వెంకయ్య నాయకుడు
డెబ్బయ్ ఏళ్ళు దాటిన తర్వాత మన తరానికి చెందిన పరిచయస్తులను కలుస్తూ వుంటే శారీరక, మానసిక ఆరోగ్యాలకు మంచిదని ఎక్కడో చదివాను. అందుకే ఈ మధ్య హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో కొత్తగా మొదలయిన శుక్రవారం ములాఖత్ లకు క్రమం తప్పకుండా వెడుతున్నాను.
పాత్రికేయ మిత్రుడు Maa Sarma మా శర్మ గారు ‘వెంకయ్య నాయకుడు’ అనే పేరుతొ, పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గారి గురించి రాసిన జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి నిన్న వెళ్లాను. రాజకీయ అతిరథ మహారధులతో సభామందిరం కళకళలాడుతోంది.
చాలాకాలంగా నేను కలవని, చాలా కాలం క్రితం దాదాపు రోజూ కలుస్తూ వచ్చిన అనేకమంది రాజకీయ ప్రముఖులను తిరిగి కలిసే అవకాశం నాకు దొరికింది.
ఉదాహరణకు ఇంద్రసేనారెడ్డి గారు. ఆయన మలక్ పేట శాసన సభ్యుడిగా వున్నప్పుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన వాడిని.
అసెంబ్లీ అయిపోయిన తర్వాత రద్దీగా వున్న రోడ్డు దాటి ఎదురుగా వున్న రేడియో స్టేషన్ కు వెళ్లడం ఎల్లా అని గుంజాటనలో వున్నప్పుడు ఇంద్రసేనా రెడ్డి గారు నన్ను తన వాహనంలో ఎక్కించుకుని న్యూస్ యూనిట్ లో వదిలి వెళ్ళేవారు. ఇలా చాలా సార్లు జరిగింది. 1987 లో మాస్కో వెళ్ళే ముందు ఒకసారి కలిసాను. అంతే! 39 ఏళ్ళ తరవాత మళ్ళీ నిన్ననే కలవడం. ఆయనలో ఏ మార్పు లేదు, ఆప్యాయంగా అదే పలకరింపు. గవర్నర్ పదవిలో వుంటూ కూడా అదే నిరాడంబరమైన జీవనశైలి. పలకరించడమే కాదు, పక్కన కూర్చోబెట్టుకుని చాలా సేపు పాత సంగతులు మాట్లాడారు.
ఆ పక్కనే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు. వీరి సంగతి చెప్పక్కర లేదు. వారు వీరని తారతమ్యం లేదు. అందరి వాడు. తాను రాసుకున్న తన జీవిత చరిత్ర పుస్తకాన్ని గుర్తు పెట్టుకుని మా ఇంటికి పంపించారు. వీరిని మధ్య మధ్య కలిసే అవకాశాలు చాలా వచ్చాయి. అలాగే తరచుగా కలిసే అవకాశాలు వున్న మరో నాయకుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గారు.
పొతే, వై. సత్యకుమార్ గారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ వైద్య శాఖ మంత్రి. పూర్వాశ్రమంలో వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా, సాక్షాత్తు మా రేడియో శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు వారి ద్వారా వీరి పరిచయం. ఆ రోజుల్లో వారం వారం వెంకయ్య నాయుడి గారితో పాటు, తరచుగా హైదరాబాదు వచ్చేవారు. వీరిని కలవక ఏండ్లూ పూండ్లు గడిచిపోయాయి. నిన్న వెళ్లి కలవగానే గుర్తుపట్టి పలకరించారు. అప్పటి ఫోన్ నెంబరు కూడా మారినట్టు లేదు.
ఈలోగా ఒడిసా గవర్నర్ కంభంపాటి హరిబాబు గారి ఆత్మీయ పలకరింపు. ఆరు మాసాల క్రితమే వారిని భువనేశ్వర్ రాజ్ భవన్ (ఇప్పుడు ప్రజా భవన్ అంటున్నారు) లో కలిసాను. వారి ఇంటి పేరు, మా ఊరి పేరు ఒకటే కంభంపాడు. అదో బాదరాయణ సంబంధం.
ఇక నిన్నటి కధా నాయకుడు వెంకయ్య నాయుడు గారు, ఒక చోట కూర్చోకుండా, హాలంతా కలయ తిరుగుతూ వచ్చిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరిస్తూ కనిపించారు. ఇది నిజంగా అపూర్వ విషయం. పరిచయస్తులని, పాత స్నేహితులను కలవడంలో ఆయన ఆనందం పొందుతారు. విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పటి నుంచీ చూస్తున్నాను. ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలో వున్నప్పుడు కూడా ఆయన ధోరణిలో, ప్రవర్తనలో, మాట తీరులో ఇసుమంత మార్పు లేదు.
తెలంగాణా బీజేపీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు గారు గతంలో టీవీ చర్చల్లో కలిసే వాళ్ళం. ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షులు. కాలం గడుస్తున్నా పలకరింపుల్లో మార్పు లేకపోవడం గొప్ప విశేషం.
ఇంకా చాలామంది ఘనాపాటీలు. ఎవరు వచ్చారు అనే దానికన్నా ఎవరు రాలేదో చెప్పడం చాలా సులభం.
ఇక పూర్వ సంపాదకులు, కె. రామచంద్ర మూర్తి గారు, ఐ. వెంకట్రావు గారు, గతంలో కలిసి మెలిసి తిరిగిన పాత్రికేయ మితృలు భగీరధ, ఉడయవర్లు, కొండా లక్ష్మణ రావు ఇలా చాలామంది కలిశారు.
పుస్తక రచయిత మా శర్మ గారు వేదిక మీద వున్న కారణంగా ఆయన్ని కలవలేకపోయాను. అయినా ఇంత మందిని కలిసే అవకాశం కల్పించిన మా శర్మ గారికి వేనవేల ధన్యవాదాలు.
నాలుగున్నరకు మొదలైన కార్యక్రమం దాదాపు తొమ్మిది గంటల దాకా సాగింది.
అంచేత చివర్లో, ముందుగా బయటకు రావాల్సివచ్చింది. తరువాత బయట పడడం కష్టం. ఎందుకంటే అంతమంది వీ ఐ పీ లు వెళ్ళే దాకా చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ హడావిడిలో అసలు పుస్తకం చేతికి అందలేదు.
సభ ఎలా జరిగిందన్నది అన్ని పత్రికలు, అన్ని మాధ్యమాలు వివరంగా కవర్ చేసాయి. ఇక రాయాల్సింది పుస్తకం గురించి. అది రాయాలంటే ముందు చదవాలి. ఎలా!
కొసమెరుపు:
నిజంగా కొసమెరుపే. ఇది రాస్తున్నప్పుడు మొబైల్ మోగింది.
‘నా పేరు బండి సందీప్...’
మళ్ళీ హెచ్ పీ గ్యాస్ బాపతేమో అని సందేహపడేంతలో, అతడు అంటున్నాడు.
“వెంకయ్య నాయుడు గారి ఇంటి నుంచి వచ్చాను. మీ గుమ్మం ముందు నిలబడి వున్నాను. మీ కాలింగ్ బెల్ పనిచేయడం లేదు’
ఒక్క పెట్టున కంప్యూటర్ ముందు నుంచి లేచి వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా పుస్తకం పార్సెల్ తో బండి సందీప్.
(ఇంకా వుంది)