మితృలు మురళీకృష్ణ గారు తమ పెళ్లి చూపుల వార్షికోత్సవం సందర్భంగా ఒక పోస్టు పెట్టారు.
ఆయనకూ, వారి శ్రీమతికీ అవే మొదటి పెళ్లి చూపులు కనుక వార్షికోత్సవం చేసుకునే భాగ్యం వారికి దక్కింది. ఇన్నేళ్ళుగా దక్కుతూ వచ్చింది. చాలామంది విషయంలో ఇది పేరాశే! ఎందుకంటే బోలెడు చూపులు చూస్తేనే కాని ఓ పెళ్లి కాదు.మురళీకృష్ణ గారికి 1983 నవంబరు ఇరవైన ఆ మొదటి పెళ్లి చూపులు జరిగితే, ఎన్నికయిన మూడునెలల పిదప అమెరికా అధ్యక్షుని పదవీస్వీకారం మాదిరిగా, తమ పెళ్లి మాత్రం అయిదారు నెలల తర్వాత 1984 మే నెల 5 వ తేదీన జరిగిందని రాసుకొచ్చారు. ఆ దంపతులు అదృష్టవంతులు. ఇలా పెళ్లి చూపులకీ, పెళ్ళికీ వార్షికోత్సవాలు చేసుకుని పెద్దల ఆశీర్వచనాలు, పిన్నల శుభాకాంక్షలు ఏటా అందుకునే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
ఇది చదివి ఆనందించి అభినందిస్తే పోయేది. ఉన్నవాడిని ఊరుకోక మాది పెళ్లి చూపులు లేని పెళ్లి అని కామెంటు పెట్టాను. అదేమిటి? అన్నారాయన మర్యాదగా. పెళ్ళికాని పెళ్లి కూడా అని రెట్టించాను. అదెలా, కమ్యూనిస్టు పెళ్ళా అన్నారాయన ఒకింత సందేహంతో.
‘కళ్ళనీళ్ళ పెళ్లి’ అన్నాను
మళ్ళీ ఇదేమి పితలాటకం ఆయన అనకముందే అదెలాగో చెప్పేశాను.
గతంలో చెప్పిందే. మురళీకృష్ణ గారిలాగా అది చదవని వారికోసం కూడా.
అదే ఇది :
1971 డిసెంబరు 15 వ తేదీ రాత్రి మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారిలో భోరున వాన. అట్లా ఇట్లా కాదు, ఉరుములు, మెరుపులు, పిడుగులు. మధ్యమధ్యలో ఆగుతూ తెల్లారేలోపునే తిరుమల చేరాము. ఎస్వీ కాటేజీలో పైన గదులు తీసుకున్నాము. పురోహితుడు ఎలా దొరికాడో తెలవదు. మా ఆవిడ పిన్ని వసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరె పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానో, ప్యాంటు షర్టు తో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భం, సన్నివేశం అలాంటివి. తొమ్మిదీ పది గంటల నడుమ పెళ్లి జరిగిపోయింది. ఫోటోలు లేవు, వీడియోలు ఎట్లాగో లేవు. వెంటనే వెళ్లి బాలాజీ దర్శనం చేసుకున్నాము. ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. “నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా పెళ్లి చేసుకున్నావ"ని మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.
రిజర్వేషన్ల
గొడవ లేని రోజులు. అంచేత 16 వ తేదీ రాత్రి బయలుదేరి రైల్లో మర్నాడు
ఉదయం బెజవాడ చేరుకున్నాము. మా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా
అక్కడే వుంది. మమ్మల్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే
దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.
‘పెళ్లోద్దు
పెళ్ళాం కావాలి’ అనే నా మొండి పట్టుదల ఫలితం మా పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత
కళ్ళనీళ్ళు పెట్టించింది కూడా. బహుశా అదే ఆఖరిసారి కావచ్చు.
మా
పెళ్ళికి పెద్దల ఆమోదం లభించింది అన్న సంతోషంలో ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లి ఎడిటర్
నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకుని మా పెళ్లి వృత్తాంతం తెలియచేశాము. ఆయన మా
ఇద్దర్నీ మెచ్చుకోలుగా చూస్తూ, ‘రోజూ ఎన్నో ఆదర్శాలు వల్లె వేస్తుంటాము.
నువ్వు చేసి చూపించావు. వెళ్ళండి. హాయిగా కాపురం చేసుకోండి. మళ్ళీ వచ్చి ఉద్యోగంలో
చేరుతున్నాను, అని చెప్పేవరకు నీకు సెలవు
ఇస్తున్నాను. ఇదే మీకు నా పెళ్లి కానుక’ అన్నారాయన.
1 కామెంట్:
ఛ ఛ ఛ పెళ్లి ముచ్చట్లెన్ని మిస్సయి పోయేరండీ !
ఏమిటో నాటి నో సెన్స్ సిద్ధాంతాలూ, ఆదర్శాలున్నూ ! అంతా మేధావుల వికటాచారములున్ను !
జిలేబి
కామెంట్‌ను పోస్ట్ చేయండి