ఆత్మీయ కలయికలకు కరోనా మూడేళ్లు ముకుతాడు వేసింది. ఇప్పుడిప్పుడే నలుగుర్ని కలుసుకోవడాలు, ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్ళడాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మూడేళ్ళుగా ముఖాముఖి కలవని రాయపాటి సాంబశివరావు గారిని నిన్న చూడడం జరిగింది.
మొన్న
రాత్రి, జ్వాలా ఇంట్లో రాయపాటి ప్రసక్తి వచ్చింది. ఆయన ఎక్కడ వున్నారో తెలుసుకోవాలని జ్వాలా వెంటనే
ఫోన్ చేశాడు. హైదరాబాదులోనే వున్నట్టు
తెలిసి, చూడడానికి వస్తామని అంటే, మీరు ఎందుకు రావడం మీ
ఇంటికి రేపు రాత్రి నేనే వస్తాను
అన్నారాయన. అన్నట్టే వచ్చారు. తెల్లటి అంగీ, తెల్లటి లుంగీ. 78 ఏళ్ళ వయస్సు అన్న విషయం పైకి తెలియక
పోయినా (నాకంటే
ఏడాది, జ్వాలా కన్నా రెండేళ్లు
పెద్ద) ఈ మధ్య చేసిన సుస్తీల కారణంగా
ఆరోగ్య రీత్యా నియమబద్ధమైన జీవితం గడుపుతున్నానని చెప్పారు.
నన్ను
చూడగానే మనిద్దరిదీ ఇప్పుడు ఒకే పడవ
అన్నారు. (వారి శ్రీమతి చనిపోయిన రెండేళ్లకే మా ఆవిడ కూడా చనిపోయింది)
రాయపాటి
గారికి మా మేనకోడలు, జ్వాలా భార్య విజయలక్ష్మి పెట్టే ఆవకాయ కారాలు బాగా ఇష్టం. బహుశా ఆయన మా
ఇళ్ళ నుంచి అడిగి మరీ తీసుకువెళ్ళేవి ఈ కారాలు ఒక్కటే. మా ఆవిడ బతికున్న రోజుల్లో
ఆయన ఎప్పుడు హైదరాబాదు వచ్చినా దోసావకాయ కారం అడిగి చేయించుకుని తీసుకువెళ్ళే
వారు. మాస్కోలో ఇక సరేసరి. ఆయన వ్యాపారపు పనుల మీద ఎప్పుడు వచ్చినా, ఎన్నాళ్ళు వున్నా, ఎక్కడ బస చేసినా
రాత్రి భోజనం మా ఇంట్లోనే. కారాలు,
పచ్చళ్ళు అంటే ఆయనకు అంత ఇష్టం. మాస్కోలో మా అన్నదాత అని బాహాటంగా చెప్పడం మాకు
ఇబ్బందిగా అనిపించేది.
రాయపాటి
గారితో జ్వాలా కుటుంబానికి, మా
కుటుంబానికి స్నేహం దశాబ్దాలుగా సాగుతోంది. ఎక్కడ ఏ యాగం తలపెట్టినా మా కుటుంబాలను
గుర్తు పెట్టుకుని తీసుకు వెళ్ళేవారు. అలాగే తిరుపతి, షిర్డీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు
కూడా.
ఆయన
రాజకీయాలు,
వ్యాపారాలు మా స్నేహాలకు, పరిచయాలకు ఏనాడు
అడ్డం రాలేదు. వాటి ప్రసక్తి కూడా మా మధ్య మాటల్లో వచ్చేది కాదు. జ్వాలా పిల్లల పెళ్ళిళ్ళకే కాదు, మనుమడి ఉపనయనానికి కూడా వచ్చారు.
మా
మేనకోడలు కొసరి కొసరి వడ్డించింది. మిగిలిన అధరవులు పక్కనపెట్టి, ఆవకాయ, మెంతికాయ, మాగాయ, వెల్లుల్లి ఆవకాయ, నీళ్ళావకాయలతోనే
భోజనం ముగించారు. ముఖ్యంగా నూనె లేని నీళ్ళావకాయ కారం ఆయనకు బాగా నచ్చింది. జ్వాలా భార్య విజయలక్ష్మి ఆ కారాన్ని ప్యాక్ చేసి
ఇచ్చింది. జ్వాలా కూడా కరోనా కాలంలో తాను రామాయణ, భారతాలపై రాసిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలను బహుకరించాడు.
వెడుతూ
వెడుతూ ఆయన ఎప్పుడూ అనే మాటే అన్నారు.
‘అన్నదాతా!
సుఖీభవ!’
(30-05-2022)
4 కామెంట్లు:
Sorry, this is irrelavant to this post. I remember DJ Tillu Director is your cousin.
I read below news in Greatandhra, is this true ?.
//చిన్నప్పుడు సినిమా పిచ్చితో ఇల్లు వదిలి పారిపోయిన శ్రావణ్ అనే మిత్రున్ని చాలా కాలం ఇంట్లో పెట్టుకుని ఆదరించారు. అప్పుడు ఆయన వయసు 10 ఏళ్లు. జ్ఞాపకంగా తన పిల్లలకి కృష్ణ అనే పేరు ఉండేలా పెట్టుకున్నాడు. డిజెటిల్లు దర్శకుడు విమల్‌కృష్ణ, శ్రావణ్ కుమారుడే. విమల్ కృష్ణ సక్సెస్ వెనుక కృష్ణ దంపతుల ఆశీర్వాదాలున్నాయి. ఆ రోజు శ్రావణ్‌ని వాళ్లు ఆదరించకపోతే మద్రాస్ మహానగరంలో ఏమయ్యో వాడో? //
మీ పాత పోస్ట్ ఇప్పుడే చూసాను, అది కరెక్ట్ . మీ మేనల్లుడు శ్రవణ్ మూడు నెలలు కృష్ణ గారి ఇంట్లో ఉండటం నిజంగా ఆశ్చర్యం . అంతే కాదు కృష్ణ గారు ఆదరించడం నిజంగా అభినందనీయులు .
ఐతే ఆంధ్రా విజయ్ మాల్యా గారికి మీరు అత్యంత అప్తులన్న మాట. పోలిక సరి కాదంటే-you've every right to condemn, revered sir.
మొదటి ఇద్దరు అజ్ఞాతలకి ధన్యవాదాలు : ఇది కూడా చిత్తగించండి : "12-04-2015 తేదీ ఆంద్రజ్యోతి, దినపత్రిక 'ఆదివారం పుస్తకం'లో 'స్పందన' శీర్షిక కింద 'దారి చూపిన దేవుడు' అనే పేరుతొ (30 వ పేజీ) సినీ నటుడు కృష్ణ గురించి మా మేనల్లుడు పింగిలి శ్రవణ్ కుమార్ (అచ్చులో శ్రావణ్ అని పడింది) రాసిన ఓ కధనం ప్రచురించారు. 1971 నాటి వృత్తాంతం అది. చిన్న వయస్సులో ఇంటి నుంచి (మానుకోట - మానుకొండ అని అచ్చయింది) పారిపోయి మద్రాసులో కృష్ణ - విజయనిర్మల ఇంట్లో కొన్ని నెలలు తలదాచుకోవడం, తిరిగివచ్చిన తరువాత తదనంతర కాలంలో ఆ పిల్లవాడే ప్రభుత్వ భీమా కంపెనీలో ఓ పెద్ద ఆఫీసరు కావడం - అంతా ఓ సినిమా కధలా నడిచిపోయింది. ఈ ఉదంతం సుఖాంతం కావడంలో 'ఆంధ్రజ్యోతి'కి కూడా కొంత పాత్ర వుంది. అది తెలియచెప్పాలనే ఈ లేఖ. ఆ రోజుల్లో నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. సీ.బీ.ఐ. డైరెక్టర్ గా పనిచేసిన కే.విజయరామారావు గారు కృష్ణా ఎస్పీ. వారిని కలిసి 'మిస్సింగ్ అప్లికేషన్' ఇచ్చాము. ఆంద్రజ్యోతిలో పిల్లవాడి ఫోటోతో ఒక ప్రకటన ఇచ్చాము. (కింది ఫోటో అప్పటిదే) మూడున్నర మాసాలు శ్రవణ్ మద్రాసులో కృష్ణ గారింట్లోనే వున్నాడు. కళా దర్శకుడు రామలింగేశ్వర రావు గారి తల్లి తెనాలి వెళ్ళినప్పుడు ఆంద్రజ్యోతిలో ఫోటో చూసి కృష్ణ గారింట్లో ఉంటున్న శ్రవణ్ పోలికలను గుర్తుపట్టి మాకు కబురు పెట్టారు. మా బావగారు వాళ్ళు మద్రాసు వెళ్లి పిల్లవాడిని తీసుకువచ్చారు. 'బాగా చదువుకో, ఆ తరువాతే సినిమాలు' అని కృష్ణ గారు ఇచ్చిన సలహాని మావాడు తుచ తప్పకుండా పాటించాడు. బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు. ఈ నేపధ్యంలో - కృష్ణగారి గురించి ఆంద్రజ్యోతిలో మా మేనల్లుడు శ్రవణ్ రాసిన వ్యాసంలో ముగింపు వాక్యాలు - "కృష్ణ గారిని రోజూ నేను తలచుకుంటూనే ఉంటాను. ఎంతలా అంటే - నా కొడుకు పేరు 'విమల్ కృష్ణ, నా కూతురు పేరు 'రమ్య కృష్ణ' - మా కుటుంబంలో చాలామందికి నచ్చాయి.
ఆ విమల్ కృష్ణ పెరిగి పెద్దయి, బీ టెక్ పాసయి కూడా ఉద్యోగాల జోలికి పోకుండా సినిమాల మీద మక్కువ పెంచుకుని అదే ధ్యాసలో ఉంటూ తనను తాను నిరూపించుకునే డీ జె టెల్లు సినిమా డైరెక్ట్ చేసి మంచి విజయం సాధించాడు. ఒకప్పుడు వాళ్ళ నాన్న పెంచుకున్న కోరికను ఈ విధంగా తీర్చాడు
కామెంట్‌ను పోస్ట్ చేయండి