‘యే
ఆకాష్ వాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే’
పాటల్లోనే
కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. వినిపించవచ్చు.
ఉర్దూ
భాషకు ఆ శక్తి వుంది.
డెబ్బయ్యవ
దశకంలో రేడియో
శ్రోతలకు చిరపరిచితమైన ఈ స్వరం హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా
సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూ ప్రాంతీయ వార్తల్లో వినపడేది.
ఉర్దూ
తెలియని వాళ్లు కూడా వసీమక్తర్ (వసీం అక్తర్) చదివే వార్తలు వినడం నాకు తెలుసు.
ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం వింటున్నట్టుగా వుండేది. నేను ఆయనతో కలిసి
చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను.
ఉర్దూలో ఓనమాలు తెలియకపోయినా ఆయనకు అభిమానిగా మారాను. నాకు ఉర్దూ రాదు. కాని
వసీమక్తర్ కు తెలుగు తెలుసు. పొడి పొడి మాటల్లోనే భావం అర్ధం అయ్యేలా చెప్పేవాడు.
ఇక వార్తలు సరేసరి. ముందే చెప్పినట్టు సంగీతం వింటున్నట్టుగా వుండేది. దురదృష్టం
ఏమిటంటే ఇటువంటివారి ఫోటోలు దొరక్కపోవడం. వసీమక్తర్ చనిపోయిన రోజు నాకు బాగా
జ్ఞాపకం. ఎంతోమంది ఆయన్ని కడసారి చూడడానికి వచ్చారు. వాళ్ళల్లో అన్ని మతాల వాళ్లు
వున్నారు. వసీమక్తర్ తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకురావడం ఆయన్ని గురించిన మరో
జ్ఞాపకం.
కొన్ని
ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా, పెద్దవా అన్న మాట అటుంచి గొప్పగొప్ప వాళ్ళతో
కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది. ఆ అదృష్టం నాకు రేడియో ఉద్యోగంలో దక్కింది.
దేశానికి
స్వాతంత్రం రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే, అప్పటి నిజాం సంస్థానంలో రేడియో
ప్రసారాలు మొదలయ్యాయి.
“1933లో మహబూబ్ ఆలీ అనే తపాలాశాఖ ఉద్యోగి
హైదరాబాదు చిరాగ్ ఆలీ సందులో
చిన్న రేడియో
కేంద్రం నెలకొల్పాడు. ఆయన కుటుంబసభ్యులే
కేంద్రం నిర్వహణ బాధ్యత చూసుకునేవారు. ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో కేంద్రం
పనిచేసేది. ప్రసార శక్తి చాలా తక్కువ కావడం వల్ల ప్రసారాలు చాలా పరిమితమైన దూరాలకే వినిపించేవి.
ఉర్దూతో పాటు
తెలుగు, కన్నడ,
మరాఠీ భాషల్లో
ప్రసారాలు
చేసేవారు.
అయితే ఉర్దూతో
పోలిస్తే తక్కిన భాషల ప్రసారాలు పరిమితంగా
వుండేవి. ఈ కేంద్రం ఉదయం ఏడున్నర నుంచి
తొమ్మిదిన్నర దాకా, సాయంకాలం
అయిదున్నర నుంచి రాత్రి పదిన్నర దాకా ప్రసారాలు చేసేది.
హిందూస్తానీ
సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. చాలా ఏళ్ళ తరువాత కర్నాటక సంగీతానికి కొంత సమయం కేటాయించసాగారు.
ముస్లిం వనితల కోసం పరదా పధ్ధతి, వారికోసం
విడిగా వాకిలి ఏర్పాటుచేశారు. వసీంఖాన్ అనే ఆయన తెలుగు కార్యక్రమాల అధికారిగా
పనిచేశారు. రాయప్రోలు రాజశేఖర్ సహాయ దర్శకులుగా, భాస్కరభట్ల కృష్ణారావు, దుర్గా చలం కార్యక్రమ నిర్వాహకులుగా
పనిచేసేవారు.
కురుగంటి
సీతారామయ్య, మహారధి
సంభాషణలు, వార్తలు
వంటివి రాసేవారు. కే.ఎల్. నరసింహారావు గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. లలిత,
వెంకటేశ్వర్లు
అనేవాళ్ళు వార్తలు
చదివేవాళ్ళు. మల్లి పాటలు,
ఎల్లి పాటలు
మొదలయిన శీర్షికలతో జానపద గీతాలు ప్రసారం అయ్యేవి” అని డాక్టర్ పి ఎస్ గోపాల కృష్ణ
చెప్పారు.
ఉర్దూలో
వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు,
పాటలు ప్రసారం
అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా దొరికేవి కావు. దానితో
స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ కార్యక్రమాలను రికార్డ్
చేసేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్ రేడియోలో మొదటి మ్యూజిక్
డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్ రేడియోలో స్టుడియో
ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర కాలంలో రవూఫ్ ఈ
కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.
మొహరం మాసంలో
రేడియో కేంద్రానికి సెలవు ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.
ఆ తరువాత
కొన్ని మార్పులు చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన
రోజుల్లో కూడా సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో
వెలువడిన వార్తల ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన
సమాచారమే వార్తల్లో చోటుచేసుకునేది.
రెండేళ్ళ
తరువాత అంటే 1935 లో
డెక్కన్ రేడియో కేంద్రాన్ని నిజాం స్వాధీనం చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్
లెస్ విభాగం కింద డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు పెట్టింది. నవాబ్ ఆలీ యవార్ జంగ్
ఆధ్వర్యంలో డెక్కన్ రేడియో కేంద్రానికి మరిన్ని హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని
మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్
ను దిగుమతి చేసుకున్నారు. రేడియో కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతాబాద్
లోని యావర్ మంజిల్ అనే భవనంలోకి మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను
నిర్మించారు. నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా నెలకొల్పారు.
దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక ప్రాంతాలకు
కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని లండన్ పంపించి
బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఎంతటి
శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.
తరువాతి
రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి
శ్రోతల నుంచి విశేషమైన ఆదరణ లభించడం అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్, హీరా బాయ్ బరడేకర్, ఆవిడ సోదరి సరస్వతీ రాణే వంటి
సుప్రసిద్ధ సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ
సంగీత కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్
రేడియోలో ప్రోగ్రాములు ఇచ్చారు.
తోకటపా:
డెక్కన్ రేడియో స్టేషన్ ఫోటో కోసం చేసిన ప్రయత్నం వృధా అయింది. నేను 1975లో రేడియోలో చేరినప్పుడు ఉన్న పాత భవనం
కూల్చి ఆ ప్రదేశంలో నూతన భవనంతోపాటు కొత్త స్టుడియోలను నిర్మించారు. ఆ భవనం ఫోటో
కూడా పదిలపర్చలేదు. ఇక నేను పుట్టని రోజుల నాటి డెక్కన్ రేడియో ఫోటో కోసం వెతకడం
అత్యాశే అనిపించి ఆ ప్రయత్నం మానుకున్నాను. ఇలాంటి సందర్భాలలో జంధ్యాల శంకర్ గారు
గుర్తు వస్తుంటారు. ఆయన విజయవాడ నగరానికి మేయరుగా పనిచేశారు. మా పెద్దన్నయ్య
పర్వతాల రావు గారికి మంచి సన్నిహితులు. ఆయన మేయరుగా ఉన్న సమయంలో విజయవాడలోని
కొన్ని పురాతన భవనాలను, చారిత్రక
ప్రదేశాలను ఫోటోలు తీసి భద్రపరిచే కార్యక్రమం చేపట్టారు. చేశారు కూడా. కాలక్రమంలో
ఆ భవనాలు నేలమట్టం అయ్యాయి. ఆయన తీయించి భద్రపరచిన ఫోటోలు కూడా, సరైన సంరక్షకులు లేక చెదలుపట్టి
పోయాయి. ఇప్పుడు ఆ చెదలు పట్టిన ఫోటోలు కూడా లేవు. జంధ్యాల శంకర్ గారి ప్రయత్నమంతా
బూడిదలో పోసిన పన్నీరు చందం అయింది.
(ఇంకా
వుంది)
2 కామెంట్‌లు:
అవునండి, ఏమీ అర్థం కాకపోయినా ఉర్దూ వార్తలు విన సొంపుగా ఉండేవి.
“వజీర్-యే-ఆలమ్” అన్న పదం ఒకటి (ప్రధాన మంత్రి అని అర్థం అనుకుంటాను) నాకిప్పటికీ బాగా గుర్తుండి పోయింది 🙂.
ఉర్దూ వార్తలు వింటే సొంపు కాదు వికారం కలుగుతుంది🤦.
కామెంట్‌ను పోస్ట్ చేయండి