23, జులై 2022, శనివారం

“ట” మాయమైపోయింది – భండారు శ్రీనివాసరావు


నాలుగేళ్ల క్రితం ఒక రోజు.
AP 24 X 7 తెలుగు న్యూస్ ఛానల్ లో ఓ సోమవారం ఉదయం Morning Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో, రాజకీయ నాయకులు మాట మార్చడాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. గుర్తున్నంతవరకు నేను చెప్పిన విషయాల్లో కొన్ని: (సరిగ్గా ఇలాగే అని కాదు, ఓ మోస్తరుగా ఇలాగే)

“తెలుగు అక్షరమాలలో ‘ట’ అనే అక్షరం మాయమయిపోయినట్టుంది. అదివరకు ఏవైనా విన్నవి, అనుమానం వున్నవి చెప్పేటప్పుడు ‘అన్నాడుట’, ‘చెప్పాడుట’ అని అనేవారు. ఇప్పుడు అలాకాదు, ఎదురుగా వుండి తన చెవులతో విన్నట్టు, ‘అలా అన్నాడు, ఇలా చెప్పాడు’ అనేస్తున్నారు. ‘వెనక ఎన్టీ రామారావు గారు, కాంగ్రెస్ వాళ్ళు రాజ్యసభ సీటు అడిగితే కాదన్నారన్న కినుకతో ఏకంగా తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టాడుట తెలుసా’ అని చెప్పుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ‘ట’ తీసేసి మాట్లాడుతున్నారు. దీనివల్ల మీడియా పని కూడా తేలిక అయింది. ప్రయాస పడి, సోర్సులను పట్టుకుని వార్తను కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పని లేదు. అసలు వాళ్ళే నేరుగా మీడియాకు, అదీ కెమెరాల ముందు నిలబడిమరీ చెప్పేస్తున్నారు. ‘హోదా కావాలని చెప్పగలరు, అదే నోటితో హోదా కావాలని ఎప్పుడు అన్నామో చెప్పండి’ అంటూ మీడియానే ఎదురు ప్రశ్న వేయగలరు. రాజ్యసభ సీటు ఇస్తానని మోసం చేశారని ఎవరో అన్నట్టు ఇంకెవరో చెప్పడం కాదాయె. స్వయంగా నాయకులే చెబుతున్నారు. టీవీ చర్చల్లో తమ నాయకుల వ్యాఖ్యలని సమర్ధించలేక ఇబ్బంది పడే పార్టీ ప్రతినిధులను మనం రోజూ చూస్తూనే వున్నాం.
“నేను మూడేళ్ళ నుంచీ మీడియా చర్చల్లో ఒకటే చెబుతూ వస్తున్నాను. హోదా విషయంలో వైఖరులు మార్చి మాట్లాడకండి. ఇప్పటివరకు అది భావోద్వేగ అంశం కాలేదు. ఒకసారి అలా రూపం మార్చుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఉదాహరణ తెలంగాణా ఉద్యమం. లక్ష కోట్ల ప్యాకేజీ ఇస్తానన్నా ఒప్పుకోలేదు. తెలంగాణా తెచ్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు ప్రభ వెలిగిపోతున్నరోజుల్లోనే, అంటే మొదట్లోనే ‘హోదా అనేది మారిన పరిస్తితుల్లో సాధ్యం కాదు, ప్రత్యామ్న్నాయం చూస్తాము’ అని వుంటే ప్రజలు ఎవరెన్ని చెప్పినా వారి మాటనే నమ్మేవారు. అప్పుడేమో ప్రతివారూ హోదా తధ్యం అన్నట్టు మాట్లాడారు. తరువాత కుదరదన్నారు. హోదా అనేది ఇంకా భావోద్యోగ అంశంగా రూపాంతరం చెందలేదు కానీ, ఆయా పార్టీల వైఖరి ఈ అంశంపై రూపాంతరం చెందుతూ వుండడం ప్రజలు గమనిస్తున్నారు. ప్రస్తుతానికి నాయకులు మాత్రం ఈ అంశాన్నే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.
“వెనక బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో పట్టుకుంటే లక్ష అనో పదివేలనో ఒక సినిమా వచ్చింది. ఒక చిన్న పాప ఆడుకునే బొమ్మలో లక్షలు ఖరీదు చేసే వజ్రాలు దాస్తారు. అది చేతులు మారుతుంటుంది. కానీ విషయం తెలియక ఎవరూ ఆ బొమ్మను సీరియస్ గా తీసుకోరు. ఒకసారి వజ్రాలు ఎక్కడ వున్నాయో తెలియగానే అందరూ ఆ బొమ్మ వేటలో పడతారు. ఇప్పడు హోదా వ్యవహారం కూడా ఆ బొమ్మ మాదిరిగానే తయారయింది. ఎన్నికల వైతరణి దాటాలంటే హోదా అస్త్రం ఒక్కటే శరణ్యం అని అనుకుని అన్ని పార్టీలు హోదా మంత్రం మొదలు పెట్టాయి”
“చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు సార్లు కరక్టు టైము చూపిస్తుంది. ఆ మాదిరిగా రాజకీయం కోసం రాజకీయం చేయండి. పార్టీలుగా మీకు ఎలాగూ మాటలు మార్చక తప్పదు. అయితే కనీసం కొంతయినా ప్రజలకోసం మాట్లాడండి. అన్ని పార్టీలకి నా విజ్ఞప్తి ఇదే”

నాలుగేళ్ల క్రితం కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడే చాన్స్ ఇచ్చారు.
ఇప్పుడా! నో చాన్స్! నో వే!

తోకటపా: తన తల్లి ఇందిరాగాంధి మరణ వార్తని ధ్రువ పరచుకోవడానికి రాజీవ్ గాంధి బీబీసీ వార్తలు విన్నారు. ఈ రోజుల్లో ఏదైనా వార్తని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏ ఛానల్ చూడాలి?

కామెంట్‌లు లేవు: