రేడియో కధాకమామిషు
రేడియో ఉద్యోగం కోసం హైదరాబాదులో ఇంటర్వ్యూకు హాజరై బెజవాడకు తిరిగి వచ్చినప్పటి
నుంచి అసలీ ఉద్యోగం ఏమిటి అనే వెంపర్లాట నాలో మొదలయింది. మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి ఇంటికి వచ్చే
నాలుగయిదు తెలుగు, ఇంగ్లీషు పత్రికలు తిరగెయ్యడం తప్ప రేడియో కార్యక్రమాలు శ్రద్ధగా వినే అలవాటు
లేదు. మా అన్నయ్య ఆఫీసు నుంచి ఇంటికి రాగానే రేడియోలో ప్రాంతీయ వార్తలు
పెట్టేవాడు. అంటే దాని అర్ధం నన్ను కూడా వాటిని వినమని. అంతవరకూ నేను చేస్తున్నది
ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ ఉద్యోగం. రేడియో వాళ్ళు పేపర్లో ప్రకటించిన ఉద్యోగం హోదా
అసిస్టెంట్ ఎడిటర్ బ్రాకెట్లో రిపోర్టింగ్ అని వుంది. ఆ ఉద్యోగం తీరుతెన్నులు
ఏమిటో బొత్తిగా తెలియదు. రిపోర్టింగ్ అనే పదాన్ని బట్టి రిపోర్టర్ జాబు
అనుకున్నాను. జ్యోతిలో నండూరి రామ్మోహన రావు గారి దయ వల్ల రిపోర్టింగ్ లో కొంత
అనుభవం వుంది. తిరుమలశెట్టి శ్రీరాములు గారు, డి. వెంకట్రామయ్య గారు, మాడపాటి సత్యవతి గారు చదివే ప్రాంతీయ
వార్తలు వింటూ వుండేవాడిని. విజయవాడ రేడియో కేంద్రంలో అప్పటికి ప్రాంతీయ వార్తా
విభాగం లేదు. అంచేత వివరాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయినా
ఉద్యోగం వచ్చినప్పటి మాట కదోయి నాయనా అని నాకు నేనే సర్దిచెప్పుకునేవాడిని.
నాకు బుద్ది
తెలుస్తున్న తొలి రోజుల్లో రేడియోని చూసింది మా స్వగ్రామం కంభంపాడులోని చామర్తి
వీరభద్రరావు మామయ్య గారింటిలో. వాళ్ళ ఇంటి మధ్య హాలులోని అల్మారాలో ఒక భోషాణం
పెట్టె మాదిరిగా వుండేది. దాని కిందనే మోటారు కార్లలో వాడే బ్యాటరీ మాదిరిగా ఒక
పెద్ద బ్యాటరీ వుండేది. కార్లలో వాడే బ్యాటరీ కాదు గానీ రేడియో కోసం ప్రత్యేకమైన
బ్యాటరీ. బాగానే పెద్దది. ఎవరెడీ కంపెనీ వారి బ్యాటరీ. ఆ కంపెనీ గుర్తు 9 అంకె. ఆ నెంబరు మధ్యలో నుండి
దూకుతున్నట్లున్న పిల్లి బొమ్మ ఆ బ్యాటరీ మీద ఉండేది.
ఆ పెద్ద గదిలో
పైన ఆ మూల నుంచి ఈ మూలకు నైలాన్ తో అనుకుంటా తయారు చేసిన ఒక జాలీ మాదిరి యాంటీనా
కట్టి వుండేది. (అప్పటికి దాని పేరు యాంటీనా
అని తెలియని వయసు) మా మామయ్యగారు రేడియో
ఆన్ చేయగానే కింది భాగంలో పచ్చటి లైటు ముందుకూ వెనక్కూ సాగుతూ ఒక చోట ఆగిపోయేది.
మా మామయ్యగారికి భానుమతి పాటలు అంటే చాలా ఇష్టం. ఆ పాటలు రేడియోలో ఎప్పుడు వస్తాయో
ఆయనకు ముందుగా ఎలా తెలుసో నాకయితే తెలియదు. కానీ రేడియోలో అవే పాటలు వచ్చేవి.
బహుశా ఆకాశవాణి ప్రచురించే వాణి పత్రిక తెప్పించేవారేమో. ఒక వేళ భానుమతి స్వరం
వినబడకపోతే, వెంటనే
గ్రామఫోన్ పెట్టె బయటకు తీసి, బాసింపట్టు వేసుకుకూర్చుని భానుమతి పాట రికార్డు
వేసుకుని వినేవాడు. మాకేమో రేడియో వినాలని. ఆయనకేమో భానుమతి పాట వినాలని. రేడియోలో
అప్పుడప్పుడూ హరికధలు, ఆదివారాల
నాడు తెలుగు సినిమా (సంక్షిప్త శబ్ద చిత్రం) వేసే వాళ్ళు. ఇక ఆ రోజు ఆయన ఇల్లు
తిరుణాల మాదిరిగా వూరిజనంతో నిండిపోయేది. ఎందుకంటే వూరి మొత్తానికి అదొక్కటే
రేడియో. అలాంటి రోజుల్లో మా మామయ్య గారు ఆ రేడియోను తీసుకుని వచ్చి పదిలంగా బయట
వరండాలో ఓ బల్ల మీద వుంచి రేడియో పెట్టేవారు, వచ్చిన జనమంతా విననడానికి వీలుగా.
పొరబాటున
ప్రసారంలో ఏదైనా అంతరాయం వస్తే ఆయన వెంటనే హార్మనీ పెట్టె బయటకు తీసి దానిపై వున్న
మీటలపై చేతివేళ్ళను కదిలిస్తూ, మరో
చేతితో ఆ పెట్టెకు వెనుకవైపువున్న చెక్క పలకను వెనక్కీ ముందుకూ జరుపుతూ గొంతెత్తి
ఏదో ఒక పద్యం అందుకునేవారు. కొంతమంది ఊరిజనం కూడా ఆయనతో గొంతు కలిపేవారు.
ఒక విధంగా మా
మామయ్య గారిల్లు పొద్దుగూకే వేళకు వూరిజనాలకు వినోదకేంద్రంగా మారిపోయేది.
అదీ రేడియోతో
నా మొదటి పరిచయం.
తర్వాత స్కూలు
చదువుకోసం బెజవాడ వెళ్లి మా లాయరు బావగారు తుర్లపాటి హనుమంతరావు గారింట్లో
ఉండేవాడిని. ఆయన ఇంట్లో ఆఫీసు గదిలో ఒక బీరువా మీద ఒక చిన్న సైజు రేడియో వుండేది.
దానికి మా వూళ్ళో రేడియో మాదిరిగా యాంటీనా వున్నట్టు లేదు. కరెంటుతో పనిచేసేది.
కాకపోతే ఆ రేడియో పెట్టే అధికారం మా బావగారికి మాత్రమే వుండేది. ఇంట్లో వాళ్ళం
ఎవ్వరం దాని మీద చేయివేసే సాహసం చేసేవాళ్ళం కాదు. పొద్దున్నే భక్తి రంజని, ఇంగ్లీష్ వార్తలు అంతే! ఆ తర్వాత
రేడియో నోరు తెరిచేది కాదు. అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
మొట్టమొదటిసారి చంద్రుడి మీద కాలుమోపినప్పుడు ఆ చారిత్రాత్మక సంఘటనను బీబీసీ
కాబోలు ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ రోజు మా బావగారు నిబంధనలను కాస్త సడలించి
రేడియో పెట్టారు. గుర్రుబర్రు మంటూ ఇంగ్లీష్ లో ప్రసారం అయిన ఆ కార్యక్రమంలో ఒక్క
ముక్క అర్ధం కాకపోయినా అందరం చెవులొప్పగించి విన్నాం.
బీసెంటు
రోడ్డులో జంధ్యాల నారాయణ మూర్తి (సినిమా డైరెక్టర్ జంధ్యాల తండ్రి) గారి బుష్
రేడియో స్టోర్స్ వుండేది. మా బావగారు ఆయన గారు మంచి స్నేహితులు. అంచేత పిల్లలం
అప్పుడప్పుడూ ఆ దుకాణంలో కాసేపు కూర్చుని రేడియో కొనడానికి ఎవరైనా వచ్చినప్పుడు
పెట్టే ప్రోగ్రాములు వినేవాళ్ళం. ఆ విధంగా మా ముచ్చట తీర్చుకునేవాళ్ళం.
హైస్కూల్లో
చేరిన తర్వాత సెలవుల్లో మా వూరికి వెళ్ళినప్పుడు ఊరి మద్యలో మైకులో వినిపించే
పంచాయతీ రేడియో సెంటర్ మాకు ఆటవిడుపు. రోజూ సాయంత్రం వేళల్లో ఓ రెండు మూడు గంటలు
రేడియో వినడానికి వూళ్ళో వాళ్ళు ఆ మైకు దగ్గరికి చేరేవాళ్ళు. అది కూడా ఒక్క
విజయవాడ మెయిన్ స్టేషన్ మాత్రమే. సాయంత్రం ప్రాంతీయ వార్తలు, ఢిల్లీ నుంచి వచ్చే తెలుగు వార్తలు,
వ్యవసాయదారుల
కార్యక్రమం, ఎప్పుడయినా
ఓ హరికధా కాలక్షేపం. వివిధభారతి పాటలు అవీ వినడానికి వీలులేదు. మొదట్లో బాగున్నా,
సినిమాపాటలు వినే ఛాన్స్ లేకుండా పోయిందని బాధపడే వాళ్ళం.
ఈ లోపల మా ఇంటి
పెత్తనం మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు చేతికి వచ్చింది. ఆయన చేసిన మొదటి
పనేమిటంటే విజయవాడ వెళ్లి నాలుగు బా౦డ్లో, అయిదు బా౦డ్లో తెలియదు, ఓ ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కొచ్చాడు. మా వూళ్ళో అడుగుపెట్టిన మొదటి
ట్రాన్సిస్టర్ అదే. అంతకు ముందు బ్యాటరీతో పనిచేసే రేడియో మాత్రమే మేము చూశాము.
ఎక్కడికిపడితే అక్కడికి తీసుకువెళ్ళే ఆ రేడియో ఆ రోజుల్లో వూళ్ళో వాళ్ళందరికీ
చూడముచ్చటగానే కాకుండా విచిత్రంగా కూడా వుండేది. రేడియో సిలోన్ నుంచి మీనాక్షి
పొన్ను దొరై సమర్పించే కార్యక్రమంలో వినిపించే తెలుగు పాటలు మొదటిసారి వినే భాగ్యం
కలిగింది.
ఇక ఆ తర్వాత
రేడియో యుగం మొదలయింది. ప్రతి ఇంటా
రేడియో. ప్రతి చేతిలో బుల్లి ట్రాన్సిస్టర్. క్రికెట్ కామెంటరీలు వింటుంటే అచ్చం
క్రికెట్ గ్రౌండ్ లోనే వున్నామా అనే అనుభూతి కలిగేది. ఆ ఉత్సాహం రేడియో వినేవాళ్ళ
మొహాల్లో, చేతల్లో కేరింతల రూపంలో కనబడేది. రేడియో పుణ్యమా అని బుర్ర కధలు,
హరి కధలు,
పురాణ
కాలక్షేపాలు, సంగీత
కచ్చేరీలు అన్నీ ఇళ్ళ లోగిళ్ళలోకి తరలివచ్చాయి.
ఎప్పటికో
అప్పటికి సొంతంగా రేడియో కొనుక్కోలేకపోతానా అనే కోరిక నాతోపాటే పెరిగి పెద్దయి
రేడియో ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా తీరలేదు. ఎందుకంటే రేడియో వాళ్ళే మాకో ట్రాన్సిస్టర్ రేడియో,
దానితోపాటే
చేతిలో పట్టుకుని తిరిగే టేప్ రికార్డర్ ఇచ్చారు. దాంతో కొనే అవసరం లేకుండా పోయింది. ఆ
రేడియోకి కావాల్సిన బ్యాటరీ సెల్స్ కూడా నెలకోసారి ఆఫీసువాళ్ళే సప్లయి చేసేవాళ్ళు.
బదిలీ అయినప్పుడో, రిటైర్
అయినప్పుడో ఆ రేడియో తిరిగిచ్చేయాలనేది కండిషన్. నా విషయంలో ఇది కూడా జరగలేదు.
ఎందుకంటే ఏ బదిలీలు లేకుండా చేరిన చోటే, అంటే హైదరాబాదులోనే మూడు దశాబ్దాల తర్వాత పదవీవిరమణ చేశాను. ప్రభుత్వ
సర్వీసులో ఇదొక రికార్డు అనేవాళ్ళు. మూడు దశాబ్దాల క్రితం ఇచ్చిన ఆ రేడియో ఏమైందో
తెలియదు. మధ్యలో అయిదేళ్ళు దేశంలోనే లేను. రేడియో మాస్కోలో పనిచేయడానికి వెళ్లాను.
తిరిగివచ్చిన తర్వాత కూడా ఆ రేడియో గురించి అడిగినవాళ్ళూ లేరు. ఆ రికార్డులు
వున్నట్టూ లేదు. అసలు అదేమై పోయిందో నాకూ గుర్తులేదు. ఒకసారి బి.హెచ్.ఇ.ఎల్.
ప్రెస్ మీట్ కు వచ్చిన విలేకరులందరికీ అరచేతిలో ఇమిడే బుల్లి ట్రాన్సిస్టర్
రేడియోలు గిఫ్ట్ గా ఇచ్చారు. దీనివల్ల నాకు కలిగిన ప్రయోజనం ఏమిటంటే, సచివాలయంలో మంత్రుల ప్రెస్ మీట్లు
కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన సంగతులను అక్కడికక్కడే వారికి
వినిపించేవాడిని. ఇప్పుడే కదా చెప్పింది అప్పుడే ఎలా రేడియో వార్తల్లో వచ్చింది
అని వాళ్లు ఆశ్చర్యపోతుంటే అదో తుత్తిగా ఫీలయ్యేవాడిని.
ఉద్యోగం చేసిన
రోజుల్లో పుట్టని యావ, అసలు
రేడియో ఏమిటి, దీని
పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అనే మీమాంస రిటైరైన తర్వాత మొదలయింది. ఇటువంటి
విషయాల్లో అవగాహన కలిగిన వాళ్ళు చాలామంది నాలాగే రిటైర్ అయ్యారు. అనేకమంది జీవించి
లేరు. ఉన్నవారిలో కూడా చాలామందికి కొన్ని కొన్ని జ్ఞాపకం. అక్కడక్కడా మతిమరపు.
డాక్టర్ పద్మనాభ రావుగారి లాంటి వాళ్ళు విషయ సేకరణ చేసి రేడియోకి సంబంధించి కొన్ని
పుస్తకాలు రాసారు. మరొక వ్యక్తి డాక్టర్ పి.ఎస్. గోపాల కృష్ణ. గతంలో ఆలిండియా
రేడియో, హైదరాబాదు
కేంద్రానికి డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన స్వయంగా రాసి అనేక సదస్సుల్లో సమర్పించిన
పరిశోధనాపత్రాలు అనేకం వున్నాయి. ఆయన పనితీరు నాకు తెలుసు. పైగా ధారణ శక్తి అపారం.
సాధికారత లేకుండా ఏదీ రాయరు. కాబట్టి ఆయన్నిఅడిగీ, ఫోనులో మాట్లాడి చాలా విలువైన
సమాచారం సేకరించాను. అలాగే మరొకరు వీవీ శాస్త్రి గారు. హైదరాబాదు స్టేషన్
డైరెక్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. సాయంకాలక్షేపాల కబుర్లలో రేడియోకి సంబంధించిన
కబుర్లు అనేకం ఆయన నోటి వెంట విన్నాను.
ఏతావాతా మొత్తం మీద చాలా సమాచారాన్ని పోగుచేసి, కొంతవరకు నా బ్లాగులో భద్రపరిచాను.
వాటి ఆధారంగా మరికొన్ని రేడియో సంగతులు ఈ శీర్షిక ద్వారా తెలియచెప్పాలనేది
సంకల్పం. ఇక రాజకీయ పార్టీలు, వాటి నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రుల సంగతులేవీ అంటే వాటిని
గురించి ముందు ముందు ముచ్చటించుకోవచ్చు.
కింది
ఫోటో:
మా మామయ్య చామర్తి వీరభద్ర రావు గారు
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి