3, నవంబర్ 2016, గురువారం

రమణ దీక్షితులు


తిరుమల శ్రీవారి దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా నలభై ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్న రమణ దీక్షితులు గురించి ఆయన మాటల్లోనే విందాం.
“నేను తిరుపతిలోనే పుట్టి పెరిగాను. మా తండ్రి గారు వేంకటపతి దీక్షితులు తిరుమల శ్రీవారి దేవాలయంలో ప్రధాన అర్చకులు.
“ నా చిన్న తనంలో, అంటే, 1960 ప్రాంతంలో తిరుపతి చాలా చిన్న పట్టణం. వూళ్ళో రెండు సినిమాహాళ్ళు, రెండే రెండు కార్లు, నాలుగు స్కూటర్లు వుండేవంటే నాటి పరిస్తితులను ఊహించుకోవచ్చు.
నా తలితండ్రులకి నేను ఏకైక సంతానాన్ని. మునిసిపల్ స్కూల్లో, ఎస్.వీ.ఆర్ట్స్ కాలేజీలో చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీ;హెచ్.డీ. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాను.
“తరతరాలుగా మా కుటుంబీకులే శ్రేవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా వుంటూవస్తున్నారు. అంచేత ఏదో ఒకరోజు ఈ బాధ్యతలు నేను స్వీకరించాల్సి వస్తుందని నాకు తెలుసు.
“శ్రీవారి ఆలయంలో అర్చకత్వం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో నియమనిష్టలు అవసరం. అందుకే నా పెంపకం కూడా ఆ కోణంలోనే సాగింది. ప్రాధమిక పాఠశాల స్థాయి నుంచి గట్టి క్రమశిక్షణలో పెరిగాను. ఆహారవిహారాల్లో కూడా కఠిన నియమ నిబంధనలు ఉండేవి.
“ఇప్పటికీ కూడా నా భోజనం చాలా సింపుల్. ఉడకబెట్టిన కూరగాయలు తప్పించి ఒండిన అన్నం కూడా ముట్టను.
“దురదృష్టం నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండగానే మా తండ్రి గారు విష్ణు సాన్నిధ్యం చేరుకున్నారు. దాంతో మా తండ్రి గారి అడుగు జాడల్లో అర్చకత్వం స్వీకరించాను. అదేసమయంలో నా చదువు కొనసాగించాను. మాలిక్యులర్ బయాలజీలో డాక్టరేట్ తీసుకున్నాను. అమెరికాలోని సౌత్ కరోలినా యూనివర్సిటీలో సీటు వచ్చింది.
  
 “అయితే వైఖానస ఆగమ సూత్రాల ప్రకారం తిరుమల ఆలయంలో పనిచేసే అర్చకులు సముద్రాన్ని దాటి ప్రయాణం చేయరాదు.ఈ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ నాకు లభించిన ఈ అవకాశాన్ని వదులుకున్నాను.
వంశపారంపర్యంగా నాకు లభించిన సువర్ణ అవకాశం అని అనుకోవడం లేదు. తన సేవకు అర్హులైన వారిని ఆ స్వామే నిర్ణయించుకుంటారు. అది దైవ నిర్ణయం తప్ప వేరు కాదు”

కామెంట్‌లు లేవు: