30, అక్టోబర్ 2021, శనివారం
నాకు తెలిసింది సున్నా! – భండారు శ్రీనివాసరావు
29, అక్టోబర్ 2021, శుక్రవారం
ఆరు ఆటంబాంబులతో కాపురం – భండారు శ్రీనివాసరావు
1975 లో హైదరాబాదుకు వచ్చినప్పుడు కొత్త కాపురం ఇబ్బందులు ఎలా ఉంటాయో ఏమిటో తెలియకుండా, అశోక్ నగర్ చమన్ దగ్గర మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారింట్లో కొన్నాళ్ళు కాలక్షేపం చేశాము. తర్వాత వాళ్ళ పక్కనే ఉన్న ఇంట్లో చిన్న వాటా దొరికితే అక్కడకు మారాము. ఇల్లుగలవాళ్ళు ఆ ఇంటిని ఎవరికో అమ్మివేయడంతో వాళ్ళకీ, మాకూ ఆ ఇంటితో రుణం తీరిపోయింది. మళ్ళీ ఇల్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి. సరే! ఎక్కువ వెతుకులాట, ప్రయాస లేకుండానే చిక్కడపల్లి త్యాగరాయ గానసభ సమీపంలో ఒక పోర్షన్ దొరికింది. మాస్కో వెళ్ళే దాకా అక్కడే మా ఆల్ మకాం. ఆ ఇంటి వాస్తు మహిమ ఏమోకానీ ఎప్పుడూ నలుగురు వచ్చేపోయేవాళ్ళతో కళకళలాడుతూ వుండేది. పగలల్లా మా ఆవిడ నడిపే అమ్మవొడి, సాయంత్రం అయ్యేసరికి రచయితలు, కవులు, ఉన్నతాధికారులతో కూడిన ఆస్థానంగా మారిపోయేది. ఆఫీసునుంచి నా రాకతో నిమిత్తం లేకుండా జనం జమ అయ్యేవారు. వాళ్లకు, కాఫీలు, ఉప్మాలు, కొండొకచో అర్ధరాత్రి భోజనాలతో మా ఆవిడ నిర్మల అన్నీ అమర్చిపెట్టేది. ఇవన్నీ చూసి రేడియోలో నా సహచరులు, న్యూస్ రీడర్, ప్రముఖ రచయిత డి. వెంకట్రామయ్య గారు, “వండ నలయదు వేవురు వచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌ నతనిగృహిణి” అనేవారు, మనుచరిత్రలో అల్లసాని పెద్దన గారి పద్యాన్ని ఉటంకిస్తూ. అనడమే కాదు తన జీవిత చరిత్ర గ్రంథంలో పేర్కొన్నారు కూడా.
ఇదలా ఉంచుదాం.
‘పొయ్యి పైనా, పొయ్యి లోపలా’ వున్నవాడే కలవాడు అనేది మా
బామ్మగారు. అంటే నలుగురికి సమృద్ధిగా వండి
పెట్టే సరుకులు, పొయ్యి
వెలిగించడానికి ఎండు కట్టెలు ఎల్లప్పుడూ ఇంట్లో వుండాలి అనేది ఆవిడగారి మన్ కి
బాత్.
ఆ రోజుల్లో లాగా కట్టెల బాధ ఇప్పుడు లేదు. వచ్చిన
బాధల్లా గ్యాస్ సిలిండర్ ఖాళీ అయితేనే. సింగిల్ సిలిండర్ సిస్టం
కావడం వల్ల గ్యాస్ అయిపోతే ప్రత్యామ్నాయం వుండేది కాదు. ఆ కాలంలో సామాన్య
గృహస్తుకు డబ్బుతో పాటు బాగా కటకటగా ఉండేవి మరో మూడు. కరెంటు, నల్లా నీళ్ళు, గ్యాస్
సిలిండరు.
ఇంట్లో నిత్యం జరిగే సంతర్పణలు,
సమారాధనలు, సంభారాల
భారంతో నిమిత్తం పెట్టుకోకుండా అవన్నీ అంతా
మా ఆవిడ భుజాల మీదకు వదిలేసి, కొరతలుగా ఉన్న ఈ మూడింటి సంగతి చూడడానికి, అధికార
దుర్వినియోగం ఆనండి, ఏదైనా
అనండి ఎంతదూరం అయినా వెళ్ళేవాడిని. నీళ్ళు రాని రోజున ఏకంగా మంచినీళ్ళ మంత్రి,
ఆయన్ని అలానే పిలిచేవాడిని, మునిసిపల్ శాఖ మంత్రి, బండారు సత్యనారాయణ
మూర్తిగారికి పొద్దున్నే ఫోన్ కొట్టేవాడిని. ఆయన విసుక్కోకుండా ‘ట్యాంకర్ కావాలి
కదా పంపిస్తాను అనేవారు. అన్నట్టే అరగంటలో మంచి నీళ్ళ ట్యాంకర్ వచ్చి సంపులో నీళ్ళు నింపి పోయేది మా ఇరుగు పొరుగుకు కూడా సరిపోయేలా.
అలాగే కరెంటు. పోవడం ఆలస్యం,
విద్యుత్ బోర్డుచైర్మన్ నార్ల తాతారావు గారెకి ఫోన్. ఆయన నా బాధ పడలేక మా ఇంటి
దగ్గరలోనే ఓ ట్రాన్స్ ఫార్మర్ వేయించారు.
పొతే మూడోది మరీ ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్.
ఖాళీ అయిందని మా ఆవిడ ఫోన్ చేసి చెప్పడం ఆలస్యం అన్ని పనులు వదిలిపెట్టి ఆ పనిమీదనే
కూర్చొనే వాడిని.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో తెలిసిన జనరల్
మేనేజర్లకు ఫోన్ చేసేవాడిని. అరగంటలో సిలిండర్ డెలివరీ అయిన సంగతి తెలిసిన తర్వాతనే ఆఫీసు పనయినా ఏదైనా. నా బాధ ప్రపంచం బాధ అన్నట్టు సాగేది నా
వ్యవహారం. అదేమిటో
ఆ రోజుల్లో ఒక సిలిండర్ ఇరవై రోజులు కూడా వచ్చేది
కాదు. ఇప్పుడు రెండు నెలలు వస్తోంది. ఈ ఖర్చులు అయితే తగ్గాయి. కానీ మరో
రూపంలో పెరిగాయి. పక్షి పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరి పోయిన తర్వాత గూడు విశాలమైనట్టు
ఇప్పుడు ఇళ్లు కూడా ఖాళీగా, విశాలంగా కనిపిస్తున్నాయి.
ఆ తర్వాత అయిదేళ్లు ఇలాంటి ఏ కొరతలు లేని సోవియట్
యూనియన్ లో కాలుమీద కాలేసుకుని దర్జాగా బతికాము. దేనికీ కొరతలేదు,
చివరాఖరుకి డబ్బుకు కూడా. పైగా గ్యాసు, కరెంటు, ఫోను, మూడు పడక గదుల ఇల్లు ఉచితం. దాంతో వారానికి
రెండు మార్లు, వారాంతపు రోజుల్లో మాస్కోలోని తెలుగు విద్యార్ధులతో, తెలుగు
కుటుంబాలతో మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చ
తోరణం.
ఇక అయిదేళ్ళ ప్రవాస జీవితం తర్వాత తిరిగి వస్తే, హైదరాబాదు
ఎయిర్ పోర్టులోనే నాటి కమ్యూనికేషన్ల మంత్రి రంగయ్య నాయుడు గారు కలిసి ఫోన్
లేకపోతె ఎల్లా అంటూ ఆయనే చొరవ తీసుకుని ఫోన్ కనెక్షన్
మంజూరు చేశారు. డిపార్ట్ మెంటు వాళ్ళు
మర్నాడు ఫోను, లాంగ్
కార్డు పట్టుకుని రేడియో స్టేషన్ కు వచ్చారు, ఇల్లెక్కడ అడ్రసు చెప్పండని అంటూ.
అప్పటికి రెంటుకు ఇల్లే దొరకలేదు. మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారింట్లో
ఉంటున్నాము.
ఆకస్మికంగా వచ్చి పడ్డ ఫోన్ కోసం ఇంటి వేట
ముమ్మరం చేశాము. చివరికి పంజాగుట్టలోని మా అన్నయ్య ఇంటికి దగ్గరలోనే దుర్గానగర్
కాలనీలో ఓ ఇల్లు దొరికింది. ఓడలో మాస్కో సామాను వచ్చేలోగా దగ్గరలో ఉన్న మరో పెద్ద ఇంటికి మారాము. అద్దె
రెండు వేలు. లంకంత కొంప. ఇంటివాళ్ళు ముస్లిమ్స్. ఎక్కడో ఏదో దేశంలో వుంటారు. ఆ
ఇల్లు కట్టిన తాపీ మేస్త్రీకి చిన్న చిన్న
గదులు కట్టడం తెలియదల్లె వుంది. అన్నీపెద్ద పెద్ద హాల్సే. ఇల్లంతా కట్టిన తర్వాత చూసుకుంటే
వంటిల్లు కనబడనట్టుంది. ఏదో చిన్న జాగా చూసి వంట గది అనిపించాడు. ఆ ఇంట్లో మా
మాస్కో సామాను భేషుగ్గా సరిపోయింది కానీ సిలిండర్లకు ఆ చిన్న కిచెన్ లో జాగా దొరకలేదు. దాంతో వున్న ఆరు సిలిండర్లలో ఒకటి స్టవ్ కు బిగించి, మిగిలిన అయిదింటినీ బయట
హాల్లో దసరా బొమ్మల కొలువులా వరసగా పెట్టేవాళ్ళం.
ఆరు సిలిండర్లు కధ ఏమిటంటారా!
నేను మాస్కోనుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే
అప్పటి పెట్రోలియం మంత్రి చింతా మోహన్ గారు ఓ రెండు, ఎంపీలు డాక్టర్ మల్లు రవి,
రాయపాటి సాంబశివరావు గార్లు చెరి రెండు సిలిండర్లు నోరు తెరిచి అడగకుండానే తమ
కోటాలో ఇప్పించారు. దాంతో ఆరు సిలిండర్లు గృహ ప్రవేశం చేసాయి. నట్టింట్లో బాంబులు పెట్టుకుని
శ్రీనివాసరావు మళ్ళీ కొత్త కాపురం మొదలు పెట్టాడని ఫ్రెండ్స్ సరదాగా అనేవారు.
అయితే మా ఆవిడ పబ్లిక్ రిలేషన్స్ కు అవి బాగా ఉపయోగపడ్డాయి. ఎవరికి ఎప్పుడు
సిలిండర్ అవసరమైనా వాళ్ళు గ్యాస్ కంపెనీకి కాకుండా మా ఆవిడకు ఫోన్ చేసేవాళ్ళు. అలా కొన్నాల్తికి ఎవరికి
ఇచ్చామో తెలియని పరిస్థితుల్లో చివరికి మా ఇంట్లో అయిదే మిగిలాయి.
ఈలోగా రూల్స్ మారి ఒక పేరు మీద ఒకే కనెక్షన్
అన్నారు. శాపవిమోచనం అయిన గంధర్వుల మాదిరిగా ఓ మూడు సిలిండర్లు రెక్కలు కట్టుకుని తమ దేవలోకానికి తరలి పోయాయి. ఆచూకీ
దొరక్కుండా పోయిన సిలిండర్ డబ్బు మా చేత కట్టించుకున్నారు. అలా ఆరు సిలిండర్ల కధ
కంచికి చేరింది.
ఇక ఇప్పుడు దేనికీ కొరత లేదు, ఒక్క మా ఆవిడ లేదనే
చింత తప్ప. అనుభవించే దశలో దాటిపోయింది.
(29-10-2021)
28, అక్టోబర్ 2021, గురువారం
నడిచి వచ్చిన దారి – భండారు శ్రీనివాసరావు
ఇక్కడి నా మిత్రులలో అన్ని వయసులవాళ్ళు ఉన్నప్పటికీ చాలామంది కొంచెం అటూఇటూగా నా ఈడువాళ్ళే. నా తరం వాళ్ళే. కాబట్టి మా పెంపకాల్లో, జీవన విధానాల్లో కొంచెం పోలికలు కనిపిస్తాయి. మొదటి మెట్టు మీద కాలు మోపిన దగ్గరినుంచి పడిన కష్టాలు, ఇబ్బందులు ఇప్పుడు పై మెట్టు మీద నిలబడి చూసుకుంటూ వుంటే చాలా వింతగా వుంటుంది. నడిచి వచ్చినదారి ఇలాంటిదా అని ఆశ్చర్యం వేస్తుంది.
ఐ నో సీఎం, ఐ నో పీఎం - భండారు శ్రీనివాసరావు
మా పాత డైరీల్లో రాసుకున్న పాత విషయాలు
26, అక్టోబర్ 2021, మంగళవారం
రేడియో చిన్నక్క రతన్ ప్రసాద్ – భండారు శ్రీనివాసరావు
25, అక్టోబర్ 2021, సోమవారం
ఆగండి వినండి గమనించండి వెళ్ళండి
ఉద్యమ పార్టీల పుట్టుక, ఎదుగుదల ఎన్నో ప్రతికూల పరిస్తితుల నడుమ సాగుతాయి. ఇందుకు టీఆర్ ఎస్ పార్టీ కూడా మినహాయింపు కాదు. రెండు దశాబ్దాల నాటి సంగతులను సింహావలోకనం చేసుకుంటే ఎన్ని బాలారిష్టాల నడుమ ఈ పార్టీ బతికి బట్ట కట్టిందీ అవగతమవుతుంది.
తెలంగాణా
ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదు. ప్రత్యేక తెలంగాణా సాధన కోసం గతంలో కూడా పలుమార్లు
ఉద్యమాలు జరిగాయి. అయితే ప్రతిసారీ అవి హింసాత్మకంగా మారాయి. సాధించింది ఏమీ
లేకపోవడంతో అసలు ఉద్యమాల పట్లనే ప్రజలకు ఏవగింపు కలిగే పరిస్తితుల్లో కేసీఆర్
రంగప్రవేశం చేసి సుదీర్ఘ శాంతియుత పోరాటానికి బాటలు వేశారు. స్వల్ప సంఘటనలు
మినహాయిస్తే పుష్కర కాలం పైచిలుకు సాగిన తెలంగాణా సాధన పోరాటంలో ఎక్కడా అపశృతులు
దొర్లిన దాఖలాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ముందు చెప్పినట్టు, వినూత్నంగా
ఆలోచించే కేసీఆర్ తత్వం, ఏ దశలోనూ తెలంగాణా
ఉద్యమ స్పూర్తిని దెబ్బతినకుండా
కాపాడింది. ఉద్యమజ్యోతి వెలుగులు మసిబారకుండా చూసింది. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన
ప్రసంగాలు, వ్యాఖ్యలు, సీమాంధ్రుల మనోభావాలను కొంత మేరకు దెబ్బతీసేవిలా
ఉన్నప్పటికీ, తెలంగాణావాదుల ఉద్యమ తీవ్రత తగ్గుముఖం
పట్టకుండా ఎప్పటికప్పుడు చేయగలిగాయి. వెలుగుతున్న
పెట్రోమాక్స్ లైట్ లో గాలి ఒత్తిడి తగ్గి,
వత్తి ఎర్రబడుతున్నప్పుడల్లా, పంపుతో గాలికొట్టి
మళ్ళీ వత్తిని తెల్లగా ప్రకాశవంతం చేసినట్టు,
ఉద్యమకాలంలో కేసీఆర్ తన వ్యూహాలను, ఎత్తుగడలను తాజా రాజకీయ పరిణామాలకు, పర్యవసానాలకు తగినట్టుగా మార్చుకుంటూ ప్రత్యేక తెలంగాణా
ఆకాంక్ష ప్రజల్లో సజీవంగా వుండిపోయేట్టు చేయగలిగారు. ఈ పరిణామ క్రమంలో కేసీఆర్ ఎదుర్కున్న
ఇబ్బందులు, మోసిన నిందలు అన్నీ ఇన్నీ కావు. తీసుకున్న ప్రతి నిర్ణయం అవహేళనలకు
గురయింది. వేసిన ప్రతి అడుగు అపనిందల పాలయింది. అయినా కేసీఆర్ ప్రతి మలుపును
గెలుపు దిశగా మళ్ళించుకుని, పార్టీకి ఎప్పటికప్పుడు నూతన జవసత్వాలను అందిస్తూ
పోయారు. దశలు దశలుగా, రూపాలు మార్చుకుంటూ
సాగించిన ఉద్యమం ఒక కొలిక్కి రావడానికి పట్టిన సమయం కూడా పుష్కర కాలం పైమాటే. మరి అన్నేళ్ళు ఒక ఉద్యమ పార్టీ
ఊపిరి పీల్చుకోవాలంటే మాటలు కాదు. సాధ్యమూ కాదు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం
చేయగలిగిన సత్తా ఉండబట్టే కేసీఆర్ తెలంగాణా ప్రజల దృష్టిలో ఒక గొప్ప నాయకుడు
కాగలిగారు. మొత్తం మీద ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు.
సరే
ఇదొక ఎత్తు అనుకుంటే, అధికారం సిద్ధించిన తరువాత ఎదురయ్యే పరిణామాలను
సమర్ధవంతంగా నిభాయించుకోవడం మరో ఎత్తు. ఏమరుపాటుగా
వుంటే చాలు ఏమి చేయడానికయినా సిద్ధం అన్నట్టు వ్యవహరించే ఇతర పార్టీల్లోనే కాదు
స్వపక్షంలోని రాజకీయ శక్తులను కూడా ఆదిలోనే కట్టడి చేసి, తనదారి లోకి తెచ్చుకున్న విధానం
కేసీఆర్ వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని వెలుగులోకి
తెచ్చింది. ఆయన ఒక ఉద్యమ నేత మాత్రమే కాదు, చాణక్య నీతిని సయితం
వంటబట్టించుకున్న వ్యూహకర్త అని ప్రపంచానికి వెల్లడయింది.
అందలం
ఎక్కినంత మాత్రాన పండగ కాదు. తెలంగాణాలో రాజకీయం చాలా విభిన్నమైనది. ఈ ప్రాంతంలో
రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తూ వుంటుంది.
లక్ష్యసాధనలో ఏకోన్ముఖంగా సాగిన తెలంగాణా సమాజం అదేమాదిరి కొత్త ప్రభుత్వం
చేసిన ప్రతి పనికీ తలూపకపోవచ్చు. తెలంగాణా స్వప్నం నెరవేరింది కనుక, ఇప్పుడు ప్రజల
దృష్టిలో ఒకప్పటి ఉద్యమ పార్టీ, ఇప్పటి పాలక
పక్షం అయిన టీఆర్ఎస్ కూడా రాష్ట్రంలోని
అన్ని రాజకీయ పార్టీల్లో ఒకటి మాత్రమే.
ఒక
విషయం పార్టీ అధినేత గుర్తుంచుకోవాలి. ఉద్యమ సమయంలో జరిగిన విధంగానే అన్ని
వైపులనుంచి ప్రత్యర్ధులు బాణాలు గురిపెడతారు. పద్మవ్యూహాల రచన బృహత్తరంగా
సాగుతుంది. వాళ్ళు ఎక్కుబెట్టే అస్త్రాల పదును పెరగడానికి పాలకపక్షం స్వయంకృతాపరాధాలు కూడా తోడ్పడడానికి
అవకాశం వుంది.
అన్నిటికన్నా
ముఖ్యం, అలనాడు ప్రజల్లో అపరిమితంగా భావోద్వేగాన్ని రగిల్చిన తెలంగాణా అనే బ్రహ్మాస్త్రం ఇప్పుడు టీఆర్ఎస్ అంబుల పొదిలో లేదు. అదిప్పుడు
స్వతంత్ర భారత దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రం రూపంలో ఆవిర్భవించి ఏడేళ్లు దాటిపోయాయి.
టీఆర్
ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఏళ్ళు. వ్యక్తుల జీవితాల్లో అయినా, వ్యవస్థల జీవితాల్లో అయినా ఈ వయసు
చాలా ప్రమాదకరమైనది. దారి తప్పడానికి,
గాడి తప్పడానికి ఈ ప్రాయమే కారణం. ఒకింత జాగ్రత్త పడగలిగితే అవసరమైన పరిణతి లభిస్తుంది. ఆగి, నిలిచి, వెనక్కి తిరిగి చూసి తిరిగి ముందడుగు వేయాల్సిన సమయం.
అధికారంలో
ఉన్నవాళ్ళకి ఎన్నో చేశామనే అభిప్రాయం వుంటుంది. అన్నీ చేయలేదేమో అని కొందరికి
అనిపిస్తే తప్పు పట్టాల్సిన పని లేదు. ప్రాధాన్యతల ఎంపికలో వచ్చే తేడా ఇది.
టీఆర్ఎస్
ప్లీనరీలో ఇటువంటి ‘కీలక’ అంశాలపై దృష్టి పెట్టాలనేది హిత వాక్యం.
(25-10-2021)
ఈనాటి మీడియా - భండారు శ్రీనివాసరావు
24, అక్టోబర్ 2021, ఆదివారం
ప్రజలు గమనిస్తున్నారు - భండారు శ్రీనివాసరావు
22, అక్టోబర్ 2021, శుక్రవారం
నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య......
ఫీల్డ్ మార్షల్ మానెక్ షా అంటే ఆషామాషీ కాదు. అప్పటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్ కు నో అని
మొహం మీదనే చెప్పగలిగిన ధీశాలి. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వెంట ఆయన కుమార్తె
ఇందిరా గాంధి సైనిక స్థావరాల్లోకి ప్రవేశించడానికి అనుమతించని గొప్ప సైనికాధికారి.
21, అక్టోబర్ 2021, గురువారం
దారి ఇచ్చిన కుక్క – భండారు శ్రీనివాసరావు
వృత్తి - ప్రవృత్తి - భండారు శ్రీనివాసరావు
యాచక ప్రవృత్తి కంటే యాచక వృత్తి మేలంటారు డాక్టర్ బాలాజీ
20, అక్టోబర్ 2021, బుధవారం
మీడియాకు విజ్ఞప్తి – భండారు శ్రీనివాసరావు
మంచితనానికి దైవానుగ్రహం తోడయితే..... భండారు శ్రీనివాసరావు
మూడేళ్ల క్రితం ఇదే రోజున తిరుమలమ్మ మా ఇంటికి వచ్చింది. పోల్చుకోవడానికి కొంత సమయం పట్టిన మాట నిజం.
19, అక్టోబర్ 2021, మంగళవారం
రేడియో ప్రాంగణంలో సమాధి చేయాలి – రావూరి భరధ్వాజ కడపటి కోరిక
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ గారి రెండో వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాల్ని మననం చేసుకుంటూ రాసిన దానికి ఇది జోడింపు." భరద్వాజ గారికి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించినప్పుడు ప్రముఖ జర్నలిష్టు రెంటాల జయదేవ్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. అది ప్రజాశక్తిలో వచ్చింది. మనసు ఆర్ద్రం అయ్యే ఒక జవాబు చెప్పారు అందులో భరద్వాజ గారు. నేను రేడియో మనిషిని కనుక దాన్ని అందరితో పంచుకోవాలని సహజంగా అనిపించింది. అదే ఇది.
"ఆకాశవాణిలో
ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది? రెంటాల గారి
ప్రశ్న. భరద్వాజ గారు ఉద్వేగానికి గురవుతూ ఇచ్చిన సమాధానం :
"కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో
ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన
సంస్థ – ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే
చాలా ఎక్కువ. హైదరాబాద్ ఆకాశవాణిలో నాకు ఉద్యోగం రావడానికి కారణమైన రచయిత
త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశకం
ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ
జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా…) నాకు ఒకే ఒక్క
కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ
శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ
దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో
ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!" (రెంటాల గారికి కృతజ్ఞతలు)