11, ఆగస్టు 2010, బుధవారం

జీవనస్రవంతి - భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి - భండారు శ్రీనివాసరావు




కధలన్నీ కంచికి చేరతాయంటారు కాబట్టి- కధలకు ప్లాట్లు కావాల్సినవాళ్ళు కంచికి పోవాలన్న జోకు ప్రచారంలో వుంది. గ్రహం గ్రీన్ అనే ఓ గ్రీకు రచయిత మాత్రం తన కధలకు ఆధారం తనకొచ్చే కలలే అని సెలవిస్తున్నారు. కధా కధన చాతుర్యమంతా కలల నుంచే సంగ్రహిస్తున్నానని చెప్పుకుంటున్నారు.

 ఆయన రాసే కధలు చదువుతూ కలల్లో తేలిపోతున్న చదువరులు - కలలు కంటూ ఆ రచయిత వండి వారుస్తున్న కధా సంపుటాలను వేడి వేడి పకోడీల్లా ఎగరేసుకుపోతున్నారు. కధ రాస్తూ రాస్తూ వుండగా ఏదయినా అనుమానం వస్తే చాలు - ఆ కలల కధకుడు వెంటనే నిద్రలోకి జారుకుని, కలలు కంటూ వాటిల్లోనే పరిష్కారం వెతుక్కుంటూ ఉంటాడట. తన కధల కొసమెరుపులన్నీ తను కన్న కలల్లోనుంచి సంపాదించినవేనని గ్రహం మహాశయులవారు ఓ కధ చెబుతున్నారు.



జీవనస్రవంతి






న్యూ ఢిల్లీ లోని స్కూళ్ళలో చదువుకుంటున్న సుమారు పదిహేనువందలమంది పిల్లలకి ఓ రోజు ఓ పెళ్ళికి ఆహ్వానిస్తూ శుభ లేఖలు అందాయి.ఫలానా చోట జరగనున్న ఫలానా వారి పెళ్ళికి రావాల్సిందని ఓ ఫలానా సంస్థ వారు వారందరికీ ఆహ్వానాలు పంపారు. షరా మామూలుగా వుండే 'మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ ' లతో పాటు శుభ లేఖ అందుకున్న వారందరూ తలా ఒక రూపాయి పంపాలన్న విజ్ఞప్తి కూడా అందులో వుంది. అసలు సంగతేమిటంటే - ఢిల్లీ లోని ఒక స్వచ్చంద సంస్థ వారు - ఓ పేద జంటకు పెళ్లి చేసేందుకు ఆ విధంగా విరాళాలు సేకరిద్దామని తలపెట్టారు. పిల్లలందరూ తలా ఒక రూపాయి వేస్తె - పెద్దలందరూ తలా ఒక చేయి వేసి ఆ పెళ్లి జరిపించారు.



జీవనస్రవంతి






రాయపూరులో ఓ సాధువు గారు అక్కడి రెవిన్యూ అదికారులకి తన చేష్టలతో దిగ చెమటలు పట్టించారు.

సంగతేమిటంటే - ఆ సాధువు అంత సాదు జంతువేమీ కాదు. ఆశ్రమం పేరుతొ ఏకంగా ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ఖాళీ చేయమని అధికారులు తాఖీదు పంపితే ఆయనకు

ఎక్కడలేని ఆగ్రహం తన్నుకొచ్చింది. ఆ తాఖీదుని ఒక చేత్తో- మనిషి పుర్రెని మరో చేత్తో పట్టుకుని ఆయనగారు కోపంతో ఊగిపోతూ తహసీల్ కచ్చేరీలో అడుగుపెట్టి - తలపాగా తీసి బల్లపై పెట్టిన చందంగా - ఆ మానవ కంకాళాన్ని అధికారి ఎదురుగా పెట్టాడు. పెట్టి ఊరుకున్నాడా ? ' ధైర్యం వుంటే దాన్ని తీసి పక్కన పెట్టండి చూద్దాం ' అని సవాలు విసిరాడు. ఏ పుట్టలో ఏ పాముందో ! ఏ పుర్రెలో ఏ ప్రమాదమున్నదో అని శంకించిన అధికారీ ఆయన సిబ్బందీ గజ గజలాడుకుంటూ ఆఫీసు వొదిలిపెట్టి కాలికి బుద్ధి చెప్పారట.

NOTE: All Images in this blog are copy righted to their respective owners

కామెంట్‌లు లేవు: