16, నవంబర్ 2020, సోమవారం

బెదురుగొడ్డు (కథానిక) - భండారు శ్రీనివాసరావు

 

పొద్దున్నే సెల్ మూగడంతో సుబ్బారావుకు మెలకువ వచ్చింది.
‘కరోనా భయంతో ఎన్నాళ్ళు అలా కొంపలో పడుంటావు. మధ్యాన్నం అలా శేఖరం ఇంటికి పోయొద్దాం, రెడీగా వుండు, ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాను’ అని కట్ చేశాడు సుందరం.
సుబ్బారావు ఎప్పుడూ ఇంతే! అవతలవాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించడు.
స్నానం చేస్తుంటే రాత్రి అనుభవం గుర్తుకు రావడం మొదలయింది సుబ్బారావుకి. రాత్రి గడుస్తుందా లేదా అనేంత భయకరమైన అనుభవం.

తెల్లవారుతుండగా కాబోలు తల భారంగా అనిపించింది. ముక్కు పూడుకుపోయినట్టు శ్వాస పీల్చడం కష్టం అయింది. పక్క మీద నుంచి లేచి కూర్చోలేకపోయాడు. కరోనా లక్షణాలేమోనని దడ పట్టుకుంది. భార్యను లేపి చెప్పడానికి కూడా భయపడ్డాడు. ఎందుకంటే ఆవిడ తనలా కంగారు పడకపోగా తేలిగ్గా తీసుకుని ఎదురు అక్షింతలు వేస్తుంది. ‘మీకు అన్నీ అనుమానాలే! కరోనా లేదు, పాడూ లేదు. మీకేదో కల వచ్చింది. కాసిని మంచి నీళ్ళు తాగి పడుకోండి’ అంటుంది, తనకు తెలుసు.

సుబ్బారావు ఫోనుకు మెలకువ వచ్చి లేచినప్పుడు మళ్ళీ ఏమీ లేదు. అంతా మామూలుగానే వుంది. బహుశా కరోనా గురించే అస్తమానం ఆలోచిస్తూ వుండడం వల్ల ఇలాటి కల వచ్చిందేమో. అందరూ అంటున్నట్టు.
స్నానం చేసి భార్య పెట్టిన టిఫిన్ తినేసరికి సుందరం రానే వచ్చాడు. చేతులు శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కుని, మొహానికి కొత్త మాస్కు తొడుక్కుని సుబ్బారావు కారెక్కాడు. ఎక్కడో వూరి బయట ఓ గేటెడ్ కమ్యూనిటీలో శేఖరం విల్లా కొనుక్కున్నాడు.
కారులో వెడుతుంటే చెప్పాడు సుందరం, శేఖరానికి కేన్సర్ పాజిటివ్ అని. అది విని నివ్వెరపోయాడు సుబ్బారావు. శేఖరం సిగరెట్ తాగడు, మందు అలవాటు లేదు, కనీసం పాన్ కూడా వేసుకోడు. అతడికి కేన్సర్ రావడం ఏమిటి?
ముగ్గురూ బాల్యం నుంచి స్నేహితులు. ఉద్యోగాలు కూడా ఉన్న ఊళ్లోనే రావడంతో ఆ స్నేహం మరింత బలపడి కొనసాగుతూ వచ్చింది. కాకపోతే చిన్నతనంలో వారిమధ్య ఈగోలు లేవు. ఇప్పుడు అవి వచ్చిపడ్డాయి.

శేఖరం అంటే సుబ్బారావుకు కాసింత అసూయ. ఎవర్నీ మాట్లాడనివ్వడు. తను చెప్పిందే వేదం అన్నట్టుగా వుంటుంది అతడి వ్యవహారం. అది సుబ్బారావుకు నచ్చదు, కానీ పైకి చెప్పలేడు. అది అతడి బలహీనత.

కేన్సర్ పేరు వెంటే చాలు జనం డీలా పడిపోతారు. సుబ్బారావు కజిన్ కు డాక్టరు బయాప్సీ చేయాలని చెప్పగానే ఇంటిల్లిపాదీ కుంగిపోయారు. ఒకపూట భోజనాలే చేయలేదు. బయాప్సీ రిపోర్ట్ వచ్చి ఏమీ లేదని తెలిసేదాకా ఎవ్వరూ సరిగా ఊపిరే పీల్చుకోలేదు. కేన్సర్ అంటే అంత భయం. ఎందుకంటే దానికి చికిత్స లేదని తెలిసి కూడా చేయించాలి. మనిషి చనిపోతాడని తెలిసి కూడా చివరిదాకా బతికించుకునే ప్రయత్నం చేయాలి. జబ్బుతో రోగి, ఖర్చుతో ఇంటివాళ్ళు కుంగి కృశించిపోతారు. ఫలితం లేని ప్రయత్నం. అయినా చేయక తప్పదు.
మరి శేఖరం ఎలా ఉన్నాడో. బతకడం కష్టం అని తెలిసిన వ్యాధి పట్టుకున్నదని తెలిసినప్పుడు, ఆ మనిషిలో వెనుకటి గాంభీర్యం అలాగే వుండదు. ఆ స్థితిలో అతడ్ని ఎలా పలకరించాలి? ఎలా ద్జైర్యం చెప్పాలి?

“చూడు సుబ్బారావ్!”
సుందరం పిలుపుతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు.
‘అతడికి కేన్సర్ అని మనకు తెలిసినట్టు అతడికి తెలియదు. కాబట్టి తొందరపడి నోరు జారకు’ అని హెచ్చరించాడు సుందరం.

గేటెడ్ కమ్యూనిటీ ఎంట్రెన్స్ లో కరోనా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని శేఖరం విల్లాకు చేరుకున్నారు.
ఇద్దరూ మెట్లెక్కి డోరు దగ్గర నిలబడి కాలింగు బెల్ నొక్కారు.

లోపల ఓ గదిలో శేఖరం పక్క మీద దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాడు. పక్కన స్టూలు మీద మందు సీసాలు, బత్తాయి రసం గ్లాసు.
ఇలా ఊహించుకుంటున్న సుబ్బారావుకు ‘తలుపు తీసే వుంది, లోపలకు రండి’ అని ఖంగున వినపడింది శేఖరం గొంతు. సుబ్బారావు ఆశ్చర్యపోతూ సుందరంతో కలిసి లోపలకు అడుగుపెట్టాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతడ్ని మరింత నిశ్చేష్టుడిని చేసింది.

శేఖరం. అతడి భార్య సోఫాలో కూర్చుని నెట్ ఫ్లిక్స్ లో Bad Boy Billionaires: India వెబ్ సీరియల్ ఎపిసోడ్ ఏదో చూస్తున్నారు.
‘ఈ బయో పిక్ సీరియల్ బాగా తీశారు. ఇలాంటివి తీయాలంటే కాస్త గుండె ధైర్యం కావాలి. అప్పటికీ ఎన్నో కోర్టు కేసులు. అన్నీ తట్టుకుని ఈ నెల మొదట్లో టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టారు” అంటున్నాడు శేఖరం టీవీ ఆపుచేస్తూ.

సుబ్బారావుకి అసలేం జరుగుతున్నదీ అర్ధం కావడం లేదు. శేఖరాన్ని ఎలా ఓదార్చాలి అని వస్తే అతగాడేమో బయో పిక్ సీరియల్స్ గురించి మాట్లాడుతున్నాడు.

“రైట్ సుందరం మంచి పని చేసావు, బెదురుగొడ్డును కూడా వెంటబెట్టుకు వచ్చావ్”
సుబ్బారావుకు రోషం పొడుచుకు వచ్చింది. కానీ శేఖరం ప్రవర్తన వల్ల కలిగిన ఆశ్చర్యం దాన్ని పక్కకు నెట్టేసింది. సుందరం తప్పకుండా పొరపడివుంటాడు, సందేహం లేదు. శేఖరం నిక్షేపంగా వున్నాడు, పైగా అతడి పొగరు కూడా ఏమీ తగ్గలేదు, లేకపోతె తనని అంత మాట అంటాడా! బెదురుగొడ్డట బెదురుగొడ్డు.

ఇంతలో సుబ్బారావు ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తూ శేఖరం భార్య మాట వినపడింది.
“ఏమండీ ఈ కరోనా కారణంగా మీరిద్దరూ మా ఇంటికి రావడమే మానేశారు. మామూలుగా అవుతే మిమ్మల్ని భోజనం చేసిపోమ్మనేదాన్ని. కానీ మీరు ఏమంటారో అని సంక్షేపించాను” అంటూనే శేఖరం భార్య మూడు గాజు గ్లాసులు తెచ్చి మేజా బల్ల మీద పెట్టింది.
“కరోనా అయినా వీటికి ఇబ్బంది లేదు కదా! మా వారికి కూడా మంచి కంపెనీ” అన్నదావిడ.

“అరేయ్ మీకు తెలియదు కదా మా డాక్టరు చెప్పాడు, మీరేం చేయాలనుకుంటే అది చేసేయండి. అసలే కరోనా రోజులు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ మధ్యనే మా బావమరది మంచి బాటిల్ తెచ్చి పెట్టాడు. ఇవ్వాళ మీరు నాకు కంపెనీ ఇచ్చి తీరాలి” అన్నాడు శేఖరం, బల్ల మీద సోడాలు సర్దుతూ.

సుబ్బారావు ఇదంతా నిలువుగుడ్లు వేసుకుని చూస్తున్నాడు. బీరుకు, విస్కీకి తేడా తెలియని శేఖరం మందు పార్టీ ఇవ్వడం ఏమిటి? ఇచ్చెనుబో తను కూడా తాగుతాను అనడం ఏమిటి? అదీ భార్య ముందే. ఏమిటో, అంతా విచిత్రంగా వుంది. కేన్సర్ భయంతో వచ్చిన మతి చాంచల్యం కాదుకదా!

ఈ ఆలోచనల్లో ఉండగానే శేఖరం తనకు గ్లాసు అందించి చీర్స్ చెబుతున్నాడు.
“మామూలుగా అయితే మా ఆవిడ మంచింగ్ ఏదో చేసేది. కానీ మధ్యలో కరోనా భయం ఒకటి ఏడిసింది కదా! భయం అంటే జ్ఞాపకం వచ్చింది. మన బెదురుగొడ్డు ఈ కరోనా కాలాన్ని ఎలా నెట్టుకు వస్తున్నాడో. వీడి భయం ఏమో కానీ పాపం ఆ మహాతల్లిని ఏం బెదరగొడుతున్నాడో ఏమో”

సుబ్బారావుకు అనుమానం కొండలా పెరిగిపోతోంది. సుందరం చెప్పింది నిజమేనా! శేఖరానికి కేన్సర్ వచ్చిన మాట కరక్టేనా! మరి వీడేమిటి ఆ జబ్బు వచ్చింది తనకు కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. సరే వీడంటే మొండి ఘటం. మరి వాడి భార్య సంగతి. ఆమె మోహంలో లేశమాత్రం కంగారు లేదు. పైగా మొగుడికి కంపెనీ ఇమ్మంటుంది.

ఇంతలో శేఖరం మాట వినపడి సుబ్బారావు ఈ లోకంలోకి వచ్చాడు.
“అరేయ్ కంగార్రావ్ నువ్వు వినాలిరా ఈ సంగతి. మొన్నీమధ్య పొట్టలో అదేపనిగా నొప్పిగా వుంటుంటే తెలిసిన డాక్టరుకి చూపించాను. ఆయన క్రియాటి నైన్ టెస్ట్ చేయించాడు. One point two వుంది. పర్వాలేదు కిడ్నీ ప్రాబ్లం కాదేమో అన్నాడు. బాటిల్ ఇచ్చాడు అని చెప్పానే మా బావమరది, వాడు మిలిటరీలో డాక్టరు. రిపోర్టులు అవీ చూసి ఒకసారి సీటీ స్కాన్ తీయిద్దాము డౌట్ క్లియర్ అవుతుంది అన్నాడు, ఆ డౌటేమిటో చెప్పకుండా. స్కాన్ చేయిస్తే ఇదిగో ఇది బయటపడింది. తరువాత బయాప్సీ అన్నారు. అనగానే అర్ధం అయిపొయింది ఇదేదో కేన్సర్ బాపతు అని. అదే కన్ఫర్మ్ అయింది. ముందే తెలిసింది కాబట్టి కొంత ఛాన్స్ వుంది అంటున్నారు డాక్టర్లు. చాన్స్ అంటే తెలుసు కదా Life Extension అన్న మాట. కాబట్టి నేను కూడా చాన్స్ తీసుకో దలచుకోలేదు. ఇన్నాళ్ళు తాగుడూ గట్రా ఏమీ లేకుండా గడిపేశాను. అ డాక్టర్ గారేమో ఇక నీ ఇష్టం కానీయ్ అని పచ్చ జెండా ఊపాడు. వెంటనే మీ ఇద్దరూ జ్ఞాపకం వచ్చారు. ఇన్నేళ్ళు మీరు ఎప్పుడు అడిగినా నేను కంపెనీ ఇవ్వలేదు, అందుకని నేనే మీకు హోస్ట్ చేయాలని సుందరానికి ఫోన్ చేసి చెప్పాను సుబ్బును కూడా తీసుకురమ్మని. ఇద్దరూ వచ్చారు, సంతోషం. నాకు ఈ ఆట రూల్స్ ఆట్టే తెలియవు. మీరే సెల్ఫ్ హెల్ప్ చేసుకోవాలి, నాకూ చేయాలి. నా భార్య ఏమీ అనుకోదు, ఆమెకు కూడా విషయం అర్ధం అయిపోయింది. మన చేతిలో ఏమీ లేదని. కానీ మన చేతిలో గ్లాసులు వున్నాయి. రైట్! చీర్స్ చెప్పండి ఫర్ మై హెల్త్”

సుబ్బారావుకు ఆ క్షణంలో, శేఖరంలో తను ఇంతకుముందు ఎన్నడూ చూడని కొత్త శేఖరం కనిపించాడు.

(16-11-2020)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Its touching guruvu garu