17, నవంబర్ 2016, గురువారం

మన దేశానికి పట్టిన ‘నల్ల’ తుప్పు వదిలేనా!

ఎదుటి దృశ్యం సరిగా కనబడాలంటే కంటి చూపు తేటగా వుండాలి. కంటికి పెట్టుకున్న అద్దాలను బట్టి కూడా  ప్రపంచం కానవచ్చే తీరు మారుతూ  వుంటుంది.

పెద్ద నోట్లను చెలామణీ లోనుంచి తప్పిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా సాగుతున్న చర్చల సరళి ఇందుకు చక్కని ఉదాహరణ.

 ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే శ్రీ దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తూ గతంలో  పరిపూర్ణానంద స్వామి చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.

“ఈ ఏడాది (2016) సెప్టెంబరు నుంచి వచ్చే సంవత్సరం (2017) జనవరి వరకు దేశానికి సంక్షుభిత సమయం. ప్రజలు, ప్రత్యేకించి రాజకీయ నాయకులు సంయమనం పాటించాల్సిన అగత్యం వుంది” హైదరాబాదులో కార్తీక మాసం కోటి దీపోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా స్వామి మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. “అంశం ఏదైనా సరే, రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడ్డం మంచిద”ని ఆయన మరోమారు హితవు పలికారు.

కొద్ది రోజులు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని ప్రభుత్వ పెద్దలు కూడా  చెబుతున్నారు. మంచిదే! సంయమనం ఎప్పుడూ మంచిదే. ఎవ్వరూ కాదనరు.

అంతా సద్దుమణుగుతుంది సరే! ఈలోపల అసలు సిసలు నల్ల కుబేరులు తమ వద్ద మూలుగుతున్న నల్ల డబ్బు సర్డుకోకుండా, సర్దుబాటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతె, ‘తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని’ అనే తంతు అవుతుంది.     

 

కామెంట్‌లు లేవు: