12, జనవరి 2015, సోమవారం

శాశ్వితమైనది అశాశ్వితమొక్కటే


ఆశాశ్వితమైనదానిని శాశ్వితమని నమ్మడం మానవ సహజం. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీ మోహన్ కందా ఇందుకు సంబంధించి ఒక విషయం చెబుతుండేవారు. 'ప్రభుత్వ  అధికారులకు పలానా రోజు పదవీ విరమణ చేయాల్సి వుంటుందని బ్రహ్మలిఖితం మాదిరిగా ముందే రాసివుంటుంది. అయినా ఆఖరు రోజు దగ్గర పడుతున్నా కూడా ఆ పదవి శాశ్వితమనే భ్రమలోనే వారుంటార'ని ఆయన అనేవారు. కందా గారి అభిప్రాయం రాజకీయ నాయకులకి కూడా వర్తిస్తుంది.    
కాకపొతే వారిది ఓ విధంగా విచిత్ర మనస్తత్వం. 'వుంటే పదవిలో అయినా వుండాలి. పదవి లేకపోతే వార్తల్లో అయినా వుండాలి' అనేది వారి తత్వం.
వై.యస్.ఆర్.సీ.పీ. అధ్యక్షుడు వై.యస్.జగన్ మోహన రెడ్డి ప్రస్తుతం అధికారంలో లేరు. విభజిత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రస్తుతం ఆయన పాత్ర  ప్రతిపక్ష నాయకునికే పరిమితం. పాత్రను మార్చగలిగే శక్తి కేవలం ఎన్నికలకు మాత్రమే  వుంది. అవీ ఇప్పట్లో లేవు. 2019 దాకా ఆగాలి. అయినా సరే ఇటీవల ఆయన కొన్ని  విచిత్రమైన వ్యాఖ్యలు
చేసారు.

'చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ రెండేళ్ళలోనే అధికారం కోల్పోతుందని, ఒకవేళ పూర్తి కాలం పాలించినా తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందనీ, ఏకంగా ముప్పై ఏళ్ళపాటు జనరంజకంగా పాలించి జనం గుండెల్లో శాశ్వితంగా నిలిచిపోతాన'నీ ఆయన వ్యాఖ్యల  సారాంశం.
ఒక రకంగా చూస్తె ఇది కొత్త విషయం ఏమీ కాదు. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అయన ఈ సంగతి పలుమార్లు చెప్పారు.
జగన్ వ్యాఖ్యలు సహజంగానే టీడీపీలో కలకలం రేపాయి. రకరకాలుగా ప్రతి వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అవి ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటె ఏ రాజకీయ నాయకుడయినా తను అధికారంలోకి రావాలనీ, ఆ  అధికారం కూడా  శాశ్వితమనే అనుకుంటాడు. అందులో అసహజమేమీ లేదు. ఈ విషయంలో మినహాయింపు ఇవ్వగల రాజకీయ నాయకుడు ఎవ్వరూ ఈ రోజుల్లో కలికానికి కూడా దొరకరు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరూ తమ అధికారం సుదీర్ఘ కాలం సాగాలనే తమ మనసులోని మాటను చెప్పకనే చెబుతుంటారు. అయిదేళ్ళ కాల వ్యవధికి ప్రజలు అధికారం ఇస్తే ముప్పయ్యేళ్ళ ప్రణాళికలు గురించి మాట్లాడుతుండడం దీనికి ఒక ఉదాహరణ.
ఇది సరే! అధికారాన్ని పదికాలాలపాటు పదిలంగా కాపాడుకున్న  నాయకులు కూడా చరిత్రలో వున్నారు. చరిత్రలో ఎందుకు, సిక్కిం ప్రస్తుత ముఖ్యమంత్రి పవన్ చాల్మింగ్ నే తీసుకోండి. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయబావుటా ఎగురవేసి అయిదోమారు ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పటికే అంటే 1994  డిసెంబరు 12 వ తేదీన మొదటిసారి  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినాటినుంచి దరిమిలా అయిదేళ్ళకోమారు జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ నాలుగు పర్యాయాలు అంటే ఏకంగా ఇరవై ఏళ్ళు రాష్ట్రాన్ని  పాలించిన ఘనత పవన్ చాల్మింగ్ ఖాతాలో వుంది. ఈసారి అయిదేళ్ళు పూర్తయితే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబసు రికార్డును ఆయన అధిగమిస్తారు. ముఖ్యమంత్రిగా రజితోత్సవం జరుపుకోగల అరుదయిన అపూర్వమయిన ఘనత ఈ సిక్కిం నాయకుడిదవుతుంది.
పొతే,  జ్యోతిబసు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా (1977-2000) వరుసగా ఇరవై మూడు సంవత్సరాల మూడున్నర మాసాలు  పాలించారు. అదీ సీపీఎం నాయకత్వంలోని వామపక్ష కూటమి ముఖ్యమంత్రిగా. వార్ధక్య కారణాలతో పదవి నుంచి తనకు తానే తప్పుకున్నారు. ఇది కూడా  చాలా అరుదయిన విషయమే.
ఇంత సుదీర్ఘ కాలం కాకపోయినా, వరసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రులయిన వారు మరో ఆరుగురు వున్నారు. వీరిలో ముగ్గురు, శ్రీమతి షీలా దీక్షిత్, (ఢిల్లీ), శ్రీ తరుణ్ గగోయ్,(అసోం), ఓక్రామ్ ఇబోబి సింగ్ -  కాంగ్రెస్ వారే  కావడం విశేషం. పొతే మిగిలిన ముగ్గురిలో ఒకరు ప్రస్తుత భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ, బీజేపీ,  (గుజరాత్, 2001 - 2014) శ్రీ మాణిక్ సర్కార్, సీపీఎం (త్రిపుర), శ్రీ నవీన్ పట్నాయక్, బీజేడీ, (ఒడిషా).
ఈ జాబితాలో చేరినవారు  మరికొందరు వున్నారు.
శ్రీ మోహన్ లాల్ సుఖాడియా, కాంగ్రెస్ (రాజస్తాన్, పదహారు సంవత్సరాల ఎనిమిది మాసాలు, 1954 - 1971)
శ్రీ గెగాంగ్ అపాంగ్ (అరుణాచల్ ప్రదేశ్, 1980 - 1999)
శ్రీ బీ.సీ. రాయ్ (కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్, 1948 - 1962)
శ్రీ  కామరాజ్ నాడార్ (కాంగ్రెస్, తమిళ్ నాడు, 1954 - 1963)
శ్రీ వసంత రావు నాయక్ (కాంగ్రెస్, మహారాష్ట్ర, 1963 - 1975)
శ్రీ ఎం.జీ. రామచంద్రన్ (అన్నా డీ.ఎం.కే., తమిళ్ నాడు, 1977 - 1987)
తెలుగు రాష్ట్రం ప్రత్యేకించి మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం అయిన ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో శ్రీ చంద్రబాబునాయుడికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు వుంది. ఆయన వరసగా రెండు దఫాలు, 1995 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి  2004 మే నెల 13 వరకు తిరిగి మూడో సారి 2014 జూన్  8 నుంచి ఈరోజు వరకు మొత్తం 3600 రోజులు అధికారంలో వున్న ఘనత సంపాదించుకున్నారు. 2009 వరకు  సుదీర్ఘకాలం పాలించిన  రికార్డు అంతవరకు చంద్రబాబు పేరిటే వుండేది.  ఆ ఏడాది రాజశేఖరరెడ్డి రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయినప్పుడు,   అయిదేళ్ళ తరువాత, మొత్తం పదేళ్ళ పాలనాకాలం పూర్తిచేసుకుని   వైయస్సార్ దాన్ని  అధిగమించే అవకాశం ఉంటుందని  భావించారు. అయితే దురదృష్టవశాత్తు హెలికాప్టర్ దుర్ఘటనలో వైయస్సార్ ఆకస్మికంగా కన్నుమూయడంతో ఆయన మొత్తం 1938 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేయగలిగారు. ఇక ముందు ముందు రాజకీయ సుస్థిరతకు రోజులు చెల్లిపోయి,  సంకీర్ణశకం రాజకీయాలే రాజ్యమేలే అవకాశాలు ఉన్నందువల్ల, మూడో టరం కూడా ముఖ్యమంత్రిగా  ఎన్నికయిన చంద్రబాబు రికార్డును భవిష్యత్తులో  తిరగరాయడం ఎవరికయినా  కష్టసాధ్యమే కాగలదు. వీరిద్దరి తరువాత మూడో స్థానంలో కాసు బ్రహ్మానంద రెడ్డి (2777 రోజులు) వున్నారు. ఎన్టీయార్ సయితం 2751 రోజులే సీ.ఎమ్. పీఠం మీద ఉండగలిగారు.
చాలాకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసి కొందరిలా చరిత్రపుటలకు  ఎక్కితే మరికొందరు మరో రకంగా చరిత్ర సృష్టించారు. కాళ్ళ పారాణి సామెత చందంగా అలా ప్రమాణ స్వీకారం చేసి ఇలా గద్దె దిగిపోయిన బాపతు. వీరిలో ముందు చెప్పుకోవాల్సింది జగదంబికా పాల్ గురించి. ఎక్కడా విన్నట్టు కూడా అనిపించని ఈ పేరుగల ఆసామీ ఉత్తర ప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రానికి అతి పిన్నకాలం - 'మూడంటే మూడు రోజులు' ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1998 ఫిబ్రవరి 21 న అప్పటి యూపీ గవర్నర్ రొమేష్ భండారీ,  కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరప్ చేయడంతో జగదంబికా పాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. గవర్నర్ నిర్ణయాన్ని కళ్యాణ్ సింగ్ సుప్రీం కోర్టులో సవాలు చేసారు. సింగ్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధం అని సర్వోన్నత న్యాయస్థానం  నిర్ణయించడంతో మూడో రోజునే జగదంబికా పాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. కళ్యాణ్ సింగ్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇక బీహారులో సతీష్ ప్రసాద్ సింగ్ అనే పెద్దమనిషి అయిదే రోజులు ముఖ్యమంత్రి వైభోగం అనుభవించారు.  1968 జనవరి 28 న ముఖ్యమంత్రి అవడం, ఫిబ్రవరి ఒకటో తేదీకల్లా పదవి నుంచి దిగిపోవడం చకచకా జరిగిపోయాయి. కాకపొతే అసలు ముఖ్యమంత్రి ఎంపికలో జరిగిన ఆలస్యం ఆయనకి  ఆవిధంగా కలిసివచ్చింది. మేఘాలయలో యస్ సీ మారక్ 1998 ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి మూడో తేదీ వరకు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నారు. ఒకానొక కాలంలో  అక్కడ రాజకీయ అనిస్థితి ఏ దశకు చేరుకుందంటే,  'విందు భోజనాల్లోనే రాత్రికి రాత్రే  ముఖ్యమంత్రులను మార్చే స్థాయికి వెళ్లిందని హాస్యోక్తిగా  చెప్పుకునేవారు.
ఇక దక్షిణాదిన తమిళనాడులో ఎమ్జీ రామచంద్రన్  మరణానంతరం ఆయన భార్య జానకీ రామచంద్రన్ ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆవిడ ఆ పదవిలో, 1998 జనవరి ఏడోతేదీ  నుంచి జనవరి ముప్పయ్యోతేదీ వరకు, ఇరవయ్ నాలుగు రోజులు మాత్రమే ఉండగలిగారు.
ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈ విశిష్ట స్థానం  లభించింది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు నేతృత్వంలో తొట్టతొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల్లోనే అప్పటి గవర్నర్ శ్రీ రాం లాల్,  ఎన్టీయార్ ని తొలగించి శ్రీ నాదెండ్ల భాస్కర రావుని  ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. అప్పుడు రగిలిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం దరిమిలా ఆయన నెల రోజుల్లోనే (1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు  16 )  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. శ్రీ రామారావు సరిగ్గా నెల తిరిగేసరికల్లా మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు.
ఇటువంటి ఉదంతాలు  మరికొన్ని వున్నాయి. బీహారు ముఖ్యమంత్రిగా బీపీ మండల్ 31 రోజులు (1968), కేరళలో మహమ్మద్ కోయా 45 రోజులు (1979), హర్యానాలో ఓపీ చౌతాలా 20  రోజులు (1989 ) ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టారు.
అయినా పదవిలో ఎన్నాళ్ళు వున్నామన్నది కాదు లెక్క. ప్రజలకు పనికొచ్చే పనులు ఎన్ని చేసామన్నదే చివరికి  లెక్కలోకి వచ్చే ముక్క.  
ఎవరో వేదాంతి చెప్పినట్టు శాశ్వితమైనది అశాశ్వితమొక్కటే. (12-01-2015)
NOTE: Courtesy Image Owner

కామెంట్‌లు లేవు: