31, ఆగస్టు 2021, మంగళవారం

కధలు రాయడం ఎలా! – భండారు శ్రీనివాసరావు

 (ఆగస్టు 31ఆరుద్ర జయంతి)



నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ దుర్మార్గానికి పూనుకుంది కూడా నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’

కధలెలా రాయాలి’ అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.

పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా అంతే వుంటుంది. ఆరుద్ర గారంటే మాటలా మరి!


NOTE: Courtesy Image Owner

 

సర్వకళల సమాహారం – హరికధ


(ఈ రోజు హరికధా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి)

కానీ హరికధలంటే బోరు కొట్టే కధలు మాత్రం కాదు.హరికధలు, ఒకానొక కాలంలో జనాలను కట్టిపడేసిన భక్తిరస ధునులు. ప్రజలను సమ్మోహితులను చేసిన శ్రవణానందకర ధ్వనులు.
ఈ నాటి పిల్లలకు కాని ఇంకా చాలామంది పెద్ద వాళ్ళకు కాని హరికథ అనే ప్రసిద్ధ కళా రూపం వొకటి వుందని కూడా తెలియదేమో అనిపించే రోజుల్లో జీవిస్తున్నాము. ఎనభయ్యో దశకములో కూడా హరికథకు ఎంతో కొంత ప్రభావము వుండేది.
యాభయ్, అరవై దశకాల్లో అయితే హరికథ ఎంతో ఉచ్చ స్థితిలో వుండేది. దేవాలయాల ఉత్సవాలలో, వినాయక చవితి, దేవి నవరాత్రుళ్ళు, శ్రీరామ నవమి పందిళ్ళలో, పెద్ద స్థితిమంతుల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలలో హరికథా కాలక్షేపాలు ఉండేవి. మధ్య మధ్యలో వేసవికాలంలో కూడా గ్రామస్తులు అంతా కలసి రామాయణమో, మహా భారతమో సీరియల్ గా చెప్పించుకొనేవారు. సాంస్కృతిక కార్యక్రమాలు నెలనెలా నిర్వహించే గాన సభల్లో కూడా ఏడాదికి వోసారి అయినా హరికకధ పెట్టించే వారు.

“హరికధ అనేది సర్వ కళాసమాహారం. హరికథ చెప్పే దాసు గారికి సాహిత్యం, సంగీతం క్షుణ్ణంగా వచ్చి తీరాలి. రామాయణ,భారత,భాగవతాదులు కరతలామలకంగా వుండాలి. కొద్దో గొప్పో నాట్యం తెలిసి వుండాలి. వీటన్నితో పాటు సమయస్పూర్తి, చతురత, రక్తి కట్టించే సామర్ధ్యం అవసరం. అభినయ కళ తెలిసివుండడం కూడా ముఖ్యం. ఇన్ని వుంటేనే ఉంటేనే దాసుగారికి బంతిపూల దండలు దండిగా పడేది. హరి కథలు చెప్పే దాసుగారిని భాగవతార్ అని పిల్చేవారు. అమ్ముల విశ్వనాథ భాగవతార్ అలా. హరికథకి వయోలిన్, మృదంగం పక్క వాయిద్యాలు. దాసుగారు కుడిచేతిలో చిడతలు పట్టుకొని కీర్తనలు పాడేటప్పుడు తాళం వేస్తూ వుండే వారు. కాళ్ళకు గజ్జెలు. దాసు గారి ఆహార్యం పట్టు పంచె, పట్టు ఉత్తరీయం, నుదుట సింధూరం. అన్నట్టు దాసుగారు తనతో ఎప్పుడూ తీసుకు వెళ్ళేది శ్రుతి బాక్స్.

“కథా ప్రారంభంలో దాసుగారు పక్క వాయిద్యాల సమేతంగా వేదిక మీద కూర్చునే గణపతి ప్రార్ధనతో మొదలుపెట్టి తాను ఏ కధ చెప్పదలచుకొన్నారన్నది సూచన ప్రాయంగా తెలియచేస్తూ రెండు మూడు కీర్తనలు పాడే వారు. తర్వాత లేచి నిలబడి, గజ్జెలు కళ్ళకు అద్దుకొని, వాటిని కాళ్ళకు కట్టుకొని, ‘శ్రీమద్రమారమణ గోవిందా’ అని తానంటూ, సభికులందరి చేతా గట్టిగా అనిపిస్తూ కథలోకి ఉపక్రమించే వారు. కీర్తనలు ఆలపించేటప్పుడు పక్క వాయిద్యాల సహకారం తీసుకొనే వారు. సందర్భోచితంగా నాట్యం చేస్తూ కథను రక్తి కట్టించే వారు. నిద్రలో జోగే శ్రోతలను మేలు కొలిపెందుకు మధ్యమధ్యలో గోవిందలు కొట్టించేవారు. సినిమాలో కూడా హరికథలు పెట్టేవారు. పది పదిహేను నిమషాలు ఉండేవి. విజయా వారి షాహుకారు సినిమా హరికథ తోనే ప్రారంభం అవుతుంది. నాగేశ్వరరావు కృష్ణకుమారి నటించిన కవితా వారి వాగ్దానం సినిమాలో రేలంగి హరిదాసుగా ఘంటసాల పాడిన సీతా కల్యాణం చాలా మంది ఇష్టపడే మరపు రాని హరికథ.
“హరికథ అంటే ఆది భట్ల నారాయణ దాసు గారి పేరే అందరికి గుర్తుకు వస్తుంది. విజయనగరం సంస్థానం ఆస్థాన విద్వాంసులు ఆయన. ఫిడేలు ద్వారం వెంకట స్వామి నాయుడు గారికి ముందు విజయనగరం సంగీత కళా శాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు కూడా. హరికధ చెప్పే ప్రతివారు మేము నారాయణదాసు గారి శిష్యులమనో లేదా ఆయన కథలు చెపుతున్నామనో చెప్పుకొనేవారు. ఇప్పటికి కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో నారాయణ దాసు గారి ఉత్సవాలు చేస్తూ వుంటారు.
కూచిభొట్ల కోటేశ్వర రావు అనే ఆయన బక్క పలచగా పొడుగ్గా వుండేవారు. భక్త పోతన హరికథ ఎంతో గొప్పగా చెప్పే వారు. లలిత సరస గాన కళానిధే అంటూ ప్రార్ధన చేసేవారు. లేచి నిల్చున్న వెంటనే వాసుదేవ అని కళ్యాణి రాగంలో త్యాగరాజ కీర్తన ఎంతో శ్రావ్యంగా పాడే వారు. సందర్భానికి తగ్గట్టుగా పిట్ట కథలు చెప్పే వారు. పోతన భాగవతాన్ని అమ్ముకోలేక ఎంత బాధ పడ్డాడో అందరికీ తెలిసిందే. పోతన గారిలాగే కూచిభొట్ల వారుకూడా తమకున్న అద్భుతమయిన హరికథా విద్యను అమ్ముకోలేదు. ఏమిస్తే అది పుచ్చుకొనే వారు. పెద్ద వారయినా పెద్ద మనసు వున్నవారు. ప్రాతఃస్మరణీయులు. అమ్ముల విశ్వనాధం గారు మరో గొప్ప విద్వాంసులు. చల్లపల్లి, అవని గడ్డ ప్రాంతం వారు. స్ఫురద్రూపి. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులు.మండలి బుద్ధప్రసాద్ గారు ప్రచురించిన దివిసీమ రత్నాలలో అమ్ముల విశ్వనాధం గారి గురించి చాలా వివరంగా వుంది. నారాయణదాసు గారి తర్వాత బహుశః శిలా విగ్రహం వేయించుకోగలిగిన గౌరవం పొందింది అమ్ముల వారే. శివధనుర్భంగం కథ చాలా గొప్పగా చెప్పేవారు. అమ్ముల విశ్వనాధం గారి అమ్మాయి దుర్గాభవాని ప్రస్తుతం విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది.
“సీరియల్ హరికథల గురించి కొంత చెప్పాలి. పొలం పనులు అయిపోయి అందరు తీరిగ్గా వున్నప్పుడు సీరియల్ హరికథలు పెట్టించుకునేవారు. గుళ్ళో కళ్యాణ మండపం స్టేజిగా రామాయణమో, భారతమో పూర్తిగా చెప్పించే వారు. రాత్రి ఏడు ఎనిమిది మధ్య ప్రారంభమయిన కథ పన్నెండు గంటల దాకా సాగేది. మధ్యలో హారతి పళ్ళెం పట్టే వారు. హరికధ వినడానికి వచ్చిన హారతి పళ్ళెంలో తమకు తోచిన విధంగా అణా, అర్ధణా, బేడా, పావలా కాసులు వేసేవాళ్ళు. పళ్ళెం మధ్యలో చిన్న కుంది పెట్టి వొత్తి వెలిగించి దీపం పెట్టే వాళ్ళు. చీకట్లో కొంతమంది అణా వేసి పావలా కొట్టేసేవారని జోకులు కూడా ఉండేవి. చిల్లర లేక పోతే హారతి పళ్ళెం పట్టే వాడిని అడిగి తీసుకునే వెసులుబాటు వుండేది. ‘నా దగ్గర పావలా వుంది నేను వో అణా వెయ్యాలి మిగతాది ఇచ్చెయ్యి’ అని అడిగి తీసుకునే వారు.వీరగంధం వెంకట సుబ్బారావు, రాజశేఖరుని లక్ష్మీపతి రావు, ర్యాలి రామచంద్ర రావు, కంచిభొట్ల వీర రాఘవయ్య, నౌడూరి విశ్వనాధ శాస్త్రి , కడలి వీరదాసు, ముదపాక మల్లేశ్వర రావు, ప్రగడ వీర భద్ర రావు, ముదునూరు శంకర్ రావు, ఎల్లమంద రావు, చోరగుడి పాండురంగరావు గార్లు హరికధలు చెప్పడంలో దిట్టలుగా పేరుతెచ్చుకున్నారు. ములుకోట్ల సదాశివ శాస్త్రి గారు అని తెనాలి అనుకొంటా. హైస్కూల్ లో తెలుగు మాష్టారుగా వుండే వారు. త్యాగరాజ చరిత్రను రామ భక్తి అంతా జోడించి చెప్పే వారు. పాతూరి మధుసూదన్ రావు గారు మొత్తం సంస్కృతంలోనే హరికథ చెప్పే వారు, సంసృతం రాని వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా. రేడియోలో ప్రయాగ నరసింహ శాస్త్రి గారు, ఏ కధ అయినా అనర్ఘళంగా చెప్పేవారు. షెడ్యూల్ చేసిన ప్రోగ్రాం లేక పోతే ప్రయాగ వారి హరికథ వుండేది. గాంధీ, నెహ్రు, బోస్ చరిత్రలు కూడా ఆయన హరికధలుగా చెప్పే వారు.
“తర్వాత తరంలో అందరికీ తెలుసున్న వ్యక్తి కోట సచ్చిదానంద శాస్త్రి గారు. చాలా రమణీయంగా హాస్యోక్తులతో ఎన్ని గంటలు విన్నాఇంకా ఇంకా వినాలనిపించేలా చెప్పేవారు.
“బుర్రా శివరామకృష్ణ శాస్త్రి కూడా మంచి కథకులు. ఆడ వారిలో కూడా మంచి విద్వాంసులు వున్నారు. తెనాలి ఉమా చౌదరి భాగవతారిణి కొన్నేళ్ళపాటు ఆంధ్రదేశంతో పాటు ఇతర రాష్ట్రాలోని తెలుగు వారికి సయితం అభిమాన పాత్రులయ్యారు. నగరాజకుమారి, వజ్రాల విజయ శ్రీ , మంత్రిప్రగడ లలిత కుమారి చెప్పే హరికథలు అంటే జనం చెవి కోసుకొనే వారు.
పోతే, మరో ప్రసిద్ధ హరికధా విద్వాంసులు బుద్ధవరపు కురంగేశ్వర రావు గారు. వీరి గురించిన ప్రస్తావన ‘నియోగి సర్వస్వం’ లో వున్నట్టు తెలియచేసారు. హరి కధలు చెప్పడంలో వీరు అందె వేసిన చేయి. అపర రామ దాసు అని పేరు. రామదాసు హరికధ చెబుతూ రామా రామా అంటూనే కైవల్యం చెందారట. ప్రసిద్ధ రచయిత శ్రీ నిడదవోలు వెంకటరావు గారు శ్రీ కురంగేశ్వర రావు గారి హరికధా గాన ప్రశస్తి గురించి తన రచనల్లో ప్రస్తావించారు. ఆయన తన అనుభవాన్ని ఇలా రాశారు. “ నేను వీరి కధను విని తన్మయత్వము చెందిన వారిలో ఒకడిని. కధ చెబుతూ భక్తి పారవశ్యములో తన్మయత్వములో అట్లే నిలిచెడివారు. అప్పుడు హారతి నొసగిన తరువాత తిరిగి కధ ప్రారంభించెడివారు.”
“రాజమండ్రి దగ్గర కపిలేశ్వరపురం జమీందార్ సత్యనారాయణరావు గారు సర్వారాయ హరికథ గురు కులం ప్రారంభించి, హరికధలపట్ల ఆసక్తివున్న వారికి అక్కడే వసతి కల్పించి రెండు మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేసారు. ఇప్పుడు హరికథ చెపుతున్నవారిలో చాలా మంది కపిలేశ్వరపురం గురుకులం విద్యార్ధులే - ఉమా మహేశ్వరితో సహా. ఉమా మహేశ్వరి చాలా చిన్నతనంలోనే సంసృతంలో హరికధ చెప్పి అందరిని మెప్పించారు. మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులు కళా కృష్ణ గారిని వివాహం చేసుకొని ఈ దంపతులిద్దరూ వొకరు పేరిణి నాట్యం ద్వారా మరొకరు హరికథ ద్వారా కళాసేవ చేస్తున్నారు.
ఆచార్య తూమాటి దోణప్ప గారు హరికధా సర్వస్వం అనే గ్రంధం రాశారు. తెలుగు యూనివర్సిటీ వారు తమ రజితోత్సవాల సందర్భంగా తక్కువ ధరకు అమ్మిన పుస్తకాల్లో ఇది కూడా వుంది. ఇంకా అవి వున్నాయో లేదో కూడా తెలియదు. హరికధను అభిమానించే వారంతా కొని దాచుకోవాల్సిన పుస్తకం.

“రేడియోలో ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకు గంట సేపు హరికథ వచ్చేది. రేడియో సంగీత సమ్మేళనం, నాటక సప్తాహంలాగా హరికథా సప్తాహం కూడా నిర్వహించే వాళ్ళు. హరిదాసులు అందరు వారి లెటర్ హెడ్స్ పైనా, కర పత్రాల పైనా ‘రేడియో ఆర్టిస్టు’ అని వేసుకొనే వారు. ఇప్పుడు కూడా హరికథలు ప్రసారం చేస్తున్నారో లేదో తెలియదు. చేస్తే చాలా సంతోషం. మానేస్తే అంత కంటే అన్యాయం మరోటి వుండదు. తోలుబొమ్మలాటలు పోయాయి. పౌరాణిక నాటకాలు మరచి పోతున్నారు. హరికథని అలా కానివ్వకూడదు. తమిళనాడులో ఇంకా హరికధ ఆదరణకు నోచుకుంటూనే వుందన్న సంగతి మరచిపోకూడదు.
“గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కధా గాన కళా పరిషద్ ఏర్పాటు చేసింది. సంగీత,సాహిత్య, నాటక అకాడమీల్లాగానే అది కూడా కాలగర్భంలో కలసిపోయింది. అలాగే బుర్రకధలు. ఎన్నికలప్పుడే ప్రచారాలకోసం గుర్తుకొచ్చే విధంగా క్రమంగా మాయమయిపోతున్నాయి.

(31-08-2021)

30, ఆగస్టు 2021, సోమవారం

ఇదీ సంగతి

 రాత్రి అమెరికా నుంచి మా అన్నయ్య కుమారుడు సత్య సాయి ఫోన్ చేశాడు.

ఈనాడు దినపత్రిక నెట్ ఎడిషన్ లో చాలా రోజుల నుంచి కార్టూనిస్ట్ శ్రీధర్ ఇదీ సంగతి కార్టూన్లు కనిపించడం లేదు, కారణం ఏమిటని ఆరా తీశాడు. గత నెల ఆగస్టు పదమూడున శ్రీధర్ వేసిన కార్టూన్ ఆఖరు సారి నెట్ ఎడిషన్ లో వేశారని, అప్పటినుంచి రావడం లేదని వివరం చెప్పాడు.

రెండు రోజుల క్రితమే ఫేస్ బుక్ లో శ్రీధర్ ఉద్యోగపర్వం నలభయ్ రెండేళ్లుగా సాగుతోందని, ఆ పత్రికలో ఇదొక రికార్డు అని పేర్కొంటూ ఒక పోస్టు చూశాను. మళ్ళీ ఈరోజు శ్రీధర్ ఫేస్ బుక్ లో ‘ఈనాడుతో తన బంధం ముగిసిందని, రాజీనామా చేశాను’ అని రెండే రెండు చిన్న వాక్యాలతో ఓ బుల్లి పోస్టు పెట్టారు. అది బాగా వైరల్ అయింది. కారణాలు ఎవరికి వారు ఊహించుకుని రాయడమే కానీ ఇదమిద్ధంగా తెలియదు. తెలిసినదల్లా శ్రీధర్ ఈనాడు నుంచి తప్పుకున్నారని మాత్రమే.

ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్న సత్య సాయికి శ్రీధర్ కార్టూన్లు అంటే తగని మక్కువ. అందుకే కార్టూన్లు రావడం లేదు అనే ఎరుక అతడిలో కలిగింది. ఇలాంటి అభిమానులు పెద్ద సంఖ్యలో వున్న శ్రీధర్ అదృష్టవంతుడు.

ఈనాడులో శ్రీధర్ వేసిన మొట్టమొదటి కార్టూన్ అంటూ ఒకటి వైరల్ అవుతోంది. అదే ఇది. కార్టూనిస్ట్ శ్రీధర్ కు ధన్యవాదాలు




 

(30-08-2021)

తరం మారుతోంది – భండారు శ్రీనివాసరావు

 

‘మీరలా కాసేపు ప్రెస్ క్లబ్ కి వెళ్లి రండి. ఇంట్లో వుండి ఇలా కాళ్ళకు చేతులకు అడ్డం పడుతూ, వచ్చిన పనివాళ్ళని కసురుకుంటూ వుంటే ఇల్లు సర్దడం ఇప్పట్లో కాదు’ అనేది మా ఆవిడ మేము ఇల్లు మారినప్పుడల్లా.
అన్నీ ఒక పద్దతిగా చేయాలనేది నా థియరీ, అసలు ఏ పద్దతి నాకు తెలియకపోయినా.
ముందు బీరువాలు పెట్టాలి, తర్వాతే మంచాలు. అప్పుడు అన్నీ తేలిగ్గా అమరుతాయి. ఆ మాటే వచ్చిన వర్కర్లతో చెప్పాను అంటే మా ఆవిడ వినిపించుకునేది కాదు. ‘చెబితే చెప్పారు, అలా కసురుకుంటూ చెప్పడం ఏమిట’ని లా పాయింటు తీసేది. దాంతో ఆమె చెప్పినట్టే ఎక్కడో కాలక్షేపం చేసి ఇంటికి వచ్చేసరికి చిందరవందరగా వున్న ఇల్లు కాస్తా కడిగి తుడిచిన అద్దంలా కనిపించేది.
మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత మా పిల్లలు అంటే కొడుకూ, కోడలు ఇంటి సంప్రోక్షణ (ప్రక్షాళన) మొదలు పెట్టారు. మూడు రోజులుగా ఇంట్లో పనులు జరుగుతున్నా కేకలు, అరుపులు లేవు. పనివాళ్ళకి ఏమి కావాలో మెల్లిగా చెప్పి చేయిస్తున్నారు. వాళ్ళు కూడా ఎదురు చెప్పకుండా చేస్తున్నారు.
ఎక్కడ వచ్చింది ఈ తేడా ?
జవాబు సులభంగా చెప్పవచ్చు.
తరం మారుతోంది.
(30-08-2021)

బిగ్ జీరో – భండారు శ్రీనివాసరావు

 

“ఏదో అనుకున్నాకానీ నువ్వో బిగ్ జీరో”

అన్నారు ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మ గారు.

అప్పుడు నేను ఆయన దగ్గర సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు సుదీర్ఘ సెలవులో పోవడం వల్ల నాకు అనుకోకుండా కలిగిన అదృష్టం అది. దినపత్రికలో సబ్ ఎడిటర్ గా ఉన్న నన్ను ఎడిటర్ నండూరి రామ్మోహన రావు గారు కొన్నిరోజులపాటు పురాణం గారికి సాయంగా ఉండమన్నారు.

ఆరోజుల్లో, పేరు జ్ఞాపకం రావడం లేదు కానీ ఒక తెలుగు చిత్రానికి కధ, మాటలు రాసే అవకాశం పురాణం గారికి వచ్చింది. బెజవాడ బీసెంటు రోడ్డులోని మోడరన్ కేఫ్ లో ఒక గది ఇచ్చారు నిర్మాతలు. పగలు ఆఫీసు పనిచూసుకుని సాయంత్రానికి పురాణం గారు అక్కడికి వచ్చేవారు. ఆ పని పూర్తికావస్తున్న దశలో కాబోలు నన్ను సాయంగా రమ్మన్నారు.

ఆయన గారి ఆలోచనలు జెట్ స్పీడు. దానికి తగ్గట్టుగా వాటిని కాగితాలపై పెట్టడం నా పని, నన్నయభట్టుకు నారాయణ భట్టు మాదిరిగా. ఆయన చెబుతూ వుండడం నేను రాస్తూ పోవడం. నేను పత్రికా విలేకరినే కానీ తెలుగు షార్ట్ హ్యాండ్ గట్రా ఏమీ తెలవ్వు. అంచేత కొన్ని నట్లు పడేవి. ఆ సందర్భంలో ఒక రోజు పురాణం వారు అక్షింతలు వేస్తూ అన్న మాట ఇది. పెద్దవారి అక్షింతలు ఆశీర్వాదాలే కదా! 

ఇంతకీ ఆయన ఆ ఒక్క మాటే అని ఊరుకోలేదు. 

ఆయన అన్నదేమిటంటే:

“శ్రీనివాసరావ్! నువ్వో జీరో లాంటివాడివి. నీ సంగతి నీకు తెలవదు. ఎవరన్నా నీకు దన్నుగా వుంటే నీ విలువ ఇంకా బాగా పెరుగుతుంది, ఒకటి పక్కన సున్నా లాగా”

ఆయన ఏక్షణంలో అన్నారో తెలవదు. 

ఈ సున్నా పక్కన మా ఆవిడ వచ్చి నిలబడిన తర్వాత కానీ ఆ విషయం బోధపడలేదు.

ఇప్పుడు మళ్ళీ సున్నా సున్నా అయింది, పక్కన దన్నుగా నిలబడ్డ మనిషి పోయాక.



28, ఆగస్టు 2021, శనివారం

రేడియో అభిమాని – భండారు శ్రీనివాసరావు

 

మంగళగిరి ఆదిత్య ప్రసాద్ అనేది ప్రసార భారతిలో కొత్తగా చేరి పనిచేసేవారికి ఒక అధికారి పేరు. కానీ సంగీత పరిజ్ఞానం కొద్దో గొప్పో వున్నవారికి మాత్రం ఆయన ఒక సంగీత కారుడు. రేడియో అంటే సంగీతం అనుకునేవారు ఇలాటి అధికారులు రావాలని. వుండాలని కోరుకుంటారు. కాని ప్రసాద్ గారు మాత్రం రేడియో శ్రోతల సంఖ్య పెరగాలని కోరుకుంటూ వుంటారు. సందర్భం దొరికినప్పుడల్లా సమయం చూసుకుని తన మనసులోని మాటని బయట పెడుతుంటారు.


(మంగళగిరి ఆదిత్య ప్రసాద్)




కొన్నేళ్ళ క్రితం మంగళగిరి ఆదిత్య ప్రసాద్ రేడియో స్టేషన్ ఉత్తరాదికారిగా పనిచేస్తున్నప్పుడు తెలిసిన వాళ్ళు ఆయన్ని "ఇప్పడు రేడియోలు ఎక్కడ దొరుకున్నాయండీ" అడుగుతుండేవారు. దానికి జవాబు ఆయన వద్ద సిద్ధంగా వుంటుంది. కాకపొతే మాటల రూపంలో కాదు, చేతల రూపంలో. అలా అడిగినవారికి ఒక చిన్న సైజు ట్రాన్సిస్టర్ రేడియో ఇచ్చి 'రేడియో దొరికింది కదా! ఇక వినండ'ని అంటుంటారని ఆయన గురించి మెచ్చుకోలుగా చెప్పుకునే ఒక జోకు ప్రచారంలో వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిత్య ప్రసాద్ గారు రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ గారెని మర్యాదపూర్వకంగా  కలుసుకున్నప్పుడు ఏకంగా వారికి ఒక బుల్లి రేడియో కానుకగా ఇచ్చారట. దాన్ని స్వీకరించిన గవర్నర్ ఎంతగానో సంతోషించారట.  కొన్నేళ్ళ క్రితం హైదరాబాదు ఆకాశవాణి ప్రాంగణంలో డాక్టర్  ఆర్. ఏ. పద్మనాభరావు గారు రచించిన 'అలనాటి ఆకాశవాణి' పుస్తక ఆవిష్కరణ సభలో ఆయనే ఈ విషయాన్ని మర్యాదకు భంగం కలగని రీతిలో చాలా మన్ననగా ప్రస్తావించారు. 'రేడియో ప్రచార సభ' ఆలోచన కూడా వారిదే.

రేడియో శ్రోతల సంఖ్య పెరగాలన్న ఆదిత్య ప్రసాద్ గారి కోరిక నెరవేరాలని కోరుకుందాం.

అయితే అదే సభలో సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి  కేవీ రమణాచారి గారు చెప్పినట్టు 'హాయ్ ఓయ్ రేయ్' అంటూ చెలరేగిపోయే మిర్చీ బజ్జీ శ్రోతలు కాదు. మంచి సంగీతాన్ని, మనిషికి కావాల్సిన విజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి శ్రోతల సంఖ్య పెరగాలి. అందుకు నాందిగా ఆదిత్య ప్రసాద్ గారి మాదిరిగా ఒకరికొకరు చిన్న చిన్న రేడియోలు చిరుకానుకలుగా ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం రావాలి.

27, ఆగస్టు 2021, శుక్రవారం

మ్యూజియంలో కృతజ్ఞత

గూగుల్ ఇమేజ్ సెర్చ్ చేస్తుంటే ఒక కార్టూన్ కనిపించింది.

కంప్లెయంట్స్ (ఫిర్యాదులు), గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత) అనే రెండు కౌంటర్లు వుంటాయి.
పిర్యాదుల కౌంటర్ వద్ద పెద్ద క్యూ వుంటుంది.
కృతజ్ఞతలు తెలపాల్సిన కౌంటర్ దగ్గర మాత్రం ఒక్క మనిషీ కనబడడు.
ఆ కార్టూన్, వర్తమాన ప్రపంచానికి, ముఖ్యంగా భారత దేశానికి అద్దం పట్టే కార్టూన్ అని నాకు అనిపించింది.
కొన్నాళ్ళ తరువాతో, కొన్నేళ్ళ తరువాతో పిల్లలకు ‘కృతజ్ఞత’ గురించి తెలియచెప్పాలంటే, మ్యూజియంకు తీసుకు వెళ్ళాలేమో!
బయట ప్రపంచంలో కానరాని వాటిని చూడగలిగేది మ్యూజియంలలోనే కదా!



NOTE: Courtesy Image Owner

అమెరికాలో శునక వైభోగం – భండారు శ్రీనివాసరావు

 

ప్రతి కుక్కకి ఓ (మంచి) రోజు వస్తుంది (Every dog has it’s day) అని ఆంగ్లంలో ఓ నానుడి వుంది. బహుశా దీన్ని గుర్తించి కాబోలు సంవత్సరంలో ఒక రోజును (ఈ ఏడాది ఆగస్టు, 26)శునకముల దినం  అంటే కుక్కల రోజుగా పరిగణిస్తున్నారు. ఈ ఇంగ్లీష్ వాళ్ళంటే ఇప్పుడు మొదలు పెట్టారు కానీ మనకు కోర్ల(కుక్కల) పున్నమి అని ఓ పండుగే వుంది. ఆ రోజున గారెలు వండి వీధుల్లో తిరిగే కుక్కలకు ఆ గారె తునకలు పెట్టడం చిన్నప్పుడు చాలా సరదాగా వుండేది. ఆ ఒక్క రోజు కుక్కల్ని ఎంత మురిపెంగా చూసినా మర్నాటి నుంచి ఆ వూరకుక్కలది మళ్ళీ కుక్క బతుకే.

కుక్క ఒక్కటే ధర్మరాజు వెంట కడదాకా వెంటవుండి స్వర్గానికి వెళ్ళిందని ఇతిహాసం. అది ఎంతవరకు నిజమన్నది పక్కనపెడితే అమెరికా మాత్రం కుక్కలపాలిటి స్వర్గమనే చెప్పాలి.

ఛీ! ఏం బతుకు కుక్కబతుకు’ అని బాధపడే సీను అమెరికాలో లేదు. ఎందుకంటే ఆ  దేశంలో కుక్కలది కుక్క బతుకు యెంత మాత్రం కాదు.ఒక రకంగా చూస్తే మనుషులే వాటి వైభోగం చూసి అసూయపడాల్సిన పరిస్తితి. అక్కడివారికి తెలుగు పాటలు వచ్చుంటే, ‘పుడితే కుక్కయి పుట్టాలిరా!’ అని పాడుకుంటూ వుండేవారు.

కారణాలు తెలియవుకాని, అమెరికన్లకు కుక్కలంటే ప్రాణం. చాలామంది కుక్కల్ని సొంత పిల్లలకంటే ప్రేమగా పెంచుకుంటారు. వాటికి పెట్టే పేర్లు కూడా అలాగే వుంటాయి. ఒకాయన తన కుక్కకు ‘సర్’ (అంటే తెలుగులో “అయ్యగారు”) అని పేరుపెట్టుకుని కుక్క పట్ల తన భయభక్తులను చాటుకున్నాడు. (ఆఫీసర్ మీద కోపంతో కుక్కకు అలా పేరుపెట్టి అక్కసు తీర్చుకున్నాడని గిట్టనివాళ్లంటారు.)

ఇక, క్కడ కుక్కల పెంపకం చూస్తే తల తిరిగిపోతుంది. వీటి కోసం, ప్రత్యేకమయిన సోపులు, షాంపూలు, వొంటి నూనెలు, దువ్వెనలు, హెయిర్ డ్రయర్లు, బాతు టబ్బులు (స్నానపుతొట్లు), టవల్స్, పక్కబట్టలు, చలి దుస్తులు, చలవ అద్దాలు, బిస్కెట్ల వంటి రెడీమేడ్ ఫుడ్స్ (కుక్క బిస్కెట్లు అంటే అంటే వాటిని పెంచేవారికి ఎక్కడలేని కోపం ముంచుకొస్తుంది, ఇంకో మనకు నవ్వొచ్చే మరో విషయం ఏమిటంటే, అక్కడ కుక్కను ‘కుక్క’ అని అనకూడదు, ఇంట్లో పిల్లల మాదిరిగానే పేరు పెట్టి పిలవాలి) ఆటవస్తువులు, గోళ్ళు కట్ చేసే కత్తెరలు, జుట్టు కత్తిరించే సెలూన్లు, వొళ్ళు వెచ్చపడితే చూపించడానికి క్లినిక్కులు, మందులు రాసిస్తే కొనుక్కోవడానికి విడిగా దుకాణాలు, కాలో చెయ్యో విరిగితే అందుకోసం ప్రత్యేకంగా డాక్టర్లు, ఆపరేషన్లు చేయాల్సివస్తే ప్రత్యేక ఆసుపత్రులు, వీటికోసం మళ్ళీ విడిగా ఇన్స్యూరెన్సులు ఒకటారెండా ఈ జాబితా చాంతాడంత వుంటుంది.

కుటుంబంతో వేరేవూళ్లకు వెళ్ళాల్సివచ్చినప్పుడు, వెంట వచ్చే పెంపుడు కుక్కలకోసం విడిగా ‘కుక్కల హోటళ్ళ’లో అకామడేషన్ బుక్ చేస్తారు. ఈ కుక్కల హోటళ్ళు ఆయా కుక్కల స్తాయికి తగినట్టుగా వుంటాయి. బాగా పెట్టిపుట్టిన కుక్కలు ఫైవ్ స్టార్ వసతులువున్న విడుదుల్లో మకాం చేస్తాయి. అక్కడ వుండే వసతులు అపూర్వం. అందుకోసం వసూలు చేసే చార్జీలు కూడా అనూహ్యం.

ఇక, వూళ్ళో వున్నప్పుడు, ఉదయం సాయంత్రాలు పిల్లల్ని తీసుకువెళ్ళినట్టు, వెంటబెట్టుకుని వాహ్యాళికి తీసుకువెడతారు. ముందు తోకాడించుకుంటూ కుక్కగారు. వెనక తోకలాగా చేతిలో ఒక ప్లాస్టిక్ సంచీతో యజమానిగారు.

దారిలో ఎక్కడయినా కుక్కగారికి కాలకృత్యాలు తీర్చుకోవాలని ముచ్చట వేస్తె ఏమీ మొహమాటపడకుండా, ఇతరేతర దేశాల్లోని తన సోదర కుక్కలమాదిరిగానే బహిరంగ ప్రదేశాల్లోనే బహిరంగంగా ఆ పని పూర్తి చేస్తుంది. దాని వెనుకే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చే యజమాని గారు తక్షణం చేతికి పని చెప్పి, శునకం విసర్జించిన ‘పదార్ధాన్ని’ చేతిసంచీలోకి ఎంతో జాగ్రత్తగా సేకరించి, వాహ్యాళి కార్యక్రమాన్ని యథావిధిగా, ప్రకటనల అనంతరం టీవీ సీరియల్ లాగా కొనసాగిస్తారు. అటువంటి అపూర్వ సందర్భాలలో భార్య కూడా వెంట వున్నప్పటికీ, సాధారణంగా భర్తగారే భక్తిప్రపత్తులతో ఈ పవిత్ర భాద్యతను నిర్వహిస్తూవుంటారు. పార్కుల్లో కూడా ఇదే దృశ్యం. పిల్లల్ని కన్నతల్లి ఓపక్క ఆడిస్తుంటే, మరో పక్క, కుక్కగారి పెంపుడు తండ్రి శునక సేవనంలో తరిస్తుంటాడు.

ఇవన్నీ చూసిన తరువాత ఎవరయినా ఒక విషయం ఒప్పుకోకతప్పదు.

ఏమాత్రం సిగ్గుపడకుండా , మొహమాటపడకుండా, నలుగురూ చూస్తున్నారన్న భేషజాలు లేకుండా ‘పసి పిల్లల విషయంలో కన్నతల్లులు చూపే ఆప్యాయత మాదిరిగా’ కానవచ్చే వారి ప్రవర్తన, కుక్కలపట్ల వారికున్న ప్రేమాభిమానాల్లో ఏమాత్రం కల్తీ లేదన్న స్వచ్చమయిన నిజాన్ని వెల్లడి చేస్తుంది.

సాధారణంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, మాల్స్ లో కుక్కలకు ప్రవేశం వుండదు. అయినా కొన్ని చోట్ల ఇవి దర్శనం ఇస్తాయి. విషయం ఏమిటంటే, అవి గైడ్ డాగ్స్. దృష్టి లేని వారికి దోవచూపేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలు అవి.

