17, ఫిబ్రవరి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (86 )- భండారు శ్రీనివాసరావు

 

ఈ రేడియో డైరెక్టర్ కి రేడియో ఉద్యోగం అంటే పడదట ......

వేమూరి విశ్వనాధ శాస్త్రి అంటే వాళ్ళ కుటుంబంలో తెలుసు. వీ.వీ. శాస్త్రి అంటే రేడియోలో పనిచేసేవారికి తెలవకుండా పోదు. ప్రోగ్రాం సైడులో అతి చిన్న కింది మెట్టు అంటే  డ్యూటీ ఆఫీసర్ (ట్రాన్స్ మిషన్ ఎక్జిక్యూటివ్) నుంచి అదే స్టేషన్ కు డైరెక్టర్ గా ఎదిగిన అనుభవశాలి. హైదరాబాదులోనే కాదు భోపాల్ వంటి చోట్ల కూడా పనిచేసారు. రేడియోని ‘స్కాచి’ వడబోశారు. చిత్రం ఏమిటంటే ఆయన అరవయ్యవ దశాబ్దంలో రేడియోలో చేరినప్పుడు, ఇష్టం లేని పెళ్ళికి తల వంచి తాళి కట్టించుకున్న వధువులా, విధి లేక చేరానని చెబుతారు. ఎవరన్నా ఏదన్నా అనబోతే,  తన వాదనకు మద్దతుగా బీబీసీ   సీనియర్ అధికారి  లయొనెల్  ఫీల్డెన్ (Lionel Fielden) రాసిన ‘బెంట్ ఆఫ్ మైండ్’ పుస్తకాన్ని ఉదహరిస్తారు. ఇంకో చిత్రం ఏమిటంటే ఆయనకు రేడియో ఉద్యోగం పడదు కానీ రేడియో అంటే ప్రాణం, అందులో  ముఖ్యంగా రేడియో వార్తలు ఆయనకు మరీ మరీ ఇష్టం. సుమారు నలభయ్ ఏళ్ళ సుదీర్ఘ రేడియో ప్రస్థానంలో  రేడియో గురించిన  మధురమైన ఎన్నో  జ్ఞాపకాలు ఆయన మదిలో పదిలంగా వున్నాయి.   

చిన్నప్పుడు ఆయన ఇంట్లో రేడియో వుండేది కాదు. రేపల్లెలోని శంకర్ విలాస్ కాఫీ హోటల్లోని  రేడియో ఒకటే దిక్కు. అక్కడికి వెళ్లి వార్తలు వినాలంటే కాఫీ టిఫిన్లకు చిల్లర డబ్బులు కావాలి. అందుకోసం, నాన్నగారి లాల్చీ జేబులో నుంచి చిల్లర కొట్టేసే చిల్లరమల్లర దొంగతనాలకు కూడా వెనుతీయలేదు. ఇంతా చేసి ఆలిండియా రేడియో వార్తల్లో వచ్చే జాతీయ అంతర్జాతీయ సమాచారం పట్ల ఆయనకు  ఆసక్తి వుండేది కాదు. జోలిపాల్యం మంగమ్మ వంటి న్యూస్ రీడర్లు వార్తలు చదివే విధానం అంటే చెవి కోసుకునేవారట. ఇంటికి వెళ్ళిన తరువాత కూడా రేడియో న్యూస్ రీడర్ల మాదిరిగానే వార్తలను  అనుకరిస్తూ బిగ్గరగా చదవడం శాస్త్రిగారి హాబీ.

ఎమ్మే పాసయిన తరువాత రేడియోలో ట్రాన్స్మిషన్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆయనతో పాటు ఇరవై రెండు మంది సెలక్ట్ అయితే ఈయన కడమాఖరిలో ఇరవై రెండోవారు. ఢిల్లీలో ఇంటర్వ్యూ. ఆ కమిటీకి  ఆనాటి  రేడియో డీజీ శ్రీ నారాయణ్  మీనన్ చైర్మన్.  ఆయనకు ఎందుకో శాస్త్రి గారిపట్ల వాత్సల్యం కలిగింది. సంగీత, నృత్యాలు గురించి అడిగిన  ఏ ప్రశ్నకూ ఆయన సరయిన సమాధానం ఇవ్వలేకపోయారు. చివరికి ఆ అధికారే కల్పించుకుని ‘ఢిల్లీ నీకు కొత్తా, ఏమేం  చూసావు ఇక్కడ’ అంటూ చనువుగా అడిగారు. ఢిల్లీలో తాను  చూసిన హుమాయున్ సమాధి గురించి చెప్పారు. అనేక విషయాలు గురించి ఈ కుర్రవాడికి అవగాహన  లేకపోయినా, తెలిసిన విషయాలు గురించి పరిపూర్ణ పరిజ్ఞానం వుందని ఆయన అభిప్రాయపడ్డట్టు శాస్త్రిగారికి తోచింది. సరయిన జవాబులు చెప్పలేకపోయినా, చెప్పిన పద్దతి నచ్చిందేమో తెలియదు.  శాస్త్రిగారి ‘బెంట్ ఆఫ్ మైండ్’  రేడియో పట్ల లేకపోయినా,  శాస్త్రి గారిని మాత్రం ఆ ఉద్యోగానికి  సెలక్ట్ చేసారు. దీన్నే డిస్టినీ అంటారు శాస్త్రి. దీన్నే తలరాత అంటారేమో. రాసిపెట్టి వుంది కాబట్టే ఆ ఉద్యోగానికి తాను పెట్టుకున్న దరకాస్తు సకాలంలో చేరిందని అంటారు శాస్త్రిగారు. దీనికి మరో ఉపాఖ్యానం వుంది.

ఇంచుమించుగా అరవై ఏళ్ళ కిందటి సంగతి. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎం కాం చదివిన ఓ కుర్రాడికి ఉద్యోగ నిమిత్తం ఒక గెజిటెడ్ అధికారి సంతకం కావాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లోనే ఒక వాటాలో తహసీల్దార్ అద్దెకు ఉంటున్నాడు. కుర్రాడి అన్నయ్య, ఆయనకు  విషయం చెబితే, ‘దానిదేముంది ఆఫీసుకు పంప’మన్నాడు. ఆ తహసీల్దార్ రోజూ ఆఫీసుకు వెళ్ళే తీరు ఆ కుర్రాడికి చూడ ముచ్చటగా వుండేది. ఓ బిళ్ళ బంట్రోతు ఓ కర్ర పట్టుకుని అక్కడ ఎవరూ లేకపోయినా ‘జరగండి, పక్కకి జరగండి అయ్యగారు వస్తున్నారు’ అంటూ అరుస్తూ ముందు వెళ్ళేవాడు. అతడి వెనక తహసీల్దారు. ఆయన వెనుక దస్త్రాల పెట్టె మోసుకుంటూ మరో బంట్రోతు. వాహనం వుండేది కాదు. ఆఫీసుకు నడిచి వెడుతున్నా కూడా ఈ వైభోగం అంతా వుండేది. ఇదలా ఉంచితే..

అన్నయ్య చెప్పిన ప్రకారం ఆ కుర్రాడు తహసీల్ కచేరీకి వెళ్ళాడు. గది ముందు బిళ్ళ బంట్రోతు తానే అధికారిలా హడావిడి చేస్తున్నాడు. రోజూ ఇంట్లో చూసే మనిషే అయినా, ‘ఎవరు మీరు ఏం కావాల’ని గద్దించి అడిగాడు. కుర్రాడు తహసీల్దారుని కలవాలని చెప్పాడు. ‘ఆయనకు తీరిక లేదు, అయిదు రూపాయలు అవుతుంది ఉన్నాయా’ అన్నాడు. అయిదు కాగితం చేతిలో పడగానే లోపలకు పంపాడు.        

తహసీల్ దారు కుర్రాడిని తెలియనట్లే మాట్లాడాడు. వచ్చిన విషయం చెబితే కాగితాలు తీసుకుని పైకీ కిందికీ ఓసారి చూసాడు. ‘ఢిల్లీలో ఉద్యోగమా ఎంతిస్తార’ని అడిగాడు. ‘బేసిక్ 230 అని రాసి వుంది’ అని కుర్రాడు చెప్పాడు. అది వింటూనే ‘సరి సరి నా జీతమే నూట ముప్పయి. నేను సంతకం పెట్టాలా వెళ్ళు వెళ్ళు’ అన్నాడు.

కుర్రాడు బయటకు వచ్చాడు. బంట్రోతు ‘పనయిందా’ అన్నాడు. లేదన్నాడు కుర్రాడు. ‘లోపలకు పంపినందుకు మూడు, సంతకం పెడితే స్టాంప్ కొట్టినందుకు రెండు. అంచేత ఇదిగో ఈ రెండు రూపాయలు తీసుకుని బయటకు నడవ’మన్నాడు బిళ్ళ బంట్రోతు.

నిజానికి ఆ రోజుల్లో తహసీల్దారు గెజిటెడ్ కాదు. కానీ ఉద్యోగ హోదా రీత్యా సంతకం చేస్తే చెల్లుతుంది. పొతే ఆ వూళ్ళో మరో గెజిటెడ్ అధికారి వున్నాడు. పశువుల డాక్టరు. అక్కడ బంట్రోతుల హడావిడి లేదు, ఆవులు, గేదెల రొద తప్ప.

నేరుగా వెళ్లి కలిశాడు. ‘అయిదు రూపాయలు ఇచ్చుకోవాలి, తెలుసుకదా’ అన్నాడు.

కుర్రాడు డబ్బులు తీసి ఆయన చేతికే ఇచ్చాడు. అధికారి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఆ చేత్తోనే సంతకం చేసి, తనే స్టాంప్ వేసి ఇచ్చాడు. అక్కడ అన్నీ ఆయనే.



ఆ విధంగా రేడియో ఉద్యోగానికి సకాలంలో దరకాస్తు చేసుకోవడం సాధ్యపడిందని, ఇలా జరగడం విధి రాతే అని, తదనంతర కాలంలో ఆ ఉద్యోగంలో చేరి హైదరాబాదు ఆలిండియా రేడియో డైరెక్టరుగా పదవీవిరమణ చేసిన వేమూరి విశ్వనాధ శాస్త్రి గారు మాటల మధ్యలో గుర్తు చేసుకున్న ‘స్వకీయం’ ఇది.’

అప్పుడు శాస్త్రిగారికంటే మంచి మార్కులతో ముందు వరసలో  ఎంపిక అయినవారిలో ధిగ్గనాధీరులు వున్నారు. శ్రీయుతులు  గొల్లపూడి మారుతీరావు, శంకరమంచి సత్యం మొదలయిన వాళ్ళు వారు. అందరికీ హైదరాబాదులో పోస్టింగు ఇచ్చారు.

ఆలిండియా రేడియోకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని గురించి శాస్త్రి గారు చెప్పింది వినసొంపుగా వుంది.   

1935 లో బెంట్  ఆఫ్ మైండ్ రచయిత లయొనెల్  ఫీల్డెన్ ఇండియాకు వచ్చారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్ (ISBS) అని కొత్తగా ప్రారంభించిన సంస్థకు ఆయన మొదటి కంట్రోలర్.

ఎందుకో ఆయనకు ఆ పేరు నచ్చలేదు. ఏదైనా చక్కటి పేరు కోసం అయన తపన పడ్డాడు. ఒకరోజు వైస్రాయ్ గౌరవార్ధం ఇచ్చిన విందులో Lord Linlithgow ని కలుసుకుని ఈ మాట చెప్పారు. ఆయన కూడా కాస్త ఆలోచించి ‘ఆలిండియా..’అని ఆగిపోయారు. మళ్ళీ ఆయనే బ్రాడ్ కాస్టింగ్ బదులు రేడియో అంటే ఎలా ఉంటుందని అడిగారు. ఆ రెంటినీ కలిపితే  ‘ఆలిండియా రేడియో’. ఆ పేరు లయొనెల్  ఫీల్డెన్ గారికి తెగ నచ్చింది. అదే స్థిరపడి పోయింది (ట). దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఆలిండియా రేడియో భారతీయ భాషల్లో ‘ఆకాశవాణి’ గా మారిపోయింది (తమిళాన్ని మినహాయిస్తే).

సాయంత్రాలు తీరిగ్గా  కూర్చుంటే ఇలాటి కబుర్లు విశ్వనాధ శాస్త్రి గారు అలవోకగా బోలెడు చెబుతారు. శాస్త్రిగారి భార్య చనిపోయిన తర్వాత, హైదరాబాదులో ఒంటరిగా ఉంటున్న శాస్త్రి గారిని  వాళ్ళ అబ్బాయి వచ్చి, తన వెంట  అమెరికా తీసుకు వెళ్ళాడు. గ్రీన్ కార్డు కూడా వచ్చింది.

మరిప్పుడు, ఇలాంటి కబుర్లు అన్నీ ఆయన  ఎవరికి  చెబుతున్నారో ఏమో! 

కింది ఫోటో: వీవీ శాస్త్రి గారు 




(ఇంకా వుంది)

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఆకాశవాణి అన్న అద్భుతమైన పేరు మారుగా ఆలిండియా రేడియో అని అరవ సోదరులు పిలవడం మూర్ఖత్వం. భారతీయ భాషలకు మాతృ భాష సంస్కృతం కంటే విదేశీ భాష ఆంగ్లం లో ఉన్న పదం వారు కోరుకున్నారు అంటే భాషాపరంగా ఎంత సంకుచితంగా ఉన్నారో తెలుస్తుంది.

దీనికి తోడు ఇటీవల ప్రధాని కూడా తమిళం ప్రపంచంలో ప్రాచీన భాష అని చెప్పడం దురదృష్టకరం.

వేద భాష దేవ భాష అయిన సంస్కృతం కంటే ఇంకొక ప్రాచీన భాష ఉంది అని చెప్పడం హాస్యాస్పదం. అవివేకం. తమిళం ఒక పురాతన భాషే కానీ సంస్కృతం అంతకుముందే వేల ఏళ్ల క్రితమే పరిఢవిల్లిన భాష అన్నది నిర్వివాదాంశం.

Zilebi చెప్పారు...

ఈ మధ్య తమిళ రేడియో స్టేషన్లు కూడా ఆకాశవాణి అనే అంటున్నాయండి ( భాజ్పా ధమాకా :))

భండారు వారు out of touch లా‌ వున్నారు :)


విన్నకోట నరసింహా రావు చెప్పారు...

వి వి శాస్త్రి గారికి నమస్కారాలు 🙏.

// “సరి సరి నా జీతమే నూట ముప్పయి. నేను సంతకం పెట్టాలా వెళ్ళు వెళ్ళు’ అన్నాడు.” //
🙂🙂. నాకొక ఉదంతం గుర్తుకొచ్చింది. నలభై యేళ్ళ క్రితం జరిగినది. ఓ ప్రభుత్వాధికారి నేను పని చేస్తున్న ఊరికి బదిలీపై వచ్చాడు. బ్యాంకు లో ఉన్న ప్రభుత్వ శాఖ ఖాతా drawing officer గా ఫారాలు నింపి తన గుమాస్తాకెచ్చి పంపించాడు. వారు కొత్తగా వచ్చారు కాబట్టి వారి సంతకాన్ని ధృవీకరిస్తూ ఆ ఫారాల మీద వారి శాఖ వారు ఎవరైనా సంతకం చెయ్యాలి కదా. ఎలా అన్నాడు ఆ గుమాస్తా. మీరు సంతకం పెట్టండి అని మార్గం చూపిస్తే …. అమ్మో, ఆయన నా పై ఆఫీసరండీ, ఆయన సంతకాన్ని నేను ధృవ పరచడమేమిటి (attest చెయ్యడం), అపచారం అపచారం అన్నాడు …. భక్తితో లెంపలేసుకోవడం ఒకటే తక్కువ. 🙂🙂