26, నవంబర్ 2020, గురువారం

TO WHOMSOEVER IT MAY CONCERN - BHANDARU SRINIVAS RAO

 

“సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు”
ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం.

ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక వారి చేత హామీల వర్షం కురిపిస్తుంది. ఒకటా రెండా, సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న ఉచిత సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్న మేనిఫెస్టోలకు కొరత లేదు. ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ప్రభుత్వ ఖజానా డబ్బులతో, ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎన్నికల హామీల తాయిలాలను ఎలా ఇస్తారన్నడానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నడానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు.

అందుకే అయ్యలూ! ఓ పని చేయండి. ఇలా చేస్తే, మీకూ, ఓటర్లకు మాత్రమే కాకుండా ప్రభుత్వాలకు కూడా ప్రయోజనకరంగా వుంటుంది. మీ మీ పార్టీలు ఏమీ బీదవి కావు. అందరికీ తెలిసిన విషయమే. ఓట్లకోసం మీరు పెట్టే ఖర్చే ఈ వాస్తవాన్ని తెలుపుతుంది. గెలిచిన పక్షంలో ఒక్క ఏడాది పాటు మీరిచ్చిన ఈ ఉచిత హామీలను మీ పార్టీ నిధులతో అమలు చేయండి. ఆ తర్వాత సర్కారు ఖజానా నుంచి ఖర్చు పెడుదురు కాని.

మీకు ప్రజాధనం విలువ తెలిసిరావాలంటే ఇంతకంటే వేరు మార్గం కనబడడం లేదు.
ఏమంటారు?

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి హిందువూ సమర్ధించి పాల్గొని ప్రోత్సహించి తరించాల్సిన సన్నివేశం ఒకటి భాగ్యనగరం నడిమధ్యన జరగబోతున్నది,అదే వాజపేయ సోమయాగం హైదరాబాద్ - భాగ్యనగరం - వాజపేయం - సోమయాగం - Those who are living in and around bhagyanagaram must attend in person!