27, జులై 2010, మంగళవారం

నేడే చూడండి - భండారు శ్రీనివాసరావు

నేడే చూడండి - భండారు శ్రీనివాసరావు



తప్పనిసరయి ఇక తప్పదురా అనుకున్నప్పుడు అనుభవించి ఆనందించమని ఇంగ్లీష్ లో ఓ సామెత వుంది.
మంచికో చెడుకో టీవీ అనేది ఇప్పుడు ‘నెసిసరీ ఈవిల్’ గా తయారయిందన్నది మాత్రం నిజం. తిట్టుకుంటూ అయినా చూడక తప్పని అవసరంగా మారిందన్నది మరో నిజం. కాదనలేని ఈ నిజాల దృష్ట్యా - తిట్టుకోవడం కూడా మానేసి టీవీని చూస్తూపోతూవుంటే నష్టపోయేదేమీ వుండదు కరెంటు ఖర్చు తప్ప – అన్నాడో టీవీ విప్లవకవి.

వెనుకటి రోజుల్లో, ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది అంటే ‘దూరదర్శన్ లో ‘ అనేవారు నవ్వుతాలుగా. కానీ ఇప్పడు యిరవై నాలుగ్గంటల న్యూస్ చానళ్ళు వచ్చేశాక మొదలయిన ఊకదంపుడు చర్చలు చూస్తునప్పుడు – ఆ పేడా పిడ కలే నయమనే వారు ఎక్కువయ్యారు. వార్తల అధారంగా వ్యాఖ్యలు, వ్యాఖ్యల ఆధారంగా వార్తలు, మళ్ళీ వీటి ఆధారంగా చర్చలు, వాటిపై తిరిగి ‘ఫోన్ ఇన్ లు’, మధ్యమధ్యలో విలేకరుల విరుపులు, యాంకర్ ల విన్యాసాలు, ‘లక్ష వొత్తుల నోములు’ లక్ష సార్లు నోచుకోవాల్సిన న్యూస్ ప్రేజెంటర్ల మూకుమ్మడి తెలుగు భాషా హత్యాప్రయత్నాలు, బుల్లి తెర నిండుగా ‘ఇప్పుడే అందిన ఎప్పటివో వార్తలు’, తాబేలు, కుందేలు మాదిరిగా డేకుతూ, పాకుతూ వెళ్ళే స్క్రోలింగులు, పంటికింది రాళ్ళలా ‘యాడ్ లు ‘ - ఒకటా రెండా యేమని చెప్పుదు ఆ టీవీల లీలలు. యేమని వర్ణింతునూ ఆ ఛానళ్ళ సొగసులు – అన్నాడో వికట కవి.

టీవీల్లో చూపించే చర్చలని చూస్తూ వాటిపై చర్చోపచర్చలు చేసేవాళ్ళని చూస్తూవుంటాము. బుల్లి తెరలపై కానవచ్చే విశ్లేషణ కర్తలే- భుజాలపై శంఖు చక్రాలు పొడిపించుకుని, ‘భుజకీర్తులు’ తగిలించుకున్న భజన బృందగాన బృందావన విహారులుగా చెలరేగిపోతున్నప్పుడు – మేము మాత్రం తీసిపోయామా అన్నట్టు చూసేవాళ్ళు కూడా సినీహీరోల వీరాభిమానుల మాదిరిగా చీలిపోయి ఆయా రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులను కూడా మించిపోయి శ్రుతి మించి ‘రాగాలు’ అందుకుంటున్న తీరుతెన్నులు గమనించేవారికి ‘బ్రోచే వారెవరురా ‘ అన్న కీర్తన జ్ఞాపకం వచ్చి- ప్రకటితమో అప్రకటితమో ‘కరెంటు కోత’ ఒక్కటే తమను కాపాడగలగలదని ‘గజేంద్ర మోక్షం’ పద్యాలను తిరగేసి అరగదీస్తుంటారంటూ - ’ఇవా ఈనాడు జనానికి కావలసినవి? ఇదా ఈ రోజు జనం కోరుకుంటున్నది?’అని ఆవేశపడిపోయాడో వికటాట్ట కవి.

కానీ, ఇక్కడే కరెక్టుగా పైన చెప్పిన సామెత అక్కరకు వస్తుంది. అన్ని వేలుపోసి టీవీలు కొనుక్కున్నదెందుకు? వున్న చీకాకులను మరచిపోయి హాయిగా కాలక్షేపం చేసేందుకు. అంతేకానీ, ఇలా అడ్డమయిన చర్చల్లో తలదూర్చి లేని తలనొప్పులు తెచ్చుకునేందుకు కాదుకదా. అందుకని తెలివయిన వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే –టీవీ రోట్లో పెట్టిన తలను రోట్లోనే వుంచేసి ‘రోకటి పోటు’ని ’ ఆహ్వానించి ఆస్వాదించడం – అంటూ సెలవిస్తున్నాడో ఉచిత సలహా కవి.
అందుకాయన ఇస్తున్న ఉదాహరణలను సోదాహరణంగా గమనించండి.
‘ముఖ్యమంత్రి రోశయ్య గారు ఈ సాయంత్రం డిల్లీ వెడతారా?
‘సోనియా గాంధీ ఆయనకు అప్పాయింట్మెంట్ ఇస్తారా ?
‘లేకపోతె అహ్మద్ పటేల్ లేదా అందుబాటులో వున్న మరో నాయకుడినో కల్సి సరిపెట్టుకుంటారా?
‘ఈ పరిణామాలను జగన్ వర్గం ఎలా గమనిస్తోంది?
‘జగన్ వర్గం వేయబోయే ఎత్తులపై కాంగ్రెస్ సీనియర్లు ఏమనుకుంటున్నారు?
‘రోశయ్య తదుపరి చర్యలు ఎలావుండబోతున్నాయి?
‘ఆయన వర్గం ఎలా భావిస్తోంది?
‘ఇంతకీ రోశయ్య గారికి ఒక వర్గమంటూ వుందా?
‘జగన్ వ్యతిరేక వర్గమే ఆయన వర్గమా?
‘ఇలా ఇన్ని రకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ లో రానున్న రోజుల్లో రాగల పరిణామాలెలా వుండబోతున్నాయి?
‘ఎంతో ఆసక్తిని రగిలిస్తున్న ఈ అంశాలపై మేము అంటే మా ఛానల్ మాత్రమే నిర్వహిస్తున్న చర్చను మా ఛానల్ లోనే - ఈ రోజే, ఇప్పుడే చూడండి.’

వంటా వార్పూ కార్యక్రమంలో ‘ఇలా చేసి మాడండి’ తరహాలో వెలువడే ఈ రకం ప్రకటనలు వింటుంటే నవ్వు రావడం లేదా? ఇంతటి హాస్యాన్ని ఇరవై నాలుగ్గంటలపాటు ఇంటింటికీ పంచుతున్న తెలుగు టీవీ చానళ్ళ నిర్విరామ, నిస్వార్ధ, నిర్వికార సేవా నిరతిని కొనియాడడానికి మీకు మాటలు రావడం లేదా? అయినచో – మీకు నిష్కృతి యెట్లు? మీబోటి బోంట్లకు అదే సరయిన మార్గం. తలను రోటిలోనే వుంచండి. రోకటి పోటుకు వెరవకండి. (26-07-2010)

NOTE: All images in this blog are copy righted to their respective owners.

21, జులై 2010, బుధవారం

మనసు రాతలు - భండారు శ్రీనివాసరావు

మనసు రాతలు  - భండారు శ్రీనివాసరావు


(ఓ వయసులో ఈ రాతలు రాయని మనసూ వుండదు-మనిషీ వుండడు - నేనూ మినహాయింపు కాదు. కాకపొతే - ముప్పయి , నలభై ఏళ్ళ   తరవాత చదువుతూ వుంటే - రాసింది నేనేనా అనిపిస్తోంది.  కాలమహిమ కాబోలు  - రచయిత )


రాత్రి ఓ నక్షత్రం
రాలి ఒళ్ళో పడింది-
తెల్లారి చూస్తే అది నువ్వే




కొందరికి చందమామని చూస్తే
తమ ప్రియురాలు గుర్తుకువస్తుంది
కానీ నిన్ను చూసినప్పుడే
నాకు చందమామ గుర్తుకువస్తుంది





నిన్ను ముట్టుకుంటే
మబ్బుల్ని తాకినట్టువుంటుంది
నిన్ను ముద్దుపెట్టుకుంటే
నక్షత్రాన్ని ముద్దాడినట్టువుంటుంది

నువ్వే నాదానివయితే
ఇక సమస్త ప్రపంచం నాదే

నువ్వు కనబడలేదన్న బెంగ నాకెందుకు?
అస్తమానం నిన్ను అంటిపెట్టుకునే వున్నానుగా





రాత్రి కలలో నువ్వు
రాత్రంతా నాతో నువ్వు
ఇద్దరి మధ్యా నలుగుతూ పాపం రాత్రి
చివరికి నీ కనురెప్పల మధ్య
నిద్రపోతూ నేను




నీ మనసు మెత్తనిదే
హృదయమే ఒక పాషాణం
కానీ నా ప్రేమ వెడితో అది కరక్క పోతుందా
నేను చూడకపోతానా


గొంతు కొరబోయింది
నిన్న చాటుగా నువ్విచ్చిన
ముద్దు ఘాటు కాదు కదా


ఇంత ముద్దొస్తున్నావ్
ఓ ముద్దిస్తే నీ సొమ్మేం పోయింది?


నీ అందంలో వున్న రహస్యం ఏమిటో
ఎందరి కళ్ళు పడ్డా
దిష్టే తగలదు


నువ్వెదురుగావుంటే
యుగాలు క్షణాలు
నువ్వు కనుమరుగయితే చాలు
క్షణాలు


నిన్ను నేను మరవాలంటే
నన్ను నేను మరవాలి
నన్ను నేను మరవాలంటే
నిన్ను నేను మరవాలి




షాజహానుకు బుద్దిలేదు
ప్రియురాలికి గుండెలో గుడి కట్టాలి కాని
చలువరాళ్ళతో తాజమహలు కడతాడా?


నిను చూడకుంటే చస్తాను
నువు కనబడితే పడి చస్తాను


కన్ను తెరిస్తే నువ్వు
కనులు మూస్తే నువ్వు
కలల్లో నువ్వు
కనురెప్పల్లో నువ్వు
పీల్చే గాలిలో
విడిచే శ్వాసలో
రాసే రాతలో
నువ్వే-నీ నవ్వే


ఊహల్లో నేను
ఊహించుకుంటూ నువ్వు
వర్తమానాన్ని నష్తపోతున్నాము.


Bhandaru Srinivas Rao (I.I.S.)

Cell: 98491 30595 Res: 040 2373 1056.

NOTE: All images in this blog are copy righted to their respective owners.


 





--------------------------------------------------------------------------------

విందామయా నరుడ విందామయా - భండారు శ్రీనివాస రావు

విందామయా నరుడ విందామయా - భండారు శ్రీనివాస రావు

చిన్నప్పుడు చదివిన ముళ్ళపూడి వారి జోక్ గుర్తొస్తోంది.

"పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.

తరవాత్తరవాత - మొగుడి మాట పెళ్ళాం వింటుందట.

పొతే, ఆ తరవాత మాత్రం - ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట."


ఈ వినడం అన్నది చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా - అనే చెవలాయిలు- వినదగునెవ్వరు చెప్పిన అని- ఎవరేది చెప్పినా చెవులు రెండూ వొగ్గించి, రిక్కించి మరీ వింటారు.
కొందరు భార్యలు - " నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని అసంతృప్తులు మరచిపోతుంటారు. మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు.

వినికిడి సమస్య అంటూ లేకపోతె, ఈ వినకపోవడం అన్న ప్రసక్తే వుండదు. ఆ సమస్య వుంటే ఈ వినే సమస్యకు తావుండదు. ఎంచక్కా, ఎవరేం చెబుతున్నా వింటున్న ఫోజు పెట్టి- చెప్పేవాళ్ళ నోటి దురద వొదిలించవచ్చు.
విని, తలాడించే అలవాటు మగవాళ్ళలో ముఖ్యంగా పెళ్ళయిన వాళ్లలో ఎక్కువన్న థియరీ ఒకటుంది. ఈ బాపతు మగాళ్ళు ఆ బాపతు అపప్రధ వొదిలించుకోవడానికి ఆదర్శ పురుషుల అవతారం ఎత్తుతుంటారు. " భార్య మాట వింటే తప్పేమిటి? ఆవిడా మనలాంటి మనిషే కదా." అంటూ తమకి తాము సర్ది చెప్పుకుంటారు.
కాగా మరో రకం మగాళ్ళు- తమ మగాడితనాన్ని - వేరే రకంగా ప్రదర్శిస్తుంటారు.
" నన్నడిగితే అసలు మగాళ్ళ మాటల్ని ఆడవాళ్ళు వినకపోవడమే కాదు, ఎదిరించమని కూడా చెబుతాను. నా విషయమే తీసుకోండి. మామూలుగా మొగుళ్ళు రాగానే భార్యలు లేచినిలబడడం ఆనవాయితీ కదా. మా ఇంట్లో అలా కాదు. నేను బయట నుంచి రాగానే మా ఆవిడ లేచి నిలబడబోతుంది. పరవాలేదు కూర్చో అంటాను. నా మాట వినొద్దన్నది మా ఇంట్లో నా రూలు కాబట్టి లేచి నిలబడుతుంది. చూసారా! అదీ నేను నా భార్య కిస్తున్న స్వేఛ్చ." అంటుంటారు ఈ కోవలోకి వచ్చే మొగుళ్ళు.
బొత్తిగా మాట వినని జనం -జనాభాలో ఎక్కువ. వీళ్ళని 'సీతయ్యలు' అంటారని కూడా ఈ మధ్యనే తెలిసింది - ఓ సినిమా పుణ్యమా అని.
పొతే,వినడం వినకపోవడం అన్న రూట్లో ముందుకుపోయే పని కాసేపు పక్కనపెడదాం.
హైదరాబాద్ ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ పీ ఎస్ గోపాల కృష్ణ -'విన్నవింత' అనే శీర్షికతో రేడియో లో ఒక కార్యక్రమం కొన్నాళ్ళు నడిపారు. విన్న వింతలను శ్రోతలతో పంచుకోవడం రచయిత ఉద్దేశ్యం. అయితే వినేవారికి పెద్దపీట వేసే పెద్ద మనసు వున్నవాడు కనుక, విన్నవించుకోవడం అనే అర్థంతో దానికి "విన్నవింత" అని పేరు పెట్టారు.

మా బోటి రేడియోలో పనిచేసిన వాళ్లకి వినే వాళ్ళే 'దేవుళ్ళు' కాబట్టి , పొద్దునపూట వచ్చే ఆ ప్రోగ్రాం వాళ్ళకో 'నివేదన' గా భావించే వాళ్ళం. ఆయన చెప్పే వన్నీ మంచి విషయాలే కాబట్టి , ఆ రోజుల్లో శ్రోతలు కూడా మంచి సంగతులు వినే బాపతు కాబట్టి- ఆయన కూడా రకరకాల పనికొచ్చే కబుర్లతో దాన్ని తీర్చిదిద్దేవారు.(ఇన్ని కా'బట్టీలు' అవసరమా అంటే- ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పకపోతే రేడియో వాళ్లకి తెలుగు రాదు అని అపోహపడే ప్రమాదం సయితం లేకపోనూ లేదు) . శ్రోతలు కూడా 'రేడియోలో

చెప్పడమేమిటి? మనం వినడమేమిటి?' అని భేషజాలకు పోకుండా బుద్దిగా వినేవారు. ఆ విధంగా చెప్పేవారికి వినేవారు, వినేవారికి చెప్పేవారు లేరనే కరువు లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో రేడియోలో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో వినేవాళ్ళం అని గుర్తు చేసుకునే ఆనాటి శ్రోతలు ఈ రోజుల్లో కూడా తారసపడడం కద్దు.

మళ్ళీ అసలు సంగతికొస్తే-
'వినంగానే సరిపోదు- విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకత' అనే వాళ్ళున్నారు.
'ఒరేయ్ కన్నా! మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!' అని తండ్రి అంటే- పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.

విని పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడు, తలిదండ్రుల మాట జవదాటడు' అని కన్నవాళ్ళు - వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.

వినడంలో ఇంత విషయం వుంది కాబట్టే- నోములు, వ్రతాలు చేసేటప్పుడు వ్రత కధలు విన్నవాళ్ళకు కూడా 'వ్రత ఫలం' లో భాగం కల్పించారని - సూతుడు శౌనకాది మునులకు చెప్పగా-అది విన్నవాళ్ళలో ఒకడు తెలియచేయడమైనదని సర్వజనులకు ఇందుమూలముగా తెలియపరచడమైనది.

NOTE: All images in this blog are copy righted to their respective owners.

జీవన స్రవంతి - భండారు శ్రీనివాస రావు

జీవన స్రవంతి - భండారు శ్రీనివాస రావు


(ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియోలో ప్రసారితం)




జీవనస్రవంతి - 1


'ఉప్పంటే ఏమిటి? దాని రుచి ఎలా వుంటుంది?' అంటే తెలియదు-

'రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే అదీ తెలియదు.

ఇవి ఏ ఇంటర్వ్యూ లోనో అడిగిన షరా మామూలు ప్రశ్నలు - జవాబులు కావు.


యెంతో అభివృద్ధి జరిగిందని జగమంతా అనుకుంటున్న సోవియెట్ రష్యా లాంటి దేశంలోని ఒక మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న ఒకానొక తెగవారు గత నలభై సంవత్సరాలనుంచి ఉప్పు రుచి ఎరగరు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సంగతే వారికి తెలియదు.

ఈ మధ్య దారితప్పిన ఓ పరిశోధకుల బృందం - దారి తెలియక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తెలియవచ్చిన విషయాలు ఇవి.




జీవన స్రవంతి -2


పశ్చిమ బెంగాల్ లోని పోలిసులు పాగా వేసి ఓ పాగా లేని పెద్ద మనిషిని పట్టుకున్నారు. అతని దగ్గర పోలితిన్ సంచీ ఒకటి వారికి దొరికింది. దాంట్లో రెండు పుర్రెలు బయట పడ్డాయి. ఈ పుర్రెల సంగతి చెబుతావా? నీ బుర్ర రామకీర్తన పాడించమంటావా అని పోలీసులు సుతారంగా బెదిరించేసరికి, పాపం ఆ పుర్రెల షావుకారు జావకారిపోయి అసలు సంగతి ఒప్పేసుకున్నాడు. పుర్రెల్ని కలకత్తాలో హెచ్చు ధరలకు కొనే బడా వ్యాపారులున్నారన్న రహస్యం బయటపెట్టి వారి పుట్టి ముంచేసాడు. దాంతో పోలీసులు కలకత్తాలో కూడా దాడులు చేసి పుర్రెల వ్యాపారం చేసే వారిని పట్టేసుకుని కటకటాల వెనక్కు నెట్టేశారు.

జీవన స్రవంతి -3

దేశంలోని గూడ్స్ రైళ్లన్నీ కలసి ఏటా ఎంత సరుకుని రవాణా చేస్తున్నాయో - అంత కంటే ఎక్కువగా ఎడ్ల బండ్లపై సరుకుల రవాణా జరుగుతోందని ఆ మధ్య ఓ సర్వేలో తేలింది. ఇప్పుడా ఎడ్ల బండి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.


 భారత దేశం తయారు చేసిన ఒక ఉపగ్రహాన్ని అర్జంటుగా అడంగుకి చేర్చడానికి ఎడ్ల బండిని ఉపయోగించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంతొమ్మిదివందల ఎనభయి ఒకటిలో ఆ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపడానికి ముందు- కొన్ని పరీక్షలు జరపడానికి దాన్ని ఎడ్లబండిపై తీసుకు వెళ్ళారట. విదేశాల్లో ఈ పనికి ఎంతో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే మనవాళ్ళు మాత్రం యాభయి రూపాయలకు ఒక ఎడ్లబండిని మాట్లాడి పనిపూర్తి చేశారు.

జీవన స్రవంతి -4

ఒక్కో దేశంలో జనాన్ని ఒక్కోరకమైన వింత రోగాలు పట్టి పీడిస్తుంటాయి.


ఈ మధ్య ఇంగ్లాండ్ లో జనం విపరీతంగా వొళ్ళు పెరిగిపోయి తెగ బాధ పడిపోతున్నారట. కాస్త కండ పట్టి, వొళ్ళు చేసి నిగ నిగలాడుతూవుంటే . బాగానే వుంటుందికాని, పెరిగే వొళ్ళు పెరిగిపోతూనేవుంటే ఏం బాగుంటుంది చెప్పండి ? ఇలా వొళ్ళు పెరిగిపోయే జబ్బు - రోజు రోజుకు పెరిగి పోతూ వుండడంతో .- జనంలో ఆందోళన కూడా అదే మోతాదులో పెరిగిపోతోందని అక్కడి రాయల్ వైద్య కళాశాల నివేదికలో పేర్కొన్నారు. పెద్దవారిలో ముప్పయి శాతం- పిల్లల్లో అయిదు శాతం ఊబకాయంతో లబ లబ లాడుతూ వున్నారట. గున్న ఏనుగుల్లా బలిసిన చిన్న పిల్లలు గున గున తిరుగుతూ- బరువు తగ్గడమెలా అన్న బెంగతో మంచమెక్కి - మరింత వొళ్ళు చేస్తున్నారట.

జీవన స్రవంతి -5

గుండె భద్రం తమ్ముడూ అంటున్నారు డాక్టర్లు.


  గుప్పెడు గుండెకాయపై గుండిగెలకొద్దీ భారాలనూ, బాధలనూ, భయాలనూ రుద్దకండీ- పిచ్చి గుండె గభాల్న ఆగి ఊరుకుంటుందని హెచ్చరిస్తున్నారు. మీ కోపం - మీకంటే - మీ గుండెకు ప్రధాన శత్రువని ఉచిత సందేశం కూడా ఇస్తున్నారు. మనసులో కక్షలూ, కార్పణ్యాలూ పెంచుకుంటూ పొతే- ఆ ప్రభావం గుండె మీదపడి గుండె జబ్బులకు దారి తీయగలదని గుండె మీద చేయి వేసుకుని మరీ చెబుతున్నారు. సిగరెట్ తాగడం గుండెకు ఎంత హాని చేస్తుందో- కోపతాపాలు కూడా గుండెని అంతే బలహీనం చేస్తాయని వారంటున్నారు. అంతేకాదు- నవ్వూ నవ్వించూ అంటూ నవ్వే భోగం- నవ్వే యోగం అనే ఫిలాసఫీతో జీవితాన్ని తేలిగ్గా తీసుకునేవారి గుండె మాత్రం నిక్షేపంగా వుంటుందట.
అయితే గుండె గురించి గుండె చెరువు అయిపోయే విషయాలు వీళ్ళిలా చెబుతుంటే- అమెరికాలోని ఫ్లోరిడా వైద్య కళాశాలలో పనిచేసే శాస్త్రవేత్తలు - చెప్పాపెట్టకుండా ఆగిపోయే గుండెని ఎన్నాళ్ళు నమ్ముకుంటామని ఏకంగా ఒక నకిలీ గుండెనే తయారుచేసారు. హృదయ చలనం ఆగిపోయిన రోగికి ఈ అయస్కాంతంతో రూపొందించిన ఈ నకిలీ గుండెని అమరిస్తే- గుండె చేసే పనులన్నీ అదే చేసేస్తుందట.

జీవన స్రవంతి -6



చాదస్తం మొగుడు చెబితే వినడు- కొడితే ఏడుస్తాడు అన్నట్టయింది పంజాబులో ఓ భర్తగారి పరిస్తితి.
అమృతసర్ దగ్గర ఓ ఊళ్ళో ఒక పెద్దమనిషి ఇంటి విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా - కేవలం వొంటికి మందు పట్టించడంలోనే ఎక్కువ సమయాన్నీ, డబ్బునూ ఖర్చు చేస్తూ వుండేవాడు.
 ఇంటి ఇల్లాలుకి ఇంటి ఖర్చులకింద ఏమీ ఇవ్వకుండా- సంపాదన అంతా తాగుడికే తగలేస్తూవుండడం ఆవిడకు సుతరామూ నచ్చేదికాదు.
నచ్చని సంగతి నయాన చెప్పింది. ఏడుస్తూ చెప్పింది. వేడుకుంటూ చెప్పింది. అయితే- మందు తలకెక్కిన ఆ పెద్దమనిషికి పెళ్ళాం మాటలు మాత్రం మనసుకు ఎక్కలేదు. పైపెచ్చు- ఇంట్లో గొడవలన్నింటికీ మందే మందు అని ధృడంగా నమ్మేసి తన మందు గొడవలోనే కూరుకుపోయాడు.
దానితో ఆ ఇల్లాలుకి చిర్రెత్తుకొచ్చింది.
భర్త పని చేసే దుకాణం ముందు ధర్నా ప్రారంభించింది. చోద్యం చూస్తున్నవారందరికీ తన మొగుడి నిర్వాకాన్ని తెలియచెప్పింది. ఆ విధంగా భాద్యత తెలియని భర్తలందరికి బుద్ధి చెప్పింది.

జీవన స్రవంతి -7

'అడుక్కోవాల్సిన ఖర్మ నాకేం పట్టింది- అప్పిచ్చే వాళ్ళు న్నంతకాలం.' అన్నాడొక అప్పారావు.
నిజమే. వూరికే ధర్మం చేసాడా- అప్పిచ్చాడు కాని - అని ఆనక బుకాయించవచ్చు- ఎంచక్కా అప్పు తీసేసుకుని.
 పంజాబు నేషనల్ బ్యాంకు వారు అడుక్కునేవాళ్ళకి అప్పులిచ్చిచూద్దామని ఆలోచన చేసి - కొందరు బిచ్చగాళ్ళకు రుణాలు మంజూరు చేశారు.


 బిలబిలమంటూ వచ్చి అప్పు తీసుకున్న భిక్షకులు ఆ డబ్బుతో స్వయం ఉపాదులు ఏర్పాటుచేసుకుని, రాబట్టుకున్న రాబడిలో కొంత మొత్తం బాకీ కింద బ్యాంకుకు చెల్లు వేసారు. దర్జాగా అప్పులుచేసి మొగం చాటేసి ఎగ్గొట్టే బడాబాబులకంటే పూటకు గతిలేని బిచ్చగాళ్ళే నయమన్నది సదరు బ్యాంకు వారి ఉవాచ.  

జీవన స్రవంతి -8

కొందరు సాహసాలు చేసి కీర్తి గడిస్తే- మరికొందరు దుస్సహాసాలకు దిగి జయిల్లో పడుతుంటారు.
ఫ్రాన్సు సైన్యంలో పనిచేస్తున్న ఓ కుర్ర ప్రేమికుడికి - కొత్తగా తళతళలాడుతున్న ఆర్మీ కారు కనిపించింది.


 అది వేసుకుకుని-తనకోసం ఎదురుచూస్తున్న ప్రేయసి వద్దకు వెడితే ఎలా వుంటుందో అని ఆలోచించడానికి అతగాడికి రెండు క్షణాలు కూడా పట్టలేదు. ఎందుకంటే- మరు క్షణంలోనే అతడు కారుని దొంగతనంగా బయటకు తీసుకువెళ్ళి- ఝామ్మున ప్రేయసి దగ్గరకు దూసుకుపోయాడు. చూసావా నా తడాఖా అంటూ ప్రియురాలితో డంబాలు పలకబోయేన్తలో - వెనుకనే వున్న పోలీసులు హఠాత్తుగా ముందుకొచ్చి కారు దొంగ చేతికి అరదండాలు తగిలించారు. వయస్సులోవున్న కుర్రాడు, కొత్త కారు చేతికి చిక్కితే - ముందుగా వెళ్ళేది ప్రేమించిన పిల్లదగ్గరికే అన్న ధర్మసూక్ష్మం తెలిసిన పోలీసులు- ఆ యువకుడికంటే ముందుగానే ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, అతడికోసం కాచుకోవడంతో ఆ కుర్ర దొంగ కధ కాస్తా అడ్డం తిరిగింది. కొత్త కారులో- పాత ప్రేయసితో హాయిగా షికారు తిరుగుదామనుకున్న అతడిని ఆ కారులోనే కారాగారానికి చేర్చారు.


జీవన స్రవంతి -9

ప్రతి బియ్యపు గింజమీద తినేవాడి పేరు రాసుంటుంది అన్నది ఓ సామెత. పెళ్ళిళ్ళ విషయం కూడా అంతే అంటారు. ఎవరికెవరో ఎవరికెరుక ?
సౌదీ అరేబియాలో ఈమధ్య ఇలాంటి ఒక వివాహం - నిజం చెప్పాలంటే రెండు జరిగాయి.


ఇంట్లో వొంట్లో పుష్కలంగా వున్న ఒకానొక పెద్దమనిషి తన ఇద్దరు కుమార్తెలకీ పెళ్లి సంబంధాలు వెతికి- ఘనంగా వివాహ వేడుకలకు ఏర్పాట్లు చేసి- ఆర్భాటంగా నలుగుర్నీ పిలిచి - సరిగ్గా నిఖా సమయానికి నోరు జారి, తన కూతుళ్ళను - ముందు నిశ్చయం చేసుకున్న వరుళ్ళలో - ఒకరికి బదులు మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు ప్రకటించాడు. తరువాత జరిగిన పొరబాటు తెలుసుకుని, నాలుక కరుచుకుని - , అవసరమయితే విడాకులు ఇప్పించయినా సరే - కూతుళ్ళకి ముందు నిర్ణయించిన వరులతోనే వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు. అయితే ఆ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే- మారుపడిన మొగుళ్ళ తోనే మనువు కొనసాగిస్తామని ఆ కొత్త వధువులిద్దరూ మారు మాట లేకుండా రాజీ పడిపోయారు.


జీవన స్రవంతి -10

భార్యలమీద ప్రేమని ఒక్కొక్కరూ ఒక్కొక్కవిధంగా వెల్లడిస్తుంటారు కొందరు పెళ్ళాం మెడలో నగలు దిగవేసి తమ వగలు చూపిస్తే- మరికొందరు పట్టు చీరెలతో కట్టుకున్నవారిని ఆకట్టుకుంటూ వుంటారు. మనీలాలో- ఆర్మిడో పినేడా అనే వడ్రంగికి భార్య అంటే వల్లమాలిన ప్రేమ. ఎలాగయినా సరే- కష్టపడి కాసులు కూడబెట్టి - రెండస్తుల మేడ కట్టి- సుఖపెడతానని ఇల్లాలితో ఎప్పుడూ చెబుతుండేవాడు. పాపం- విధి వక్రించి- ఇంతలొ ఆ ఇంటావిడ కన్నుమూసింది.


ఆటను మాత్రం- భార్యనూ, ఆమెకిచ్చిన మాటనూ మరవలేదు. రేయింబవళ్ళు శ్రమించి, డబ్బులు పోగేసి- అనుకున్న ప్రకారం భార్య పేరున ఇల్లు కట్టాడు. ఆమె అవశేషాలతో ఇంట్లోనే సమాధి నిర్మించాడు. దానిపైన- భార్య చాయా చిత్రాన్ని వేలాడకట్టాడు . ఆవిడ జీవించి వుండగా ఉపయోగించిన గ్యాస్ స్టవ్ ను, పడక మంచాలను ఆ సమాధికి దగ్గరగా అమర్చాడు. అలా, గృహ ప్రాంగణం లోనూ, గృహ ప్రాంగణం లోను - ఇల్లాలి జ్ఞాపకాలను భద్రపరచుకుని రోజులు దొర్లిస్తున్నాడు.

(ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియోలో ప్రసారితం - భండారు శ్రీనివాసరావు)

NOTE: All images in this blog are copy righted to their respective owners.




17, జులై 2010, శనివారం

గ్రేట్ ఫెయిల్యూర్ స్టొరీ -భండారు శ్రీనివాస రావు

గ్రేట్ ఫెయిల్యూర్ స్టొరీ -భండారు శ్రీనివాస రావు
 (డిసెంబర్. ఆరు - రెండువేల ఆరులో రాసినదానికి కొద్దిపాటి సవరణలతో )

పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరయయ్యవ తేది.

విజయవాడ, లబ్బీపేట లోని 'ఆంద్ర జ్యోతి' కార్యాలయం.

అందులో అడుగు పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారిని కలుసుకున్నాను.



ఆయన ఎగాదిగా చూసి, నా పరిచయం కనుక్కుని-

'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.

అదే నా తొట్ట తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.

ఉపేంద్ర గారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వున్నా బల్ల చివర్లో కూర్చున్నాను. పీ టీ ఐ , యు ఎన్ ఐ వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం.

ఉదయం ఎనిమిది గంటలకల్లా అన్నం తిని ఆంధ్ర జ్యోతి కి వెళ్ళే వాడిని. అన్నయ్య పర్వతాలరావు గారు ఇమ్మన్న రూపాయి నోటు వొదినె సరోజినీ దేవి నా చేతులో పెట్టేది. రాను పోను సిటీ బస్సుకు నలభై పైసలు. మధ్యాహ్నం ఆఫీసు కు ఎదురుగా వున్నా టీ స్టాల్లో ముప్పయి పైసలు పెట్టి ఒక సమోసా తిని టీ తాగేవాడిని. రోజుకు ముప్పయి పైసలు మిగిలేవి. వేరే ఖర్చులు లేవు. అలా నెలకు సుమారు పది రూపాయలు ఆదా. అదే నా మొట్టమొదటి నెలసరి ఆదాయం.

అలా మూడు నెలలు గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్ నాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చి ఎక్కవుంటేంట్ ని కలవమని చెప్పాడు. వెడితే- ఓ ఓచర్ మీద సంతకం చేయించుకుని పది- పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు. అదే నా తొలి వేతనం.

ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా- ప్రూఫ్ లో అచ్చయిన నా ఐటెంసుని నేనే చదువుకుని మురిసిపోయేవాడిని. నేను చేరిన కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు భాద్యతలు స్వీకరించడం జరిగిపోయాయి.ఎందుకో ఏమోగానీ, దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని.
వాక్టూనులు
మార్నింగ్  మనాది 
ఉదయం ఎనిమిది గంటలకల్లా 
ప్రతి సెంటర్లో అందమయిన బొమ్మల్లా 
నిలబడే అమ్మాయిలనల్లా 
ఊడ్చుకుపోయే 
ఉమెన్స్ కాలేజ్ బస్ తో ఎల్లా?
                           -భండారు 

 సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో - పిల్లలకోసం ప్రత్యెక కధలు -

భారత సైన్యం చేతిలో పాక్ ఓటమి

 బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు ఉపేంద్ర, ఐ వెంకటరావు, కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ, సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్ర జ్యోతి ఉద్యోగ పర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.

అన్నట్టు చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో పనిచేస్తున్నప్పుడు ఏదో విషయంలో పేచీ వచ్చి,రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి. అదో అధ్యాయం.

హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో విలేకరిగా చేరడం యాద్రుచ్చికమే అని చెప్పాలి.


 అంతకుముందు ఈ ఉద్యోగాన్ని ఏంటో సమర్ధంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న తురగా కృష్ణమోహన రావు గారు - గోల్కొండ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి- దురదృష్టవశాత్తు -నకిరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ విధంగా ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి ఆకాశవాణి ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా నేను దరకాస్తు చేసుకోవడం, ఇంటర్వ్యూ కు హాజరు కావడం - సెలెక్ట్ కావడం జరిగిపోయాయి. ఆంద్ర జ్యోతి అనుభవం ఈ ఉద్యోగం పొందడానికి అదనపు అర్హతగానే కాకుండా- అసలైన అర్హతగా తోడ్పడిందని నా నమ్మకం. రాసిన రాతలు అచ్చులో చూసుకునే అవకాశం ఆంద్ర జ్యోతి ద్వారా లభిస్తే- సొంత గొంతును తెలుగునాట నలుగురికీ వినిపించే వీలు రేడియోలో దొరికింది. వార్తా సేకరణ, కూర్పు, తెలుగులోకి అనువాదం ఇలాంటి ప్రక్రియలతో పాటు, రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాని రోజున ఏకంగా స్టూడియో లోకి వెళ్ళిపోయి వార్తలు చదివేయడం- వారానికి రెండు మార్లు వార్తా వాహిని -

 ఒకసారి జీవన స్రవంతి (రోజువారి జరిగే ఘటనలకు కొంత హాస్యాన్ని జోడించి తయారు చేసిన ప్రత్యెక వార్తలు ) ఇలా అన్నిరకాలుగా నా రేడియో జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాను.

ఆ రోజుల్లో ఇన్ని పత్రికలూ లేవు. ఇంత మంది విలేకరులు లేరు. ముఖ్య మంత్రి నిర్వహించే విలేకరుల సమావేశానికే పది, పన్నెండు మంది హాజరైతే గొప్పగా వుండేది. నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో కావడం వల్ల-వార్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం, రేడియో పై ఎక్కువగా ఆధార పడాల్సి రావడం- రేడియో విలేకరిగా నా ప్రాధాన్యతను కొంత పెంచింది.

 
నాటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్యతో

 అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు - రేడియో మీది అభిమానాన్ని, నా మీది వ్యక్తిగత అభిమానాన్ని కలబోసి ప్రదర్శించేవారు. విలేకరుల సమావేశాలను -'శ్రీనివాస్ వచ్చాడా!' అని కనుక్కుని మొదలు పెట్టడం అప్పుడప్పుడు నలుగురిలో ఇబ్బంది పెట్టేది. తన ఎయిర్ బస్ మంత్రివర్గంపై చెలరేగిన విమర్శల దరిమిలా-మంత్రుల మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించడానికి ఓసారి విలేకరులకు కబురు పెట్టారు. మధ్యాన్నం వార్తల టైం దగ్గర పడుతుండడంతో-రాజీనామాల సంగతి ముందుగా నా చెవిలో వేయడం - విలేకరుల సమావేశం మొదలు కాకముందే ఆ సమాచారం ప్రాంతీయ వార్తల్లో ప్రసారం కావడం జరిగి పోయింది. ఇది నా వృత్తి జీవితంలో మరచిపోలేని సంఘటన

ఆ రోజుల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళ్లి మధ్యాహ్నం దాకా ప్రెస్ రూం లోనో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లోనో గడిపి- అంతవరకు సేకరించిన సమాచారం తీసుకుని న్యూస్ బుల్లెటిన్ కు అందించడానికి కాలినడకన రేడియో స్టేషన్ కు వెడుతుండే వాడిని. ఒకరోజు అలా పోతున్నప్పుడు ముఖ్యమంత్రి పైలట్ వాహనం సైరన్ మోగిస్తూ వెళ్ళింది. అంజయ్య గారు- తన అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కారులో డ్రైవర్ పక్కన ముందు సీట్ లో కూర్చునే వారు.ఆయనకు కార్యకర్తల తాకిడి ఎక్కువ. వెనుక సీట్ లో ఎవరికి వారు దూరి పోయేవారు. ఈ ఇబ్బంది తట్టుకోవడం కోసమో ఏమో ఆయన ముందు సీట్ కి మారిపోయారు.

సరే! ఆ రోజు నా పక్కనుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి వాహనం కొద్దిగజాలు ముందుకుపోయి ఆగింది. ఆయన అంగరక్షకుడు బాలాజీ- - రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో పనిచేస్తున్నారు- కిందికి దిగి సీఎం గారు పిలుస్తున్నారు రండి అనడం- నన్ను కారు ఎక్కించుకుని రేడియో స్టేషన్ లో దింపడం క్షణాల్లో జరిగిపోయాయి.అనుకోకుండా ముఖ్యమంత్రి రేడియో

స్టేషన్ కి రావడంతో మా వాళ్ళంతా అవాక్కయ్యారు. అంజయ్య గారు ఇలా నాపట్ల చూపిన అవ్యాజాను రాగాలకి ఇంకా ఎన్నో ఉదాహరణలు వున్నాయి. అవి ఆయన గొప్పతనానికి, మంచి తనానికి తార్కాణాలుగా భావిస్తానే కాని , నా ప్రత్యేకత ఏమీ లేదు.

1980 లో వైఎస్సార్ తో రచయిత



2005 లో వైఎస్సార్ తో రచయిత


2009 లో వైఎస్సార్ తో రచయిత  

నేటి ముఖ్య మంత్రి,నాటి హోం మంత్రి శ్రీ రోశయ్యతో రచయిత


పొతే, ఎందరో మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, డీజీపీలు ,చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఐ ఏ ఎస్ , ఐ పీ ఎస్ అధికారులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, శాసన సభ్యులు - ఇందరితో సాన్నిహిత్యాలు, విందులు, వినోదాలు,విమాన యానాలు,విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్ చక్కర్లు - మాస్కో రేడియో ఉద్యోగ విజయాలు - ఓ విధమైన 'మత్తు 'లో వృత్తి జీవితం గడిచిపోయింది.

అటు చూస్తే, వ్యక్తిగత జీవితం ఓ గుండు సున్నా. జీతానికీ, జీవితానికీ పొంతన లేకపోవడంతో అందినంత వరకు అప్పులు చేయడం (చేబదుళ్లు పుట్ట వేమో కానీ జర్నలిష్టులకు మాత్రం బ్యాంకు రుణాలు కోకొల్లలు ) వాటిని తీర్చడం కోసం మళ్ళీ కొత్తవి చేయడం - అదో రుణ చక్ర భ్రమణం. ఇలా ఊబిలో కూరుకుపోయిన జీవితానికి ఆసరాగా మా ఆవిడ నిర్మల- 'అమ్మ వొడి'ని ప్రారంభించింది. కన్న సంతానం ఇద్దరు పిల్లలతో పాటు - మరో పాతికమంది పసి పిల్లల ఆలనా పాలనా నెత్తిన వేసుకుంది. ఓ గృహిణిగా సంసార భాధ్యతలో పాలు పంచుకుంటున్నదని అనుకున్నానే కాని, అలవికాని భారం మోస్తున్నదని అనుకోలేదు. ఫలితం - పదేళ్ళ తరవాత ఆమెకు జరిగిన ఓపెన్ హార్ట్ సర్జరీ. మరో పదేళ్ళ అనంతరం మొన్నీ మధ్య రెండో సర్జరీ.

ఇక వృత్తి జీవితం చివరి రెండేళ్ళు - కే ఎస్ శర్మ గారి పుణ్యమా అని హైదరాబాద్ దూర్ దర్శన్ వార్తా విభాగంలో ఆర్వీవీ గారి సారధ్యంలో దొర్లిపోయాయి. రెండువేల అయిదు డిసెంబరు ఆఖర్లో ఉద్యోగ విరమణ. మోహన్ కందా గారన్నట్టు- మనిషికి మరణం, ఉద్యోగికి రిటైర్మెంట్ రెండూ తప్పవు.




దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున

అందరికీ నమస్కారం...
జాతస్య మరణం ధృవం అన్నట్టు- సర్కారు ఉద్యోగికి ఏదో ఒకనాడు-'ఈనాడు ' అనేది రాక తప్పదు.

నా వృత్తి జీవితపు చరమాంకంలో కొద్దికాలం మీతో కలిసి పనిచేసే సదవకాశం దొరికింది. పరస్పర అవగాహనకు ఈ స్వల్ప సమయం చాలకపోవచ్చు. కానీ మీ అభిమానం చూస్తుంటే ఈ అభిప్రాయం తప్పేమోనని అనిపిస్తోంది.

చూస్తుండగానే ముప్పయ్యేళ్ళు చక చకా గడిచిపోయాయి.ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నట్టు కాలం హాయిగా వేగంగా దొర్లిపోయింది. వొప్పచెప్పిన పనులతోపాటు చిన్నా చితకా ఇతరత్రాలు కూడా నెత్తికెత్తుకున్నందువల్ల -చేసే పనిలో ఏనాడూ రొటీన్ ఫీల్ కాలేదు.ఏరోజుకారోజు కొత్తగా గమ్మత్తుగా గడిచిపోయింది.

అసూయ తెలియని పై అధికారులు-అత్మీయత కనబరిచే సాటి సిబ్బంది- ఏ ఉద్యోగికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది?

అందుకే- అత్త లేని కోడలులాగా అందరిలోను-అందరితోను కలిసిపోయి,కలగలిసిపోయి ఓ మోస్తరుగా అత్తెసరు మార్కులు కొట్టేయగలిగానని అనుకుంటున్నాను.

అయితే ఉప్పూ, కారం తినేవాడిని కనుక - ఎప్పుడో ఒకప్పుడు - ఎవరినోఒకరిని నొప్పించే వుంటాను. మాటతూలే వుంటాను. ఇలాంటి సందర్భాలలో అప్పటికప్పుడే సారీ చెప్పేసి మనసు కడిగేసుకోవడం నాకలవాటు. అయినా, నావల్ల మనసు నొచ్చుకున్నవారెవరైనావుంటే మన్నించమని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే ప్రశాంతమైన ఉద్యోగ విరమణ పర్వానికి అర్ధం పరమార్ధం.

నాకు మాట్లాడడం రాదు.ఇది నా మాట కాదు.-మా ఆవిడ ఉవాచ.

అందుకే మనసులోని మాటలను ఇలా అక్షరాలలో పరచి మీ అందరితో పంచుకుంటున్నాను.

మీ వద్ద సెలవు తీసుకునేముందు మరో మాట...

నిజమే!కృతజ్ఞతలు బాహాటంగా చెప్పడం చాల కష్టమే...

అందుకే మీ అందరికీ మరోసారి మరొక్క నమస్కారం.

ఇప్పుడు - ఇన్నేళ్ళ తరవాత -

'నడిచివచ్చిన దారిలో' ఆగి  ఓసారి  వెనక్కి తిరిగి చూసుకుంటే-

 ఎన్నో అనుభూతులు-అనుభవాలు.

అన్నింటి సమగ్ర సమాహారమే జీవితం.

నిజానికి జీవితంలో ఫెయిల్యూర్ స్టొరీ లు వుండవచ్చు-

 కానీ, ఏ జీవితం ఫెయిల్యూర్ కాదు.
(16-07-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

దడిగాడువానసిరా

మనసులో మాట - భండారు శ్రీనివాసరావు

దడిగాడువానసిరా

సంస్కారం లేని వాళ్ళే ఇతరుల ఉత్తరాలు, డైరీలు చదువుతారంటారు.
కానీ ఇది తప్పున్నరతప్పు అభిప్రాయమన్నది మా సుబ్బారావు నిశ్చితాభిప్రాయం!
అసలు జనం డైరీలు రాసేదే ఎవరైనా చదవకపోతారా! అన్న ఆశతోనే అన్నది మా వాడి థియరీ! ఆ మాటకి వస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ డైరీలు రాసేసి - దరిమిలా వాటిని ఆత్మకథలుగా అచ్చేసి - తెలిసిన వారి చేత కొనిపించి - తెలియని వారికి ఉచితంగా ఇచ్చి చదివించిన వైనాన్ని వైనవైనాలుగా చెప్పుకురావడం మా వాడికి వెన్నతో పెట్టిన విద్య! ఇందు నిమిత్తం అవసరమైన సమయాల్లో `కోట్‌' చేయడానికి వీలుగా సుబ్బారావు అనేక దాఖలాలతో కూడిన అనేకానేక పుస్తకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకున్నాడు కూడా. ` ఎవ్వరూ చదవని దాన్ని అసలు రాయడమే శుద్ధ దండుగ' అన్న అతడి అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు.


కాకపోతే అర్ధంలేని అనుమానాలతో కుట్రలు, కుతంత్రాలతో కూడిన బహిరంగ, జనాంకిత ప్రకటనలతో - అనంతంగా సాగే డైరీ సీరియళ్ళలోని ఆడతనం మచ్చుకులేని ఆడపాత్రలు - ఎప్పుడో ఒకప్పుడు వాణిజ్య ప్రకటనలకు కాస్తముందో వెనకో - వీలుచూసుకుని, వీలుచేసుకుని ప్రక్కవాళ్ళ డైరీలనో, ఉత్తరాలనో చదివే అమూల్య అవకాశం లేని పక్షంలో ఆదిక్కుమాలిన అనుమానాలు తీరిపోయే సువర్ణావకాశం తప్పిపోయి ఇక ఆ సీరియళు్ళ అనంత విశ్వంలో దారి తప్పిన రోదసీ నౌకల్లా అలా, అలా, అలా, అలా, అలా, ఏళ్ళ తరబడి అనంతంగా సాగిపోయే మహత్తర ప్రమాదం లేకపోనూలేదన్నది మా సుబ్బారావు వాదన.


ఈ రకమైన సిద్ధాంతాలు వల్లించే సుబ్బారావుని చూస్తున్నప్పుడు చిన్నప్పుడు మా వూళ్ళో పార్‌‌ట టైమ్‌ పోస్టుమాస్టరుగా పనిచేసిన గోపయ్యగారు గుర్తొంస్తుంటారు. వూళ్ళో ఎవరికి ఉత్తరాలు వచ్చినా వాటిని చించి, చదివి విషయాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని ఆ పైన వాటిని జాగ్రత్తగా అతికించి, తాపీగా ఎవరివి వాళ్ళకు బట్వాడా చేయడం పోస్‌‌ట మాస్టర్‌గా తనకున్న కాపీరైట్‌గా భావిస్తూ - ఆ కర్తవ్య నిర్వహణని ఎంతో నిష్టగా పాటిస్తుండేవాడు. అంతటితో ఆగితే ఏ చిక్కూ లేకపోను. సదరు ఉత్తరాల చిరునామాదారులు ఎదురైనప్పుడు ' ఏమయ్యా ! రామం! మీ ఆవిడకి మీ అమ్మతో బొత్తిగా పడడం లేదా ఏమిటి?'  అంటూ ఆరాలు తీసేవాడు. ఇలా చాన్నాళ్లు  అతగాడి సెన్సార్‌షిప్‌ని మౌనంగా భరిస్తూ వచ్చిన ఆ వూరి కొత్తకోడలు ఒకావిడ - ఓసారి పుట్టింటికి పోయినప్పుడు మొగుడికి రాసిన ఉత్తరంలో విషయాలన్నీ రాస్తూ చివరాఖర్న `దడిగాడువానవిదిచ' అని రాసి వూరుకుంది. అంటే చదివినవాడు గాడిద అన్నది తిరగేసిరాసిన ఆ వాక్యానికి అర్ధం అనేది ఆ అమ్మడి భావం! కానీ భార్యాభర్తల నడుమ సాగే ఉత్తరాయణంలో ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా చదివే వెధవ అలవాటున్న ఆ పెద్దమనిషి - మర్నాడు ఆ మొగుడు శాల్తీ తారసపడ్డప్పుడు ` ఏమో అనుకున్నాను. ఎంతయినా మీ ఆవిడకు కోపం పాలు కాస్త ఎక్కువే ' అన్నాడట ఏ మాత్రం సిగ్గుపడకుండా.

తాజాతోక

ఈ శీర్షికకు `మనసులో మాట' అనే పేరు పెట్టడం వల్లా అలాగే చివర్లో `తాజాకలం' బదులు `తాజాతోక' అనే పదం వాడడం వల్లా ఈ రెండూ ఎక్కడో విన్నట్టుగా వుందే అనే ఫీలింగ్‌ పాఠకులకు కలిగితే దానికి రచయిత పూచీ ఎంతమాత్రం లేదనన్నీ ఆ పదాలపై అన్ని స్వామ్యములు ఈప్రజా స్వామ్యదేశంలో ఏ కొందరివో కాక అందరివనన్నీ సమస్త ప్రజానీకానికీ ఇందుమూలంగా తెలియచేయడమైనది. (16-07-2010 )

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

13, జులై 2010, మంగళవారం

అభిమానమా? అధిష్టానమా? – భండారు శ్రీనివాసరావు

అభిమానమా? అధిష్టానమా? – భండారు శ్రీనివాసరావు

గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులను కలవర పరుస్తున్న ప్రశ్న ఇది.



దివంగత కాంగ్రెస్ నేత రాజశేఖరరెడ్డి కుమారుడు, కడప ఎంపీ వై ఎస్ జగన్మోహనరెడ్డి తలపెట్టిన ‘ఓదార్పు యాత్ర’ లో మొదటి రెండు ఘట్టాలు కలిగించిన కలకలానికి పరాకాష్టగా మూడో దశ మొదలయి పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అభిమానానికీ, అధిష్టానానికీ నడుమ నలిగిపోతున్నకొందరు పార్టీ నేతలు 'ఈ యాత్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పెనుమార్పులకు తెర తీస్తుంద'ని కలవరపడుతున్నారు. ‘మాట తప్పని, మడమ తిప్పని తత్వం’ తండ్రినుంచి వారసత్వంగా సంక్రమించిందని చెప్పుకుంటున్న జగన్ వెన్ను చూపే ప్రసక్తే లేదని ఆయన అనుయాయులు అంటున్న నేపధ్యంలో - క్రమ శిక్షణను ఉల్లంఘించే వారిపై వేటుపడకతప్పదని, పార్టీని కాదని వెళ్లేవారికి రాజకీయంగా పుట్టగతులు వుండబోవని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు తేల్చి చెబుతున్న పరిణామ క్రమంలో - జగన్ అనుకూల, ప్రతికూల వర్గాలుగా పార్టీ శ్రేణులు నిట్ట నిలువుగా చీలిపోయి, మాటల ఈటెలతో బుల్లితెరలపై నికృష్ట రాజకీయాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్న తరుణంలో - జగన్ ఓదార్పు యాత్ర - ఈ వ్యాసం రాసే సమయానికి, అంచనాలను మించి సాగుతోంది. నిరుటి ఎన్నికల్లో ప్రతిపక్ష 'మహాకూటమిని' మట్టి కరిపించి వరసగా రెండోపర్యాయం అధికారపగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ- వైఎస్సార్ చనిపోయి ఏడాది తిరగకుండానే ‘కాళ్ళ పారాణి’ సామెతను గుర్తుచేస్తూ ఇలా గందరగోళంలో పడిపోతుందని కాకలు తీరిన రాజకీయపండితులు కూడా వూహింఛి వుండలేదు.



పొతే, ఇరుపక్షాలు తమ స్కంధారావాలతో తుదిపోరుకు సిద్దమయినట్టుగా మీడియా కోడై కూస్తోంది. జగన్ వైఖరిపై అధిష్టాన దేవత అగ్గిపై గుగ్గిలం చందాన ఆగ్రహంతో వున్నట్టు పరోక్ష కధనాలతో అగ్నికి ఆజ్యం పోస్తోంది. అధిష్టానం బూచిని చూపిస్తూ మరో పక్క జగన్ వ్యతిరేక శిబిరం పార్టీ శ్రేణులను అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అమీతుమీ తేల్చుకునే రీతిలో జగన్ పక్షం పట్టుదలగా వుండడం రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. పాలకపక్షంలో బయటపడుతున్న ఈ చీలిక ప్రతిపక్షాలను ఆశల పల్లకీలో వూరేగిస్తోంది. 2009 ఎన్నికల్లో సమైక్యంగా వుండి కూడా సాధించలేని దానిని - కాంగ్రెస్ లోని ‘అనైక్యత’ అప్పనంగా అందించే పరిస్తితి ఇంత త్వరగా అందిరావడం ప్రతిపక్షాలకు ఆడబోయిన తీర్ధం ఎదురయిన చందంగా గోచరిస్తోంది. ఇంకా నాలుగు సంవత్సరాలు ‘పాలించే’ వీలున్నప్పుడు - ఎదురుతిరిగే వారిని ‘లాలించే’ ప్రసక్తే లేదన్న ధోరణిలో ‘ ధిక్కారమున్ సైతునా ’ అన్నట్టు కాంగ్రెస్ అధిష్టాన దీవత కొలువులోని పూజారులు, వారి తాబేదారుల ముఠా తన సహజ శైలిలో హుంకరిస్తోంది. ' ‘ఔరా! ఇలాటి వారికా మనం వోట్లు వేసి, పట్టంకట్టి నెత్తికెత్తుకుందని ' ఇవన్నీ గమనిస్తున్న షరా మామూలు ప్రజానీకం' మౌన వేదనకు గురవుతోంది.
ఇలా జరుగుతుందని పదినెలల క్రితం ఎవరయినా వూహించారా!
కానీ రాజకీయం అన్నది ఇలాగే వుంటుంది. అధికారం అన్నది ఇలాగే ఆడిస్తుంది. ఈ ఆట ఇలాగే కొనసాగుతుంది. ఎప్పటిదాకా? ప్రజలు కళ్ళు తెరిచేదాకా! (12-07-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.