చిన్నపిల్లలని అమ్మవొడి వంటి బేబీ కేర్ సెంటర్లలో వొదిలి వేసి, అమ్మానాన్నా ఉద్యోగాలకు వెళ్లినట్టు అమెరికాలో కుక్కపిల్లలను కనిపెట్టిచూసుకోవడానికి డే కేర్ సెంటర్లు వున్నాయి. వాటి ఆలనా పాలనా చూసుకోవడమే కాకుండా వాటికి చక్కని శిక్షణ కూడా ఇస్తారు. పసి కూనల్ని అలా పంపించలేనివాళ్ళు ఏకంగా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇంట్లోనే శిక్షణ ఇప్పిస్తారు. వాళ్ళు వారానికొకసారి వచ్చి, ‘ఇంటికి తెలిసినవారు వచ్చినప్పుడు ఎలా మెలగాలి? తెలియనివారు వచ్చినప్పుడు యెలా మొరగాలి? పక్కింటి కుక్కతో ఎలా మెసలాలి?’ అనే విషయాలపై శిక్షణ ఇస్తారు. చీటికీ మాటికీ ‘భౌభౌ’ అంటూ మొరిగి గోలచేయకుండా ‘మామంచి’ కుక్కలా ఎలా వొదిగి వుండాలో దగ్గరుండి నేర్పుతారు. కుక్కలకు మంచి నడవడిక బోధించడానికి మార్కెట్లో రకరకాల పుస్తకాలు లెక్కలేనన్ని దొరుకుతాయి. ఇవి కాక కుక్కలకు పెట్టాల్సిన ఆహారం ఎలా తయారు చేయాలి అనే అంశాలపై టీవీల్లో ప్రత్యేకకార్యక్రమాలు సరేసరి.



NOTE: Courtesy Image Owner 

 

వయో వృద్ధులు, జ్ఞానవృద్ధులు – భండారు శ్రీనివాసరావు


“ఏమిటో మునుపటి మాదిరిగా కాదు కదా! వయసు మీద పడుతోంది” చెప్పాడు ఓ వయోవృద్ధుడు తనకంటే చిన్న వాడయిన జ్ఞానవృద్దుడితో.
“అలా ఎప్పుడూ అనుకోకండి”
“నిజమే కదా! అనుకుంటే ఏముంది?”
“మీరు లోపల అనుకునే ఈ మాటను మీ మెదడు చప్పున గ్రహిస్తుంది. అది మన కంప్యూర్లకంటే చురుకు. దాని నోట్లో ఆవగింజ నానదు. ఏదీ తనలో దాచుకోదు. ఆ ముక్కను ముక్కున పట్టుకుని మీ ఒంట్లో వున్న అన్ని అవయవాలకు దాన్ని చేరవేస్తుంది.
‘ఇదిగో చెవీ విన్నావా! మనవాడికి వయసు మీద పడిందట’ అంటుంది.
ఆమాట చెవి, చెవిలో పడగానే, అలాగా! వయసు అయిపోతే మరి నేను ప్రతిదీ అంత శ్రద్ధగా వినక్కరలేదు అనుకుని రెండు చెవులు మూసుకుంటుంది.
అలాగే కళ్ళు, నోరు, కాళ్ళు, చేతులు ఇలా అన్ని అవయవాలు మెదడు ఇచ్చిన ఆ సంకేతాలను అందుకుని. జీతాలు తీసుకుంటూ పనిచేయని ఉద్యోగుల్లా, వేటికవి బద్ధకంగా పడుకుంటాయి.
దాంతో చెవులు వినపడక వినికిడి సమస్య, కళ్ళు కనపడక కంటి చూపు సమస్య ఇలా రకరకాల సమస్యలు శరీరాన్ని చుట్టబెడతాయి.
అదే, ‘నాకేం! నేను ఆల్ రైట్’ అనుకోండి, మీ మెదడు కూడా అదే ఆదేశాలు అవయవాలకు పంపుతుంది. నిజంగా మీకు వయసు మీద పడ్డా, మీ శరీరానికి ఆ విషయం తెలవక, ఎంచక్కా ఎప్పటిమాదిరిగా హాయిగా, హుషారుగా వుంటుంది. వయసుకు వచ్చిన ముసలితనం మనసుకు రాదు’
దాంతో మీరు హ్యాపీ, మీ పక్కవాళ్లు హ్యాపీ. ఆ పక్కవాళ్లు హ్యాపీ. ఆల్ హ్యాపీస్ అన్నమాట!”
జ్ఞానవృద్ధుడు చెప్పిన ఈ మాట ఆ వయోవృద్ధుడు విని వుంటే, ఇప్పుడు అక్కడ ఇద్దరు జ్ఞానవృద్ధులు వుంటారు. వినకపోతే ఒకడే మిగులుతాడు. రెండోవాడికి వయోభారం మరింత పెరుగుతుంది.

రాజకీయ గీత

 "అదేమిటండీ. ప్రెస్ ని ఎదురుగా పెట్టుకుని అంతేసి అబద్ధాలు అలవోకగా చెప్పేశారు?"

"చూడూ. రాజకీయాల్లో నేనెక్కడ వున్నాను? తెలుసుకదా! నువ్వెక్కుతున్న నిచ్చెన పైమెట్టు మీద. నువ్వేమో ఇంకా మొదటి మెట్టు దాటలేదు. ఒక నీతిపాఠం చెబుతా, గుర్తెట్టుకో. అబద్ధం చెప్పు. కానీ గోడ కట్టినట్లు ధాష్టీకంగా చెప్పు. జనం అప్పుడే నమ్ముతారు. అది అబద్దమో కాదో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎదుటి పార్టీ మీద వుంటుంది. ఇంకో సంగతి. ప్రెస్ కి కూడా ఇలాంటి సంగతులే కావాలి. పెద్దగా కష్టపడకుండా పెద్దగా ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ రావాలంటే ఇదే ఉత్తమ మార్గం. సరే పోయి వాళ్ళకి ఏమేం కావాలో దగ్గరుండి చూసుకో. పో."