‘లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో’ అని వెనక ఓ సినిమాలో డైలాగ్ వుంది.
అలాగే
రేడియో విలేకరిగా ఓ వెలుగు వెలుగుతున్న ఓ పాత
భూతకాలంలో, ఘనత వహించిన ఓ ఎంపీ గారు నన్నొక పని అడిగారు. తలచుకుంటే ఆయనకది చిటికలో పని. ఆయనకు పని పడింది
రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగి పని. ఆ ఉద్యోగికి జరూరుగా బదిలీ కావాలి. అదీ
రాష్ట్రానికి కడగొట్టున వున్న పొరుగు రాష్ట్రపు సరిహద్దు ప్రాంతానికి.
నాకది
చాలా చిన్న పని అనిపించింది. చూస్తూ చూస్తూ అంత దూరం బదిలీ కోరేవారు ఎవరుంటారు?
కాబట్టి అడగాలే కాని ఎవరైనా చేస్తారు అని ఏకంగా ఆ సంబంధిత మంత్రి దగ్గరికే వెళ్లి
చీటీ ఇచ్చాను. ఆయనతో నాకు చాలా కాలంగా మంచి స్నేహమే వుంది. అడగక అడగక అడిగాను కాబట్టి వెంటనే పని అవుతుంది అనుకున్నా.
నేరుగా
సచివాలయానికి వెళ్లి అడిగా.
‘ఈ
ఉద్యోగి నీకు తెలుసా!’ అని మంత్రి అడిగారు.
‘నాకు అతడి
ముక్కూ మొగం తెలియదు. కానీ మీ వంటి సన్నిహితుడే నన్ను ఈ ఫేవర్ అడిగారు. అందుకనే
వచ్చాను’
‘సరే!
నీ స్కూటర్ ఇక్కడే పెట్టు. రేపు తీసుకు పోదువు కానీ. ఈరోజు నాతొ రా. మళ్ళీ నా
కార్లో నిన్ను ఇంట్లో దింపుతాను’
ఆయన
కార్లోనే ఆయన ఇంటికి వెళ్లాను. మంత్రిగారు లోపలకి వెళ్లి తయారై వచ్చారు. ఇద్దరం
ఆయన పోర్టికో పైన వున్న బాల్కానీ వంటి దానిపై వేసిన కుర్చీల్లో కూర్చున్నాము.
అప్పుడు
ఆయన నాకు చేసిన పొలిటికల్ లాయల్టీ అనే భగవద్గీత ఇది.
‘శ్రీనివాస్.
నీకు అర్ధం కాదు కానీ మాకు లాయల్టీ చాలా ముఖ్యం. ఏదైనా పనిచేస్తే డబ్బు తీసుకుని
పనులు చేస్తామనే నింద మాపై వుంది. అది పూర్తిగా నిజం కాదు, అలాగని అబద్ధం కాదు. నువ్వు అడిగిన
బదిలీకి లక్షకు తక్కువ కాదు. నీకు అతడి
ముక్కూ మొహం తెలియదు. ఇతడి గురించి నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు లెటర్లు ఇచ్చారు. నువ్వు
చెప్పిన ఎంపీ కూడా వారిలో వున్నాడు. ఎంక్వైరీ చేస్తే అతడు మంచి సంపాదనపరుడు అని
తెలిసింది. హైదరాబాదు నుంచి ఆదిలాబాదు
జిల్లా చివరకి ఎవరూ బదిలీ కోరుకోరు. బార్డర్ ఏరియాలో వారి సంపాదన రోజుకు వేలల్లో
వుంటుంది. అదంతా వారికి దక్కదు. కింద
నుంచి పై దాకా పంపకాలు వుంటాయి. అంచేత మా
ఎమ్మెల్యేలు చెప్పినా నేను పట్టించుకోలేదు.
‘ఈ
సంగతులు ఏవీ నీకు తెలియదన్నసంగతి నాకు సాయంత్రమే అర్ధం అయింది. అందుకే
మాట్లాడడానికి ఇంటికి రమ్మన్నాను.
‘ఇప్పుడు
అసలు విషయం చెబుతా విను. అంతమంది చెప్పినా నేను చేయలేదు కదా! అందుకే నిన్ను పట్టుకున్నాడు, అదీ వేరే వారి ద్వారా. నువ్వు
ఇన్నేళ్ళ పరిచయంలో ఎన్నడూ ఏదీ అడగలేదు. అందుకే ఆ ఫైల్ కూడా తీసుకువచ్చాను. నువ్వు
నేను చెప్పిన దానికి అవును అంటే అతడిని
అతడు అడిగిన చోటుకు బదిలీ చేస్తూ ఇప్పుడే ఇక్కడే సంతకం చేస్తాను. రేపే ఆర్డర్
ఇస్తాను. కానీ ముందు ఒక మాట చెప్పు. నా మాట ఒకటి విను. రేపటి నుంచి అతగాడు అందరితో
చెబుతాడు. మంత్రి కాదన్నా నా పని నేను చేసుకోగలిగాను. ఆయన నాకో లెక్కా అన్నట్టు
తోటివారితో చెబుతాడు. డిపార్ట్ మెంటులో క్రమశిక్షణ దెబ్బతింటుంది. పోనీ నీకన్నా
లాయల్ గా ఉంటాడా అంటే అదీ లేదు. అతడెవరో కూడా నీకు తెలియదు. ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం’
నాకు
విషయం పూర్తిగా అర్ధం అయింది.
వెంటనే
చెప్పాను.
‘ముందా
ఫైల్ మీ ముందు నుంచి తీసేయండి. వేరే
విషయాలు ఏవైనా మాట్లాడుకుందాం!’
కాసేపు
సాయంకాలక్షేపం చేసి ఆయన కారులో ఇంటికి చేరాను.
వచ్చిన
తర్వాత ఆయన అన్న ఒక మాట అర్ధం బోధ పడలేదు.
‘నీకైనా
లాయల్ గా ఉంటాడా!’
లాయల్
గా వుండడం అంటే ఏమిటి!
ఏమిటైతే
నాకెందుకు! నాకు అవసరం లేని వ్యవహారం.
1 కామెంట్:
ఇలాంటి పైరవీలు సిఫార్సులు చేయడం సరైన పనేనా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి