5, జనవరి 2021, మంగళవారం

ఇంతకంటే ఏం కావాలి? – భండారు శ్రీనివాసరావు

 

ఎప్పటి రేడియో మాస్కో? ఎప్పటి తెలుగు వార్తలు?

ముప్పయ్యేళ్లు దాటింది నేను మాస్కో రేడియోలో తెలుగు వార్తలు అయిదేళ్లపాటు చదివి హైదరాబాదుకు తిరిగొచ్చి.

రాజమండ్రి నుంచి చంద్రశేఖర్ గారనే పరిచయం లేని పెద్దమనిషి ఫోను చేశారు. పత్రికల్లో నేను రాసే వ్యాసాలు చదివి గూగుల్ సెర్చి ద్వారా నా ఆనుపానులు పట్టుకున్నారుట. ఆరోజుల్లో మాస్కో రేడియో తెలుగు వార్తలు క్రమం తప్పకుండా వినే అలవాటు తనకు ఉండేదని, ఒకసారి నా సంతకంతో మాస్కోనుంచి పంపిన చిరుకానుక తన దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉందనీ చెప్పారు. శ్రోతలకు అలా కానుకలు పంపే సంప్రదాయం రేడియో మాస్కోలో వుండేది.

మాస్కో రేడియోతోటే ఒదిలిపెట్టలేదు. అంతకుముందు 1971లో బెజవాడ ఆంద్రజ్యోతిలో పనిచేసేటప్పుడు నేను రాసిన ‘వాక్టూనులు’, ‘బుక్ రివ్యూలు’ గురించి సవిస్తరంగా ప్రస్తావించడం చూసి ఆయన ధారణ శక్తికి ఆశ్చర్యపోవడం నావంతయింది. అల్లాగే హైదరాబాదు ఆలిండియా రేడియోలో నా కార్యక్రమం ‘జీవన స్రవంతి’ గురించి కూడా చంద్రశేఖర్ గారు ప్రస్తావించారు. 1975 లో ఆ కార్యక్రమం నేను మొదలు పెట్టినప్పటి నుంచి జీవనస్రవంతి ప్రసారం చేసే వేళలు ఎలా మారుతూ వచ్చాయో అన్న వివరాలు కూడా ఆయన చెప్పేసరికి నాకేం మాట్లాడాలో తోచలేదు.

చంద్రశేఖర్ గారూ. రేడియో మీద మీ అచంచల అభిమానానికి నా సెల్యూట్.

(కింది ఫోటో: ముప్పయ్ మూడేళ్ల క్రితం హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం నుంచి వారం వారం జీవన స్రవంతి కార్యక్రమం చదువుతున్న దృశ్యం)



1 కామెంట్‌:

Zilebi చెప్పారు...



అద్బుతః