13, జులై 2013, శనివారం

‘శ్రీరామ’భగవద్గీత



అనగనగా ఓ రాముడు. ఆయనకో బంటుపేరు హనుమంతు. ఆ రాముడికో కోరిక కలిగింది. నాడు లంకలో  రావణుడి చెరలో వున్న సీతను తిరిగి తెచ్చుకునే నిమిత్తం   సముద్రం దాటేందుకు వీలుగా వానర సేన సాయంతో నిర్మించిన వారధి రామసేతు ఎలావుందో చూద్దామని.  యుగాలు, మన్వంతరాలు గడిచిపోయిన తరువాత రామ బంటును  వెంటబెట్టుకుని రాముడు  భూలోకానికి  వచ్చాడు. తాము  వనవాసంలో వుండగా  రావణుడు అపహరించుకు పోయిన సీతను   మళ్ళీ తన  కళ్లబడేలా చేసిన ఆ వారధి అంటే ఆయనకు ఎంతో మక్కువ. దాన్ని చూడగానే దానిపట్ల  ఆయన పెంచుకున్న ఇష్టం ఆయన  మాటల్లో మరో సారి బయట పడింది.

హనుమా! ఈ వారధి నిర్మాణానికి నువ్వూ, నీ  సహచర వానరులు పడ్డ శ్రమను నేనారోజుల్లో కళ్ళారా చూసాను. మొబిలైజేషన్ అడ్వాన్సులు సరే కనీసం హీనపక్షం రోజు కూలీ కూడా అడగకుండా ఇంత బ్రహ్మాండమయిన వంతెనను నాకోసం ఎంతో కష్టపడి కట్టారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎన్నో యుగాలు  గడిచిపోయాయి. ఎన్నెన్నో  ప్రకృతి ఉత్పాతాలు ఏర్పడ్డాయి.  మరెన్నో  సునామీలు సంభవించాయి. అయినా కానీ, ఆనాటి  రామసేతు ఆనవాళ్ళు మాత్రం  వీటన్నిటినీ తట్టుకుని నిలిచాయి. అంటే ఈ వంతెన నిర్మాణంలో  మీరు ఉపయోగించిన ఇంజినీరింగ్ పనితనం అంత గొప్పదన్న మాట. నిన్న గాక మొన్న హైదరాబాదులో గామన్ కంపెనీ  అధునాతన టెక్నాలజీ సాయంతో  కట్టిన ఫ్లై వోవర్ కధ ఏమయిందో  తెలుసుకదా. కాళ్ళ పారాణి కూడా ఆరకముందేఅన్న సామెతను నిజం చేస్తూ  ఆ వంతెన ఫిల్లర్లపై సినిమా పోస్టర్లు   అంటించేంతవరకయినా ఆగిందా అంటే  ఆగలేదు. సరికదా ఓపక్క  కడుతుండగానే మరో పక్క  డమాలున  కూలిపోయిందిఅంటూ  రాముడు కాసేపు  ఆగాడు.
సమయం కోసం ఎదురు చూస్తున్న హనుమ వెంటనే అందుకున్నాడు.

జై శ్రీరాం!  రామ సేతు నిర్మాణంలో మాగొప్పదనం ఇసుమంత కూడా లేదు. మేము చేసిందల్లా ఆ రాళ్ళపై  నీ పేరు రాయడం వరకే. వంతెనకోసం టిస్కో కంపెనీ  ఉక్కు దిమ్మలు  వాడలేదు. అంబుజా సిమెంటో, ఏసీసీ సిమెంటో ఉపయోగించలేదు. అయినా కానీ,  నీ దయవల్ల అది గట్టిగా నిలబడింది. అయినా రామయ్యా! ఆ పాత సంగతి ఇప్పుడెందుకయ్యా!

రాముడన్నాడు.
కలియుగం వచ్చేసింది ఆంజనేయా! మన రోజులు కావివి. ఇప్పుడు రామసేతును పడగొట్టి దాని  స్తానంలో కాలువ లాటిదేదో  నిర్మించాలని కొందరు అనుకుంటున్నట్టు ఈ మధ్య టీవీ స్క్రోలింగులలో చూసాను. కాలువ నిర్మిస్తారో లేదో  కానీ మనం కట్టిన సేతువుని తొలగించడం ఖచ్చితమనిపిస్తోంది. ఎందుకంటె,  ఈ కాలువ కాంట్రాక్ట్ లో కోట్ల డబ్బు కొందరి చేతుల్లోకి  చేరుతుంది.  వాళ్లు మరికొందరి చేతులు తడిపయినా సరే ఆ  కాంట్రాక్ట్ ను దక్కించుకోవడం ఖాయంగా కనబడుతోంది. మాల్తూసియన్ అనే ఒక ఆర్ధిక వేత్త  ఏనాడో చెప్పాడు కదా. జనాలకు ఉపాధి కల్పించాలంటే  ‘Dig a pit and cover itఅని. అంటే ఏమిటి?  ముందు ఒక గొయ్యి తవ్వించు. మళ్ళీ దానిని పూడ్పించు.   గొయ్యి తవ్విన వాడికో పని. దాన్ని పూడ్చినవాడికి మరో  మరో పని. అసలా గొయ్యి ఎందుకు తవ్వాలో ఎందుకు పూడ్చాలో అడిగే నాధుడు వుండడు. అలాగే ఇప్పుడు రామసేతు వ్యవహారం. పడగొట్టినందుకు డబ్బులు. మళ్ళీ కాలవ నిర్మించినందుకు  డబ్బులే డబ్బులు.

ఆ మాటలు వింటూనే  హనుమంతుడిలా అన్నాడు.
ఆ రోజుల్లో వంతెన నిర్మాణానికి మేము కూలీ డబ్బులు తీసుకోకుండా పని చేసిన  మాట వాస్తవమే. అటు రాజ్యలక్ష్మిని,ఇటు  గృహలక్ష్మిని పోగొట్టుకుని వుసూరుమంటూ అడవుల్లో తిరుగుతూ వున్న  మీనుంచి  డబ్బు డిమాండ్ చేయడం కూడా మాకు  సబబు అనిపించలేదు. అదీకాక పళ్ళూ కాయలు తిని పొట్ట నింపుకునే మా వానరులకు విత్తముతో పని ఏముంటుంది?   కాకపొతే,  ఈ మానవులున్నారే వాళ్లు మామూలు వాళ్లు కాదు. క్షమించాలి తొందర్లో మీదీ అదే జాతి అని మరచిపోయి మాట తూలాను. అయినా కానీ,  ఈ కలియుగం మానవులకూ, మన కాలం నాటి మానవులకూ పోలికెక్కడ ప్రభూ. మీరు మీరే వాళ్లు వాళ్ళే. వాళ్లు  బాగా వొళ్ళు బలిసి పోయి  వ్యవహరిస్తున్నారు. అలాటి వారినుంచి డబ్బు పిండినా తప్పులేదు. ఆ విషయం ఆలోచిద్దాం. అసలా  వంతెన కట్టింది మేము. దాని ఆనుపానులన్నీ తెలిసింది మాకు. అలాటప్పుడు దాన్ని  కూలగొట్టడం ఎలాగో మాకు తెలిసినంతగా వేరేవారెవ్వరికీ  తెలిసే వీలు లేదు. కాబట్టి  మనమే వెళ్లి మన  సంగతి ఆ మూఢ మానవులతో చెప్పుకుని  ఆ పనేదో నెత్తికెత్తుకోవడం మంచిదేమో ప్రభూ

హనుమా! నీకు శారీరక  బలం తప్ప మేధోపరమయిన తెలివితేటలు పూజ్యం. ఆ బలం కూడా ఎవరయినా గుర్తుచేస్తేనే నీకు గుర్తుకొచ్చి అక్కరకొస్తుంది. అదీ నీ పరిస్తితి. ఒక విషయం తెలుసుకో. మన  రోజులు కావివి. అప్పుడంటే నేను టెండర్లు పిలవకుండా నామినేషన్ మీద మీకు పని వొప్ప చెప్పాను. మీరూ ఏమీ ఆశించకుండా పని పూర్తిచేశారు. అందుకే  మన మీద ఏ ఆరోపణలు రాలేదు. గిట్టనివారెవరూ  సీబీఐ  దర్యాప్తు డిమాండ్ చేయలేదు. కాని ఇప్పుడలా కాదు. ప్రతిదీ ఓ పద్దతి ప్రకారం జరగాలి. లెక్కలన్నీ పక్కాగాలేకపోయినా వున్నట్టు చూపించగలగాలి. లేకపోతే ఏ కాగోపట్టుకుని విచారణ పేరుతొ మనల్ని కాగులో వేసి మరగ పెడుతుంది. దర్యాప్తుల పేరుతొ నిద్ర పట్టకుండా చేస్తారు. జైళ్ళంటారు. నార్కో పరీక్షలంటారు. ముందు ఏసీ కారులో  దిల్ కుశా గెస్ట్ హౌస్ కు పోదాం  అంటారు. అక్కడికెళ్ళాక అరెస్ట్ అంటారు. ఆ తరువాత  సీబీఐ కోర్టుకంటారు. ఆ కోర్టు న్యాయమూర్తి వున్నాడే నాగ మారుతీ శర్మ. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే  మన  రోజుల్లో కూడా ఇలాటి ఖరాఖండీ  న్యాయమూర్తిని చూడలేదు. నిజానికి  వాళ్ల నాన్న నా భక్తుడు. అసలు పేరు సుందర లాల్. నా పేరు అనుక్షణం ఆయన నాలుక మీద ఆడుతూ వుండేది. ఖమ్మంలోవుండగా  ఆయన పేరు రామాయణం మునసబు’.  రోజూ రామాయణ పారాయణం చేస్తేకాని ఆయనకు నిద్రపట్టేది కాదు. ఖమ్మంలోవుండగా  ఆయన్ని అందరూ  ‘రామాయణం మునసబుగారనేవారు. మామిళ్లగూడెంలో ఆయన  అద్దెకు వున్న ఇంట్లో క్రమం తప్పకుండ  సుందరాకాండ పారాయణం జరిగేది.   నా పేరు కలవరిస్తూనే ఆయన కళ్ళు మూశాడని చెప్పుకుంటారు. కాని ఆయన కొడుక్కు మన సంగతి తెలుసో లేదో తెలవదు. బెయిల్ ఇవ్వనన్నాడో చెంచల్ గూడా జెయిలే గతి. ఇక అన్నిటికంటే ఘోరం  టీవీల్లో మన గురించి జరిగే ప్రచారం. నామీద ఈ మానవులు గతంలో  ఎన్నో సినిమాలు తీసి డబ్బు చేసుకున్నారు.   మనల్ని జెయిల్లో తోయించే దృశ్యాలు వాళ్ళ చేతికి చిక్కాయో ఇంతే సంగతులు.  పొద్దస్తమానం మనల్ని జెయిల్లో రెక్కపట్టి నెడుతున్నట్టుగా పదేపదే  చూపిస్తారు. రాముడు మంచి బాలుడన్న సంగతి కాస్తా గంగలో  కలిసిపోతుంది. నన్ను నమ్ముకున్న రామదాసు లాటివాళ్ళు  బందిఖానాలో పడ్డ మాట నిజమే.  కాని, నాకు మాత్రం  జెయిళ్లు, బెయిళ్లు తెలియదు.  వనవాసంలో లక్ష్మణుడు తెచ్చిపెట్టిన కందమూలాలు తప్ప   జెయిల్లో పెట్టే చిప్ప కూడు ఏనాడూ తిని ఎరుగను. ఇప్పుడు పోయిపోయి  సీబీఐ వాళ్ళ  చేతుల్లో పడితే ఇక మన చేతిలో ఏమీ వుండదు. ఇంత బతుకూ బతికి మళ్ళీ ఆ ‘చేతి’ పార్టీ చేతులే పట్టుకోవాలి. వాళ్లు ఓ పట్టాన తేల్చరు. అయిదు రాష్ట్రాల ఎన్నికలంటారు. తిధులంటారు. పండగలంటారు. ఈ లోపల మనం మళ్ళీ అవతారం ఎత్తాల్సిన త్రేతా యుగం  రానే వస్తుంది. అది తప్పిపోయిందంటే మళ్ళీ మరో నాలుగు యుగాలు ఆగాలి.    రామరాజ్యంలో ఏదయినా కూడబెట్టుకున్నది వున్నదంటే అది లాయర్లకు చదివించు కోవడానికే సర్వం సరిపోతుంది. ఈ లోగా యుగాలు, మన్వంతరాల తరబడి కష్టపడి మనం  సంపాదించుకున్న మంచి తనం కాస్తా టీవీ చర్చల్లో మంట కలిసిపోతుంది. కలియుగం మనుషులంటావా తింటారు తినిపిస్తారు. దర్యాప్తులు, విచారణలు ఏళ్లతరబడి సాగిస్తారు. సాగదీస్తారు. ఈ లోపల వాళ్లకు వాళ్లకు లెక్కలు డొక్కలు కుదిరితే కేసులన్నీ  అటకెక్కుతాయి. ఆ టక్కుటమార విద్యలు నా గురువులు విశ్వామిత్రులవారు  నాకు నేర్పలేదు. పోనీ నేర్చుకుందామనుకున్నా  ఈ వయస్సులో వంటపట్టవు. ఏదో  నువ్వు చెబుతున్నావు కదా, పోతే పోయింది ఒక రాయి విసిరి చూద్దాం   అని వెళ్ళామే అనుకో. నిలబెట్టి   వెయ్యి ప్రశ్నలు అడుగుతారు. వంద సర్టిఫికెట్లు తెమ్మంటారు. వయస్సు సర్టిఫికేట్  ఏదంటే ఏం చెబుతాం. ఏం చదివారంటే మన దగ్గర  ఏం జవాబుంది? చదువు  చెప్పిన విశ్వామిత్రుడు తన దగ్గర నేను చదివినట్టు నాకు ఏ  సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇటు భూలోకానికి అటు స్వర్గలోకానికి కాకుండా మధ్యలో వేళ్ళాడుతూ త్రిశంకు స్వర్గంలో  వుండిపోయాడు. ఆయన్ని ఇప్పుడు యెక్కడని వెతికి పట్టుకుంటాం. రోజులు బాగున్న రోజుల్లో  రధాల మీద తిరిగాము. కాలం ఖర్మం కలసిరానప్పుడు  కాలినడకన అడవుల్లో సంచరించాము. అలాగని ఆ   రధానికి  డ్రైవింగ్ లైసెన్సు తెమ్మంటే ఎక్కడ తెస్తాము చెప్పు. యెలా తెస్తాము చెప్పు.      
          
అంతటితో అయిపోతుందా. అడ్రసు ప్రూఫ్ అడిగారనుకో  అదీ లేదు. నేను జన్మించిన  అయోధ్యనే ఈ  మానవులు ఏళ్లతరబడి కోర్టు  లిటిగేషనులో పెట్టి తమాషా చూస్తున్నారు. మనిద్దరం విల్లంబులు పట్టుకుని టెండర్ వేయడానికి వెడితే, పని ఇవ్వకపోగా ఎస్ టీ కోటా కింద  ఏదయినా ఆశ్రమ  పాఠశాలలో చేర్పించి చేతులు దులుపుకుంటారేమో కూడా. అంతటి ఘనులు వీళ్ళు. ఇంకో సమస్య ఏమిటంటే మనం భగవంతుడి అవతారం అన్న ట్యా గ్ లైన్ ఒకటి వుంది. అది పెట్టుకుని ఇప్పుడు కాలినడకన వెడితే ఏం బాగుంటుంది చెప్పు. మిగిలిన కాంట్రాక్టర్ల మాదిరిగా త్రీ పీస్ సూట్ వేసుకువెళ్ళామంటే ఇంతే సంగతులు. మన భక్తులు కూడా మనల్ని  అనుమానిస్తారు. అదింకా ప్రమాదం. టెండరు దక్కక పోగా మనకే టెండరు పడుతుంది.
రాముడు చెప్పిన భగవద్గీత అంజనీకుమారుడి చెవికెక్కినట్టులేదు. అతడు తోకతో  ఓమారు వీపు గోక్కుని  దాంతోనే మరోమారు  తల  తడుముకుని ఇలా అన్నాడు.
రామసేతు వంతెనను నేనూ నా సహచర వానరులు స్వయంగా కట్టామని ఆ మానవాధములకు స్టాంపు పేపరు మీద రాసి ఇస్తాను. అదీ నమ్మరా. అలాటప్పుడు ఆ పేపర్లు ఎందుకు, డూప్లికేట్ స్టాంపు కాగితాలు తయారు చేసే తెల్గీ లాటి వాళ్లు బాగు పడడం కోసమా?’

ఓరి అమాయక వానర చక్రవర్తీ!రాముడు మళ్ళీ చెప్పాడు.   

అలాటి కాగితాలు వాళ్లకు చిత్తు  కాగితాలతో సమానం. వాళ్ళు ముందు నిన్ను రామసేతువు  లేఅవుట్ సబ్మిట్ చేయమంటారు. ప్రాజెక్ట్ వివరాలు అడుగుతారు. ఇన్ కం టాక్స్ రిటర్న్లు తెమ్మంటారు. అప్రూవ్  చేసిన ప్లాను అడుగుతారు. మునిసిపల్ పర్మిట్లు, ఎస్కవేషన్  పర్మిట్టు,  రామసేతు కట్టిన కంట్రాక్టర్ పేరు వివరాలు, అతడికి యెంత ఖర్చయింది, ఎన్నాళ్లలో కట్టాడు, దాన్ని సకాలంలో పూర్తిచేసిన సర్టిఫికేటు వుందా ఇలా   రకరకాల పత్రాలు అడుగుతారు.ప్రశ్నలు వేస్తారు. రామసేతు పూర్తయిన తరువాత దాన్ని ఎవరు ప్రారంభించారు, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్పింగులు గట్రా పట్రా అంటారు. ఎందుకంటె ఈ కలియుగంలో మనిషి మాటకన్నా సర్టిఫికేట్లకే విలువెక్కువ. ప్రత్యేకించి పవిత్ర బారతంలో ఈ పత్రాల గోల మరీ ఎక్కువ. పెన్షన్  తీసుకునే వాడు స్వయంగా వెళ్ళినా అతడు బతికే వున్నట్టు సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా అధికారులు ఏదీ ఒప్పుకోరు. నువ్వు ఖల్లు ఖల్లున దగ్గుతున్నా సరే డాక్టర్ సర్టిఫికేట్ దగ్గర వుంటేనే నీకు దగ్గు జబ్బు వున్నట్టు లెక్క.

శ్రీ రామ గీత వింటున్న పవన సుతుడుడికి మతి పోయినంత పనయింది.

స్వామీ ఇదెక్కడి మాయ లోకం. నువ్వు ప్రతి వందేళ్లకీ ఓ మాటు  సూరదాసు, తులసీదాసు, త్యాగరాజు, జయదేవుడు, భద్రాచల రామదాసు,  భక్త తుకారాం లాటివారికి నీ ఉనికినీ, మహిమలనూ  ప్రదర్శిస్తూనే వున్నావు. అయినా సరే ఇప్పటికీ  నువ్వున్నావా అసలున్నావా   అని సినిమా పాటలు రాస్తూనే వున్నారు. ఇక నీ ఉనికి గురించిన చర్చోప చర్చలు టీవీ తెరలపై అనంతంగా సాగి పోతూనే  వున్నాయి. రామాయణం పుక్కిటి పురాణమని, రామసేతు నిర్మాణం అసలు జరగనేలేదనీ వాదించేవారు లెక్కకు మిక్కిలిగా వున్నారు. ఈ స్తితిలో నాకు ఒకే దారి కనబడుతోంది. ఏమయినా సరే నువ్వు రాముడిగా మరో సారి అవతారం ఎత్తాలి. రామాయణం నిజంగా జరిగిందేనని నిరూపిస్తూ దాన్ని మరోసారి ఈ మానవులకు ప్రదర్శించి చూపాలి.అన్నాడు ఆంజనేయుడు ఆవేశంగా.

రాముడు తనదయిన రీతిలో మందహాసం చేసి  చెప్పాడు.

అదంత సులభం కాదు అంజనీ పుత్రా. ఈనాటి రాజకీయ నాయకులతో పోలిస్తే  రావణుడు లాటి విలన్  కూడా జనాలకు ఒక హీరో లాగానే అనిపిస్తాడు. కనిపిస్తాడు. ఈ మధ్య మారీచుడు నాకు తారస పడితే అడిగాను. మారీచుడు ఎవరో  గుర్తున్నాడు కదా. ఈనాటి మిమిక్రీ కళాకారులందరికీ ఆదిగురువు. అరణ్యంలో బంగారు లేడిని వేటాడుతూ  వెడుతున్నప్పుడు అచ్చు  నా స్వరాన్ని అనుకరిస్తూ హా లక్ష్మణాఅంటూ   లక్ష్మణుడిని ఎలుగెత్తి  పిలిచాడు చూడూ  ఆ మారీచుడే. ఏమన్నాడో తెలుసా! సల్మాన్ ఖాన్ వున్నంతవరకు మళ్ళీ భూమి మీద కాలు మోపే ఛాన్స్ తీసుకునేది  లేదని తెగేసి చెప్పాడు.

శ్రీరాముడు బోధించిన ఈ భగవద్గీతతో ఆంజనేయుడికి జ్ఞానోదయం అయింది.

స్వస్తి. (31-01-2012)

12, జులై 2013, శుక్రవారం

రామసేతు నిర్మాణం చూద్దాం రండి!


రామసేతు 



 An Engineering Marvel  of 5076 BC, 

 9 Min.  Video .
(Use below link)

https://www.youtube.com/watch?v=FgSINZO_VuI
  

This  film brings to light the layers of bridge construction, and the month and the
year, when the Rama Setu ( bridge ) was built .  Watch it, if you find time.
 


11, జులై 2013, గురువారం

స్వయంకృతాపరాధాలు



పురుషులందు పుణ్య పురుషులు వేరయాఅన్నాడు వేమన. అలాగే - విభక్తుల్లో సంబోధనా ప్రథమా విభక్తితరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కాలవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ఒసేఅనడం - తండ్రిని ఒరేఅనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతుంది.

వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా గురూ-గురూఅని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనే వారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి - బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది.ఇంట్లో అమ్మా అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం అమ్మగారూ అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు - గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి అనో, పూజ్యులైన తాతయ్యగారికి అనో వినమ్రత కనబరిచే వారికి వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతా, సంస్కారాలక్కు అదే కొలమానంగా భావించేవారు.

ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు, చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా  చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు. 
కానీ, కాలం ఒక్క తీరుగా ఉండదు కదా! జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, అమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత వేగవంతంచేయడంలో ఈనాటి ఎ టూ జెడ్ఛానెళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.

తరాలు మారుతున్నప్పుడు - వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు - రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే - ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతూ వుంటుంది.  తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వెఐరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను ‘ఒసే’ అనడం, నాన్నను ‘ఒరే’ అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి - సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు - చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో - సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు - ఈనాటి సినిమాలే, ఈనాటి ఛానళ్ళే ఈనాటి పత్రికలే, ఈనాటి పుస్తకాలే, ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు.రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు. 
 
పాలితులను బట్టే పాలకులు- పాఠకులను బట్టే పత్రికలు - ప్రేక్షకులను బట్టే సినిమాలు - వీక్షకులను బట్టే ఛానెళ్ళు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

చర్చించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు



ఈ మధ్య మా పక్క వాటా లోకి తెలుగు వచ్చీ రాని పొరుగు రాష్ట్ర కుటుంబం ఒకటి అద్దెకు దిగింది. వచ్చిన దగ్గరనుంచి వాళ్ళను ఒక సందేహం పీడిస్తున్నట్టుగా ఇటీవలే అర్ధం అయింది. మా ఇంట్లో వుండేది నేనూ మా ఆవిడా ఇద్దరమే. పిల్లలిద్దరూ వేరే వూళ్లలో కాపురాలు వుంటున్నారు. అటువంటప్పుడు ఉదయం నుంచి రాత్రిదాకా అరుపులు, కేకలు వినవస్తాయేమిటని పొరుగింటావిడ, మా ఇంటావిడని అంటే మా ఆవిడని ఆరా తీసింది. అదంతా టీవీ చానళ్ళలో వస్తుండే చర్చలలోని రచ్చని తెలుసుకుని ఆశ్చర్య పోవడం పొరుగావిడ వంతయింది.

ఆకాశవాణి, దూరదర్శన్ లలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక ఉద్యోగి వుంటారు. మామూలుగా డ్యూటీ ఆఫీసర్ అని పిలిచే ఆ ఉద్యోగి డ్యూటీ ఏమిటంటే రేడియోలో ప్రసారం అయ్యే లేదా దూరదర్శన్ లో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రాములను ఆమూలాగ్రం శ్రద్ధగా విని, చూసి - తప్పొప్పులను పట్టుకుని, మంచి చెడులను గమనించి ఏరోజుకారోజు పై అధికారులకు రిపోర్ట్ చేయడం. రేడియో వినడానికి ప్రత్యేకంగా ఉద్యోగి అవసరమేమిటని కొందరు అడిగేవారు కూడా. బహుశా అలాటి ఏర్పాటు ఈనాటి ప్రైవేట్ చానళ్ళలో లేకపోబట్టే ఇలాటి చర్చలురచ్చరచ్చగా తయారవుతున్నాయేమో!

ఇటీవల ఒక ఛానల్లో చర్చలో పాల్గొంటున్న ఇద్దరి మధ్య ఆవేశకావేశాలు పెచ్చరిల్లాయి. మాటల తూటాలు పేలాయి. అసభ్య పదజాలాలు జాలువారాయి. ఏతావాతా ఆ మహత్తర దృశ్యాలను పన్నుకట్టకుండా చూసి వినోదించగల అవకాశం వీక్షకులకు లభించింది. కాకపోతే, భాష కారణంగా  విషయం అర్ధం కాని మా పొరుగింటావిడ లాంటి వాళ్ళు పక్కింట్లో యేవో గొడవలు జరుగుతున్నాయని అపోహపడే దుస్తితి దాపురించడం దీనికి పరాకాష్ట. 

ఈ మధ్య ఓ శుభకార్యం లో తారసపడిన ఓ పెద్దమనిషి అడిగాడు ఎందుకండీ ఇలా చానళ్ళ వాళ్ళు ఉప్పూ నిప్పూ లాటి మనుషులను చర్చలకు పిలుస్తారు?’ అని. సుతీ మతీ కుదరని ఇలాటివాళ్ళ వల్ల చర్చ పక్కదారి పడుతుందన్నది ఆ పెద్దమనిషి ఉద్దేశ్యం. 

అసలే చిటపటలు. వీటికి ఆజ్యం పోయడానికి తయారుగా ఫోన్ ఇన్ లో మరికొందరు సిద్ధంగా వుంటారు. వీరందరినీ సర్డుబాటు చేయడానికీ, సముదాయించడానికీ యాంఖర్ సతమతమవుతుంటాడు. వాద ప్రతివాదాలు ముదిరి, ఖండన ముండనలుగా మారి, దుమ్మెత్తి పోసుకోవడాల్లోకి దిగి, వీధి కొళాయిల వద్ద తంతుని డ్రాయింగ్ రూముల్లో చూసే భాగ్యం వీక్షకులకు దొరుకుతోందని మరి కొందరి ఉవాచ. 

ఇది ఇంతేనా? అంటే - ఇప్పటికింతే!అనుకోవాలి.

మెరుగయిన సమాజ నిర్మాణాలు స్క్రోలింగ్ లకే పరిమితమై పోయి, రేటింగులే ప్రధానమనుకున్నప్పుడు - ఇది ఇంతే!

ఎన్ని చానల్స్ వచ్చినా, వాటి నిర్వాహకులు యెంత లబ్ధ ప్రతిష్టులయినా ఇది ఇంతే!

ఈ పోటా పోటీ పోటీ యుగంలో పోటీ తప్పనిసరి. పాట్లూ తప్పనిసరి. బోధి వృక్షాలు కూడా జ్ఞానోదయం కలిగించలేని విషమ పరిస్తితి. తప్పని సరి అనుకున్నప్పుడు ఆనందించమన్న సామెత మాదిరిగా చూసి తరించడమే వీక్షకులకు మిగిలింది.

చర్చించి వగచిన ఏమి ఫలము?’

10, జులై 2013, బుధవారం

నేరపూరిత రాజకీయాలపై సుప్రీం కొరడా


నిజంగా హర్షించదగ్గ తీర్పు. నేరచరితులకు పెద్ద పీట  వేస్తున్న  రాజకీయ పార్టీలకు మింగుడుపడని విషయం. ట్రయల్ కోర్టులో శిక్షపడ్డ వెంటనే పదవి కోల్పోవడం అంటే సంకీర్ణయుగంలో మామూలు సంగతి కాదు. బొటాబొటి మెజారిటీలతో  బండి లాగిస్తున్న పాలక పక్షాలు ‘తుమ్మితే ఊడిపోయే’ నేరగాళ్లకు ఇకముందు టిక్కెట్లు ఇవ్వడానికి సంకోచిస్తాయి. ఆవిధంగా చాలావరకు  రాజకీయాలు క్షాలనం అయ్యే అవకాశం వుంది. కానీ అదే సమయంలో మరో ప్రమాదం పొంచి  వుంది. రాజకీయ ప్రత్యర్ధుల బెడద తొలగించుకోవడానికి పాలక పక్షాలు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా వుంది. అమల్లో తేడాలు రాకుండా చూసుకోగలిగితే ఇది ఆహ్వానించదగ్గ నిర్ణయం. కానీ ప్రస్తుత రాజకీయాల తీరుతెన్నులు గమనిస్తుంటే  సుప్రీం తీర్పు పర్యవసానాలు గురించి కొంత ఆందోళన  కలగడం సహజం.
(10-07-2013)

నడిచివచ్చిన దారి -భండారు శ్రీనివాస రావు


పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరవయ్యవ తేది. విజయవాడ, లబ్బీపేట లోని 'ఆంద్ర జ్యోతి' కార్యాలయం.
అందులో అడుగు పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారిని కలుసుకున్నాను.
ఆయన ఎగాదిగా చూసి, నా పరిచయం కనుక్కుని-
'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.
అదే నా తొట్ట తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.
ఉపేంద్ర గారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వున్నా బల్ల చివర్లో కూర్చున్నాను. పీ.టీ.ఐ., యు.ఎన్.ఐ. వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం.
అలా మూడు నెలలు గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్ నాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చి అక్కవుంటెంట్ ని  కలవమని చెప్పాడు. వెడితే- ఓ ఓచర్ మీద సంతకం చేయించుకుని పది- పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు. అదే నా తొలి వేతనం.
ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా- ప్రూఫ్ లో అచ్చయిన నా వార్తల్ని చదువుకుని మురిసిపోయేవాడిని. నేను చేరిన కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు బాధ్యతలు  స్వీకరించడం జరిగిపోయాయి.ఎందుకో ఏమోగానీ, దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని. సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో - పిల్లలకోసం ప్రత్యెక కధలు - బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు ఉపేంద్ర, ఐ వెంకటరావు, కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ, సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్ర జ్యోతి ఉద్యోగ పర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.
అన్నట్టు చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో పనిచేస్తున్నప్పుడు ఏదో విషయంలో పేచీ వచ్చి,రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి. అదో అధ్యాయం.
రాసిన రాతలు అచ్చులో చూసుకునే అవకాశం ఆంద్ర జ్యోతి ద్వారా లభిస్తే- సొంత గొంతును తెలుగునాట నలుగురికీ వినిపించే వీలు రేడియోలో దొరికింది. వార్తా సేకరణ, కూర్పు, తెలుగులోకి అనువాదం ఇలాంటి ప్రక్రియలతో పాటు, రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాని రోజున ఏకంగా స్టూడియో లోకి వెళ్ళిపోయి వార్తలు చదివేయడం- వారానికి రెండు మార్లు వార్తా వాహిని - ఒకసారి జీవన స్రవంతి (రోజువారి జరిగే ఘటనలకు కొంత హాస్యాన్ని జోడించి తయారు చేసిన ప్రత్యెక వార్తలు ) ఇలా అన్నిరకాలుగా నా రేడియో జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాను.
ఆ రోజుల్లో ఇన్ని పత్రికలూ లేవు. ఇంత మంది విలేకరులు లేరు. ముఖ్య మంత్రి నిర్వహించే విలేకరుల సమావేశానికే పది, పన్నెండు మంది హాజరైతే గొప్పగా వుండేది. నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో కావడం వల్ల-వార్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం, రేడియో పై ఎక్కువగా ఆధార పడాల్సి రావడం- రేడియో విలేకరిగా నా ప్రాధాన్యతను కొంత పెంచింది.
ఈ క్రమంలో,  ఎందరో మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, డీజీపీలు ,చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్. అధికారులు,  కేంద్రమంత్రులు,  ఎంపీలు,  శాసన సభ్యులు - ఇందరితో సాన్నిహిత్యాలు, విందులు, వినోదాలు,విమాన యానాలు,విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్ చక్కర్లు - మాస్కో రేడియో ఉద్యోగ విజయాలు - ఓ విధమైన 'మత్తు 'లో వృత్తి జీవితం గడిచిపోయింది.

ఇక వృత్తి జీవితం చివరి రెండేళ్ళు – కే.ఎస్. శర్మ గారి పుణ్యమా అని హైదరాబాద్  దూరదర్సన్  వార్తా విభాగంలో ఆర్వీవీ గారి సారధ్యంలో దొర్లిపోయాయి. రెండువేల అయిదు డిసెంబరు ఆఖర్లో ఉద్యోగ విరమణ.  లోగడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా గారన్నట్టు- మనిషికి మరణం, ఉద్యోగికి రిటైర్మెంట్ రెండూ తప్పవు.

ఆటో నెంబర్ – MH 02 Z 8508 - భండారు శ్రీనివాసరావు




ఎక్కగానే తెలిసిపోయింది మాకు అది అలాటిలాటి అల్లాటప్పా ఆటో కాదని.





మేము కూర్చున్న సీటు ఎదురుగా విమానంలో అమర్చినట్టు ఓ సంచీలో కొన్ని పత్రికలు కనిపించాయి. మాముందు ఓ చిన్న టీవీ సెట్టు వుంది. అందులో కేవలం దూరదర్శన్ కార్యక్రమాలు మాత్రమే పెడతానని డ్రైవర్ చెప్పాడు.


ఆటో ఎక్కిన నాకూ నా భార్యకూ కాసేపు ఆశ్చర్యంతో మాటలు పెగల్లేదు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, డెట్టాల్, దూది కొన్ని మందులు అందులో చూసిన తరువాత.


అంతే కాదు. టీవీ తో పాటు రేడియో, వాల్ క్లాక్, చిన్నపాటి మంటలను అదుపు చేసే పరికరం, కేలండర్, ఇలా చాలా కనిపించాయి. వివిధ మతాలకు చెందిన సింబల్స్ తో పాటు ముంబై ఉగ్రవాదుల దాడిలో హీరోలు గా పేరుతెచ్చుకున్న కామ్టే, కర్కరే, సలాస్కర్, ఉన్నికృష్ణన్ ల ఫోటోలు వున్నాయి.



మేమెక్కిన ఆటోనే కాదు దాని డ్రైవర్ కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలున్నవాడని కొద్ది సేపటిలోనే మాకు తెలిసివచ్చింది.


దారిలో మెల్లగా అతడితో మాటలు కలిపాను. ముందు నా మాటల్లో ధ్వనించిన వ్యంగాన్ని నేను గుర్తించక పోలేదు. కానీ ఆ వెటకారం కాసేపటిలోనే ఆవిరై పోయింది. దాని స్తానంలో అతడిపట్ల తెలియని గౌరవభావం చోటుచేసుకుంది.



హీరోలకే హీరో సందీప్ బచ్చే


ఆ ఆటో రిక్షా డ్రైవర్ పేరు సందీప్ బచ్చే. పెద్దగా చదువుకోలేదు. అందుకే ఓ చిన్న ప్లాస్టిక్ ఫాక్టరీ లో చిన్న ఉద్యోగంలో కుదిరాడు. దురదృష్టం. ఆ ఫాక్టరీ ఎన్నో రోజులు నడవలేదు. అది మూతపడడంతో సందీప్ రోడ్డున పడ్డాడు. కాకపొతే కిరాయి ఆటోతో. ఆటో నడుపుతుండగానే పదేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో కిరాయి ఆటో బదులు సొంత ఆటో నడుపుకునే స్తితికి చేరాడు. ఇద్దరు పిల్లల్నీ స్కూల్లో చేర్చాడు. బతుకు బండి ఓ గాటన పడింది. కానీ అతడు బాట తప్పలేదు. కష్టపడడం మానలేదు. ఉదయం ఎనిమిది గంటలకు ఆటో ఎక్కితే మళ్ళీ ఇంటికి చేరేది రాత్రి పది తర్వాతనే.

“ఇంట్లో వుండి చేసేది ఏమిటి సార్ టీవీ చూడడం తప్పితే. అదే ఆటో పని చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదిస్తే ముందు ముందు పనికొస్తాయి కదా!” అంటాడు అతగాడు.

నిజమే పనికొస్తాయి. తన కోసం కాదు సమాజంలో తనకంటే ఆర్ధికంగా వెనకబడ్డ వాళ్ళ కోసం. ఎంత చక్కటి ఆలోచన. 


మాకర్ధమయింది మాకు పరిచయం అయిన వ్యక్తి మామూలు మనిషి కాదని. పని విలువ, జీవితం విలువ తెలిసిన ముంబై నగరానికి అసలు సిసలు ప్రతినిధి అని.

తేనెటీగ లాగా పనిచేసే అతడికి తీరుబాటు సమయం అంటూ ఏమయినా వుందా? వుంటుందా? అదే అడిగాను.

కాస్త మొహమాట పడుతూనే జవాబు చెప్పాడు.

వారానికోసారి అంధేరీలోని వృద్ధ మహిళల ఆశ్రమానికి వెడతాడు. అదనంగా ఏదయినా ఆదాయం లభిస్తే వారికి అవసరమయిన టూత్ బ్రష్ లు, సబ్బులు, తలనూనెలు మొదలయినవి కొనుక్కుని తీసుకువెడతాడు.

ఆటో దిగుతుంటే కళ్ళబడింది.


 


ఆటో మీటర్ కింద ఇలా రాసి వుంది.

“వికలాంగులకు మీటర్ చార్జి లో పాతిక శాతం రాయితీ. యాభయి రూపాయల వరకు అంధులకు ఆటో ప్రయాణం ఉచితం.”

నాకూ మా ఆవిడకు అతడు ఆటో డ్రైవర్ లాగా కనిపించలేదు. నిజంగా అతడొక హీరో.

మా ప్రయాణం ముగిసింది. ఆ నలభై అయిదు నిమిషాల్లో జీవితం గురించిన కొత్త కోణం మాముందు ఆవిష్కృతమైంది. హీరోలు సినిమాతెరలపైనే కాదు నిజ జీవితాల్లోనూ తారసపడతారు. నిజానికి నిజమయిన హీరోలు సందీప్ బచ్చే లాటి వాళ్ళే.

ఈసారి ఎప్పుడయినా ముంబై వెడితే ఆ ఆటో నెంబర్ గుర్తు పెట్టుకోండి.

-MH 02 Z 8508- 


“లక్ష మంది మొహాల్లో నవ్వులు పూయడానికి కారణం కండి. ఒక్కరి వేదనకు కూడా కారణభూతులు కాకండి.” సందీప్ వల్ల మేము నేర్చుకున్న జీవిత సత్యం ఇదే.


(నెట్లో సంచరిస్తున్న ఒక ఆంగ్ల వ్యాసానికి స్వేఛ్చానువాదం – భండారు శ్రీనివాసరావు ) 

5, జులై 2013, శుక్రవారం

క్విడ్ ప్రోఖోలు ఇక కుదరవంటున్న సుప్రీం కోర్టు


“సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు” ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక, మండు  వేసవిలోనైనా సరే వారి చేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. కలర్ టీవీలు, లాప్ టాపులు, నెలసరి భత్యాలు, నగదు బదిలీలు, భూసంతర్పణలు, పట్టు చీరెలు, పసుపు కుంకాలు, ఉచిత వైద్యాలు, ఆల్  ఫ్రీ చదువులు, బంగారు తల్లులు, కరెంటు మీది, బిల్లు మాది తరహా హామీలు – ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్న  మేనిఫెస్టోలకు ఇక కాలం చెల్లిందని అనుకోవాలేమో. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ఖజానా డబ్బులతో ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎత్తులకు సుప్రీం కోర్టు లక్ష్మణ రేఖలు గీసింది.
వాగ్దానకర్ణుల మాదిరిగా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు. ఎన్నికల కోయిల ఇంకా కూయకముందే వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలు చూస్తుంటే అసలు మేనిఫెస్టోలో ఇంకెన్ని ఉంటాయో అన్న భేతాళ ప్రశ్నకు సుప్రీం కోర్టు సమాధానం చెప్పింది.
అర్ధం పర్ధం లేకుండా చేసే హామీలు ఇక కుదరవు కాక కుదరవు అని తేల్చి చెప్పింది.
చూడాలి ఇప్పుడు ఎవరు ఏం చేస్తారన్నది? (05-07-2013)

అర్ధం – అపార్ధం


నిన్న ఉదయం మహా టీవీ చర్చలో పాల్గొంటూ వుంటే ఒక వీక్షకుడు ఫోన్ ఇన్ లోకి వచ్చి నేరుగా నేను చెప్పినదాన్ని ఖండిస్తున్నాను అని చెప్పాడు. తరువాత ప్రోగ్రాం ప్రెజెంటర్ శ్రీనివాస్,  అతడి అభిప్రాయంపై నా స్పందనకు అవకాశం ఇచ్చారు. ‘అభిప్రాయం వ్యక్తం చేసుకునే స్వేచ్చ అతడికి వుంది. ఇక్కడ కూర్చుని నేను వ్యక్తం చేసే అభిప్రాయాలతో టీవీ చూసేవాళ్ళందరూ ఏకీభవిస్తారనుకోవడం మంచిది కాదు.’ అని తిరస్కరించాను. ఇదేదో గొప్పకోసం చెప్పుకోవడం కాదు. సందర్భం వచ్చింది కనుక ప్రస్తావించాల్సివచ్చింది.
‘జర్నలిస్టులు, స్కూటర్ లోన్లు’ అని గతం తవ్వుకోబోతే అదికాస్తా ‘హెల్మెట్ల ఆందోళన – జర్నలిస్టులు’ కిందికి మారి కొందరు ఏకంగా రాజకీయ రంగునే పులిమారు. ఇలాటి వేదికలపై ఈ పరిణామాలు సహజం కూడా. కానీ, ఒక విషయం వివరించకుండా మహా టీవీలో మాదిరిగా వొదిలేస్తే వెలువడే వ్యాఖ్యాన బాణాలు మరింత అగ్గిని రాజేస్తాయనే భావనతో ఇది రాస్తున్నాను. నేను యనభయ్యవ దశకం చివరిలో, తొంభయ్యవ దశకం  మొదట్లో మాస్కో రేడియోలో పనిచేస్తున్నప్పుడు, డెబ్బయి దశాబ్దాలకు పైగా ఆధిపత్యపు పోరులో అమెరికాకు సవాలుగా నిలిచిన  సోవియట్ యూనియన్, ఒక్కసారిగా  కుప్పకూలి అంగ వంగ కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమైపోయింది. అలాటి సందర్భాలలో అక్కడి విషయాలను గ్రంధస్తం చేస్తే నాటి పాలకులను విమర్సించినట్టు భావిస్తే ఏం చెప్పుకోగలం? అలాగే, ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రజల్లో అలజడి కలిగించిన ఓ అంశాన్ని ప్రస్తావిస్తే దాన్ని ఆయన పాలనపై విమర్శగా పరిగణించి వ్యాఖ్యానిస్తుంటే కూడా ఏం చెయ్యగలం? నిజానికి  ఎన్టీయార్ కానీ, లేదా పోలీసు అధికారులు కానీ యెంత హుందాగా ప్రవర్తించారు అన్న సంగతులకే ప్రాధాన్యం ఇచ్చి రాసినా కూడా  దాన్ని పట్టించుకోకుండా, దీన్నేదో టీడీపీ – కాంగ్రెస్ నడుమ రాజకీయ అంశంగా రంగు పులిమి వ్యాఖ్యానాలు చేస్తుంటే ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు. గతంలోని స్వీయ  అనుభవాలను ఒక డైరీ మాదిరిగా రాయాలన్న,  లేదా ఆ నాటి సంఘటనలను ఒక ఫోటో మాదిరిగా చూపించాలన్న ఆసక్తి తప్ప నాకు ఏవిధమయిన రాజకీయ ఉద్దేశ్యాలు లేవని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అర్ధం చేసుకోకపోతే పర్వాలేదు, అపార్ధం చేసుకోకండి. – భండారు శ్రీనివాసరావు (05-07-2013) 

హెల్మెట్ల నిబంధన – జర్నలిస్టుల నిరసన – పూర్వాపరాలు - 2

హెల్మెట్ల నిబంధన అమలు జరిగిన తీరుతెన్నులు గురించి రాస్తుంటే మధ్యలో జర్నలిస్టులు కూడా సమాజంలో భాగమే, వారేమీ అతీతులు కాదు అన్న పద్ధతిలో వాదాలు బయలుదేరాయి. నిజమే! పాత్రికేయులేమీ పైనుంచి ఊడిపడలేదు. కానీ, ఈ విమర్శలు చేసే  వాళ్ళు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. హెల్మెట్ నిబంధనను నాటి అధికారులు అమలు చేయడానికి ఎంచుకున్న విధానాలపట్ల ప్రజల్లో ఎంతో నిరసన వెలువడింది. కాకపొతే ఇప్పట్లా ఇన్ని రకాల ప్రసార మాధ్యమాలు లేకపోవడంతో జర్నలిస్టుల నిరసన కారణంగా విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాని హెల్మెట్ నిబంధన అమలు తీరు వ్యతిరేక ఆందోళన ప్రజల్లోనుంచే మొదలయింది. నాటి పరిస్తితుల నేపధ్యాన్ని ఒకసారి గమనంలోకి తీసుకుని పరిశీలిస్తే ఈ విషయంలో తలెత్తిన సందేహాలు నివృత్తి అయ్యే అవకాశం వుంది. జరిగి ముప్పయ్యేళ్ళు అవుతోంది కనుక ఈనాటి తరానికి నాటి పరిస్తితుల పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండకపోవచ్చు. ఆరోజుల్లో రోడ్లు సరిగా ఉండేవి కావు. ఇప్పుడు వున్నాయని కాదు. కాకపొతే చాలా మెరుగు.
ఓ రోజు రేడియోలో పని ముగించుకుని ఇంటికి వస్తుంటే  అప్పుడే వర్షం పడి వెలిసినట్టు వుంది.  త్యాగరాయ గాన సభ దగ్గర పోలీసుల హడావిడి కనిపించింది. పోలీసు కమీషనర్ అప్పుడే కారు దిగి నిలబడ్డారు. నేను వెళ్లి ‘ఒకసారి ఇటు రండి’ అని  రోడ్డుపై పారుతున్న నీళ్ళల్లో నా కాలిని  బలంగా ఆనించాను. దాదాపు మోకాలు దాకా దిగిపోయింది. ‘సార్ ! ఇలాటి రోడ్లపై వేగంగా వెళ్ళడం ఎలా కుదురుతుందో చెప్పండ’ని అడిగాను. ఆయన తన సహజ ధోరణిలో చీకాకు పడకుండా చిరునవ్వుతోనే జవాబు చెప్పారు. భావం ఏమిటంటే రోడ్ల నిర్వహణ తమ శాఖకు సంబంధించింది కాదని. నిజమే రోడ్ల నిర్వహణ పోలీసులది కాదు. ప్రజలకు సేవ చేయడంలో ఎదురయ్యే లోపాలకు ప్రభుత్వ విభాగాలు ఒకరిపై మరొకరు నెపాలు మోపుకునే వెసులుబాటు వుంది. కానీ పౌరులు మాత్రం ఏదో మిష  చూపి తప్పించుకోవడానికి వీలుండదు.  ‘నాకు హెల్మెట్ వుంది. ఈ సందులోనే మా ఇల్లు. మా అమ్మకు మందు కొనడానికి మందులషాపు పక్కనే కదా అని తొందరలో హెల్మెట్ మరచిపోయి వచ్చాను. చూడండి లుంగీ మీదనే వున్నాను’ అన్నా వినకుండా  ట్రాఫిక్ పోలీసులు చలానాలు రాసిన  రోజులవి. ఇదొక ఉదంతం మాత్రమే. ఆ రోజుల్లో ప్రజలను పోలీసులు యెంత భయపెట్టారన్నది ఈనాటి తరానికి తెలియకపోవచ్చు.
నిజమే. వాహనదారుల రక్షణకు హెల్మెట్ అవసరమే. కానీ ఇదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అన్న పద్ధతిలో నాడు ఈ విధానం అమలు జరిగింది. సరే హెల్మెట్లు ధరించడం పౌరుల బాధ్యతే అనుకుందాం. మరి రోడ్లమీద స్పీడ్ బ్రేకర్లు వుంటాయి. దగ్గరికి  వచ్చిన దాకా అవి కనబడవు. నిజానికి నిబంధల ప్రకారం వాటి మీద పసుపు నలుపు రంగు చారలు స్పష్టంగా కనిపించేటట్టు పెయింట్ వేయాలి. వాటికి కొద్ది దూరంలో దగ్గరలో ‘స్పీడ్ బ్రేకర్ వున్నది జాగ్రత్త’ అనే సైన్ బోర్డు ఏర్పాటు చేయాలి. ‘ఏవీ!ఇవేవీ కనబడవు’ అంటే ‘నిధుల కొరత’  అంటారు, సామాన్యుల దగ్గర మాత్రం  డబ్బు సంచులు మూలుగుతున్నట్టు అక్కడికక్కడే ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తారు. ఇదేమి న్యాయమో చెప్పండి.