19, జూన్ 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో : (328) : భండారు శ్రీనివాసరావు

 

మగాడి సంసారం
ఇక్కడ సంసారం అంటే భవసాగరం ఈదడం అన్నమాట. వేరే అపార్థం చేసుకోకండి.
శివరామప్రసాద్ కప్పగంతు గారి ప్రకారం, కొత్త తరాల లెక్క ( జెన్ జడ్) బట్టి చూస్తే నేనో బేబీ బూమర్ని. 1946 నుండి 1964 వరకు, అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, జనాభా వేగంగా పెరగడం మొదలైన పిదప, పుట్టిన బాపతు అన్నమాట.
నేను నేల మీద పడింది 1945లో, ఒక ఏడాది ముందు కాబట్టి, ఆ లెక్కల్లోకి నేను రానేమో మరి. అందుకే, ముద్దుగా నాకు నేనే లిటిల్ బేబీ బూమర్ అని పిలుచుకుంటాను.
లేకపోతే, ఈ ప్రపంచ జనాభాలో నన్నులెక్క కట్టకుండా, ‘సారో! (SIR) ఓసారి నా మాట వినండి సారూ!’ అంటున్నా వినకుండా ఓటర్ల జాబితా నుంచి తప్పించినా తప్పించే అవకాశాలు లేకపోనూ లేవు. పోతే పోయింది. ఏమవుతుంది?
ఆధార్, పెన్షనర్, PAN, రాష్ట్ర ప్రభుత్వ అక్రిడిటేషన్, CGHS, ప్రెస్ క్లబ్ వంటి అనేకానేక గుర్తింపు కార్డులతో బలిసిన సీమపంది పొట్టలా వున్న నా పర్సు నుంచి ఓటరు కార్డుకు విముక్తి కలుగుతుంది. అంతే! నాకు ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి నేటి వరకు జరిగిన చిన్నాపెద్దా అన్ని ఎన్నికల్లో ఓటు వేస్తూ వచ్చాను. ఆ హక్కు పోతుంది.
ఏదో మా దూరదర్సన్ కొలీగ్ N V హనుమంతరావు గారు చెప్పారని 2002 ఓటర్ల జాబితా కంప్యూటర్ లో చూస్తే, ఓ గంట సేపు నా చేత క్యాప్చాలు గట్రా పజిల్స్ చేయించి చివరకు ఎర్ర అక్షరాలతో ‘మీరు సరిగా చేయడం లేదు, మరో మారు ప్రయత్నించండి’ అని ఓ సలహా ఇచ్చింది. అదేమిటో ఇంగ్లీష్ వాడి ఇంగ్లీషు, అమెరికా వాడి ఇంగ్లీష్ లా ఈ కంప్యూటర్ ఇంగ్లీష్ కూడా అర్ధం అయ్యీ అవనట్టుగా వుంటుంది. అలా మరో మారు, మరో మారు, ఇంకో మారు ప్రయత్నించి, ఇక ఇది నా Cup of Tea కాదనుకుని భేతాలుడి శవాన్ని కంప్యూటర్ లోనే వదిలేశాను. కొద్దో గొప్పో కంప్యూటర్ ఓపెన్ చేయడం తెలిసిన నిరక్షరకుక్షిని నా పరిస్థితే ఇలా వుంటే ..
ఈ మాత్రం తెలియదా అనకండి. నిజంగా మా తరానికి తెలియదు. సరే! అదలా పోనివ్వండి.
అసలీ తరాల మాట ఎందుకు తెచ్చాను అంటే నేను రాసే రాతలన్నీ పాత తరానికి చెందినవి. విశ్వనాధ వారి రచనల్లో నేటి తరం పోకడలు వెతుక్కుని ఉపయోగం ఏముంటుంది? నా పోస్టుల్లో కనిపించే కొన్ని తెలుగు పదాలు, తభావతు, లగాయతు వంటి మాటలకు అర్ధం ఏమిటి అని కొందరు అడుగుతుంటే అప్పుడు అర్ధం అయింది, తరం మారింది అనే సంగతి నేనే అర్ధం చేసుకోలేకపోతున్నానని.
అసలు సంసారం కదా సబ్జెక్టు. ఇలా ఈ దారి తప్పడాలు, డొంక తిరుగుళ్ళు ఈ నాటి వేగ యుగంలో క్షమార్హం కాదు.
మా ఆవిడతో కాపురం 1971 లో మొదలైనా, అసలు సంసార బాధ్యతలు ఆవిడ పోయిన తర్వాతనే నా మీద పడ్డాయి. కాడి మీద పడిన పిదప కానీ బరువు తెలియలేదు. వంట, వడ్డన, అతిధులు, వారిని కనుక్కోవడం, చుట్టపక్కాలు, మంచి చెడ్డలు, పండుగలు, పేరంటాలు, పురుళ్లు, పుణ్యాలు, రాకపోకలు ఇలా ఈ జాబితా అనంతం.
వామ్మో! ఇన్నేళ్ళుగా ఒక్కత్తీ ఇంత బరువు మోసిందా! అలిసిపోయి ఇక చాలనుకుని వెళ్లిపోయిందా!
అసలు వింతల్లో వింత! ఇన్నేళ్ళుగా చీమ కుట్టినట్టు కూడా లేకుండా, రాజాలా, జల్సాగా నేను కాలం వెళ్ళదీయడం నా ఒక్కరికే చెల్లింది. నాతి బాధలు, ఈతి బాధలు లేని జీవితం నాది అని గొప్పలు చెప్పుకోవడం మరొకటి.
ఆమె బతికి వున్నప్పుడే నెత్తిన మొట్టో, మొట్టికాయలు వేసో, ఇంత ఉడకేసుకోవడం, ఇల్లు నిభాయించడం నేర్పిపోయుంటే ఇప్పుడు ఈ తిప్పలు తప్పేవి కదా!
అలా అని నేనిప్పుడు పడుతున్న కష్టాలు ఏమీ లేవు. ఉండడానికి అందరూ వున్నారు. వంటమనిషి, పని మనిషి, చిన్న చిన్న అవసరాలకోసం హమేషా రెడీగా వుండే వాచ్ మన్. నిజానికి వడ్డించిన విస్తరి లాంటి జీవితం. ఏ లోటు లేదు.
మరేమిటి బాధ!
పరిష్కారం మన చేతుల్లో లేని ఇబ్బందులను కష్టాలు అంటారని ఒకాయన భాష్యం చెప్పారు. అలాంటిదే ఇది.
వున్నట్టుండి గత దశాబ్ద కాలంగా ఏనాడూ ఎరుగని నీళ్ళ కరువు ఈ ఏడాది వచ్చి పడింది. గత పదిహేను రోజుల్లో పద్నాలుగు నీళ్ళ ట్యాంకర్లు తెప్పించారు. వీటిల్లో సగం ప్రైవేటువి. అయినా సరిపోవడం లేదు. నిన్నా ఇవ్వాళ పూర్తి బందు. కారణం బుక్ చేసినవి రాలేదు.
పనిమనిషి నిన్న ఉదయం ఫోన్ చేసి వేములవాడ దేవుడి గుడికి వెడుతున్నాము, రెండు రోజులు రాను అని అన్నది. మరి కాసేపటికి వంటావిడ ఫోన్ చేసి ఏదో కారణం చెప్పి ఈరోజు రావడం లేదన్నది.
పనిమనిషికి, వంటమనిషికి ఏవో ప్రత్యామ్నాయాలు, స్విగ్గీ, అర్బన్ కంపనీ వంటివి వున్నాయి. మరి నీళ్ళు. అలా కాదు.
నిన్నటివో, మొన్నటివో ఒక బక్క్కెట్టు నీళ్ళు దొరికాయి. నిన్న వాన చినుకులకు బయట ఆరేసిన బట్టలు కూడా తడవలేదు కానీ, వాతావరణం చల్లబడింది.
ఏదైనా పెద్ద గిన్నెలో నీళ్ళు కాగబెట్టి చన్నీళ్ళు సరిపాట్లు చేసుకొందామని గ్యాస్ స్టవ్ మీద పెట్టాను. ఏమిటి నీళ్ళు ఎంతకీ వెచ్చబడడం లేదని చూస్తే గ్యాస్ అయిపోయింది. ఇంట్లో స్పేర్ సిలిండర్ వుంది కానీ మార్చడం తెలియదు. వాచ్ మన్ కోసం చూస్తే ఎలాగూ ఈరోజు నీళ్ళ పని లేదు అనుకున్నాడేమో, ఎక్కడికో పెత్తనాలకు పోయాడు.
తీరిగ్గా వచ్చి సిలిండర్ మార్చాడు. మళ్ళీ నీళ్ళు కాగబెట్టి బాత్‌రూం లోకి తీసుకు వెళ్ళడానికి ఒక టవల్ తో ప్రయత్నం చేశాను. సన్మానితులకు భుజం మీద శాలువా కప్పినట్టు గిన్నె అంచులకు ఆ టవల్ చుట్టి పట్టుకు పోతుండగా, ఒక అంచుకు గుడ్డ సరిగా లేకపోవడంతో చెయ్యి చురుక్కుమంది. భూకైలాస్ సినిమాలో మాదిరిగా శివలింగాన్ని కింద పెట్ట కూడదు. కానీ చేతి నొప్పి కారణంగా దాన్ని కింద పెడుతూ, పైకి పట్టుకుంటూ రిలే రేస్ మాదిరిగా స్నానాల గదికి చేర్చాను. మొత్తం మీద స్నానం అయింది అనిపించాను.
ఇలాంటి కష్టాలు పగవారికి కూడా రాకూడదు అనుకున్నా. కానీ మా పెద్ద కోడలు భావన చెప్పినట్టు, ‘ఇవి కష్టాలు కాదు చిన్న చిన్న ఇబ్బందులు’ అనుకోగానే ప్రాణం తేలిక పడింది.
నిజంగా ఇవి కష్టాలే అయితే సామాన్య మధ్య తరగతి ఆడంగులు ఇన్నేళ్ళు కాపురాలు ఎలా చేస్తారు?
వారందరికీ నా శాల్యూట్!



(ఇంకావుంది)



1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

It appears there will be less rainfall this year due to el nino effect. Going to be very tough situation in apartments and high rise buildings in coming months if monsoon fails.

Let's hope raingods will bless us.