(Published by 'SURYA' telugu daily in its Edit page on 29-01-2015, Thursday)
'నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక రకమైన నిర్ణయమే' అనేవారు మాజీ ప్రధాన మంత్రి, కీర్తిశేషులు శ్రీ పీవీ నరసింహారావు.
రాజకీయాల్లో తీసుకునే నిర్ణయాలనుబట్టి, తీసుకునే
సందర్భాలను బట్టి ఆయా నాయకుల తలరాతలు మారిపోతుంటాయి. కొన్ని నిర్ణయాలు ఎదుగుదలకు
మెట్లుగా ఉపయోగపడితే, మరికొన్ని నిర్ణయాలు ఎదురులేని దెబ్బతీస్తాయి. నిర్ణయాల మంచి
చెడులను నిర్ణయించగల శక్తి ఒక్క కాలానికే వుంది. కాలం గడిస్తే కాని వాటి ఫలితాలు,
పరిణామాలు అవగతం కావు. అప్పటివరకు మనం తీసుకున్న నిర్ణయమే భేషయినదని భ్రమ పడడం మానవ
సహజం. ఇది చరిత్ర చెప్పే సత్యం.
నిర్ణయాన్ని ప్రశ్నించలేని వాళ్లు కూడా నిర్ణయం తీసుకున్న
తీరును అధిక్షేపించిన సందర్భాలు అనేకం. వాటిల్లో ఎన్నదగినది నిరుడు కాంగ్రెస్
పార్టీ తన పాలనాకాలం ముగియబోయే ఆఖరు ఘడియల్లో హడావిడిగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం. విభజనను గట్టిగా కోరుకున్నవారు
కూడా ఆ నిర్ణయం తీసుకున్న తీరును ఎండగట్టడం ఇందుకు ఒక ఉదాహరణ. ఎన్నో ఏళ్లుగా నాన్చిపెట్టి చివరి నిమిషంలో ఆదరాబాదరాగా తీసుకున్న ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి యెంత చేటు
చేసిందన్నది ఆ పార్టీ వారికే బాగా ఎరుక.
పోతే, గత ఆదివారం నాడు తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయాలు, వాటిని అమలు పరచడంలో కనబరచిన వేగం, వురవడి గమనిస్తే
సంచలనం అన్న పదానికే కొత్త నిర్వచనం
ఇచ్చినట్టు అనిపించింది. కేసీఆర్ అంటేనే సంచలనాలకు నెలవు అనే పేరు ఇప్పటికే వుంది. అది
ఇంకా బలపడే విధంగా, తన మంత్రివర్గం నుంచి,
ఉపముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసే ఉత్తర్వుతోపాటు, అయన స్థానంలో పార్లమెంటు సభ్యుడయిన కడియం శ్రీహరి
చేత ఆఘమేఘాల మీద ఉపముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించిన వైనాన్ని పరిశీలిస్తే, రాజకీయాల్లో ఇది అత్యంత సంచలనాత్మక నిర్ణయం అని వొప్పుకోకతప్పదు.
అంతకు కొన్ని గంటల ముందు ముఖ్యమంత్రి
కేసీఆర్, ఆయన మంత్రివర్గ సభ్యుల్లో అనేకమంది హైదరాబాదు నగర పొలిమేరల్లో కొంపల్లి
దగ్గర జరిగిన ఒక వివాహవేడుకకు హాజరయ్యారు.
రాజయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని
వినికిడి. వధువు తండ్రి టీ.ఆర్.యస్.
పార్టీలో అత్యంత ముఖ్యుడు కావడంతో రాజకీయ ప్రముఖులు పెక్కుమంది అక్కడకు
తరలివచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సయితం చాలాసేపు వివాహమండపంలో తీరిగ్గా గడిపారు.
ఆ సమయంలో ఆయన్ని చూసిన వారికి, మరికొద్దిసేపట్లో ఆయన రెండు ప్రధానమైన నిర్ణయాలను అమలు పరచబోతున్నారు
అన్న అనుమానం లేశమాత్రం కూడా కలగలేదు. అంత నిబ్బరంగా, అంత తాపీగా అక్కడకు వచ్చిన వారితో మాటలు ముచ్చట్లతో గడిపారు. వచ్చిన అతిధులు, విలేకరుల్లో చాలామంది
తిరుగుముఖం పడుతుండగానే రాజభవన్ లో కడియం శ్రీహరి ప్రమాణ స్వీకారం, రాజయ్య తొలగింపులకు సంబంధించిన విశేషాలను టీవీల్లో చూపిస్తున్నట్టు మిత్రులనుంచి వర్తమానాలు అందాయి. కేసేఆర్ యెంత త్వరగా, యెంత
గుట్టుగా నిర్ణయాలను అమలుపరచగలరు అన్న
విషయం ఈ ఉదంతంతో మరోమారు స్పష్టపడింది.
తన మంత్రివర్గంలో ఎవరిని తొలగించాలి ఎవరిని
చేర్చుకోవాలి అనే విషయంలో ఏ ముఖ్యమంత్రికయినా పూర్తి స్వేచ్చవుంటుంది. ఇది
నిర్వివాదాంశం. కానీ ముందే చెప్పినట్టు నిర్ణయం తీసుకునే తీసుకున్న తీరు, సందర్భం బట్టి
ఆ నిర్ణయం ప్రశ్నార్ధకంగా మారే అవకాశాలు
వుంటాయి.
రాజయ్య తొలగింపుకు కారణాలను ప్రభుత్వం తరపున
అధికారికంగా తెలియచెప్పకపోయినా వాటిని గురించి మీడియాలో పుంఖానుపుంఖాలుగా కధనాలు
వెలువడుతూనే వున్నాయి. రాజయ్య నిర్వహిస్తూ
వచ్చిన వైద్య ఆరోగ్య శాఖలో అనేక అవినీతి కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయన్న
ఆరోపణతో ఆయన పేషీలో పనిచేసే కొందరు అధికారులను, సిబ్బందిని ఆయనతో ప్రమేయం లేకుండానే ఏకపక్షంగా తొలగించారు.
అధికారులమీద చర్య తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి రాజయ్య పదవికి వచ్చిన
ముప్పేమీ లేదని కొందరు తొందరపడి భాష్యాలు చెప్పారు. కానీ కేసీఆర్ ఎత్తుగడ మరో రకంగా
వుందనుకోవాలి. రాజకీయ అవినీతితో పాటు బ్యూరోక్రాటిక్ వర్గాల్లో పేరుకుపోయివున్న
అవినీతి మకిలిని సయితం వదిలించాలి అన్నది
అయన యోచన కావచ్చు. మంత్రిని తొలగిస్తే సంకేతాలు ఉద్యోగ వర్గాలకు చేరవు. మంత్రితో
పాటే వారూ తప్పుకుంటారు కాని, హెచ్చరికలు
వారికి చేరే అవకాశం వుండదు. అందుకే కాబోలు, ముందు అవినీతి మచ్చపడిన సిబ్బందిపై వేటు వేయడం ద్వారా
ఉద్యోగులకు, ఆ తరువాత మంత్రిని తప్పించడం ద్వారా ఇతర మంత్రులకు ఒకేమారు గట్టి
సంకేతాలు ఇచ్చినట్టయింది. ఒకే దెబ్బకు రెండు పిట్టల సామెత చందంగా కేసేఆర్ ఈ చర్యలకు పూనుకున్నారు.
అయితే, ఉపముఖ్యమంత్రి స్థాయిని కూడా పరిగణనలోకి
తీసుకోకుండా ఇలా చేయడం సహజంగానే రాజయ్యకు మనస్తాపం కలిగించే అంశం. అంతే సహజంగా దీనికి సామాజిక
కోణం ఆపాదించడం ప్రతిపక్షాలకు అసహజమేమీ కాదు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నాయకులు
దీనిపైనే ధ్వజం ఎత్తారు. సామాజికంగా వెనుకబడిన రాజయ్యను కేవలం కుల అహంకారం తోనే
కేసీఆర్ ఈవిధంగా అవమానించారని విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయంగా
నాలుగాకులెక్కువ చదివిన కేసేఆర్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే ఈ పరిణామాలకు
తెరలేపారు. మంత్రి వర్గం నుంచి తొలగించిన రాజయ్య
కులానికే చెందిన, రాజయ్య జిల్లాకే చెందిన ఇంకా చెప్పాలంటే రాజయ్య నియోజకవర్గానికే
చెందిన కడియం శ్రీహరిని, రాజయ్య స్థానంలో మంత్రిగా తీసుకోవడం మాత్రమే కాకుండా
ఉపముఖ్యమంత్రి హోదాను కూడా కట్టబెట్టారు. ఆవిధంగా సామాజిక కోణం నుంచి వెలువడే
విమర్శలకు పదును తగ్గేలా ముందుగానే జాగ్రత్తపడ్డారు అనుకోవాలి.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి
కేసీఆర్ ఒక విషయంలో తన మంత్రివర్గ సహచరులను హెచ్చరిస్తూ వచ్చిన మాట కూడా వాస్తవమే.
బంగారు తెలంగాణా లక్ష్యం నెరవేరాలంటే, రాజకీయ అవినీతికి అడ్డుకట్ట వేసి తీరాలని
ఆయన పదేపదే చెబుతూ వచ్చారు. అవినీతిని
ఎట్టి పరిస్తితిల్లోను సహించేది లేదని, ఈ విషయంలో తన కొడుకునయినా ఉపేక్షించేది
లేదని అనేక సందర్భాలలో స్పష్టం చేస్తూ వచ్చారు.
ఈ దశలో వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి
భాగోతాలపై వెలువడిన మీడియా కధనాల
నేపధ్యంలో, ప్రభుత్వానికి మచ్చ తెచ్చే నడవడిక
మార్చుకోవాల్సిందని తోటి మంత్రుల ద్వారా సంకేతాలు పంపినట్టు కూడా వార్తలు వచ్చాయి. అంటే
రాజయ్య తొలగింపు నిర్ణయం హటాత్తుగా తీసుకున్నది కాదని, బాగా ఆలోచించి చేసిన
నిర్ణయమే అని బోధపడుతోంది. కాకపొతే తెలంగాణా ప్రాంతంలో ప్రత్యేకించి హైదరాబాదులో
చెలరేగిన స్వైన్ ఫ్లూ వ్యాధి, ఈ నిర్ణయం అమలును వేగిరపరచి వుంటుంది. తొలగింపుకు ఒక
హేతువు మాదిరిగా ఉపయోగపడివుంటుంది.
అయినా కానీ, అవినీతి ఆరోపణలు వచ్చినంత మాత్రాన, అవినీతి
జరిగినట్టు నిఘావర్గాల నుంచి సమాచారం అందినంత మాత్రాన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో
వున్న వ్యక్తిపై, అదీ సామాజికంగా అణగారిన వర్గానికి చెందిన విద్యాధికుడయిన సహచరుడిపై
వేటు వేసిన తీరు, సంచలనం కావడం మాత్రమే
కాదు ఒక ఆయుధాన్ని చేతులారా ప్రతిపక్షాల చేతికి అందించినట్టు అయిందని స్వపక్షంలోనే
కొందరు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. రాజయ్య బర్తరఫ్ జరిగి రోజులు
గడిచిపోతున్నా దానికి కారణాలు వివరిస్తూ అధికారికంగా ప్రకటన చేయకపోవడం కూడా
విమర్శలకు తావిస్తోంది. అవినీతి యెలా జరిగిందీ, ఏ మేరకు జరిగిందీ, ఎవరు కారకులు
అన్న వివరాలపై స్పష్టత లేదు. అలాటి
పక్షంలో విమర్శకుల నోళ్లకు తాళాలు పడివుండేవి.
వివరణ రాని నేపధ్యంలో సహజంగానే ప్రతిపక్షాలు దీన్ని ఒక అస్త్రంగా మలుచుకునే
ప్రయత్నం చేస్తాయి. చేస్తున్నాయి కూడా. కేసీఆర్ నిర్ణయం ఆయన అహానికి అహంకారానికి
ప్రతీక అనే ఆరోపణల పర్వానికి తెర తీసాయి. ఆ
పార్టీలు అధికారంలో వున్నప్పుడు ఈ మాదిరి ఘటనలు జరిగాయి కాబట్టి ఆ విమర్శలకు అంతగా
విలువ వుండకపోవచ్చు.
సరే!
వీటితో మీడియాకు కొన్నాళ్ళు కాలక్షేపం. అలా అని ప్రజాస్వామ్యంలో ఈ రకమైన
తీరుతెన్నులను సమర్ధిస్తూ పోవాలా అన్న ప్రశ్న మిగిలే వుంటుంది.
గతంలో తెలుగుదేశం తొలిసారి అధికారానికి వచ్చిన
కొత్తల్లో, పదివేల రూపాయలు లంచం
తీసుకున్నారు అన్న ఆరోపణతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీయార్ ఒక మంత్రినే బర్తరఫ్ చేశారు. ఆరోజుల్లో అదొక సంచలనం. అలాగే, ఒకసారి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన
మంత్రివర్గం లోని మొత్తం ముప్పయ్ రెండు మంది మంత్రులను ఒకే ఒక్క ఉత్తర్వుతో
బర్తరఫ్ చేసి, ఢిల్లీ వెళ్ళి కొన్ని రోజులపాటు అక్కడే హస్తినలో మకాం పెట్టారు.
మంత్రుల మూకుమ్మడి తొలగింపుకు కారణం
అవినీతి ఆరోపణలు కాకపోయినా, బడ్జెట్ లీకును
ఒక మిషగా చూపారు. అది కాదు, మంత్రి వర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు అలా
చేసారని కొందరు చెబుతారు. అలాగే మరో సందర్భంలో టీడీపీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రి,
సీనియర్ నాయకుడు అయిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉద్వాసన కూడా అప్పట్లో
సంచలనం సృష్టించింది. సొంత జిల్లాలో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన వెళ్లారు.
ఈలోగా మంత్రిని బర్తరఫ్ చేస్తున్నట్టు
ఉత్తర్వులు వెలువడ్డాయి. మంత్రిగా పర్యటనకు వెళ్ళిన శ్రీనివాసులు రెడ్డి మాజీ
మంత్రిగా హైదరాబాదు తిరిగొచ్చారు. తిరిగి వెళ్ళడానికి వాహనం సమకూర్చడానికి కూడా
అధికారులు సుముఖత కనబరచక పోవడంతో ఆయన నిస్సహాయంగా రైలులో రావాల్సివచ్చిందని
వార్తలు వచ్చాయి. శ్రీనివాసులు రెడ్డి బర్తరఫ్ కు ప్రభుత్వం ఎలాటి కారణం చూపలేదు.
పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అభియోగం మోపారు. ఆయన మాత్రం
మంత్రి పదవి పోయిన తరువాత కొన్ని రోజులు మౌనం పాటించి తరువాత నోరు విప్పారు. అధికారం
అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అడ్డదారుల్లో లక్షలు పోగేసుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు. తరువాత కాంగ్రెస్ లో చేరారు కానీ ఆయన రాజకీయ భవిష్యత్తు
అంధకారంలోకి మళ్ళింది మాత్రం ఆ బర్తరఫ్ తోనే.
కాంగ్రెస్ పార్టీలో ఇలాటివి జరగలేదా అంటే జరిగాయి
కాని అమలు చేసే విధానమే మరో రకంగా వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులను వెంటవెంటనే
మార్చిన తీరు దీనికి ఉదాహరణ. దెబ్బయ్యవ దశకం చివర్లో అయిదేళ్ళలో నలుగురు
ముఖ్యమంత్రులను, మళ్ళీ తొంభయ్యవ దశకం మొదట్లో అయిదేళ్ళలో ముగ్గురు ముఖ్యమంత్రులను
కారణం చెప్పకుండా తొలగించిన చరిత్ర కాంగ్రెస్ అధిష్టానానికి వుంది.
అంచేత, ఇలాటి సందర్భాలలో అధిక్షేపించే
నైతిక హక్కు పార్టీలకి లేని మాట నిజమే.
అయినా రాజకీయం కోసం విమర్శించే ప్రాధమిక హక్కు తమ హక్కుభుక్తం అని అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నప్పుడు ఎవ్వరూ ఏమీ చేయగలిగింది లేదు.
2 కామెంట్‌లు:
''ముందు అవినీతి మచ్చపడిన సిబ్బందిపై వేటు వేయడం ద్వారా ఉద్యోగులకు, ఆ తరువాత మంత్రిని తప్పించడం ద్వారా ఇతర మంత్రులకు ఒకేమారు గట్టి సంకేతాలు ఇచ్చినట్టయింది.''
మంచి విశ్లేషణ
@ K>Srinivas _ Many thanks
కామెంట్‌ను పోస్ట్ చేయండి