వార్తలు చదువుతున్నది దుగ్గిరాల పూర్ణయ్య
ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివినవారిలో మరో ప్రసిద్ధులు దుగ్గిరాల పూర్ణయ్య.
1936 ఏప్రిల్ 15న వెంకటకృష్ణారావు, అన్నపూర్ణమ్మ దంపతులకు గుడివాడ దగ్గర అంగలూరులో దుగ్గిరాల పూర్ణయ్య జన్మించారు. గుడివాడ ఏ ఎన్ ఆర్ కళాశాలలో బియ్యే చదివారు. భీమవరంలో ఎం.ఎ. ఇంగ్లీషు, పిమ్మట భగల్పూరు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. పొలిటికల్ సైన్స్. చదువు మీద ఆసక్తితో ఉద్యోగంలో చేస్తూ కూడా పుణే విశ్వవిద్యాలయం నుంచి నుంచి ఎల్ ఎల్ బి చేశారు.
సినిమా రంగంలో ఒక మాట వినబడుతూ వుంటుంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినాడని. దుగ్గిరాల వారిది కూడా ఓ మోస్తరుగా ఇదే కధ.
కృష్ణా జిల్లా నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ వెళ్ళిన పూర్ణయ్య గారికి ఒక చిన్న కొలువు దొరికింది. బీజేపీ అగ్ర నాయకుడు ఎల్.కే.అద్వాని (అప్పుడు జనసంఘం) నడిపే ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు పూర్ణయ్య గారి పనితీరు వారికి నచ్చింది. వారిరువురి నడుమ సాన్నిహిత్యం పెరిగింది. అద్వానీ గారి మాట సాయంతో ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా ఆయన న్యూస్ రీడర్ కాగలిగారు.
రేడియో ఉద్యోగం కొత్త. అయినా ఆయన త్వరగానే ఆ కొత్త కొలువులో ఒదిగిపోయారు. ఇంగ్లీష్ నుంచి వార్తల్ని తెలుగులోకి తర్జూమా చేసి, స్టూడియోలో లైవ్ చదవడంపై పట్టు సాధించారు. మనిషి పీలగా కనిపించినా వారిది కంచు కంఠం. వేరే ధ్యాసలు లేకుండా కేవలం వృత్తి ధర్మాన్ని నిర్వహించే స్వభావం కావడం వల్ల దుగ్గిరాల పూర్ణయ్య గారికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదని బాధ పడే అభిమానులు కూడా వున్నారు. ఆయన ఆహార్యం కూడా పల్లెటూరి రైతుని తలపించేదిగా వుంటుంది. ఇస్త్రీ చేయని చొక్కా మాదిరిగా నలిగిన దుస్తుల్లో కనిపించేవారు.
ఆరోజుల్లో రేడియో కళాకారులకు, న్యూస్ రీడర్లకు సినీ రంగంతో పాటు దీటైన ఆకర్షణ వుండేది. కనపడని వారిని, వినపడే వారి గొంతుకలే జనాలకు దగ్గర చేసేవి. సాంస్కృతిక కార్యక్రమాలకు, వేడుకలకు ముఖ్య అతిధులుగా ఆహ్వానించి సత్కరించేవారు. అయితే స్వతహాగా నిరాడంబర జీవితం గడిపే పూర్ణయ్య వీటన్నిటికీ దూరంగా వుండేవారు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెంపొందించుకోగల అవకాశాలు వృత్తిపరంగా ఎన్నో ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన పనేదో తనేమో అన్నట్టు జీవితం సాగించారు.
మాస్కో రేడియోలో పనిచేయడానికి వెళ్ళే ముందు దుగ్గిరాల పూర్ణయ్య గారిని ఢిల్లీలో కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ముభావకంగా, అంతర్ముఖంగా వుండేవారు. అంతమాత్రాన మానవ సంబంధాలకు దూరం కాదు. మన వైపు నుంచి ఎవరైనా ఢిల్లీ వెళ్లి రేడియోలో తెలుగు విభాగానికి వెడితే, పరిచయం లేకపోయినా క్యాంటీన్ కు తీసుకువెళ్లి చాయ్ ఇప్పించి మాట్లాడి పంపించేవారు.
గంభీరమైన స్వరం. వార్తలు విరిచినట్టు చదవడంలో ఒక ప్రత్యేకమైన బాణీ. రేడియో వార్తలు సగంలో విన్నా కూడా చప్పున చెప్పేయొచ్చు వార్తలు చదివేది దుగ్గిరాల పూర్ణయ్య గారని. ఎందరో శ్రోతలు, ఎందరో అభిమానులు. అలా గడిచి పోయింది వారి రేడియో జీవితం.
అయితే పూర్ణయ్య గారిది వీటిని పట్టించుకునే తత్వం కాదు, పట్టించుకోవాలనే తాపత్రయం లేని మనిషి. వ్యక్తిగత ప్రచారాలకు దూరం.
వారిది కృష్ణా జిల్లా లోని అంగలూరు గ్రామం. తన గ్రామం మీద ఆయన గారికి ఎంతటి మక్కువ అంటే , రిటైర్ అయిన తర్వాత ఢిల్లీలో కొనుక్కున్న ఇంటిని ఏదో ఒక ధరకు అమ్మేసి స్వగ్రామంలో స్థిర పడ్డారు. భౌతిక సంపదలపై లేనిపోని అనురక్తిని పెంచుకోకపోవడం కారణంగా చెబుతారు.
ఎనిమిది పదులు దాటిన పూర్ణయ్య గారు, అనేక దశాబ్దాల క్రితం వదిలి వెళ్ళిన స్వగ్రామం, గుడివాడ దగ్గర అంగలూరులో భార్య శ్రీమతి లక్ష్మితో కలిసి శేష జీవితం గడుపుతూ 2020 మార్చి ఇరవై తొమ్మిదిన కన్నుమూశారు.
చివరి దశలో ఆరోగ్యపరమైన సమస్యలతో శారీరకంగా కృశించిన స్థితిలో ఆయన్ని చూడడం తనకు చాలా బాధ కలిగించిందని ఆయన్ని చూసి వచ్చిన రేడియో సహచరులు, రచయిత నాగసూరి వేణుగోపాల్ చెప్పారు.
చక్కటి కంఠాన్ని వరంగా ఇచ్చిన దేవుడు, దారుణమైన వృద్ధాప్యాన్ని పూర్ణయ్య గారికి శాపంగా ప్రసాదించడం విధి వైపరీత్యం.
1 కామెంట్:
అరె, మాదీ దుగ్గిరాల పూర్ణయ్య గారి ఊరే 🙏😎.
దుగ్గిరాల పూర్ణయ్య గారు బిఏ చదువుకున్ననాటికి అది “ది గుడివాడ కాలేజ్” అనే అనేవారు. తరువాత 1959 లోనే, 1960 లోనే “ఏ ఎన్ ఆర్ కాలేజ్” (అక్కినేని నాగేశ్వర రాయ కళాశాల) అయింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి