30, జనవరి 2021, శనివారం

మీడియాకు దూరంగా .... భండారు శ్రీనివాసరావు

 

“నేను పత్రికలు, చదవను, టీవీ చర్చలు చూడను” అని ఓ మిత్రుడు వాట్స్ అప్  సందేశం పంపాడు. నిజానికి ఈ మాటను ఒకప్పుడు మన దేశానికి ప్రధాన మంత్రిగా స్వల్పకాలం పనిచేసిన చరణ్ సింగ్ ఎప్పుడో చెప్పారు. కాకపొతే అప్పటికి ఈ టీవీలు లేవు. అంచేత ఆయన ఇలా అన్నారు.

“నేను పేపర్లు చదవను, రేడియో వినను. అదే నా ఆరోగ్య రహస్యం”

సరే అదలా వుంచి మా వాట్సప్ మిత్రుడి గురించి చెప్పుకుందాం.

టీవీలు, చూడకపోవడానికి, పత్రికలు చదవక పోవడానికి ఆయన చెప్పిన కారణం విచిత్రంగా వుంది. తనకు వచ్చిన ఓ మెసేజ్ తననీ నిర్ణయానికి ప్రొద్బలపరచిందని చెప్పాడు. నిజానికి ఈ సందేశం ఇప్పటికే  చాలా సార్లు చాలా మందికి చేరిపోయింది కూడా.

అదేమిటంటే, Nathan Zohner అనే పెద్దమనిషి, తనకు తెలిసిన  శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఇతరుల అజ్ఞానాన్ని అవహేళన చేయడానికి ప్రయోగిస్తుంటాడు. ‘డైహైడ్రోజన్ మోనాక్సైడ్ (diyhydrogen monoxide) అనేది చాలా ప్రమాదకరం అని, దాన్ని తక్షణం నిషేధించాలని ఆయన చెబుతుంటాడు. తీరా చేస్తే  diyhydrogen monoxide అంటే మామూలు నీళ్ళు (water). అదొక రసాయనిక నామం మాత్రమే. శాస్త్రవేత్తలు కూడా చాలా అరుదుగా వాడే పదం ఇది. అలాంటి శాస్త్రీయ పదాల పట్ల అవగాహన లేనివాళ్లు నిజమే, అది ప్రమాదకరం  కాబోలు అనుకుంటారు అమాయకంగా. ఇలా తమ ప్రజ్ఞతో సాధారణ విషయాలను కూడా మసిపూసి మారేడు కాయ చేసే వ్యవహారాలు ఈనాటి మీడియా చేస్తోందనేది ఆ మితృడి అభిప్రాయం. అందుకే ‘పేపర్లు చదవను, టీవీ చర్చలు చూడను అనే నిర్ణయానికి ఆయన వచ్చాడు.

కానీ మీడియా మీద ఎంత చెడుగా అనుకున్నా, అది necessary evil అంటాడు మరో మిత్రుడు. మొన్నీమధ్య ఆయన ఓ అయిదు రోజుల పాటు నగరానికి దూరంగా వున్న ఫాం హౌస్ లో గడిపివచ్చారు. ఆయనకీ పొద్దున్నే పత్రిక చూడనిదే గడవదు. అక్కడ పత్రిక దొరకదు. ఫాం హౌస్ లో ఉన్న టీవీకి నెట్ సమస్య వచ్చి మౌన ముద్రదాల్చింది. మొదటి రోజు కష్టంగా గడిచింది. మర్నాడు మనసుకు ప్రశాంతంగా వున్నట్టు తోచింది. ఆ మర్నాడు అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయా అనిపించింది. అక్కడే అలానే వుండిపొతే బాగుండు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా అని కూడా అనిపించిందట. షుగర్, బీపీ అదుపులో వుందని పరీక్ష చేసుకుంటే తెలిసిందట.

అయితే ఇంటికి తిరిగి రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, గుమ్మం  ముందు పడి వున్న పత్రికలను అన్నింటినీ వరసపెట్టి  తిరగేయడం.

మరొక మిత్రుడు మరీ విచిత్రమైన విషయం చెప్పాడు. నిరుడు ఫిబ్రవరిలో కరోనా గురించిన సమాచారం అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న రోజులు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పేపరు మొహం చూడలేదు. పొరబాటున కూడా పత్రికను చేతితో తాకలేదు. పుట్టడమే పత్రికాసమేతంగా పుట్టాడని ఆయన చుట్టపక్కాలు చెప్పుకొనేవారు. ప్రతిరోజూ  రోజూ మూడు నాలుగు పత్రికలు చదివే అలవాటు చిన్నప్పటి నుంచీ వుంది. అలాంటి మనిషి దాదాపు ఏడాదిగా పేపరు చేత్తో పట్టుకోలేదు, ముట్టుకోలేదు అంటే ఆశ్చర్యమే మరి.

ఈ విషయాలన్నీ తలచుకుంటూ వుంటే ఎప్పుడో జ్వాలా చెప్పిన ఓ విషయం జ్ఞాపకం వచ్చింది.

అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి కుముద్ బెన్ జోషీ గవర్నర్. తెలుగు దేశం అధికారంలో వుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో. కాంగ్రెస్ గవర్నర్ కాబట్టి  టీడీపీ అనుకూల పత్రికలు కొన్ని గవర్నరు ఏం చేసినా వాటిని తూర్పార పడుతూ కధనాలు రాసేవి. ఆవిడ వ్యవహార శైలి కూడా అందుకు దోహదం చేసి వుంటుంది. అది రాజ్ భవన్ కాదు, గాంధీ భవన్ (కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం) అనే వారు. కాంగ్రెస్ నాయకులు చాలామందికి రాజ్ భవన్ ఓ అడ్డాగా మారింది అని గుసగుసలు వినిపించేవి.

ఒకసారి ఉపరాష్ట్రపతి వెంకట్రామన్ గారు హైదరాబాదు వచ్చి రాజ భవన్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. గవర్నర్ కుముద్ బెన్ జోషీ, గవర్నర్ కార్యదర్శి చంద్రమౌళిగారు వెళ్లి ఉపరాష్ట్రపతిని   మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

మాటల సందర్భంలో వెంకట్రామన్ అడిగారు జోషీ గారెని, ‘ఏమిటి అలా వున్నారు ఒంట్లో బాగుండలేదా అని.

చంద్రమౌళిగారు గారు కల్పించుకుని అసలు విషయం చెప్పారు, ఆరోజు ఉదయమే ఒక పత్రిక గవర్నర్ కు వ్యతిరేకంగా ఒక కధనం ప్రచురించిందని.

అప్పుడు వెంకట్రామన్ గారు ఇచ్చిన సలహా ఇది.

‘ఓ మూడు రోజులు పత్రికలు చదవడం మానేసి చూడండి, మనసుకు ఎంతటి ప్రశాంతత లభిస్తుందో అర్ధం అవుతుంది”     

(30-01-2021)

 

కామెంట్‌లు లేవు: