ఈ అంశంపై 10 టీవీ వాళ్ళు ఇంటికి వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు రికార్డు చేసుకుని వెళ్ళారు. భస్మాసుర హస్తం అనే శీర్షికతో ఈ సాయంత్రం ప్రసారం చేసిన వైడ్ యాంగిల్ కార్యక్రమంలో దాన్ని ప్రసారం చేశారని ఓ మిత్రుడు ఫోన్ చేసి చెప్పారు. ఆ ఫోటో క్లిప్పింగ్ పంపారు. రికార్డు చేసిన అభిప్రాయంలో ఎంత టెలికాస్ట్ చేసారో తెలియదు. ఇలా రికార్డు చేసినవన్నీ ప్రసారం చేయాలని రూలేమీ లేదు కూడా.
పోతే నాకు గుర్తు ఉన్నంత వరకు వాళ్ళ ప్రశ్నలకు నా జవాబులు:
“కాంగ్రెస్ పార్టీలో ఒక స్థాయిలో ఆల్టర్ నేటివ్
పాలిటిక్స్ మీద ఆధారపడడం మొదలయింది. ‘ఈసారి మనల్ని కాదని వేరే పార్టీని
ఎన్నుకున్నారు. వచ్చేసారి ప్రజలకు మనమే ప్రత్యామ్నాయం అనే ధోరణి’ అన్నమాట. రెండే రెండు
పార్టీల వ్యవస్థ వున్నప్పుడు ఈ లెక్క సరి కావడానికి అవకాశం వుండేదేమో. బహుళ
పార్టీల వ్యవస్థ ఆవిర్భావం తరవాత ఈ లెక్క తప్పుతూ వచ్చింది. మరోపక్క దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరుగుతున్న విషయాన్ని
కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లెక్కపెట్టలేదు. తమిళనాడులో పరిస్థితి చూసిన తర్వాత
అయినా దిద్దుబాటు చర్యలు తీసుకుని వుంటే
ఎలా ఉండేదో. అప్పుడెప్పుడో పార్టీకి
స్వర్ణ యుగం నడిచిన కాలంలో అక్కడ కట్టుకున్న పార్టీ ప్రధాన కార్యాలయం తప్పిస్తే , పార్టీకి
చెప్పుకోతగ్గ నాయకులు కానీ,
కార్యకర్తలు కానీ వున్నారా అంటే అంటే
చప్పున జవాబు చెప్పలేని పరిస్థితి”
“జాతీయ స్థాయిలో కూడా పార్టీది అదే స్థితి.
రాహుల్ వయసులో చిన్నవాడు. భార్యా పిల్లల బాధ్యత కూడా లేనివాడు. పూర్తి సమయాన్ని
పార్టీకి కేటాయించగలిగిన వెసులుబాటు వున్నవాడు.
రాజకీయంగా మోడీని ఎదుర్కోవడానికి అన్ని అర్హతలు హంగులు రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి వున్నాయి. అనుభవం అందామా మోడీ కంటే ముందునుంచే,
సుదీర్ఘ చరిత్ర కలిగిన కలిగిన ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తూవస్తున్నవాడు.
పార్టీలో ఆయన మాటకు ఎదురు చెప్పేవారు లేరు. అయినాసరే,
పార్టీకి అత్యున్నత నేతగా ఆయన కొనసాగిన కాలంలో ఏ ఒక్క ఎన్నికలో కూడా కాంగ్రెస్
పార్టీ గణనీయమైన విజయాన్ని సాధించలేకపోయింది. కొన్ని రాష్ట్రాలలో పై చేయి
అనిపించుకున్నా, బీజేపీ రాజకీయ చతురంగపు ఎత్తుగడల్లో అధికారంతో పాటు
సమర్ధులైన నాయకులను కూడా ఆ రాష్ట్రాల్లో కోల్పోయింది. ఒకానొక సమయంలో ప్రధాని అయ్యే
అవకాశాన్ని కూడా రాహుల్, తన
తల్లి సోనియా మాదిరిగానే వదులుకున్నాడు. నేటి రాజకీయ ప్రమాణాలతో పోలిస్తే నిజానికి ఇది ఎంతో పెద్ద త్యాగం. మామూలు విషయం
కాదు. దేశ ప్రధానిగా కొద్ది రోజులు వున్నా చాలు అని ఆశ పడే రాజకీయ నాయకులకు కొదవ లేని దేశం మనది. అంత త్యాగనిరతిని ప్రదర్శించి
కూడా ఆ విషయం ప్రజల గుండెలకు తాకేలా చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు.
“కాంగ్రెస్
పార్టీకి చాలా రాష్ట్రాలలో పటిష్టమైన
స్థానిక నాయకత్వం వుంది. కానీ ఆ నాయకులు మరింత బలపడితే తమకు ఇబ్బంది అని భావించే వృద్ధ నాయకుల మాటకే ఆ పార్టీలో పెద్దపీట. దాని ఫలితమే ఈనాటి
దుస్థితి.
“ఇక తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మరింత
దిగజారిపోవడం అనేది కేవలం
స్వయంకృతాపరాధమే. దేశమంతా పార్టీ తుడిచిపెట్టుకుని పోయిన రోజుల్లో కూడా
ఆంధ్రప్రదేశ్,
కర్ణాటక ప్రజలు ఆ పార్టీని అక్కున చేర్చుకుని అందలం ఎక్కించారు. అలాంటి
రాష్ట్రాలలో కూడా పార్టీ ఉనికి ప్రశ్నార్ధకం కావడం చేజేతులా చేసుకున్నదే.
“తెలంగాణా ఇచ్చింది సోనియా నాయకత్వంలోని
కాంగ్రెస్ అయినప్పటికీ అది ఇచ్చిన తీరును తెలంగాణా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.
ఉదాహరణ చెప్పాలంటే ఒక పిల్లవాడు తల్లిని చాక్ లెట్ కొనిపెట్టమంటాడు. తల్లికి
అదేమంత పెద్ద విషయం కాదు,
పిల్లవాడు అడిగింది కూడా కొండమీది కోతిని కాదు. అయినా పిల్లవాడు పొర్లిపొర్లి
ఏడ్చినదాకా ఆగి, ఆ తల్లి అప్పుడు కొనిపెట్టిందనుకోండి, ఆ
పిల్లాడు కూడా నేను అడిగితే కొనలేదు,
గుక్కపట్టి ఏడిస్తే కొనిచ్చింది అనే అభిప్రాయంలోనే ఉంటాడు. అదే జరిగింది. ఇచ్చిన వరదాన ఫలం తెలంగాణాలో లభించలేదు. అటు ఆంధ్రా ప్రాంతంలోని
ప్రజలు, కాంగ్రెస్ రాష్ట్రాన్ని నిలువునా
చీల్చింది అనే ఆగ్రహంతో ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. చివరికి ఉభయ భ్రష్టత్వం అనే సామెత నిజమైంది”
“అయితే ఇంతటితో కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది
అనే నిర్ధారణకు రానక్కర లేదు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి,
యువరక్తంతో పార్టీని నింపి, ప్రజల సమస్యలను పట్టించుకుంటూ, నవతరం
ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ విధి విధానాలను తీర్చి దిద్దగలిగితే. ....ఏమో
గుర్రం ఎగరావచ్చు.
“ఒకప్పుడు లోకసభలో రెండే రెండు సీట్లున్న బీజేపీ,
ఈనాడు అత్యధిక మెజారిటీతో దేశాన్ని పాలిస్తోంది. కంటికి కనబడుతున్న ఈ వాస్తవాన్ని
కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం గుర్తు పెట్టుకోవాలి” (18-11-2020)
1 కామెంట్:
ఒకప్పటి రెండుసీట్లపార్టీ పట్టుదలతో ఎదిగింది. ఈకాంగ్రెసుపార్టీకి బ్రతికి బాగుండాలన్న కోరికే లేదు - ఆ కుటుంబం గొప్పది తప్పుపట్టరానిది అన్న మంత్రజపం తప్ప పార్టీలో మరో కార్యక్రమం లేదు. ఆకుటంబాన్ని జనం ప్రక్కనపెట్టేసారు. నాయకత్వమూ జీవమూ లేని పార్టీ దేశానికి మేమే దిక్కు అని చెప్తుంటే జనం నవ్వుతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి