నిన్న ఉదయం మహా టీవీ చర్చలో పాల్గొంటూ వుంటే ఒక
వీక్షకుడు ఫోన్ ఇన్ లోకి వచ్చి నేరుగా నేను చెప్పినదాన్ని ఖండిస్తున్నాను అని
చెప్పాడు. తరువాత ప్రోగ్రాం ప్రెజెంటర్ శ్రీనివాస్, అతడి అభిప్రాయంపై నా స్పందనకు అవకాశం ఇచ్చారు. ‘అభిప్రాయం
వ్యక్తం చేసుకునే స్వేచ్చ అతడికి వుంది. ఇక్కడ కూర్చుని నేను వ్యక్తం చేసే
అభిప్రాయాలతో టీవీ చూసేవాళ్ళందరూ ఏకీభవిస్తారనుకోవడం మంచిది కాదు.’ అని
తిరస్కరించాను. ఇదేదో గొప్పకోసం చెప్పుకోవడం కాదు. సందర్భం వచ్చింది కనుక
ప్రస్తావించాల్సివచ్చింది.
‘జర్నలిస్టులు, స్కూటర్
లోన్లు’ అని గతం తవ్వుకోబోతే అదికాస్తా ‘హెల్మెట్ల ఆందోళన – జర్నలిస్టులు’ కిందికి
మారి కొందరు ఏకంగా రాజకీయ రంగునే పులిమారు. ఇలాటి వేదికలపై ఈ పరిణామాలు సహజం కూడా.
కానీ, ఒక విషయం వివరించకుండా మహా టీవీలో మాదిరిగా వొదిలేస్తే వెలువడే వ్యాఖ్యాన
బాణాలు మరింత అగ్గిని రాజేస్తాయనే భావనతో ఇది రాస్తున్నాను. నేను యనభయ్యవ దశకం
చివరిలో, తొంభయ్యవ దశకం మొదట్లో మాస్కో
రేడియోలో పనిచేస్తున్నప్పుడు, డెబ్బయి దశాబ్దాలకు పైగా ఆధిపత్యపు పోరులో అమెరికాకు
సవాలుగా నిలిచిన సోవియట్ యూనియన్,
ఒక్కసారిగా కుప్పకూలి అంగ వంగ కళింగ దేశాల
మాదిరిగా విచ్చిన్నమైపోయింది. అలాటి సందర్భాలలో అక్కడి విషయాలను గ్రంధస్తం చేస్తే
నాటి పాలకులను విమర్సించినట్టు భావిస్తే ఏం చెప్పుకోగలం? అలాగే, ఎన్టీయార్
ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రజల్లో అలజడి కలిగించిన ఓ అంశాన్ని ప్రస్తావిస్తే
దాన్ని ఆయన పాలనపై విమర్శగా పరిగణించి వ్యాఖ్యానిస్తుంటే కూడా ఏం చెయ్యగలం?
నిజానికి ఎన్టీయార్ కానీ, లేదా పోలీసు అధికారులు
కానీ యెంత హుందాగా ప్రవర్తించారు అన్న సంగతులకే ప్రాధాన్యం ఇచ్చి రాసినా కూడా దాన్ని పట్టించుకోకుండా, దీన్నేదో టీడీపీ –
కాంగ్రెస్ నడుమ రాజకీయ అంశంగా రంగు పులిమి వ్యాఖ్యానాలు చేస్తుంటే ఎలా అర్ధం
చేసుకోవాలో తెలియడం లేదు. గతంలోని స్వీయ అనుభవాలను ఒక డైరీ మాదిరిగా రాయాలన్న, లేదా ఆ నాటి సంఘటనలను ఒక ఫోటో మాదిరిగా
చూపించాలన్న ఆసక్తి తప్ప నాకు ఏవిధమయిన రాజకీయ ఉద్దేశ్యాలు లేవని సవినయంగా మనవి
చేసుకుంటున్నాను. అర్ధం చేసుకోకపోతే పర్వాలేదు, అపార్ధం చేసుకోకండి. – భండారు
శ్రీనివాసరావు (05-07-2013)
Agitation against helmets in AP during 1986-87 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Agitation against helmets in AP during 1986-87 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
5, జులై 2013, శుక్రవారం
హెల్మెట్ల నిబంధన – జర్నలిస్టుల నిరసన – పూర్వాపరాలు - 2
హెల్మెట్ల నిబంధన అమలు జరిగిన తీరుతెన్నులు
గురించి రాస్తుంటే మధ్యలో ‘జర్నలిస్టులు
కూడా సమాజంలో భాగమే, వారేమీ అతీతులు కాదు’ అన్న
పద్ధతిలో వాదాలు బయలుదేరాయి. నిజమే! పాత్రికేయులేమీ పైనుంచి ఊడిపడలేదు. కానీ, ఈ
విమర్శలు చేసే వాళ్ళు ఒక విషయం అర్ధం
చేసుకోవాలి. హెల్మెట్ నిబంధనను నాటి అధికారులు అమలు చేయడానికి ఎంచుకున్న
విధానాలపట్ల ప్రజల్లో ఎంతో నిరసన వెలువడింది. కాకపొతే ఇప్పట్లా ఇన్ని రకాల ప్రసార
మాధ్యమాలు లేకపోవడంతో జర్నలిస్టుల నిరసన కారణంగా విషయం వెలుగులోకి వచ్చింది.
అంతేకాని హెల్మెట్ నిబంధన అమలు తీరు వ్యతిరేక ఆందోళన ప్రజల్లోనుంచే మొదలయింది. నాటి
పరిస్తితుల నేపధ్యాన్ని ఒకసారి గమనంలోకి తీసుకుని పరిశీలిస్తే ఈ విషయంలో తలెత్తిన
సందేహాలు నివృత్తి అయ్యే అవకాశం వుంది. జరిగి ముప్పయ్యేళ్ళు అవుతోంది కనుక ఈనాటి
తరానికి నాటి పరిస్తితుల పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండకపోవచ్చు. ఆరోజుల్లో రోడ్లు
సరిగా ఉండేవి కావు. ఇప్పుడు వున్నాయని కాదు. కాకపొతే చాలా మెరుగు.
ఓ రోజు రేడియోలో పని ముగించుకుని ఇంటికి వస్తుంటే
అప్పుడే వర్షం పడి వెలిసినట్టు వుంది. త్యాగరాయ గాన సభ దగ్గర పోలీసుల హడావిడి
కనిపించింది. పోలీసు కమీషనర్ అప్పుడే కారు దిగి నిలబడ్డారు. నేను వెళ్లి ‘ఒకసారి
ఇటు రండి’ అని రోడ్డుపై పారుతున్న
నీళ్ళల్లో నా కాలిని బలంగా ఆనించాను. దాదాపు
మోకాలు దాకా దిగిపోయింది. ‘సార్ ! ఇలాటి రోడ్లపై వేగంగా వెళ్ళడం ఎలా కుదురుతుందో
చెప్పండ’ని అడిగాను. ఆయన తన సహజ ధోరణిలో చీకాకు పడకుండా చిరునవ్వుతోనే జవాబు
చెప్పారు. భావం ఏమిటంటే రోడ్ల నిర్వహణ తమ శాఖకు సంబంధించింది కాదని. నిజమే రోడ్ల
నిర్వహణ పోలీసులది కాదు. ప్రజలకు సేవ చేయడంలో ఎదురయ్యే లోపాలకు ప్రభుత్వ విభాగాలు
ఒకరిపై మరొకరు నెపాలు మోపుకునే వెసులుబాటు వుంది. కానీ పౌరులు మాత్రం ఏదో మిష చూపి తప్పించుకోవడానికి వీలుండదు. ‘నాకు హెల్మెట్ వుంది. ఈ సందులోనే మా ఇల్లు. మా
అమ్మకు మందు కొనడానికి మందులషాపు పక్కనే కదా అని తొందరలో హెల్మెట్ మరచిపోయి
వచ్చాను. చూడండి లుంగీ మీదనే వున్నాను’ అన్నా వినకుండా ట్రాఫిక్ పోలీసులు చలానాలు రాసిన రోజులవి. ఇదొక ఉదంతం మాత్రమే. ఆ రోజుల్లో ప్రజలను
పోలీసులు యెంత భయపెట్టారన్నది ఈనాటి తరానికి తెలియకపోవచ్చు.
నిజమే. వాహనదారుల రక్షణకు
హెల్మెట్ అవసరమే. కానీ ఇదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అన్న పద్ధతిలో నాడు ఈ
విధానం అమలు జరిగింది. సరే హెల్మెట్లు ధరించడం పౌరుల బాధ్యతే అనుకుందాం. మరి
రోడ్లమీద స్పీడ్ బ్రేకర్లు వుంటాయి. దగ్గరికి వచ్చిన దాకా అవి కనబడవు. నిజానికి నిబంధల
ప్రకారం వాటి మీద పసుపు నలుపు రంగు చారలు స్పష్టంగా కనిపించేటట్టు పెయింట్ వేయాలి.
వాటికి కొద్ది దూరంలో దగ్గరలో ‘స్పీడ్ బ్రేకర్ వున్నది జాగ్రత్త’ అనే సైన్ బోర్డు
ఏర్పాటు చేయాలి. ‘ఏవీ!ఇవేవీ కనబడవు’ అంటే ‘నిధుల కొరత’ అంటారు, సామాన్యుల దగ్గర మాత్రం డబ్బు సంచులు మూలుగుతున్నట్టు అక్కడికక్కడే
ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తారు. ఇదేమి న్యాయమో చెప్పండి.హెల్మెట్ ఆందోళన – పూర్వాపరాలు -1
పాత విషయాలను ముచ్చటించుకునేటప్పుడు కాల
ధర్మాన్ని గమనంలో పెట్టుకోవాలి. నాటి పరిస్తితులను దృష్టిలో వుంచుకోవాలి. పౌర సమాజంలో పాలకులు విధించే నియమ నిబంధనలు, వాళ్ళు ప్రవచించే నీతి సూత్రాలు ఎన్నో వుంటాయి. వాటిని గౌరవించి తీరాలి కూడా. కాకపొతే,
ఒక్కోసారి నిబంధనలను అమలు చేసే తీరుతెన్నులే విమర్శలకు గురవుతుంటాయి. ఉదాహరణకు
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. అలాగని ప్రత్యెక పోలీసు బృందాలను నియమించి
రోడ్లపై సిగరెట్ తాగేవాళ్ళని వేటాడి పట్టుకుని జరిమానాలు విధించారనుకోండి. అదిగో
అప్పుడే వస్తుంది చిక్కు. ఇదిగో ఇలాటిదే హెల్మెట్ నిబంధన. అది అమలు
చేయడంలో విచక్షణారహితంగా పోలీసులు నాడు అంటే 1986-87 లో
వ్యవహరించిన తీరు. ఓ మోస్తరు వేగంతో కూడా స్కూటర్లు నడపడానికి అనువుగా లేని
రోడ్లు. ఆ రోజుల్లో హైదరాబాదులో వాటి
పరిస్తితి ఎలా వుండేదో నేటి నెటిజన్లకు తెలిసే అవకాశం లేదు.
ఏ రోడ్డు
చరిత్ర చూసినా ......
రోడ్లపైన
వరదలా చేరు వాన నీరు
కాలు జారు
ప్రమాదాలు అడుగడుగున జోరు
ఒక్క వాన
మాత్రంతో రోడ్లతీరు మారు
సైడు
కాల్వలుప్పొంగి ఏకమయ్యి పారు
రోడ్డేదో
గుంటేదో దేవుడికే తెలుసు
స్కూటరిస్టులంటేనే
ఖాకీలకు అలుసు
అలాటి
రోడ్లమీద అతివేగం మాట అటుంచి అసలు డ్రైవ్ చేయడమే నానా యాతనగా వర్ణిస్తూ రాసిన ఈ మాదిరి వ్యంగ్య రచనలు అధికార యంత్రాంగం కళ్ళు
తెరిపించకపోగా సరిగ్గా ఈ నేపధ్యంలోనే వచ్చి పడింది ఈ నిర్బంధ హెల్మెట్ ధారణ నిబంధన.
హెల్మెట్లను
వ్యతిరేకించడం అంటే పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే చూస్తూ ఊరుకోవడం అన్న వాదనను
కొందరు లేవదీసారు.
ఆరోజుల్లో
పోలీసు కమీషనర్ ను కలిసి ఒక లేఖ ఇచ్చాను.
“అయ్యా
కమీషనర్ గారు –
“హెల్మెట్ల
విషయంలో పోలీసుల్ని విమర్శించే వాళ్ళందరూ హెల్మెట్ నిబంధనకు వ్యతిరేకం కాదు.
దాన్ని అమలు చేసే విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు.
“ఉప్పు
అమ్మాలన్నా, పప్పు అమ్మాలన్నా పత్రికల్లో ఎంతో ఖర్చు పెట్టి ప్రకటనలు ఇస్తుంటారు.
కానీ, పలానా హెల్మెట్ కొనండి అని ఒక్క ప్రకటన
ఎప్పుడయినా, ఎక్కడయినా ఒక్కసారయినా చూసారా. ఎందుకట?
“హెల్మెట్
తయారీదారులకు ప్రకటనల మీద పైసా ఖర్చుచేయాల్సిన అవసరం లేదు. ఒక కోర్టు తీర్పును
సాకుగా చూపుతారు. అతి ఉత్సాహం వున్న అధికారిని పట్టుకుంటారు. అంతే! వారి స్టాకంతా – పుచ్చు వంకాయలలాంటి సరుకయినా
సరే క్షణాల్లో అమ్ముడు పోతుంది. పైపెచ్చు సర్కారు ఖర్చుతో హెల్మెట్ ధారణ ఆవశ్యకత
గురించి ఎలాగూ ప్రచారం ఉండనే ఉంటుంది. అధికారులు చూపిస్తున్న ఈ అత్యుత్సాహం వెనుక
ఏదయినా మతలబు ఉందేమో అని అనుమానిస్తే తప్పేమిటి?
“ప్రజలకు
అనునిత్యం తారసపడే ఏకైక ప్రభుత్వ
ప్రతినిధి ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్. ప్రజల పరువు మర్యాదల్ని అతడి
ఇష్టాఇష్టాలకు నడిబజార్లో వొదిలేయడం ఏం మర్యాద చెప్పండి.
కార్లలో
తిరిగే ట్రాఫిక్ అధికారులను వెళ్లి ఏదయినా కూడలిలో నిలబడి రోడ్డు దాటలేని
అభాగ్యులకు సాయం చేయమనండి. అస్తవ్యస్తంగా వున్న ట్రాఫిక్ దుస్తితిని సరిచేయమనండి.
ఒక్క పది రోజులపాటు ట్రాఫిక్ పోలీసుల్ని – చలానాల వసూలు కట్టిపెట్టి తమ పని తాము
చేసేలా చూడండి. యెంత మార్పు వస్తుందో మీరే చూస్తారు. మంచి మార్పును గమనిస్తే
ప్రజలే ట్రాఫిక్ పోలీసుల ప్రాధాన్యతను గుర్తిస్తారు. ఎలాటి నిరసనలు లేకుండా హెల్మెట్లతో
సహా అన్ని రకాల ట్రాఫిక్ నిబంధలను వారే
స్వచ్చందంగా తుచ తప్పకుండా పాటిస్తారు. ఇది నిజం. నిజానికి ఇదే సరైన పరిష్కారం.”
కమీషనర్ నా లేఖను నా ముందే
పూర్తిగా చదివారు. అభినందన పూర్వకంగా మందహాసం చేసారు. కానీ ఆ చిరునవ్వులోనే నాకు
ఆయన నిస్సహాయత కూడా కనబడింది. కొన్ని రోజులకు పూర్వం నగరంలో ఓ రోడ్డు దుస్తితిని
గురించి ఆయనకు నేనే ప్రత్యక్షంగా చూపించాను. (ఆ వివరాలతో పాటు హెల్మెట్ నిబంధన –
జర్నలిస్టుల నిరసన పూర్వాపరాలు గురించి మరికొన్ని సంగతులు మరోసారి)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)