గంధ నగరం అనే
పేరు. దానికి తగ్గట్టు, ప్లేగ్ వ్యాధి జరిపిన ముట్టడితో మరింత మురికి పేరు, సూరత్
పేరులో పేరుకుపోయింది. ఆ నేపధ్యంలో యస్.ఆర్.రావు అనే యువ ఐ.ఏ.యస్. అధికారిని ప్రభుత్వం 1995 లో సూరత్
మునిసిపల్ కమీషనర్ గా నియమించింది. పన్నుల వసూళ్లు, రహదారుల నిర్మాణాలు కాదు ఆయన
మీద మోపిన బాధ్యత. ప్లేగ్ వ్యాధి తాకిడితో తలకిందయిన నగర పారిశుధ్యాన్ని తిరిగి
గాడిలో పెట్టడం అనే పెను బాధ్యతను ఆయన భుజస్కంధాలపై పెట్టింది.
బాధ్యతలు
స్వీకరించిన వెంటనే ఏమాత్రం కాలయాపన
చేయకుండా ఆయన నేరుగా రంగంలోకి దిగిపోయారు.
ముందు సూరత్ నగరానికి వున్న మురికి పేరును
వొదిలించడం మొదటి పనిగా పెట్టుకున్నారు. అయితే ఇందుకోసం అయన చీపురు పట్టుకుని వీధుల్లోకి
రాలేదు. మునిసిపాలిటీ నిధులు వెచ్చించి వాక్యూం క్లీనర్లు కొనలేదు. సాధారణంగా ఐ.ఏ.యస్.
అధికారుల్లో కానవచ్చే బ్యూరోక్రాట్ మనస్తత్వం ఆయనలో లేకపోవడమే ఆయనకు కలిసివచ్చిన
అంశం. అంచేత బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఆయన ప్లేగ్
వ్యాధిపై యుద్ధం ప్రకటించారు. నగరాన్ని దుర్గందానికి దూరం చేసి, పరిశుద్ధ నగరంగా
చేయడానికి కసితో పని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయనపై ఎన్నో రాజకీయ వొత్తిళ్ళు
వచ్చాయి. స్థానిక నాయకులు ఆయన ప్రతిపనికీ అడ్డం పడ్డారు. కానీ ఆయన దేనినీ ఖాతరు
చేయలేదు. ఎవరినీ లెక్కచేయలేదు. తను అనుకున్నది అనుకున్నట్టు చేస్తూ పోయారు.
బిల్డర్లు, కాంట్రాక్టర్లు, చోటా మోటా రాజకీయ
నాయకులు వారి అనుచరులు అందరూ రావుగారికి వ్యతిరేకమే, ఒక్క సూరత్ ప్రజలు తప్ప, ఆ
వూరిలో మురికివాడల్లో నివసించే జనాలు మినహా. ఏడాదిన్నర కూడా గడవక ముందే రావు
ప్రజలకు దైవసమానుడిగా మారిపోయారు. ఆయన కనిపిస్తే చాలు నోట్లో వున్న పాన్ రోడ్డుమీద
ఉమ్మేయడానికి పౌరులు సంకోచించేవాళ్ళు. చెత్త కాగితం కానీ, వాడేసిన
సిటీ బస్సు టిక్కెట్టు కానీ బయట
పారేయడానికి సందేహపడేవారు. పరిసరాల పరిశుభ్రత పట్ల పౌర సమాజంలో ఆయన కల్పించిన అవగాహనా ఫలితం అది. రావుగారి
పాలనలో సూరత్ ప్లేగ్ వ్యాధినుంచి శాశ్వితంగా విముక్తమయింది. పరిసరాలన్నీ పచ్చని చెట్లతో అలరారడం మొదలయింది. పన్నుల వసూళ్లు స్వచ్చందంగా
పెరిగాయి. తాము కట్టే పన్నులన్నీ తమకు ఉపయోగపడే పనులకే ఖర్చు చేస్తారు అన్న ఆలోచన
పౌరుల్లో పెరగడమే పన్నుల వసూళ్ళ
పెరుగుదలకు కారణం అని వేరే చెప్పనక్కరలేదు.
అనతికాలంలోనే దేశం మొత్తంలో చండీగర్ తరువాత అత్యంత పరిశుభ్ర నగరంగా సూరత్
ఎంపికయింది. ఇది సాధించడానికి ఏళ్ళూ పూళ్ళూ పట్టలేదు. వందలకోట్ల ప్రజాధనం ఖర్చు
పెట్టలేదు. ఒక అధికారి పట్టుదలతో, ప్రజలు అందించిన సహకారంతో ఇది సాధ్యపడింది. 'మన
ఇంటిని శుభ్రంగా వుంచుకుందాం' అని ప్రతివారు అనుకుంటారు. 'మన పరిసరాలను కూడా అలాగే
చక్కగా వుంచుకుందాం' అనే స్పృహ కల్పించడం చాలా కష్టం. కృష్ణాజిల్లాలో జన్మించి ఆంధ్ర
విశ్వవిద్యాలయంలో చదువుకున్న సూర్యదేవర రామచంద్రరావు ఈ అద్భుతాన్ని చేసి చూపారు. అందుకు
ఆయన అనుసరించిన విధానం కూడా చాలా చాలా మామూలుది.
మునిసిపాలిటీలో పనిచేసే అధికారులు ఆఫీసుల్లోని ఏసీ గదుల్ని వొదిలిపెట్టి ఉదయం
ఏడుగంటలకల్లా వీధుల్లోకి వెళ్లగలిగితే సగం సమస్య పరిష్కారం అయినట్టే అని ఆయన భావించారు. ఆయనా
అలాగే చేశారు. తన అధికారులు, సిబ్బందితో చేయించారు. ఫలితం కనబడింది. అట్లా ఇట్లా కాదు
అద్భుతంగా కనబడింది. పారిశుధ్య
సిబ్బందికీ, వారిపై అఆమాయిషీ చేసే
అధికారుల నడుమ చక్కని కమ్యూనికేషన్ ఏర్పడింది. కలిగిన ఆసామీ ఎవరయినా ఇంటిముందే రోడ్డుమీద చెత్త పారబోస్తుంటే అదేమని అడిగే
ధైర్యం మామూలు స్వీపర్ చేయలేడు. కానీ వెంట
ఉన్నతాధికారి వుంటే, అలా అడిగే ధైర్యం అదే
వస్తుంది. ఇదీ, మనస్తత్వ శాస్త్రం చదివిన రావు గారి థియరీ.
అప్పటివరకు
స్థానిక దినపత్రికల్లో సూరత్ అధ్వాన్నపరిస్తితుల గురించీ, అధికారుల అలసత్వం
గురించీ కోకొల్లల్లుగా కధనాలు వెలువడేవి. కొద్దికాలంలోనే వార్తల స్వరూపస్వభావాల్లో
ఎంతో తేడా వచ్చింది. విమర్శల పాలు పూర్తిగా తగ్గిపోయి, ప్రశంసల జోరు పెరిగిపోయింది.
అనతికాలంలోనే
అయన సూరత్ పట్టణాన్ని చక్కని పారిశుధ్య నగరంగా తీర్చిదిద్దారు. అత్యంత పరిశుద్ధమైన
భారతీయ నగరాల్లో దానికి రెండో స్థానం కల్పించారు. ఈ బృహత్తర కర్తవ్యాన్ని
జయప్రదంగా నిర్వర్తించినందుకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అరుదయిన పద్మశ్రీ
అవార్డు బహుకరించింది. ఒక సివిల్ సర్వీసు
అధికారికి అటువంటి 'పద్మ' పురస్కారం లభించడం కూడా అరుదయిన విషయమే.
రెండు దశాబ్దాల
నాటి ఈ నేపధ్యాన్ని యెందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందో దానికి కారణం ఏమిటో
విపులంగా వివరించాల్సిన అవసరం లేదు. ఈనాడు దేశం నలుమూలల్లో 'స్వచ్ఛ భారత్' అనే
నినాదం మారుమోగిపోతోంది. ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన ఈ పిలుపుకు దేశవ్యాప్తంగా విశేష
స్పందన లభిస్తోంది. పత్రికల్లో, మీడియాలో
ఈ కార్యక్రమానికి అపూర్వమైన ప్రాచుర్యం దొరుకుతోంది. ప్రధాని మోడీ ప్రభ నలుదిక్కులా
వెలిగిపోతూవుండడం కూడా ఒక కారణం కావచ్చు. దేశం నాలుగుచెరగుల్లో తమ ప్రతిభతో జనాలను
ప్రభావితం చేయగల సమర్ధులు, తమ తమ రంగాల్లో అశేష
శేముషీ విభవం కలిగిన ప్రముఖులు అనేకమంది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొని
విశేష ప్రచారం అందిస్తున్నారు. సెలెబ్రిటీలు తలచుకుంటే ప్రచారానికేం కొరత. మడత నలగని దుస్తులు ధరించి చీపుర్లు పట్టుకుని
వీధులు వూడుస్తుంటే చూసేవారికి కన్నుల పండువ. అయితే ఇదంతా కనిబెట్టి చూస్తున్నవారికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా మిగిలిన
అన్ని సర్కారు పధకాల మాదిరిగా ఒక ప్రచారార్భాటంగా మారిపోతుందేమో అనే భయసందేహాలు కలక్కమానవు.
స్వచ్ఛ
భారత్ అనేది ఒక చక్కటి కార్యక్రమం. సందేహం లేదు. మోడీని విధానపరంగా వ్యతిరేకించేవారు సయితం
దీన్ని తప్పుపట్టలేరు. తప్పుపట్టే పరిస్తితి వస్తే, అలాటి స్తితి తెచ్చుకుంటే మాత్రం అది సర్కారు తప్పే అవుతుంది.
మన
దేశంలోనే కాదు విదేశాల్లో వుండే భారతీయులు, ప్రత్యేకించి వేరే దేశాల్లో ఉద్యోగాలు
చేస్తున్నవాళ్లు స్వచ్ఛ భారత్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో మాదిరిగానే
సకల సౌకర్యాలు మన దేశంలో కూడా దొరుకుతున్నాయి.
దొరకనిదల్లా స్వచ్చమైన వాతావరణం. పరిశుభ్రమైన పరిసరాలు. మాతృ దేశానికి తిరిగివచ్చేయాలన్న
వారి బలమైన కాంక్షను బలంగా అడ్డుకుంటున్న కారణం ఇదొక్కటే.
సంస్కరణల
ప్రభావం దేశంలో అన్ని రంగాల మీదా, పౌరులందరి మీదా పడింది. చదువుకుండే ఆడపిల్లల
సంఖ్య పెరిగింది. ఉద్యోగాలు, ఉపాధుల పేరుతొ గడప దాటి వెళ్ళే ఆడంగుల సంఖ్యా బాగా
పెరిగింది. ఇలాటివారిలో కాస్త కలిగిన ఆడవారికి ఎదురయ్యే ఇబ్బందులు తక్కువ. వాళ్లు
పనిచేసే కార్యాలయాల్లో అన్ని సౌకర్యాలు వుంటాయి. ఉన్నత కుటుంబాలకు చెందిన
ఆడపిల్లలు చదువుకునే స్కూళ్ళు కూడా అన్ని సదుపాయాలతో వుంటాయి. పోతే, సర్కారు బళ్ళల్లో చదువుకునే ఆడపిల్లలకు, పొద్దున్నే లేచి వెళ్ళి పనిపాటులు చేసుకునేవారికీ, వీధుల్ని శుభ్రం చేసే
ఆడవారికి అవసరమైనప్పుడు కాలకృత్యాలు తీర్చుకోగల వెసులుబాటు వుండదు. అలాటి వారు తమ
ఇబ్బందిని ఎవరికీ చెప్పుకోలేరు. బలవంతంగా అణచుకుని లేనిపోని అనారోగ్యాలకు
గురవుతుంటారు. స్వచ్ఛ భారత్ సంకల్పం చెప్పుకున్నప్పుడే ప్రధాని మోడీ మనస్సులో కూడా ఈ అంశం మొలకెత్తకపోలేదు. యుద్ధప్రాతిపదికన పాఠశాలల్లో ఆడపిల్లలకు మరుగు దొడ్లు నిర్మించాలని ఆయన తలపెట్టారు. ఆలోచన మంచిదే. కానీ ఆచరణ మాత్రం అనుకున్నంత
వేగంగా సాగుతున్నట్టు లేదు.
గొప్ప
గొప్పవాళ్ళు చేత చీపుర్లు పట్టి వీధులు వూడవడం తప్పని ఎవ్వరూ అనరు. కానీ, ఏదో
మొక్కుబడి తంతుగా సాగినప్పుడు మాత్రమే ప్రతికూల ఫలితాలు వస్తాయి. కార్యక్రమం యెంత
మంచిదయినా అమల్లో నీరుకారిపోయేది చిత్తశుద్ధి కరువయినప్పుడే.
ప్రస్తుతం
మన దేశంలో తీవ్రమైన కొరత వున్నది 'చిత్తశుద్ధి'
ఒక్కదానికే అని అందరికీ తెలుసు.(05-01-2015)
NOTE: Courtesy Image Owner
4 కామెంట్‌లు:
మంచి అర్తిచ్లె. AP మినిస్టర్ కోడెల శివ ప్రసాద్ రావు గారి గురించి ఈ మధ్య ఈనాడు ఒక ఆర్టికల్ చదివ. ఆయన వారి నియోజకవర్గంలో చాల మరుగు దొడ్లు కట్టి ఇస్తున్నారంట . ఇది మంచి idea. ఊరకనే ఫొటోస్ కి ఫోజులు ఇస్తే ఏమి లాభం? జనాలని educate చెయ్యలి.
swaccha bharat will be 100% successful if people implement one single rule - Do not THROW trash fresh. Whatever trash is already on ground will automatically disappear.
అప్పుడు నేను గుజరాత్‌లోనే ఉన్నాను. ఇతర రాష్ట్రాలలో మంచి పేరు తెచ్చుకున్న తెలుగు అధికారులలో ఆయన ఒకరు. ఆ తరువాత బీహార్ ఎన్నికలలో కె జె రావు గారు కూడ బాగా పని చేసి, కొన్ని అట్టడుగు వర్గాల వారికి మొదటిసారి వోటు హక్కు కలిగేలా చేసారు.
గుజరాత్ ప్లేగ్ సమయంలొనే యల్లాప్రగడ సుబ్బారావు గారి టెట్రాసైక్లిన్ గురించి చాలా మందికి తెలిసింది.
ప్రస్తుతం మన దేశంలో తీవ్రమైన కొరత వున్నది 'చిత్తశుద్ధి' ఒక్కదానికే అని అందరికీ తెలుసు.
-----------
ప్రతివారికీ పుష్కలంగా వున్నది మాత్రం "చెత్తబుధ్ధి"
కామెంట్‌ను పోస్ట్ చేయండి