తెలుగు తిథులు తోసుకువచ్చి, ఏడూడి, మొదటి ఆబ్దీకం మొదలైన మూడు రోజుల కార్యక్రమాలు అన్నీ పది రోజులు ముందుగానే పూర్తయ్యాయి. కానీ, గుర్తు వుండిపోయేది, గుండెలో నాటుకుని సెల వేసేది ఇంగ్లీష్ తేదీనే కదా!
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున అపోలో ఆసుపత్రి నుంచి డాక్టర్ బాబీ ఫోను. ‘అందరూ వచ్చేసేయండి’
అందరం ఎందుకు? అందులోనే వుంది. అర్ధం చేసుకోవాలి. అయినా ముందు రోజు ఆసుపత్రికి బయలుదేరుతుంటే, అక్కరలేదు, ఈ ఒక్క రాత్రి చూసి రేపు డిశ్చార్జ్ చేస్తారు అన్నారు. ఏమి చూశారో మరి ఆ రాత్రి.
వెళ్ళే సరికి మా చుట్టపక్కాలు, సంతోష్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే వున్నారు. అంటే చిట్టచివర్లో తెలిసింది నాకే అన్నమాట. నా గుండె తట్టుకుంటుందో లేదో అని భయం. నాకసలు గుండె లేదనీ, దాని స్థానంలో ఓ రాతి బండ వుందనీ వాళ్లకు ఏం తెలుసు? ఆరేళ్ల క్రితం ఇదే ఆసుపత్రిలో మా ఆవిడను అంబులెన్స్ నుంచి అలా లోపలకు తీసుకువెళ్ళారు. ఓపీలోనే చెప్పేశారు, బ్రాట్ డెడ్ అని. కాకపొతే అలా చెప్పడానికి గంట పైన తీసుకున్నారు. చావు కబురు నిదానంగా చెప్పాలి అనుకున్నారేమో! మరి అంతకు ముందు, ఏం లేదు మామూలు వైరల్ ఫీవర్, మూడు రోజులు డోలో వాడితే తగ్గిపోతుందని అన్నారు. మూడో రోజు ఆ మాత్రల అవసరమే లేకుండా పోయింది.
ఇక సంతోష్ విషయంలో ముందు రోజు అలా వెళ్లి చూసి, వెంటనే వచ్చేయండి అని జాగ్రత్తలు చెప్పి ఐ సీ యు లోకి పంపిన వాళ్ళు, ఈరోజు లోపల ఎంతసేపు వున్నా మాట్లాడలేదు. మొహానికి, వంటికి పెట్టిన పరికరాలు, తీగెలు తీసేస్తున్నారు. వాడేమో వళ్ళు ఎరగని విధంగా నిద్రపోతున్నట్టు పడి వున్నాడు మంచం మీద. నలభయ్ ఏడేళ్ల జీవితానికి తెర పడిపోయింది.
దేముడికి పునర్జన్మల మీద నమ్మకం వున్నట్టు లేదు. మరుసటి జన్మవరకు వేచి చూడకుండా ఎప్పటిశిక్షలు అప్పుడే, ఆ జీవితకాలంలోనే వేసేస్తాడులా వుంది. పెద్దవాళ్ళ కళ్ళ ముందే చిన్నవాళ్ళు పోవడాన్ని మించిన శిక్ష ఏముంటుంది?
04-02-2025