4, నవంబర్ 2020, బుధవారం

వైట్ హౌస్ లోకి రీ ఎంట్రీ దొరకని అమెరికా అధ్యక్షులు

 


 

అమెరికా అధ్యక్షుల పదవీ కాలం నాలుగేళ్లు. చాలా సందర్భాలలో అమెరికన్ ఓటర్లు మరో నాలుగేళ్ల అవకాశం కల్పిస్తూ ఇంకోసారి వారినే  అధ్యక్షులుగా ఎన్నుకుంటూ వచ్చారు. ఇటీవలి కాలంలో బరాక్ ఒబామా, జార్జ్  డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్ లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాజా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు కూడా ఈ అవకాశం లభిస్తుందా లేదా అనేది లక్ష డాలర్ల ప్రశ్న. ఈసారి ఏమవుతుందో చూడాలి. మొత్తం అమెరికా చరిత్రలో కేవలం పదిమంది  ప్రెసిడెంట్లకు మాత్రమే ఆ దేశపు ఓటర్లు వైట్ హౌస్ లోకి రెండో తడవ ప్రవేశాన్ని నిరాకరించారు. ఎన్నికల్లో వారిని ఓడించారు.

వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి జార్జ్ బుష్ సీనియర్.

1992లో అప్పుడు ప్రెసిడెంటుగా ఉన్న జార్జ్ బుష్ సీనియర్ ని రెండో సారి పోటీ చేసినప్పుడు ఆయన్ని ఓడించి బిల్ క్లింటన్ ని గెలిపించారు. చిత్రం ఏమిటంటే ఓడిపోయిన ప్రెసిడెంట్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వాడయితే, ఆయన మీద ప్రెసిడెంటుగా గెలిచింది డెమోక్రాటిక్ అభ్యర్ధి బిల్ క్లింటన్.

ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్ విషయం మరింత విచిత్రం. అమెరికన్ ఓటర్లు  ఫోర్డ్  మహాశయులను నేరుగా ఎన్నికల్లో ప్రెసిడెంటుగా ఎన్నుకోలేదు. కనీసం వైస్ ప్రెసిడెంటుగా కూడా ఎన్నికల్లో గెలవలేదు. అయినా అదృష్టం కొద్దీ గెరాల్డ్ ఫోర్డ్ ఈ రెండు అత్యున్నత పదవులను అనుభవించారు.

1973లో అప్పుడు వైస్ ప్రెసిడెంటుగా ఉన్న స్పిరో ఆగ్న్యూ  రాజీనామా చేసిన ఫలితంగా రాజ్యాంగంలోని ఓ వెసులుబాటు ప్రకారం ఫోర్డ్ ఉపాధ్యక్షులు కాగలిగారు. ఆ తర్వాత వాటర్ గేట్  కుంభకోణం వంటి వివాదాల్లో చిక్కుకుపోయి ప్రెసిడెంట్ నిక్సన్ పదవి నుంచి తప్పుకోవాల్సిరావడంతో వైస్ ప్రెసిడెంటుగా విధులు నిర్వర్తిస్తున్న గెరాల్డ్ ఫోర్డ్ ప్రెసిడెంటు అయ్యారు. హాయిగా మూడేళ్ళపాటు  శ్వేత సౌధం నుంచి దేశాన్ని పాలించారు.

తర్వాత జరిగిన ఎన్నికలలో ప్రెసిడెంటుగా పోటీ చేశారు కానీ ప్రజలు తిరస్కరించారు. 1976 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జిమ్మీ కార్టర్ ఆయన్ని ఓడించారు.

అయితే  అమెరికా  ప్రెసిడెంటుగా కార్టర్ పదవి కూడా ఒక టరంతోనే ముగిసింది. 1980లో జరిగిన ప్రెసిడెన్షియల్  ఎన్నికల్లో రొనాల్డ్ రీగన్, జిమ్మీ కార్టర్ ని ఓడించి ప్రెసిడెంట్ అయ్యారు.  రీగన్ ని ప్రెసిడెంటుగా రెండోసారి కూడా ఎన్నుకున్నారు. అత్యధిక మెజారిటీతో ఎన్నిక కావడం ఆ ఎన్నికల్లో విశేషం.

ఈ విధంగా ఒకసారితోనే ప్రజలు ఉద్వాసన పలికిన ప్రెసిడెంట్లు మరికొందరు వున్నారు.

జాన్ ఆడమ్స్. ఈయన అమెరికాకి రెండో ప్రెసిడెంట్. అయినా కానీ ప్రజలు ఆయనాలి రెండోసారి అవకాశం ఇవ్వలేదు. లో జరిగిన ఎన్నికల్లో థామస్ జెఫర్ సన్ ఆయన్ని ఓడించారు. మార్టిన్ వాన్ బరెన్, బెంజామిన్ హారిసన్, గ్రోవర్ క్లీవ్ లాండ్ పరిస్థితి కూడా ఇదే. రెండో సారి అవకాశం వీరికి దక్కలేదు. కాకపొతే క్లీవ్ లాండ్ నాలుగేళ్ల విరామం అనంతరం ప్రెసిడెంటుగా మళ్ళీ పోటీ చేసి గెలిచారు. ఇదంతా పద్ధెనిమిదో శతాబ్దం నాటి ముచ్చట. పందొమ్మిదో శతాబ్దం మొదట్లో కూడా మరో ఇద్దరు ప్రెసిడెంట్లకు అమెరికన్ ఓటర్లు రెండో అవకాశం ఇవ్వలేదు. వారి పేర్లు విలియం హోవర్డ్ టఫ్ట్, హెర్బర్ట్ హోవర్.

ఇక ప్రస్తుతానికి వస్తే, అమెరికాకి 45వ అధ్యక్షుడిగా 2016లో ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ 2020 నవంబరు ఎన్నికల్లో మరో మారు పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  (04-11-2020)

 

 

 

1 కామెంట్‌:

సూర్య చెప్పారు...

@ "1992లో అప్పుడు ప్రెసిడెంటుగా ఉన్న జార్జ్ బుష్ సీనియర్ ని రెండో సారి పోటీ చేసినప్పుడు ఆయన్ని ఓడించి బిల్ క్లింటన్ ని గెలిపించారు. చిత్రం ఏమిటంటే ఓడిపోయిన ప్రెసిడెంట్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వాడయితే, ఆయన మీద ప్రెసిడెంటుగా గెలిచింది డెమోక్రాటిక్ అభ్యర్ధి బిల్ క్లింటన్."
అధ్యక్షా ఇందులో చిత్రం ఏముంది అధ్యక్షా?!!