ముందే మనవి చేసుకున్నాను, ఇది నా ఒక్కడి కధ కాదని, నా చుట్టూ అల్లుకున్న ప్రపంచం కధ అని.
కొన్ని
శబ్దాలు చెవుల్లో ఎప్పుడూ మార్మోగుతూనే ఉంటాయి. కొన్ని స్వరాలు నాలుకపై నిరంతరం
నాట్యం చేస్తూనే ఉంటాయి. కాలచక్రం గిర్రున తిరిగినా, కాలదోషం పట్టని కొన్ని అద్భుతాలు
ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్. ప్రతి రోజూ ఉదయం
రేడియోలో వినిపించే ఆ సుస్వరం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మాండలీన్, వయోలిన్, పియానో, కలగలసిన అద్భుతమైన ఆ రాగం పురుడు
పోసుకుని ఇప్పటికి కొంచెం అటూ ఇటూగా తొంభయ్ ఏళ్ళు. అయినా, నేటికీ ఆ ట్యూన్, స్మార్ట్ ఫోన్ల లో రింగ్ టోన్ / కాలర్ టోన్ గా
(మన్నించాలి, ఈ
రెంటికీ నాకు తేడా తెలియదు) వినిపిస్తూనే
వుంది. వాట్సప్ గ్రూపుల్లో షేర్ అవుతూనే ఉంది.
నేను
స్మార్ట్ ఫోన్ వాడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ ని
నా రింగ్ టోన్ / కాలర్ టోన్ గా
వాడుతున్నాను. నాకు ఎవరైనా ఫోన్ చేస్తే నాకు వినపడే రింగ్ ధ్వని అదే అన్నమాట.
రేడియోతో చిరకాల అనుబంధం నన్నీపనికి పురికొల్పింది. ప్రతిరోజూ ఉదయం
ఆరుగంటలకు రేడియో ప్రసారాలు మొదలు కావడానికి ముందుగా వినపడేది ఈ సిగ్నేచర్ ట్యూనే.
ఒకానొక రోజుల్లో ఇంటిల్లి పాదికీ ఇది కోడి కూత. అది వింటూనే జనం తమ నిత్య
వ్యవహారాలు మొదలుపెట్టే వారు.
ఇంతకీ
ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్‌ని కంపోజ్ చేసిందెవరో తెలుసా..? ఆ సంగీతజ్ఞుడి పేరు వాల్టర్ కౌఫ్‌మన్. చెక్ రిపబ్లిక్
దేశానికి చెందిన వ్యక్తి. 1934లో
ముంబైకి వచ్చిన కౌఫ్‌మన్, బాంబే
చాంబర్ మ్యూజిక్ సొసైటీలో పియానో వాద్యకారుడిగా ఉండేవాడు. ఇండియన్ బ్రాడ్‌కాస్ట్
కంపెనీ విజ్ఞాపన మేరకు 1936లో ఒక
ట్యూన్ కంపోజ్ చేసి ఇచ్చాడు కౌఫ్‌మన్. పాశ్చాత్య, శాస్త్రీయ సంగీతాల మేళవింపుగా దీనిని
రూపొందించాడాయన. శివరంజని రాగం ఆధారంగా దీనిని కంపోజ్ చేశారని చెబుతారు.
స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఈ ట్యూన్‌ని మారుద్దామని కొందరు అన్నారట! అయితే,
ఈ స్వరంలో
ప్రణవనాదం అయిన ఓంకారం ప్రతిధ్వనిస్తున్నట్టు ఉందనే అభిప్రాయంతో ఆ ట్యూన్ మార్చే
ప్రయత్నాన్ని విరమించుకున్నారట ఆకాశవాణి అధికారులు.
1934 లో
ఇండియాకు వచ్చిన పద్నాలుగేళ్ళపాటు ఈ దేశంలోనే వుండిపోయాడు. బాంబేలోని విల్లింగ్టన్
జింఖానాలో ప్రతి గురువారం నాడు ఒక సంగీత కచ్చేరీ ఇచ్చేవాడు. ఆయన బృందంలో ప్రపంచ
ప్రఖ్యాతి గాంచిన సంగీత
విద్వాంసుడు జుబెన్ మెహతా తండ్రిగారయిన మెహ్లీ మెహతా వుండేవారు. ఆయన వయొలిన్ పైనా, కౌఫ్‌మన్ పియానో పైనా శ్రోతలను
అలరిస్తూ వుండేవారు. ఆల్
ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్ లో వయొలిన్ వాయించింది మెహ్లీ మెహతా అనేవారు కూడా లేకపోలేదు.
కౌఫ్‌మన్
సంగీతంలో దిట్ట. పూర్వపు జెకొస్లవాకియా దేశంలో 1907 లో జన్మించిన ఈ సంగీత కారుడు,
బెర్లిన్ సంగీత
కళాశాల నుంచి పట్టా పుచ్చుకున్నాడు. నాజీల బాధితుడిగా అతడు భారతదేశానికి ఓ
కాందిశీకుడుగా వచ్చాడు. ఇండియాకు వీసా దొరకడం చాలా సులభం కాబట్టి తాను ఈ దేశాన్ని
ఎంచుకున్నానని ఆయన చెప్పేవాడు.
1937 నుంచి 1946 వరకు ఆల్ ఇండియా సంగీత విభాగంలో
డైరెక్టర్ గా రేడియోలో పనిచేశాడు. ఈ దేశపు అతి గొప్ప సంగీత కళాకారులను
గురించి తెలుసుకోవడానికి ఈ ఉద్యోగం ఎంతగానో ఉపకరించిందని తను రాసిన ఒక పుస్తకంలో ఆయన వెల్లడించారు.
పాతతరానికి
చెందిన అనేకమంది భారతీయ సంగీత
విద్వాంసులు, రేడియో వారు చెక్కుల రూపంలో ఇచ్చే ప్రతిఫలాన్ని
తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదని, విచ్చు
రూపాయలలో ఇస్తే సంతోషంగా తీసుకునేవారని, ఆ నాణేలను జాగ్రత్తగా లెక్కపెట్టుకోవడానికి తమ వెంట ఎవరో ఒకరిని తోడు
తెచ్చుకునేవారని తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఇండియా
వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత 1957 లో అమెరికాలో స్థిరపడడానికి ముందు
కొన్నేళ్ళు ఇంగ్లాండ్ లో, కెనడాలో
గడిపారు. 1984 లో కౌఫ్‌మన్ అక్కడే కన్ను మూశారు.
రేడియోకి
(ఇక్కడ రేడియో అంటే ఆకాశవాణి) అభిమానులు ఉన్నట్టే రేడియోలో పనిచేసిన వారికి కూడా
రేడియో అంటే తగని అభిమానం,
ఆరాధన. ఉదాహరణకు రేడియోలో సుదీర్ఘకాలం పనిచేసిన రావూరి భరద్వాజ గారి విషయమే తీసుకుందాం. ఆయన చివరి కోరిక ఏమిటో తెలుసుకుంటే
ఆశ్చర్యం వేస్తుంది.
ఆకాశవాణి
హైదరాబాదు కేంద్రంలో నేను చిరకాలం కలిసి పనిచేసినవారిలో భరద్వాజ ఒకరు. ఆయన పొడవాటి
గుబురు గడ్డం పెంచని రోజులనుంచి నాకు
తెలుసు. రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ అవార్డు
ప్రకటించినప్పుడు ప్రముఖ జర్నలిష్టు రెంటాల జయదేవ్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. అది
ప్రజాశక్తిలో వచ్చింది. మనసుకు మాత్రమే ఆర్ద్రం అయ్యే రీతిలో ఒక జవాబు చెప్పారు అందులో
భరద్వాజ గారు. నేను రేడియో మనిషిని కనుక దాన్ని అందరితో పంచుకోవాలని సహజంగా
అనిపించింది. అదే ఇది.
"ఆకాశవాణిలో
ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది?’
రెంటాల
గారి ప్రశ్న.
భరద్వాజ
గారు ఉద్వేగానికి గురవుతూ ఇచ్చిన సమాధానం :
"కడుపు
నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి.
అలాంటి నేను, నా
భార్య, నా
బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ, ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ.
హైదరాబాద్ ఆకాశవాణిలో నాకు ఉద్యోగ రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను
మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే ఉత్సాహం ఇచ్చింది ఆకాశవాణే.
నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ
మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి
ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే
నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణి (ఆవరణలో) ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!"
మరి
రేడియోలో కళాకారులు చేసేది ఉద్యోగం (వృత్తి) అందామా! (ఉపాధి) అనురక్తి అందామా!
