24, జులై 2022, ఆదివారం

లోకం చుడుతున్న వీరుడు రాజేష్ వేమూరి

 

వేమూరి రాజేష్ గారిని నేను ఇంతవరకు చూడలేదు. కానీ నేను చూడాలని బలంగా కోరుకున్న వ్యక్తుల్లో రాజేష్ ఒకరు.

రాజేష్ వేమూరి అనే పేరు వినగానే నాకు అల్లసాని పెద్దన విరచిత స్వారోచిత మనుసంభవం అనే మనుచరిత్ర  కావ్యంలోని ప్రవరుడు, మహాకవి ధూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం గుర్తుకు వస్తాయి.

ప్రవరాఖ్యుడి గురించి ఖమ్మం కాలేజీలో మా తెలుగు లెక్చరర్ ఆదినారాయణ గారు చెప్పేవారు.

అరుణాస్పదపురం అనే  ఓ మారుమూల కుగ్రామంలో కాపురం చేసుకుంటూ, తలితండ్రులను పోషించుకుంటూ త్రికాల సంధ్యాదులు సక్రమంగా క్రమంతప్పకుండా  నిర్వర్తించుకుంటూ కాలం గడిపే ఓ శోత్రియ శ్రేష్టుడు ప్రవరుడు.  అతడికి తన ఇల్లే కైలాసం. ఊరు దాటి ఎరుగడు. కానీ లోకం చూడాలనే కోరిక. పొలిమేర దాటలేని ఆశక్తత. అంచేత ఊరిలోకి ఏ కొత్త వ్యక్తి వచ్చినా ఇంటికి పిలిచి ఆతిధ్యం ఇచ్చేవాడు. అతిథి మర్యాదల అనంతరం తాను చూడాలని అనుకుని చూడలేని ప్రదేశాల విశేషాలు వారినుంచి వింటూ తృప్తి పడేవాడు. ఈ క్రమంలో యువకుడు అయిన ఓ యువ సిద్ధుడు తటస్థ పడడం, పరాయి ప్రదేశాలను గురించి అతడు చెప్పిన సంగతులు వింటూ, ఇంత చిన్న వయస్సులో అన్ని ప్రాంతాలు ఎలా తిరిగాడని అబ్బుర పడడం,  సరే ఈ కధ ఇంతవరకే చెప్పుకుందాం. తర్వాత కధ తెలియని వాళ్ళు వుండరు.

ఇదెందుకు చెప్పాను అంటే, ఈ కావ్యంలోని ప్రవరుడి వంటి వారు అనేకమంది ఈ నాటికీ వుంటారు. దేశాలు చుట్టి రావాలని వారికి  వుంటుంది, కానీ అందుకు అనేక అవరోధాలు. అంచేత రాజేష్ వంటి వారు దేశాలు చుట్టి రాసే పుస్తకాలు చదివి,  సంతోషించడం. ఇంత చిన్న వయస్సులో ఇన్ని దేశాలు ఎలా తిరిగారని ఆశ్చర్యపడడం.

మనుచరిత్రలోని  సిద్ధుడి వద్ద, అనుకున్నదే తడవుగా  లోకాలు చుట్టి రావడానికి పాదలేపనం అనే దివ్యమైన పసరు  వుంది.  మరి రాజేష్ దగ్గర ఏముంది. తిరగాలనే ఆకాంక్ష వుంది. దాన్ని నెరవేర్చుకునే పట్టుదల వుంది. పట్టుదలకు తగ్గట్టు సహకరించే భార్య భార్గవి వున్నారు. పోదాం పద డాడీ అంటూ  సంచి సర్దుకుని, నేనూ రెడీ అనే   చిన్నారి హన్ష్ ప్రోద్బలం వుంది. అన్నింటికీ మించి రకరకాల దేశాలు చూడాలి, అక్కడి ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ జీవన విధానాలు తెలుసుకోవాలి అనే బలమైన కోరిక వుంది. విశాలమైన హృదయం వుంది. ఏతావాతా జరిగింది ఏమిటి అంటే ఇరవై రెండు దేశాల వీసా స్టాంపులు వాళ్ళ పాసుపోర్టుల్లో భద్రంగా వున్నాయి. కాణీ ఖర్చులేకుండా మనల్ని కూడా ఆ పుస్తకాల ద్వారా ఆ దేశాలు  తిప్పారు. ఈ పుణ్యం ఎక్కడికి పోతుంది చెప్పండి. ముందు ముందు మరిన్ని దేశాలు తిరుగుతారు. మరిన్ని పుస్తకాలు రాస్తారు. మనమూ  వాటిని చదువుతూ వారితో పాటు ఆయా దేశాలు ఉత్తపుణ్యానికి చదువుతాము. ఉభయతారకం అన్నమాట.

ఇంతకీ దూర్జటి పద్యం గురించి ప్రస్తావించారు కానీ ఆ ప్రసక్తి రాలేదేమిటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నాను. ముగింపు కోసం అట్టే పెట్టాను.

శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఆఖరి నూరో పద్యం ఇది.

“దంతంబుల్పడనప్పుడే తనవునం దారూడి యున్నప్పుడే

 కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే

విన్తల్మేన చరించనప్పుడే కురుల్వెల్ల గానప్పుడే చింతింపన్వలె

నీ పదాంబుజములన్ శ్రీ కాళ హస్తీశ్వరా!”

ప్రతిపదార్ధం అవసరం అనుకోను. 

తిరగగలిగిన వయసులో తిరగకుండా, తిరగాలనే  కోరిక ఉన్నప్పటికీ   తిరగలేని అశక్తత కలిగిన మా వంటి వారి గురించే ఆ పద్యం రాసారని అనిపించింది.

అయినా భక్త గోపన్న అన్నట్టు, తక్కువేమి మనకు, రాజేష్ పుస్తకం చేత వున్నవరకు.



3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మంచి కాలక్షేపమే (ట్రావెల్ పుస్తకాలు చదవడం).

హైదరాబాదుకు చెందిన పరవస్తు లోకేశ్వర్ అనే వ్యక్తి “సిల్క్ రూట్‌లో సాహసయాత్ర” అని తన యాత్రా విశేషాలు వ్రాసారు (ట) (నేనింకా చదవలేదు). ఆ పుస్తకం గురించి “కినిగె” లో చూడవచ్చు / దొరుకుతుంది(ట) 👇.

https://kinige.com/book/Silk+Route+lo+Saahasa+Yaatra

అజ్ఞాత చెప్పారు...

సిల్క్ రూట్ లో సాహసయాత్ర చాల మంచి పుస్తకం . అది కూడా తక్కువ ఖర్చు తో చేయడం, భవిష్యత్తు లో చేయాలనుకునే వాళ్లకి ఒక మ్యాప్ లాంటిది .

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అజ్ఞాత గారికి, విన్నకోట వారికి : పరవస్తు గారి సిల్క్ రూటు పుస్తకం నా దగ్గర వుంది. గతంలో ఈ పుస్తకం గురించి రాశాను. అలాగే పాద యాత్రీకుడు ఎం. ఆదినారాయణ గారి పుస్తకాలు గురించి కూడా బ్లాగులో రాశాను ధన్యవాదాలు