30, నవంబర్ 2020, సోమవారం

కార్తీక దీపం – భండారు శ్రీనివాసరావు

 

“వచ్చిన వారు సీదా గుళ్ళోకి వెళ్ళకుండా ఇక్కడిక్కడే తిరుగుతుంటే అప్పుడే అనుకున్నా” అందావిడ ఏమనుకున్నదో నాతొ చెప్పకుండా, ఆవిడ ఏమనుకున్నదో మాత్రం నాకు తెలిసేలా.

ఇందిరా పార్కు దగ్గర వున్న శ్రీ విజయ గణపతి ఆలయంలో భక్తులు కిటకిట లాడడం లేదు, కానీ బాగానే వున్నారు. అందరూ  మాస్కులతోనే  కనిపించారు. గుడి ద్వారం దగ్గరే  ఒకావిడ కూర్చుని వచ్చిన వారి చేతులను    సానిటైజ్ చేస్తోంది. వెనక ప్రతి గుళ్ళో కాళ్ళు కడుక్కోవడానికి ఏర్పాట్లు ఉండేవి. ఇప్పుడు కరోనా పుణ్యాన చేతులు వాళ్ళే కడుగుతున్నారు. గుడి మూసివేసే సమయానికి వెళ్ళడం వల్ల కాబోలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వెలిగించిన దీపాలతో చలి పక్కనే వున్న పార్కులోకి పారి పోయినట్టుంది. అక్కడ నన్ను ఆకర్షించింది ఒక పెద్ద సైజు బూడిద గుమ్మడి కాయ. నిజానికి అది గుమ్మడి కాయ కాదు. ఆ సైజులో వత్తులతో తయారుచేసిన కార్తీక దీపం. ఆ దీపాన్ని వెలిగించడానికి ముందు కొబ్బరి కాయ కొడుతున్న దంపతులను అడిగాను, ఇందులో ఎన్ని వత్తులు వుంటాయి అని. 



“వన్ కరోర్” అంది నిండా ముప్పయ్యేళ్లు కూడా లేని భార్య,  ఆ దీపం వెలిగించే ఏర్పాట్లలో పక్కకి వెడుతూ.

“కోటి వత్తులా!” ఆశ్చర్యపోవడం నా వంతయింది.

 పిల్లను ఎత్తుకుని ఉన్న అతడిని అడిగాను ఇది ఎంత ఖరీదు అని. 

“ I don’t know. You ask my wife” అన్నాడతను.

అదే ప్రశ్న ఆవిడను అడిగాను. దూరంగా ఒక ఆడ మనిషిని చూపించి అక్కడ అడగండి అంది. నేను ఆమె దగ్గరికి వెళ్లి అడిగాను ఖరీదు ఎంత. ఎక్కడ దొరుకుతుంది అని.

“మిమ్మల్ని చూసి అప్పుడే అనుకున్నాను” అని అప్పుడు అన్నమాట అదన్నమాట. నాలో ఉత్సుకతను కనుక్కుందని అర్ధం అయింది.

“మూడువేలు. మళ్ళీ పోయి అడగకండి. మొగుడికి వెయ్యి అనిచెప్పింది. నాకు మూడు వేలు ఇచ్చింది. మీకూ కావాలా! ఈ నెలంతా వీటికి బాగా డిమాండ్”

ఇందిరా పార్కు ప్రహరీకి ఆనుకుని వున్న గణపతి గుడి చిన్నదే అయినా చుట్టుపక్కల చాలా పెద్ద పేరుంది. అలాంటి గుడిలో భక్తులు, మాస్కులు కట్టుకుని ఈ కరోనా సమయంలో వెలిగిస్తున్న కార్తీక దీపాలు చూస్తుంటే చాలా ముచ్చట వేసింది. 

నిన్న ఆదివారం మా ఏడో అక్కగారు తుర్లపాటి భారతీ దేవికి సహస్ర చంద్ర దర్శనం ఉత్సవ సందర్భంగా వేదోక్తంగా  కన్న సంతానం  కనకాభిషేకం చేశారు.  మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు, విమల వదిన గార్లతో  కలిసి అక్కడికి  వెళ్లి తిరిగివస్తూ దోవలో  ఆ గుడికి వెళ్ళాము.

దాదాపు ఏడెనిమిది నెలల తర్వాత మొదటిసారి దేవాలయ దర్శనం.  

‘కోటి వత్తులు ఎలా లెక్క పెడతారు?’

ఇంటికి తిరిగివస్తున్నంత సేపు నా మనసులో ఈ ప్రశ్న సుళ్ళు తిరుగుతూనే వుంది.

“నమ్మకం” అన్నాడు మా అన్నయ్య, నా ఆలోచన గ్రహించినట్టుగా. 

(30-11-2020)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

వెయ్యి వత్తులో కట్ట అటువంటివి పదికట్టలు అప్దివేలు, మరటువంటి పది కట్టలు లక్ష, ఇందులో అబద్ధంలేదు, కొంతమందికి నిత్యం ఇదే జీవనోపాధి.కోటి వత్తులు మూడు వేలు చాలా చౌక, ఒక రకంగా సేవ.