సూర్యుడి
కాంతి చంద్రుడి మీద పడి ప్రతిఫలించినట్టు ఎక్కడో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు
జరగబోతుంటే దాని ప్రభావం మన దేశంలో కూడా కనబడుతోంది. ఎన్నికల ప్రచారం మొదలయిన తొలి
రోజుల్లో తన ప్రత్యర్ధి డెమొక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ కంటే బాగా వెనుకబడి
వున్నట్టు కానవచ్చిన రిపబ్లికన్ అభ్యర్ధి
డొనాల్డ్ ట్రంప్, పోలింగు ఘడియ దగ్గర పడే
వేళకు బాగా పుంజుకుని ప్రత్యర్ధి మీద స్వల్ప ఆధిక్యత కనబరచారంటూ వెలువడిన వార్తలతో
భారతీయ మార్కెట్లు గత బుధవారం నష్టాల్లో ముగిశాయి. వారిద్దరి నడుమా పోటీ
నువ్వానేనా అనే రీతిలో సాగుతోందనే మీడియా వార్తల నేపధ్యంలో ఇన్వెస్టర్లు వేచి
చూసే ధోరణి అవలంబిస్తూ వుండడం దీనికి
కారణమని విశ్లేషకుల అభిప్రాయం.
పిడుగులు
పడ్డా అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు నాలుగేళ్ళకోసారి జరిగితీరుతాయి. అదీ ఆ నెలలో
ఒక నిర్దిష్ట దినం రోజున. అంటే నవంబరు నెలలో మొదటి సోమవారం మరునాడు వచ్చే మొదటి
మంగళవారం రోజున. దీనికి ఇంత తిరకాసు
ఎందుకు?, మొదటి మంగళవారం అంటే సరిపోతుంది
కదా అనే సందేహం రావచ్చు. దానికి ఒక కారణం వుంది. ఆ మొదటి మంగళవారం మొదటి తేదీనే
రావచ్చు. అందుకే ఈ మెలిక. అంటే ఏమిటన్న మాట ఈ నిర్దిష్ట ఎన్నికల దినం నవంబరు రెండు
నుంచి ఎనిమిది వరకు మారే అవకాశం వుంది. ఈ సారి సోమవారం ఏడో తేదీ కాబట్టి ఎన్నికలు
ఆ మరునాడు మంగళవారం ఎనిమిదో తేదీన
జరగనున్నాయి. 1788 నుంచి ఇంతవరకు ఈ విధానం ఎటువంటి మార్పులు,
మినహాయింపులు లేకుండా అమలవుతోంది.
అంతా
సజావుగా సాగితే ఎనిమిదో తేదీన అమెరికన్
అధ్యక్ష ఎన్నికల క్రతువు పూర్తవుతుంది. గతంలో ఎన్నడూ లేనిది ఈసారి సజావుగా అనే పదం
వాడడానికి కూడా కారణం లేకపోలేదు. ఈ తడవ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో సాగుతున్న ప్రచార
సరళి గతంలో ఎన్నడూ ఎరగని అధమ స్థాయికి దిగజారి పోయింది. రకరకాల మీడియా ఊహాగానాలు
జోరందుకున్నాయి. ట్రంప్ విజయావకాశాలు మెరుగుపడుతున్నాయన్న సంకేతాలు మొదటిసారి
వెలువడడంతోనే వదంతులు కూడా లెక్కకు మిక్కిలి పెరిగిపోవడం మొదలెట్టాయి. ఇవి పతాక
స్థాయికి చేరాయనడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. కొందరు ప్రపంచ దేశాల నాయకులు రహస్యంగా సమావేశమై ట్రంప్
శ్వేతభవనంలోకి అడుగు పెట్టకుండా నిరోధించాలని వ్యూహ రచన చేస్తున్నారనీ, ఇందులో
భాగంగానే ప్రెసిడెంట్ ఒబామా ఎన్నికల తేదీకి ముందుగానే దేశంలో మార్షల్ లా విధించి ఎన్నికలు వాయిదా వేయడమో, లేదా
పూర్తిగా రద్దు చేయడమో చేస్తారనే చర్చలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఇవన్నీ
గమనించినప్పుడు మన దగ్గరే పరిస్తితి కొంతలో కొంత మేలనిపించడం సహజం.
సరే!
ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం పోటీలో వున్న ఇద్దరిలో గెలుపెవరిది అనే విషయంలో
పోటీ మొదట్లో వున్న స్పష్టత ఇప్పుడు అంత స్పష్టంగా వున్నట్టు లేదు. ఇరువురి నడుమ
జయాపజయాలు గురించిన అంచనాల్లో తొలుత కానవచ్చిన తేడా క్రమంగా తగ్గిపోయింది. ఇది మీడియా ఊహాగానాల ఫలితం కావచ్చు. తుదకు అసలు ఫలితంలో తేడా కూడా వుండొచ్చు. పోలింగు తేదీ
దగ్గర పడుతున్న కొద్దీ వదంతుల తీవ్రత కూడా బాగా పెరిగిపోతోంది. అమెరికాలో అనేక
ఎన్నికలను చాలాకాలంగా చూస్తూ వస్తున్న వాళ్ళు సైతం గతంలో ఎన్నడూ ఎన్నికల ప్రచారం
ఇంతగా గాడితప్పిన దాఖలాలు లేవంటున్నారు.
మీడియా
ఎలాగూ సంచలన కేంద్రంగా పనిచేస్తుంది కనుక ఇటువంటి చర్చలు ఎలాగూ తప్పవు. ఎనిమిదో
తేదీన ఎన్నికలు జరగకా తప్పదు. వేచి చూడడమే విజ్ఞుల పని. ఫలితాల విషయం పక్కన బెట్టి అమెరికాలో రాజకీయ
క్షేత్రంలో వస్తున్న గణనీయమైన మార్పులు గురించి కొంత చెప్పుకుందాం.
గత
నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికాలో కార్పొరేట్ల ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది.
దేశంలో రాజకీయ వ్యవస్థని శాసించడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ నిధుల్లో
సింహ భాగాన్ని వెచ్చిస్తున్నాయి. అందుకు తగ్గ ప్రతిఫలాలను ప్రభుత్వాలనుంచి
రాబట్టుకుంటున్నాయి. 1970 కి పూర్వం కూడా ఈ కార్పొరేట్ల ప్రభావం ప్రభుత్వాల మీద వుండేది కానీ ఇప్పటితో పోలిస్తే చాలా
స్వల్పం. అరవయ్యవ దశకంలో అప్పటి పాలకులు జాతి శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని పౌర
సమాజానికి మేలు చేసే కొన్ని మార్పులు తలపెట్టారు. కార్పొరేట్ల లాబీ బలంగా లేకపోవడం
వల్ల ఆ రోజుల్లో వాటిని నిలవరించగల సత్తా వాటికి లేకపోయింది. కొత్త మార్పులను అవి
హరాయించుకోలేకపోయాయి. దాంతో తమ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు వందలాది వ్యాపార
వ్యవస్థలు, డెబ్బయ్యవ దశకం మధ్యలో మొట్టమొదటి సారి లాబీ చేయగల సామర్ధ్యం ఉన్నవారిని తమ కంపెనీల్లో నియమించుకుని ప్రభుత్వాలపై, వాటి విధానాలపై ప్రభావం
చూపడం మొదలు పెట్టాయి. అంతే కాదు తమకు
అనుకూలంగా వ్యవహరించే పార్టీలకు అపారమైన నిధులు సమకూర్చిపెట్టడానికి కూడా శ్రీకారం
చుట్టాయి. మొదట్లో ప్రభుత్వాన్ని శత్రువుగా పరిగణించిన కార్పోరేట్ శక్తులు
కాలక్రమంలో పాలకులను తమకు ఉపయోగపడే శక్తివంతమైన సాధనంగా మార్చుకునే మార్గాన్ని
కనుగొనే ప్రయత్నాలు సాగించాయి. ఏతావాతా జరిగింది, జరుగుతున్నది ఏమిటంటే ఆ దేశంలో ఏ పార్టీ ప్రభుత్వం అయినా కార్పొరేట్ల అధీనంలోకి
తెలిసో తెలియకో వెళ్లి పోతుండడమే.
ఈ
పరిణామాలు అమెరికాకే పరిమితం కాదు. మన దేశంలో కూడా మొగ్గ తొడిగి పుష్పిస్తున్నాయి.
పొతే,
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు, అధ్యక్షులకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు:
1789 లో జార్జ్ వాషింగ్టన్ పోటీ లేకుండా
ఎన్నికయ్యారు. ఆయన మీద పోటీ చేసేవారే కరువయ్యారు. నిజానికి ఆయన ఏ పార్టీకి
ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీకి నిలబడలేదు.
1872 లో యులిసెస్ ఎస్.
గ్రాంట్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే పోటీ లేకుండా కాదు. ఆయన మీద పోటీకి దిగిన ప్రత్యర్ధి పోలింగుకు ముందు
హఠాత్తుగా మరణించడం వల్ల గ్రాంట్ మహాశయులు నేరుగా వైట్ హౌస్ లో చేరిపోయారు.
ఆండ్రూ జాక్సన్
అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున వైట్ హౌస్ లో మద్యం ఏరులై పారింది.
మందుబాబులు అర్ధరాత్రి అయినా కదలక పోవడంతో చివరికి జాక్సన్ చేసేది లేక మెల్లగా అక్కడి
నుంచి జారుకుని ఆ రాత్రి ఓ హోటల్ లో గడపాల్సిన పరిస్తితి ఏర్పడింది.
ఆల్
స్మిత్ అనే అభ్యర్ధి మద్యపానాన్ని తన ఎన్నికల నినాదం చేసుకున్నాడు. ‘నాకు వేసే
ప్రతి ఓటు పూటుగా మందు కొట్టడానికి
లైసెన్సు బిళ్ళ’ అంటూ ప్రచారం
చేసుకున్నాడు.
రూధర్ ఫోర్డ్ బి హేస్
తరహా వేరు. వైట్ హౌస్ లో ఇచ్చే విందుల్లో మందు సరఫరా చేసే పద్ధతికి ఆయన భరతవాక్యం
పలికారు.
అమెరికా
అధ్యక్షులు నివసించే భవనానికి వైట్
హౌస్ అని నామకరణం చేసింది ప్రెసిడెంట్
రూజ్ వెల్ట్. అంతకు ముందు ఆ భవనాన్ని ప్రెసిడెంట్ నివాసం (ప్రెసిడెంట్స్
ఎగ్జిక్యూటివ్ మాన్షన్) అని పిలిచేవాళ్ళు.
రూజ్
వెల్ట్ కి మరో ఘనత కూడా వుంది. ఆయన నాలుగు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ
తరువాత రాజ్యాంగాన్ని సవరించి ఒకే వ్యక్తి రెండు తడవలకు మించి అధ్యక్షుడిగా ఎన్నిక
కారాదని పరిమితి విధించారు.
జేమ్స్
కె పోల్క్ నిజానికి అమెరికాలోనే కాకుండా
యావత్ ప్రపంచంలో కూడా ఆదర్శ ప్రాయుడయిన
రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఎన్నికల సమయంలో తాను చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని
అధికారంలోకి వచ్చిన తరువాత తుచ తప్పకుండా నెరవేర్చి చూపెట్టారు. అంతే కాదు, అవకాశం
వున్నప్పటికీ రెండోసారి పోటీ చేయడానికి ఆయన ఇచ్చగించలేదు.
అమెరికన్
అధ్యక్షులు అందరిలో విలియం హెన్రీ హారిసన్ అత్యంత దురదృష్టవంతుడు. ఎందుకంటే
అధ్యక్షుడిగా ఎన్నికై, వైట్ హౌస్ లో
ప్రవేశించిన ముప్పయి రెండు రోజుల్లోనే కన్నుమూశారు.
గ్రోవర్
క్లీవ్ లాండ్ అధ్యక్షుడిగా వున్న రోజుల్లో ఎవరు ఫోను చేసినా, ఆపరేటర్ తో నిమిత్తం లేకుండా ఆయనే స్వయంగా రిసీవ్ చేసుకునేవారు.
వైట్
హౌస్ కి వచ్చిన అతిధులతో అధ్యక్షుడు కరచాలనం చేసే సంప్రదాయాన్ని థామస్ జెఫర్ సన్ ప్రవేశపెట్టారు.
అంతకు ముందు ప్రెసిడెంటుని కలవడానికి వచ్చినవారు
గౌరవ పురస్సరంగా ఒంగి అభివాదం చేసేవారు.
రచయిత ఈమెయిల్: bhandarusr@gmail.com
మొబైల్: 98491
30595
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి