ఎన్నికల హామీలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎన్నికల హామీలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, నవంబర్ 2020, గురువారం

TO WHOMSOEVER IT MAY CONCERN - BHANDARU SRINIVAS RAO

 

“సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు”
ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం.

ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక వారి చేత హామీల వర్షం కురిపిస్తుంది. ఒకటా రెండా, సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న ఉచిత సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్న మేనిఫెస్టోలకు కొరత లేదు. ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ప్రభుత్వ ఖజానా డబ్బులతో, ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎన్నికల హామీల తాయిలాలను ఎలా ఇస్తారన్నడానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నడానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు.

అందుకే అయ్యలూ! ఓ పని చేయండి. ఇలా చేస్తే, మీకూ, ఓటర్లకు మాత్రమే కాకుండా ప్రభుత్వాలకు కూడా ప్రయోజనకరంగా వుంటుంది. మీ మీ పార్టీలు ఏమీ బీదవి కావు. అందరికీ తెలిసిన విషయమే. ఓట్లకోసం మీరు పెట్టే ఖర్చే ఈ వాస్తవాన్ని తెలుపుతుంది. గెలిచిన పక్షంలో ఒక్క ఏడాది పాటు మీరిచ్చిన ఈ ఉచిత హామీలను మీ పార్టీ నిధులతో అమలు చేయండి. ఆ తర్వాత సర్కారు ఖజానా నుంచి ఖర్చు పెడుదురు కాని.

మీకు ప్రజాధనం విలువ తెలిసిరావాలంటే ఇంతకంటే వేరు మార్గం కనబడడం లేదు.
ఏమంటారు?

1, ఏప్రిల్ 2019, సోమవారం

ఉందిలే మంచి కాలం ముందు ముందునా – భండారు శ్రీనివాసరావు


‘ఏవిటి రామయ్యా! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్’
‘ఏముంది మరో రెండు నెలల్లో మన జీవితాలు ఎన్ని కొత్త మలుపులు తిరుగుతాయో తలచుకుంటూనే ఆశ్చర్యంగా వుంది’
‘అందుకోసం పోద్దటి నుంచీ  తిండి కూడా తినకుండా ఆ కుక్కి మంచంలో పడుకుని  కాలుమీద కాలు వేసుకుని మరీ ఆలోచిస్తున్నావ్! ఇంతకీ ఆ జరగబోయే  మంచి  ఏమిటో చెప్పు, నాకూ వినాలని వుంది’
‘ఇక నుంచి నువ్వూ నేనే కాదు మన ఇంట్లో పిల్లా పాపా అందరం కాలుమీద కాలువేసుకుని దర్జాగా గడిపే రోజులు వస్తున్నాయి. కలలో కూడా ఊహించలేదు సుమా!’
‘ఏవిటి! పరగడుపునే నాలుగు పేకెట్లు పడ్డాయేమిటి కడుపులో’
‘అలానే అంటుండు. అప్పుడే ఏప్రిల్ వచ్చేసింది.  ఈ నెలకు ముప్పయి రోజులే. పైన మే నెలలో మరో ఇరవై మూడు రోజులు. ఎంతలో దొర్లిపోతాయి చూస్తుండు’
‘మేలో ఏం జరుగుతుందేమిటి? మహా అయితే ఎండలు ఇంకా మండుతాయి’
‘ఇక మనకు కడుపు మండడాలు గట్రా వుండవు. అన్నీ మంచి రోజులే. పించన్లు  నాకూ మా ఆవిడకు, నీకూ మీ ఆవిడకు మాత్రమే కాదు, చదువంటక రోడ్లు పట్టుకు తిరుగుతున్న మా ఇద్దరు పిల్లలకు నెల తిరిగేకల్లా విచ్చు రూపాయలు కళ్ళముందు గలగలా మంటాయి. ఉద్యోగం వున్నా డబ్బులే, లేకున్నా డబ్బులే. గ్యాస్ బండలు రూపాయి ఖర్చు లేకుండా వంటింట్లోకి దొర్లుకుంటూ వస్తాయి, కాణీ ఖర్చు లేకుండా. పెళ్ళయిన పిల్లకి పసుపు కుంకుమ, పెళ్లి కాని దానికి మనం  కొనిపెట్టలేని అవేవో  ల్యాప్టాపులూ, సెల్ ఫోన్లు. వాళ్ళ చదువులు అన్నీ ఇక మనం చూసుకోనక్కర లేదు. పండినా పండక పోయినా ఇన్నాళ్ళు మనకు డొక్కలు ఎండడమే. పంట వేసుకోవడానికి డబ్బులు, పైర్లు కోసుకోవడానికి డబ్బులు. రోగంరొష్టు వస్తే యెట్లా అనే బాధ లేదు. బతికున్నా డబ్బులే. రోగం వచ్చినా డబ్బులే. ఆఖరికి చచ్చి  కాటికి వెళ్ళినా డబ్బులే. వచ్చే ఎన్నికల నాటికి ఇంకెన్ని ఇస్తామంటారో. ఇన్నాళ్ళు ఏదో చచ్చామో బతికామో తెలియకుండా బతుకులు ఈడుస్తున్నాం. ఇక బతుకు గురించి బెంగ లేదు. సంసారం ఎలానా అన్న దిగులు లేదు. ఎవరు గెలిస్తే మనకేమిటి. మనకు నిత్యం చచ్చి బతికే పనిలేకుండా చేస్తామంటున్నారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా  మనకు పోయేదేమీ లేదు. వాళ్ళందరూ గెలవాలనే  మనం దేవుడ్ని కోరుకుందాం’
‘అదెలా కుదురుతుంది. ఎవరో ఒకళ్లెకదా గెలిచేది. మరి అందరూ గెలిస్తే కదా నువ్వు చెప్పిన కోరికలన్నీ తీరేది’
‘అందుకే ఇందాకటి నుంచి ఏం చెయ్యాలా అని దీర్ఘంగా  ఆలోచిస్తున్నాను. నువ్వన్నట్టు పోటీలో ఉన్న పార్టీలు అన్నీ గెలిస్తేనే కదా ఇవన్నీ నిజం అయ్యేది. అందుకని ఓ పని చేద్దాము. పోలింగు బూతులోకి వెళ్లి ఆ మెషిన్ మీద అన్ని పార్టీల గుర్తులు గుర్తు పెట్టుకుని ఒకేసారి అన్నింటిపైనా  నొక్కేద్దాము,  ఓ పనైపోతుంది. ఏవంటావ్’