31, జనవరి 2022, సోమవారం

నర్సరీ రాజ్యానికి రారాజు పల్ల వెంకన్న

 

పుస్తకం విలువ దానిని కొన్నప్పుడు పెరుగుతుంది అనేది నా నమ్మకం. నా నమ్మకంతో నిమిత్తం లేకుండా కొన్ని పుస్తకాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయి. అలా అని వాటి విలువ తక్కువేమీ కాదు. రచయిత సంతకం చేసి ఇచ్చిన పుస్తకం మరెంతో ప్రియమైనది. అలాంటిది రచయితే స్వయంగా వచ్చి ఇస్తే ఇక దానికి విలువకట్ట తరమా!

జీ. వల్లీశ్వర్ జగమెరిగిన జర్నలిస్టు. బహు గ్రంధ రచయిత కూడా. అమూల్యమైన ఇంగ్లీష్ పుస్తకాలను అలవోకగా అనువదించిన ఘనత ఆయన ఖాతాలో వుంది.

రాత్రి ఫోన్ చేసి ‘ఇంట్లో వున్నారా!’ అని అడిగారు. ‘కరోనా కాలంలో ఇంట్లోనే కదా!’ అన్నాను.

‘అయితే ఓ అయిదు నిమిషాల్లో వచ్చి, రెండు నిమిషాలు వుండి వెడతాను. మీకో పుస్తకం ఇవ్వాలి’ అన్నారు.

‘మీ రాక సంతోషం. పుస్తక సమేతంగా రాక మరింత సంతోషం’ అన్నాను.

అన్నట్టే వచ్చారు. అన్నట్టే పుస్తకం ఇచ్చారు. అన్నట్టే రెండు నిమిషాలు వుండి వెళ్ళిపోయారు. ఈ కొద్ది సమయంలో ఒక ఫోటో కూడా దిగాము. ఆ పుస్తకమే:

‘నర్సరీ రాజ్యానికి రారాజు పల్ల వెంకన్న’

పూలు, పండ్ల మొక్కల పెంపకానికి వల్లీశ్వర్ ఇచ్చిన ప్రాధాన్యత ఈ టైటిల్ లో కనబడింది.

నర్సరీని సామ్రాజ్యంగా అభివర్ణించి పల్ల వెంకన్నను దానికి రారాజును చేసేశారు.

చాలామంది చాలామందిని గురించి పుస్తకాలు రాస్తారు. కొన్ని చదివిన తర్వాత పుస్తకాలు రాయదగ్గ గొప్పతనం ఏముంది వీరిలో అనిపిస్తుంది.

పల్ల వెంకన్న గురించి వల్లీశ్వర్ రాసిన ఈ పుస్తకం చదివిన తర్వాత ఈయన గురించి ఇంత మంచి పుస్తకం ఇంతదాకా  ఎందుకు రాలేదు అనిపించింది.

పూల మొక్కల్ని పెంచేవారికి ఆ పూలంత మృదువైన మనసు వుంటుంది. వెంకన్న గారికి ఈ వెన్నలాంటి మనసు బోలెడు వుంది.

పూల మొక్కలు, పండ్ల మొక్కలు అనగానే తటాలున గుర్తొచ్చే పేరు కడియం. ఆ కడియం పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు పల్ల వెంకన్న. కృషి వుంటే అనే పాటకు పల్లవి లాంటి మనిషి పల్ల వెంకన్న. పోలియోతో చిన్నతనంలోనే రెండు కాళ్ళు చచ్చుపడ్డా, ఆయనలోని పట్టుదల చచ్చుపడలేదు. మొక్కవోని ఆత్మ విశ్వాసంతో మొక్కలనే  ఆయన తన ప్రపంచం చేసుకున్నారు. మొత్తం ప్రపంచం దృష్టి తనవైపు మళ్లేటట్టు ఆరుగాలం శ్రమించి, వంద ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద నర్సరీని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేశారు. వెంకన్న గారి విజయ రహస్యం వల్లీశ్వర్ మాటల్లో, అదీ ఒక్క ముక్కలో:

“ఆయన (పల్ల వెంకన్న) ఒళ్ళొంచి పని చేస్తాడు, ఒళ్ళొంగని వాళ్ళ చేతకూడా పనిచేయిస్తాడు”

ప్రచురణ: ఎమెస్కో  మూల్యం : రు. 175/-  

ఇలాంటి వ్యక్తి గురించి పుస్తకం రాసి వల్లీశ్వర్ ధన్యులు అయ్యారు. ఈ పుస్తకాన్ని అందంగా అతి ఖరీదైన కాగితం మీద ముద్రించి ఎమెస్కో వారు ధన్యులు అయ్యారు.






(31-01-2022)

విసుగు

 శంకరపాదానికి జీవితం మీద విసుగు పుట్టింది. ఏవిటీ జీవితం? తినడం, తొంగోడం, తోచకపోతే ఫేస్ బుక్ లోకి తొంగి చూడ్డం ఇంతేనా జీవిత పరమార్ధం ?

సర్వస్వం త్యజించి అడవుల్లోకి వెళ్లాడు. కిందంతా పచ్చటి పచ్చిక. పట్టు తివాచీ పరచినట్టు వుంది. పక్కన, ఆకాశం అంతు చూడాలన్నట్టు పొడవుగా పెరిగిన వెదురు చెట్లు. దూరంగా ఎవరో కనిపించారు. దగ్గరగా వెళ్ళి అడిగాడు ఎవరు నువ్వని. 'నేనా! ఈ సృష్టి కర్తను. ఆ చెట్టూ ఈ పుట్టా అన్నీ నేనే సృష్టించాను. ఇంతెందుకు నువ్వూ నీ జాతి మనుషులు అంతా మయాసృష్టం!' 'అలానా! సంతోషం. వెదకపోయిన తీగె కాలికి తగిలింది. ఇప్పుడు చెప్పు. ఇంత విసుగు కలిగించే జీవితాన్ని నాకు యెందుకు ప్రసాదించావు?' 'పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు. నిండు నూరేళ్ళ జీవితం ముందే వుంది. అప్పుడే నీకు బతుకు మీద రోత పుట్టిందా! దాన్ని వొదిలిపెట్టి పోవాలన్న కోరిక కలిగిందా!' '.....................' 'అటు చూడు. ఆ పచ్చిక యెంత బాగుందో. ఇటు చూడు ఈ వెదురు వృక్షాలు యెలా యెంత ఎత్తు పెరిగాయో! నీకొక విషయం చెబుతా శ్రద్ధగా విను. కొన్ని సంవత్సరాల కిందట నేనే స్వయంగా ఈ గరిక విత్తనాల్ని, ఈ వెదురు విత్తనాల్ని ఒకే రోజు నాటాను. నారుపోసిన వాడిని కదా! నీరు కూడా పోశాను. ‘చిత్రం మరునాడే గరిక మొక్క నేలతల్లిని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. వెదురు విత్తనం ఏమైందో తెలియదు. గరిక మాత్రం ఏపుగా పాకి పచ్చగా అడవి నేలనంతా మనోహరంగా పరచుకుంది. ఏడాది గడిచింది. రెండేళ్లు గడిచాయి. మూడో ఏడు దాటినా వెదురు విత్తనం మొలకెత్తే సూచన కానరాలేదు. అయినా నేను నిరాశ పడలేదు. నాపని వొదిలిపెట్టలేదు. మొలవకపోయినా వెదురు విత్తనం నాటిన చోట నీళ్ళు పోస్తూనే పోయాను. నాలుగో ఏడు కూడా గడిచింది. ఐదో ఏట బహు చిత్రంగా అక్కడ ఓ చిన్న ఆకు అపచ్చని మొలక బయటకు వచ్చింది. ఆరునెలలు గడిచాయో లేదో బారెడు పెరిగింది. ఏడాది తిరిగేసరికల్లా అడవిలో చెట్లకు రాజల్లే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. ఇంత ఎత్తు పెరగాలి కాబట్టే అంత లోతుకు వేళ్ళూనుకోవాలి. కాబట్టే, అంతవరకూ వెదురు మొక్క వెలుగు చూడలేదు. 'ఈ నా సృష్టిలో వృధా అంటూ ఏమీ లేదు. ప్రతి దానికీ ఒక పరమార్ధం వుంది. విసుగుపుట్టి వొదిలేస్తే వొరిగేది ఏమీ వుండదు. నీకంటూ ఓ కర్తవ్యం నిర్దేశించి వుంది. అది పూర్తిచేసేవరకు విసుగును దూరంగా వుంచు' శంకరపాదానికి జ్ఞానోదయం కాగానే సృష్టికర్త అదృశ్యం అయిపోయాడు. కధ కంచికి. మనం ఎఫ్ బీ లోకి.

30, జనవరి 2022, ఆదివారం

మీడియాకు దూరంగా .... భండారు శ్రీనివాసరావు

 నేను పత్రికలు, చదవను, టీవీ చర్చలు చూడను” అని ఓ మిత్రుడు వాట్స్ అప్ సందేశం పంపాడు. నిజానికి ఈ మాటను ఒకప్పుడు మన దేశానికి ప్రధాన మంత్రిగా స్వల్పకాలం పనిచేసిన చరణ్ సింగ్ ఎప్పుడో చెప్పారు. కాకపొతే అప్పటికి ఈ టీవీలు లేవు. అంచేత ఆయన ఇలా అన్నారు.

నేను పేపర్లు చదవను, రేడియో వినను. అదే నా ఆరోగ్య రహస్యం”

సరే అదలా వుంచి మా వాట్సప్ మిత్రుడి గురించి చెప్పుకుందాం.

టీవీలు, చూడకపోవడానికి, పత్రికలు చదవక పోవడానికి ఆయన చెప్పిన కారణం విచిత్రంగా వుంది. తనకు వచ్చిన ఓ మెసేజ్ తననీ నిర్ణయానికి ప్రొద్బలపరచిందని చెప్పాడు. నిజానికి ఈ సందేశం ఇప్పటికే చాలా సార్లు చాలా మందికి చేరిపోయింది కూడా.

అదేమిటంటే, Nathan Zohner అనే పెద్దమనిషి, తనకు తెలిసిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఇతరుల అజ్ఞానాన్ని అవహేళన చేయడానికి ప్రయోగిస్తుంటాడు. ‘డైహైడ్రోజన్ మోనాక్సైడ్ (diyhydrogen monoxide) అనేది చాలా ప్రమాదకరం అని, దాన్ని తక్షణం నిషేధించాలని ఆయన చెబుతుంటాడు. తీరా చేస్తే diyhydrogen monoxide అంటే మామూలు నీళ్ళు (water). అదొక రసాయనిక నామం మాత్రమే. శాస్త్రవేత్తలు కూడా చాలా అరుదుగా వాడే పదం ఇది. అలాంటి శాస్త్రీయ పదాల పట్ల అవగాహన లేనివాళ్లు నిజమే, అది ప్రమాదకరం కాబోలు అనుకుంటారు అమాయకంగా. ఇలా తమ ప్రజ్ఞతో సాధారణ విషయాలను కూడా మసిపూసి మారేడు కాయ చేసే వ్యవహారాలు ఈనాటి మీడియా చేస్తోందనేది ఆ మితృడి అభిప్రాయం. అందుకే ‘పేపర్లు చదవను, టీవీలు చూడను’ అనే నిర్ణయానికి ఆయన వచ్చాడు.

కానీ మీడియా మీద ఎంత చెడుగా అనుకున్నా, అది necessary evil అంటాడు మరో మిత్రుడు. మొన్నీమధ్య ఆయన ఓ అయిదు రోజుల పాటు నగరానికి దూరంగా వున్న ఫాం హౌస్ లో గడిపివచ్చారు. ఆయనకి పొద్దున్నే పత్రిక చూడనిదే గడవదు. అక్కడ పత్రిక దొరకదు. ఫాం హౌస్ లో ఉన్న టీవీకి నెట్ సమస్య వచ్చి మౌన ముద్రదాల్చింది. మొదటి రోజు కష్టంగా గడిచింది. మర్నాడు మనసుకు ప్రశాంతంగా వున్నట్టు తోచింది. ఆ మర్నాడు అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయా అనిపించింది. అక్కడే అలానే వుండిపొతే బాగుండు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా అని కూడా అనిపించిందట. షుగర్, బీపీ అదుపులో వుందని పరీక్ష చేసుకుంటే తెలిసిందట.

అయితే ఇంటికి తిరిగి రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, గుమ్మం ముందు పడి వున్న పత్రికలను అన్నింటినీ వరసపెట్టి తిరగేయడం.

మరొక మిత్రుడు మరీ విచిత్రమైన విషయం చెప్పాడు. కరోనా గురించిన సమాచారం అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న రోజులు. అది గాలి ద్వారా, ధూళి ద్వారా కూడా వ్యాపిస్తుందని అప్పుడు అనేక రకాలుగా చెప్పుకునేవారు. పేపర్ల ద్వారా కరోనా రాదు అని పత్రికల వాళ్ళే ప్రకటనలు ఇచ్చుకోవాల్సిన స్థాయికి ఈ పుకార్లు చేరుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పేపరు మొహం చూడలేదు. పొరబాటున కూడా పత్రికను చేతితో తాకలేదు. పుట్టడమే పత్రికాసమేతంగా పుట్టాడని ఆయన చుట్టపక్కాలు చెప్పుకొనేవారు. ప్రతిరోజూ రోజూ మూడు నాలుగు పత్రికలు చదివే అలవాటు చిన్నప్పటి నుంచీ వుంది. అలాంటి మనిషి దాదాపు రెండేళ్లుగా పేపరు చేత్తో పట్టుకోలేదు, ముట్టుకోలేదు అంటే ఆశ్చర్యమే మరి.

ఈ విషయాలన్నీ తలచుకుంటూ వుంటే ఎప్పుడో జ్వాలా చెప్పిన ఓ విషయం జ్ఞాపకం వచ్చింది.

అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి కుముద్ బెన్ జోషీ గవర్నర్. తెలుగు దేశం అధికారంలో వుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో. కాంగ్రెస్ గవర్నర్ కాబట్టి టీడీపీ అనుకూల పత్రికలు కొన్ని గవర్నరు ఏం చేసినా వాటిని తూర్పార పడుతూ కధనాలు రాసేవి. ఆవిడ వ్యవహార శైలి కూడా అందుకు దోహదం చేసి వుంటుంది. అది రాజ్ భవన్ కాదు, గాంధీ భవన్ (కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం) అనే వారు. కాంగ్రెస్ నాయకులు చాలామందికి రాజ్ భవన్ ఓ అడ్డాగా మారింది అని గుసగుసలు వినిపించేవి.

ఉపరాష్ట్రపతి వెంకట్రామన్ గారు కాబోలు, ఒకసారి హైదరాబాదు వచ్చి రాజభవన్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. గవర్నర్ కుముద్ బెన్ జోషీ, గవర్నర్ కార్యదర్శి చంద్రమౌళిగారు వెళ్లి ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

మాటల సందర్భంలో వెంకట్రామన్ అడిగారు జోషీ గారిని, ‘ఏమిటి అలా వున్నారు ఒంట్లో బాగుండలేదా అని.

చంద్రమౌళిగారు గారు కల్పించుకుని అసలు విషయం చెప్పారు, ఆరోజు ఉదయమే ఒక పత్రిక గవర్నర్ కు వ్యతిరేకంగా ఒక కధనం ప్రచురించిందని.

అప్పుడు వెంకట్రామన్ గారు ఇచ్చిన సలహా ఇది.

ఓ మూడు రోజులు పత్రికలు చదవడం మానేసి చూడండి, మనసుకు ఎంతటి ప్రశాంతత లభిస్తుందో అర్ధం అవుతుంది”

(30-01-2022)

ఈరోజు మహాత్ముడు మరణించిన రోజు – భండారు శ్రీనివాసరావు


ఎవరీ గాంధి?
1969
మహాత్మాగాంధీ శతజయంతి సంవత్సరం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జర్మని నుంచి ఒక ప్రొఫెసర్ భారత దేశానికి వచ్చారు. ఆయన ఆ దేశంలోని అతి పురాతనమైన విశ్వవిద్యాలయం హైడల్ బర్గ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. పేరు డాక్టర్ మర్ల శర్మ. వారిది కాకినాడ. పై చదువుల కోసం జర్మనీ వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. గాంధి గారు పుట్టి వందేళ్ళు గడుస్తున్న సందర్భంలో భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల వాళ్ళు గాంధీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని ఒక పరిశోధనా పత్రం తయారు చేసే పని పెట్టుకుని వచ్చారు. ఆ రోజుల్లో నేను విజయవాడ ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాను. ఆయన పరిశోధనలో చేదోడువాదోడుగా వుండే అవకాశం నాకు లబించింది. అందులో భాగంగా నేను శర్మగారితో కలిసి (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గ్రామాలు తిరిగాను.
‘మహాత్మాగాంధి ఎవరు?’ అనేది శర్మగారు ముందే తయారు చేసుకొచ్చిన ప్రశ్నావళిలో మొట్టమొదటిది. వూరి పేరు గుర్తు లేదు కానీ పట్టుమని పాతిక గడప కూడా లేని ఓ మారుమూల గ్రామంలో ఒక నడికారు మనిషిని ఇదే ప్రశ్న అడిగితే, ఆమె జవాబుగా తన కుమారుడిని చూపించింది. అతడి పేరు గాంధి. మహాత్మాగాంధీ హత్యకు గురైన తర్వాత పుట్టిన తొలిచూలు బిడ్డడు అతడు. మహాత్ముడి మీది గౌరవంతో కొడుక్కి గాంధి అని పేరు పెట్టుకుంది. స్వాతంత్ర ప్రదాత అనే కృతజ్ఞతతో ఆ రోజుల్లో వేలాదిమంది తమ సంతానానికి గాంధీ పేరు పెట్టుకున్నారు. వారిలో ఎంతమంది తమ నడవడికతో ఆ పేరుకు న్యాయం చేకూర్చారో తెలుసుకోవాలంటే మరో విదేశీ యూనివర్సిటీ పూనుకోవాలి.
అది అప్పటి మాట.
దశాబ్దాలు గడిచిన తర్వాత మా పక్కింటి పిల్లవాడు తల్లిని అడుగుతుంటే విన్నాను, ‘మమ్మీ! గాంధి అంటే ఎవరు? ఈరోజు నేను స్కూల్లో మాట్లాడాలి. నా ఫ్రెండ్ గోపి ఏమో, రాహుల్ గాంధి గ్రాండ్ పా అంటున్నాడు, కరక్టేనా!’
ఈ పిల్లవాడి ప్రశ్న కంటే ఆ తల్లి ఇచ్చిన జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ‘నన్ను విసిగించకురా! వెళ్లి గూగుల్ లో వెతుక్కో’
ఈ నేపధ్యంలో మహాత్మా గాంధి ఆయన బోధనలు, ప్రబోధాలు నేటి తరానికి ఏ మేరకు శిరోధార్యాలు అనే పెద్ద ప్రశ్న నా ముందు నిలిచింది.
మహాత్మాగాంధీ తన జీవిత కాలంలో ఎన్నో చెప్పారు. ఎన్నో రాశారు. ఈ విషయంలో ఆయనది ఒక రికార్డు అనే చెప్పాలి. తన దృష్టికి వచ్చిన ప్రతి ఉత్తరానికీ, సామాన్యులు, అసామాన్యులు అనే బేధం లేకుండా స్వదస్తూరీతో ఓ కార్డు ముక్కపై జవాబు రాయడం ఆయనకు ఓ అలవాటు. ఆయన సూక్తులూ, బోధనలు వర్తమానానికికూడా వర్తిస్తాయంటూ గాంధి జయంతి, వర్ధంతి రోజుల్లో నాయకులు చేసే షరామామూలు ప్రసంగాలతో జాతి జనుల చెవులు చిల్లులు పడివుంటాయి. ఆచరణకు వచ్చేసరికి హళ్లికి హళ్లి. సున్నకు సున్నా.
భారతీయ సమాజంలో వైరుధ్యాలు, అసమానతలు నానాటికి పెరిగిపోతున్నాయి. పెరగడమే కాదు, మరింత తీవ్రస్వరూపం ధరిస్తున్నాయి. సంపదలు పెరుగుతున్నా దేశంలో కోట్లాది సామాన్య ప్రజలకు వాటి పంపిణీ సక్రమంగా జరగడం లేదు. పేదలు నిరుపేదలు అవుతున్నారు. సంపన్నులు కోట్లకు పడగెత్తుతున్నారు. సామాన్యుల జీవన ప్రమాణాలు పాతాళంలోకి దిగజారుతుంటే, కలవారి జీవన ప్రమాణాలు అంతరిక్షాన్ని తాకుతున్నాయి. దేశంలో సంపదలు పెరిగాయి. సంపదలతో పాటు వైరుధ్యాలు, అసమానతలు పెరిగాయి. పెరిగిన సంపదలలో 73 శాతం భారత జనాభాలో కేవలం ఒక శాతం వున్న శ్రీమంతుల గుప్పిట్లోకి వెళ్లాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు గాంధి పుట్టిన దేశమా ఇది? అనే అనుమానం కలక్కమానదు. బహుశా ఆయన మళ్ళీ పుట్టి ఈ దేశాన్ని చూస్తుంటే ఆయనకు కూడా తప్పకుండా ఇలాంటి సందేహమే పొటమరించి వుండేదేమో! ఎందుకంటే ఆయన స్వతంత్ర భారతం గ్రామీణ భారత పునాదులపై నిర్మించబడాలి అని బలంగా కోరుకున్నారు. గ్రామస్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని నమ్మిన నాయకుడాయన.
అలా అని దేశం పరిస్తితి మరీ ఘోరంగా వుందని అర్ధం కాదు. ఎన్నో అవలక్షణాల నడుమ కూడా పురోగతి చుక్కల్ని తాకుతున్నమాట సైతం అవాస్తవం కాదు. కాకపోతే ఆనాడు మహాత్మా గాంధి కన్న కలల ప్రకారం సాగుతోందా అంటే అనుమానమే.
మహాత్ముడి బోధనలలో సర్వకాలాలకు వర్తించేవి వున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోవాల్సినవీ వున్నాయి. మహాత్ముడు రాట్నం వడికి తీసిన నూలు దుస్తులు ధరించమని ప్రజలకు చెప్పారు. ఆనాడు ఆయన ఉద్దేశ్యం ఖద్దరును ప్రోత్సహిస్తే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం వుండదు అన్నది కావచ్చు. మరి నేటి తరం ‘రాటం మాకిప్పుడు కాదు వాటం’ అంటోంది. విదేశీవస్తు బహిష్కరణకు గాంధి నాడు పిలుపు ఇస్తే దేశవ్యాప్తంగా ప్రజలు ఉవ్వెత్తున స్పందించి తమ దుస్తులు మూటలు కట్టి తీసుకొచ్చి నడివీధుల్లో గుట్టలుగా పోసి తగలబెట్టారు. మహాత్ముడి మాటకు జనాలు ఎలాంటి విలువ ఇచ్చారో తెలుసుకోవడానికి ఇలాంటి దృష్టాంతాలు కోకొల్లలు.
‘గమ్యం (లక్ష్యం) ఎంత గొప్పదిగా పరిశుద్ధంగా వుండాలని కోరుకుంటామో, ఆ లక్ష్య సాధనకు మనం అనుసరించే మార్గాలు కూడా అంతే పవిత్రంగా వుండాలి’ అని మహాత్ముడు చెప్పిన సూక్తిని ఆయనకు ఏకలవ్య శిష్యుడిగా ప్రపంచం పరిగణించిన నల్ల జాతి నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ తరచూ పేర్కొంటూ వుండేవారు. మహాత్ముడు ప్రబోధించిన అహింసావాదాన్ని ఆయన మనసా వాచా కర్మణా నమ్మి ఆయన తన ఉద్యమాన్ని నడిపారు. ఏ దేశంలో అయితే వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటాన్ని మహాత్ముడు ప్రారంభించారో ఆ దేశమే తదనంతర కాలంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి నివాళులు అర్పించిందంటే ఆయన బోధనల లోని ప్రభావం అంత గొప్పదని అవగతమవుతుంది.
నిజానికి మహాత్ముడి బోధనల అవసరం ఆనాటి రోజులకంటే ఈనాడే ఎక్కువగా వుంది. కానీ వాటిని విదేశాల్లో వారు పాటిస్తూ, గౌరవిస్తుంటే, మనం మాత్రం జయంతులు, వర్ధంతుల సందర్భాల్లో ఇచ్చే సందేశాలకు పరిమితం చేసి సంతోషపడుతున్నాం. మోహన్ దాస్ కరం చంద్ గాంధి అనే మహానీయుడు నడయాడిన నేలమీదనే మనమూ నడుస్తున్నాం అనే స్పృహను కోల్పోతున్నాం. పైగా ఆయనకు మహాత్ముడు అనే బిరుదు ఎవరిచ్చారు అనే అర్ధ రహితమైన చర్చలతో కాలక్షేపం చేస్తున్నాం.
‘ఇది తగునా!’ అనే ప్రస్తావన మనకు రాదు. ఎందుకంటే మహాత్మా గాంధి అంటే ఎవరు అనే ప్రశ్నకు జవాబు చెప్పాలంటే గూగుల్ వెతుక్కోవాల్సిన దుస్తితిలో వున్నాం. ఇక ముందు కూడా వుంటాం. కారణం గాంధీతో కానీ, ఆయన సూక్తులతో కానీ నేటి యువతరానికి అవసరం లేదు. పాత తరం పట్టించుకునే పరిస్తితిలో లేదు.





(30-01-2022)

29, జనవరి 2022, శనివారం

కొత్తా జబ్బులండీ ...... భండారు శ్రీనివాసరావు

 (కరోనా అనే పేరు కూడా ప్రపంచానికి తెలియని రోజుల్లో, 2018లో రాసింది.

నా వృత్తి జర్నలిజం గురించి గతంలో ఎన్నో విమర్శనాత్మక పోస్టులు పెట్టాను. ఇతర వృత్తుల వారిని కూడా ఇదే స్పూర్తితో  స్వీకరించమని కోరుతున్నాను)

 

బ్రహ్మలోకంలో దేవుడుగారు కొలువు తీరాడు. భటుడుగారు ప్రవేశించి, నడుము వరకు వొంగి వినయంగా నమస్కరించి చెప్పాడు. 'స్వామీ! ఒక మానవాధముడు తెల్లని ఉడుపులు ధరించి వచ్చాడు. శివుడి మెడలో నాగుపామును బోలిన ఒక వస్త్ర విశేషము అతడి మెడలో కూడా వేలాడుచున్నది. అనుమతించిన లోపలకు తోడ్కొని వత్తును'

దేవుడు అంతఃచక్షువుతో పరికించి చూశాడు. తోలుపటకా సంచీతో దిక్కులు చూస్తున్న మెడికల్ రిప్రెజెంటేటివ్ కానవచ్చాడు. అతడిని చూడగానే బ్రహ్మగారికి తన శిరోవేదన జ్ఞాపకం వచ్చింది. తక్షణం ప్రవేశపెట్టడమే కాకుండా సభలో వున్న యావన్మందినీ బయటకు పంపేయమని ఆజ్ఞాపించాడు.

మె.రి. దిక్కులు చూస్తూనే లోపలకు వచ్చాడు. వస్తూనే దేవుడు గారు తలనొప్పితో బాధపడుతున్న విషయం చిటికెలో గ్రహించాడు. పటకా సంచీ తెరిచి మందుల శాంపిల్స్ అన్నీ దేవుడుగారి ఆసనం ముందు పరిచాడు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మందుల్లో తలనొప్పి గోలీ వుందని, అది రాత్రి వేసుకుని పొద్దున్న లేస్తే, నొప్పి సరే, తల వుందన్న సంగతి కూడా గుర్తుకురాదనీ విరించికి వివరించి చెప్పాడు. మాత్ర వేసుకోగానే నొప్పి మాయం, గాయబ్ అంటూ సంస్కృతంలో ఏమంటారో తెలియక ఆగిపోయాడు.

బ్రహ్మగారు మూడు తలలు పంకించి మందహాసం చేశారు. మూడు తలలతో ఆలోచించాడు. మనవాడు వుత్తుత్తిగానే ఇంతదూరం రాలేదనీ. ఏదో కారణం ఉండేవుంటుందని గ్రహించినవాడై, అదేదో చెప్పమని సూటిగా అడిగాడు.

మె.రి. భేషజాలకు పోకుండా వున్నవిషయం చెప్పాడు.

'మీరు పరబ్రహ్మ మూర్తులు. మీ రాతకు తిరుగులేదు. అలాఅని అర్ధం కూడా కాదు. అందుకే బ్రహ్మరాత అంటారు. మీలాంటి వాళ్ళు మాలోకంలో కూడా వున్నారు. కాకపొతే వాళ్ళని డాక్టర్లు అంటారు. వారి దస్తూరీ మెడికల్ షాపుల వాళ్లకు తప్ప వాళ్ళ పెళ్ళాలకు కూడా అర్ధం కాదని బోలెడు జోకులు ప్రచారంలో వున్నాయి. అయినా వాళ్ళు మా కంపెనీ మందులు రాయకపోతే మేము విషం మందు మింగి చావాలి. మా బతుకులు వారి రాతతో ముడిపడివున్నాయి. వాళ్ళు అలా మందులు రాస్తూనే వుండాలి. జనాలు వాటిని కొని మింగుతూనే వుండాలి. మరి రాయాలంటే ఉత్త మందులు వుంటే సరిపోదు, వాటికి సరిపడా రోగాలు కూడా వుండాలి. వీటిని ఇతోధికంగా పెంచడానికి మా వంతు తిప్పలు మేము పడుతూనే ఉన్నాము. కానీ మా ప్రయత్నాలు సరిపోవడం లేదు. కాబట్టి మీరు సృష్టి కార్యంతో పాటు, పెద్ద మనసు చేసుకుని అలాగే మరో చేయి చేసుకుని మరి కొన్ని కొత్త జబ్బులను కూడా సృష్టించి భూమ్మీదకు వదిలితే కాని మా ఉద్యోగాలకు భరోసా వుండదు. కావున ఓ దేవదేవా! కాసింత ఈ సాయం కానీ చేస్తివా, మీ మేలు మా మందుల కంపెనీల వాళ్ళు మరచిపోరు. మీ శ్రీమతి గారికి, లక్ష్మీదేవి గారితో సమానంగా ఏడువారాల నగలు చేయించి పెడతారు. ఇక మీకంటారా మూడు తలలకూ నిఖార్సయిన బంగారు తొడుగులు వేయిస్తారు. భూలోకంలో మీకు గుళ్ళు ఎలాగూ లేవు, అంచేత మీ లోకంలోనే ఆ భోగాలన్నీ అందిస్తారు.”

మె.రి. ఇచ్చిన శాంపిల్ గోలీతో బ్రహ్మగారి ‘తలల’ నొప్పి తగ్గింది.

కానీ భూమ్మీద కొత్త కొత్త రోగాల నొప్పి జనాలకు మొదలయింది.

(2018)

 

28, జనవరి 2022, శుక్రవారం

వామ్మో! సూర్యనారాయణా! – భండారు శ్రీనివాసరావు

 (ఏపీలో ఐ.ఏ.ఎస్. ల దగ్గర పనిచేసే పేషీ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటారని ఉద్యోగుల సంఘం నాయకుడు ఒకరు టీవీలో చెబుతుంటే విన్నప్పుడు గుర్తుకొచ్చిన జ్ఞాపకం)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో దశాబ్దాల క్రితం  ఎన్జీవోల సమ్మె జరుగుతున్న రోజులు.

అంతకు కొంతకాలం క్రితం ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా పనిచేస్తున్న ఓడాక్టరు గారికి చాలా దూరంలో వేరే జిల్లాకు బదిలీ అయింది. బదిలీ ఆపుకోవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉండగానే ఈ సమ్మె వచ్చి పడింది. ఖమ్మంలో ఉంటున్న మా బావగారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆ డాక్టరు గారు బాగా తెలిసిన వాడు, ఎవరయినా నీకు తెలిసిన వాళ్ళు వుంటే మాట సాయం చేయమని.

వైద్యశాఖ మంత్రి గారు బాగా పరిచయం వున్న మనిషే. వెళ్లి కలుస్తే ఆయన ముందు సమ్మె అయిపోనీ చూద్దాం అన్నారు. కాస్త ఆగి మళ్ళీ ఆయనే అన్నారు, ‘నేను చెబుతాను కానీ ఆ సూర్యనారాయణ వున్నాడే, ఓ మొండి ఘటం, ఓ పట్టాన ఎవడి మాటా వినడు’.

మంత్రిగారి  మాట కూడా వినని ఆ కే.వీ.ఎస్. సూర్యనారాయణ గారు సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి. ఆ రోజుల్లో వైద్యశాఖ కార్యదర్శిగా వున్నారు. ఆయనని వేరే శాఖ నుంచి  ఆ పోస్టుకు బదిలీ చేసి ఎక్కువ కాలం కూడా కాలేదు. ఎవరి మాట లెక్కపెట్టని అధికారి అని పేరు. ముక్కుసూటి మనిషి. తోటి ఐ.ఏ.ఎస్. అధికారులు కూడా ఆయనకు ఒక మాట చెప్పడానికి సంకోచించేవారు. ఇక మామూలు అధికారులు అయితే ‘వామ్మో! సూర్యనారాయణ గారా! ఆయన ఎవరి మాటా వినేరకం కాదు’ అని ముందే తప్పుకునేవారు.

ఇక ఏమైతే అదే అయిందని నేనే సచివాలయానికి వెళ్లాను ఆయన్ని కలుద్దామని. సచివాలయం మొత్తం బోసిపోయి వుంది. ఎక్కడా చడీ చప్పుడు లేదు. ఉన్నతాధికారులు మాత్రం ఆఫీసులకు వస్తున్నారు. సూర్యనారాయణ గారి చాంబర్స్ కు వెళ్లాను. చీటీలు ఇచ్చే అటెండర్లు లేరు. లోపల అధికారి వున్నారో లేరో చెప్పే పియ్యేలూ లేరు. నీరవ నిశ్శబ్దంగా వుంది. నేనే తలుపు తట్టి ‘మే ఐ క మిన్ సర్’ అన్నాను మెల్లగా. ‘యస్’ అని వినిపించింది లోపల నుంచి గంభీరంగా. తలుపు తోసుకుని వెళ్లాను.

తెల్లటి దుస్తుల్లో నల్లటి మనిషి ఒకరు కుర్చీలో కనిపించారు.

ఎవరు మీరు? ఏం కావాలి” అన్నారాయన మరింత గంభీరంగా.

రేడియో కరస్పాండెంట్ ని అని చెప్పగానే ఆయన, నేను వచ్చింది సమ్మె సమాచారం కోసం అని అనుకుని అలాటి విషయాలు మీరు సీ ఎస్ ఆఫీసులో అడగాలి, నన్ను కాదు’ అన్నారు కరకుగా.

అప్పుడు నేను వచ్చిన పని చెప్పాను.

‘బదిలీ విషయంలో మీకు రికమెండ్ చేయడానికి పెద్ద పెద్దవాళ్లు కూడా జంకుతున్నారు. అంచేత నేనే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను’ అని చెప్పాను మాటల్ని కూడగట్టుకుంటూ.

ఎవరా డాక్టరు ఎక్కడ పనిచేస్తారు’ అని అడిగితే చెప్పాను వివరాలు. అవి రాసి ఉంచుకున్న చీటీ ఆయనగారి చేతికి అందించాను.

ఒకసారి చదువుకుని ఆయన కుర్చీలో నుంచి లేచారు  బయటకు వెళ్ళడానికి. ఇక ఇది అయ్యే పని కాదనుకుని నేనూ ఆయన వెంట బయటకు వచ్చాను.

చిత్రంగా ఆయన పియ్యే టేబుల్ దగ్గర ఆగిపోయి టెలిఫోన్ డైరెక్టరీ చేతిలోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా డి.ఎం.అండ్ హెచ్.ఓ. కి ఫోన్ చేశారు.

ఆయన లైన్లోకి రాగానే మా డాక్టరు గారి వివరాలు చెప్పి, రిలీవ్ చేయవద్దని అని నోటిమాటగా ఉత్తర్వులు ఇచ్చారు. ‘సార్! ఆర్డర్ టైప్ చేయడానికి స్టాఫ్ ఎవరూ లేరు’ అని అవతల నుంచి అన్నట్టు వుంది.

నా దగ్గర ఏమైనా వున్నారా! నేనే డైరెక్టరీ వెతికి మీకు ఫోన్ చేశాను.. అర్ధం అయిందా’ అన్నారు సూర్యనారాయణ గారు తనదైన శైలిలో.

అటు డి.ఎం.అండ్ హెచ్.ఓ. గారితో పాటు ఇటు నాకూ అర్ధం అయింది, ఆయన వ్యవహార శైలి.

సూర్యనారాయణ గారిని చూడడం అదే నాకు మొదటి సారి. ఇలాంటి అధికారులు కూడా వుంటారా అని అనుకుంటూ బయటపడ్డాను.

నాకు తెలిసి ఆ డాక్టరు గారిని తర్వాత ఎవరూ కదల్చలేదు. ఖమ్మంలోనే రిటైర్ అయ్యారు.

ఇప్పుడు ఆ అధికారీ లేరు, ఆ డాక్టరు గారూ లేరు, నా జ్ఞాపకాల్లో తప్పించి.