అలాగే
మరో రేడియో కళాకారిణి రేడియో చిన్నక్క.
ఒకానొక
కాలంలో రేడియో చిన్నక్కగా తన సుస్వరంతో లక్షలాదిమంది శ్రోతలను అలరించిన రతన్
ప్రసాద్ గారు కొన్నేళ్ళ క్రితం ఫోను చేశారు. జర్నలిస్ట్ డైరీ ఫేం సతీష్ బాబు రేడియోపై రూపొందించిన వీడియో చూసారట. అందులో తన గురించిన ప్రస్తావన వుందని
మురిసిపోతూ చెప్పారు. ప్రస్తుతం ఆవిడ ఢిల్లీలో మనుమల దగ్గర వుంటున్నారు. సతీష్ కు
థాంక్స్ చెప్పు బాబూ అని కోరారు.
“మేమెవ్వరం
రేడియోలో ఉద్యోగం అనుకుని చేయలేదు. కళాకారులకి కావాల్సింది కాసింత ప్రశంశ. అది
మంచి టానిక్కులా పనిచేస్తుంది” అని అంటూ అంతకు కొన్నేళ్ళ ముందటి సంఘటనను
గుర్తుచేసుకున్నారు.
రేడియో న్యూస్
రీడర్, ప్రసిద్ధ కథకుడు,
కీర్తిశేషులు డి. వెంకట్రామయ్య గారు ఆకాశవాణిలో చిరకాలం పనిచేసిన వారితో 2018
ఏప్రిల్ లో
హైదరాబాదులో ఒక ఇష్టాగోష్టి విందు సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికి కొద్ది రోజుల
క్రితం రతన్ ప్రసాద్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ‘నువ్వు నమ్మవు కానీ బాబూ
నేను చావు ముఖంలో అడుగు పెట్టి మళ్ళీ బయటకు వచ్చాను. మా పిల్లలు ఆ మీటింగుకు
ఇప్పుడు వెళ్లకపొతే ఏం’ అంటూ అభ్యంతర పెట్టారు. నా పోరు పడలేక తీసుకువచ్చారు.
కాస్త ఆలస్యంగా వచ్చిన నన్ను చూస్తూనే నువ్వొక మాట అన్నావు, ‘ఏమండీ రతన్ ప్రసాద్ గారూ, మీ స్వర యవ్వన రహస్యం ఏమిటో
చెబుదురూ’ అని. నిజం చెప్పొద్దూ! నేను తొమ్మిది పదులు నిండి కూడా ఇలా
మాట్లాడుతున్నాను అంటే, ఆ రోజు నువ్వన్న ఆ ఒక్క మాటే కారణం. అది మంచి టానిక్కులా
పనిచేసింది. అంతకుముందు అనారోగ్యంతో చాలా అవస్థలు పడ్డాను. కానీ ఆ రోజు నుంచి నేను
మళ్ళీ మామూలు మనిషిని కాగలిగాను. మా పిల్లలతో ఎప్పుడూ అంటుంటాను, శ్రీనివాసరావు ఆ ఒక్క మాటతో నాకు
పునర్జన్మ ఇచ్చాడు అని. ఈరోజు నీ పోస్టు చూసి ఫోన్ చేయాలనిపించింది. సతీష్ కు కూడా
చెప్పు. ఈ వయస్సులోవున్న మాలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుని ప్రోగ్రాం లో చేర్చినందుకు.
వుంటాను నాయనా! ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆవిడను అడిగానని చెప్పు అనడానికి నాకు నోట
మాట రావడం లేదు. పాపం చిన్న వయసులోనే పోయింది. ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నవ్వుతూ,
ఆప్యాయంగా
మాట్లాడేది. ప్రసాద్ గారు పోయిన తర్వాత నాకూ ఒంటరితనంలో బాధ ఏమిటో తెలుస్తోంది”
ఆవిడ అలా
మాట్లాడుతూనే వున్నారు. నా ఆలోచనలో నేను వున్నాను.
ఒక మంచి మాటలో
ఇంతటి శక్తి ఉందా!
కింది
ఫోటోలు:
(ఇంకా
వుంది)
8 కామెంట్‌లు:
నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ ని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణి (ఆవరణలో) ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!" - ఇదేమి వింత కోరిక ?
గవర్నమెంట్ ఆఫీసులో
ఎవరైనా అలా ఒప్పుకుంటారా ?
రావూరు భరద్వాజ ఎమోషనల్ వ్యక్తి. ఎక్కువ అతిగా గొంతు గద్గదం అవుతుంది. జ్ఞాన్ పీఠ్ అవార్డు వచ్చేంత గొప్ప రచయితా కాదు అనిపిస్తుంది.
అజ్ఞాత గారికి
"రేడియోకి (ఇక్కడ రేడియో అంటే ఆకాశవాణి) అభిమానులు ఉన్నట్టే రేడియోలో పనిచేసిన వారికి కూడా రేడియో అంటే తగని అభిమానం, ఆరాధన." అని రాసింది ఒకసారి గమనంలోకి తీసుకోండి. అభిమానానికి కొలమానాలు, హేతువులు వుండవు.
భండారు వారు,
రావూరి వారి ఆఖరి కోరిక నెరవేరిందా మరి ?
నెహ్రూ తన చితా భస్మం కొంత గంగా నదిలో కలిపి ఎక్కువ భాగం విమానం లో తీసుకుపోయి పై నుంచి పంట పొలాలలో పడే విధంగా మట్టిలో కలిసిపోయే లాగా చల్లాలి అని కోరుకున్నాడు.
https://www.nationalheraldindia.com/india/nehrus-will-let-my-ashes-scatter-over-fields-and-mingle-with-the-dust-and-soil-of-india
తన చితాభస్మాన్ని అలా చల్లాలి అని కోరుకున్న నెహ్రూ, వారసులు అలాగే చేసిన పని మీద ఆ కాలం నాటి వయసులో పెద్దవాడు ఒకాయన మాకు తెలిసిన వ్యక్తి “దేశాన్నంతా శ్మశానం చేసాడు కదయ్యా నెహ్రూ” అనడం నాకు ఇప్పటికీ బాగా గుర్తు.
ప్రముఖులు తమ కోరికలను వెలిబుచ్చే ముందు అన్ని కోణాల నుంచీ ఆలోచించాలి.
దేశమంతా వెదజల్లబడిన నెహ్రూ గారి చితాభస్మం ఎక్కడెక్కడి మట్టిలో కలిసిపోయి ఏ ఏ మట్టిపాత్రల తయారీలో కలిసిపోయిందో కదా ? ఎంతటి గొప్పవారలయినా చివరికంతే - గుఱ్ఱం జాషువా గారు చెప్పినట్లు 🙏. 👇
// “ కవుల కలాలు, గాయకుల కమ్మని కంఠము లీ శ్మశానపుం
గవనులఁ ద్రొక్కి చూచెడి; నొకానొకనాఁ డల కాళిదాస భా
రవు ల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే
ణువు లయి మృత్తికం కలిసెనో కదా! కుమ్మరివాని సారెపై “ //
మంచి పద్యం ఇచ్చారు. బూడిద అయిపోయిన తరువాత పై నుంచి చల్లినా , నదులలో కలిపినా చివరికి చేరుకునేది భూమిలోకే. మరణం అయిన తరువాత పంచ భూతాత్మకమైన భౌతిక శరీరం తిరిగి పంచ భూతాలలోకి లీనమైపోతుంది.
మరల గత జన్మ కర్మానుసారం లింగ శరీరం లేదా సూక్ష్మ శరీరం కొత్త జన్మ తీసుకుని కొత్త బట్టలు వేసుకున్నట్టు కొత్త దేహం ధరించి మరల భూమి పైకి వస్తుంది. పునర్జన్మల పై హిందువుల విశ్వాసం ఈ విధంగా ఉంటుంది.
మరణానంతరం పార్థివ దేహాన్ని దహనం చేయడం ఒక మంచి పద్ధతి. భూమిలో పాతి సమాధులు ఏర్పాటు చేయడం కొందరు చేస్తారు. అయితే సమాధులు కడుతూ పోతే భవిష్యత్తులో స్థలాలు కష్టం అవుతుంది అనిపిస్తుంది. అయితే ఇది వారి వారి మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఒక మతం వారు చనిపోయిన తరువాత దేహాన్ని ఎత్తైన ప్రదేశం లో ఉంచి రాబందులు,కాకులకు ఆహారంగా లాగా వదిలివేస్తారు అని తెలుస్తుంది. ఏ మార్గమైనా
పంచ భూతాలలో కలిసిపోవడం జరుగుతుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి