13, ఆగస్టు 2010, శుక్రవారం

ఇంకానా! ఇకపై సాగదు! - భండారు శ్రీనివాసరావు

ఇంకానా! ఇకపై సాగదు!    - భండారు శ్రీనివాసరావు



రాను రాను - సామాన్యుడనే వాడికి - ఓటు వెయ్యడం మినహా ఏ ‘హక్కూ’ లేకుండా పోతోంది. కానీ, అతడ్ని అడ్డం పెట్టుకుని బతికేవారికి మాత్రం అన్ని హక్కులూ - హక్కుభుక్తమై పోతున్నాయి.




నిజానికి, పార్టీలూ,పర్టీల నాయకులూ, అమాత్యులూ, అధికారులు,ఉద్యోగులు, పోలీసులూ, అందరూ ప్రజల్లో భాగమే. ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. ఎదిగో - ఎన్నికయ్యో, హక్కులు సాధించుకుని అధికారం చెలాయిస్తున్నారు. సామాన్యులు ఎలాంటి హక్కులూ లేకుండా కునారిల్లుతున్నారు. అదే తానులోంచి వచ్చిన వాళ్ళు మాత్రం వృత్తుల పేరిటా, ఉద్యోగాల పేరిటా,సంఘాలు పెట్టుకుని, హక్కుల పోరాటాల పేరుతో లేని అధికారాలు అనుభవిస్తున్నారు. పై పదవులకు నిచ్చెనలు వేసుకుంటున్నారు.

సంఘాల కుంపట్లు పెట్టుకోని వర్గాలు ఈనాడు కాగడాలు వేసి గాలించినా కనిపించవు. ఎన్జీవోలకు సంఘాలున్నాయి. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులకు అసోసియేషన్లు ఉన్నాయి. రిక్షాలు లాగేవారికే కాదు, విమానాలు నడిపేవారికీ యూనియన్లు ఉన్నాయి. అమ్మేవారికి, కొనేవారికి సమాఖ్యలున్నాయి. రాసేవారికి, ఆ రాసిన వాటికి అచ్చేసేవారికీ సంస్థలు ఉన్నాయి. ఆడవారికీ, భార్యాబాధితులకు సయితం సమాజాలున్నాయి. వృత్తుల వారీగా, కులాలవారీగా, మతాలవారీగా ఎవరి సంఘాలు వారికి ఉన్నాయి. వీటన్న్టిటికీ, సొంతంగా ఏర్పరచుకున్న హక్కులు ఉన్నాయి. లేకపోయినా, వాటికోసం పోరాడగల యంత్రాంగ వ్యవస్తలున్నాయి.భావాలను విప్పిచెప్పగల గళాలు ఉన్నాయి. వాటిని ప్రజలకు చేరవేసే మాధ్యమాలు ఉన్నాయి. హక్కుల సాధనకోసం సమ్మెలు, బంద్ లు, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోఖోలు, రైల్ రోఖోలు, ఘెరావ్ లు, ముట్టడులూ, ఊరేగింపులూ, బైఠాయింపులూ, అటకాయింపులూ, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు, ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నెన్నో రూపాల్లో.. సామాన్యుడి సాదారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ మరింత దుర్బరంగా మారుస్తూ - పై పెచ్చు తాము పడుతున్న ఈ పడరాని పాట్లన్నీ ఆ సామాన్యుడి కోసమే అని చెప్పి నమ్మించగల టక్కుటమార విద్యలన్నీ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ లేనివాడు, అసలేమీ లేనివాడు మాత్రం రాజ్యాంగం తనకు కల్పించిన అన్ని రక్షణలకూ తూట్లు పొడుస్తున్న ఈ అస్తవ్యస్త మధ్య చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతూ దిక్కుతోచక విలవిలలాడుతున్నాడు.

రాస్తా రోఖో కారణంగా ఆగిపోయిన అంబులెన్స్

కారణాలు ఏమైనా, హేతుబధ్దత ఎంత ఉన్నా, బంద్ ల వల్లా, రాస్తారోఖోల వల్ల నష్టపోతున్నదీ, కష్టపడుతున్నదీ సామాన్యులే అన్నది నగ్న సత్యం. నిరసనలూ, ఆందోళనల పేరుతో రాజకీయపార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, కార్మిక సంఘాలు, ఇతర సంస్థలూ, ఇష్టారాజ్యంగా నడిరోడ్లపై చేస్తున్న ధర్నాలు, బైఠాయింపులు నిత్యకృత్యంగా మారి జనజీవితాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయన్నది అంతే నిజం.


ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే నెపంతో రోడ్డెక్కుతున్న రాజకీయ పార్టీలు, కార్మికసంఘాలు తమ వైఖరులనూ, విధానాలను పునస్సమీక్షించుకోవాలి. ఏ సామాన్య జనం కోసమైతే ఉద్యమాలు, ఆందోళనలూ, నిర్వహిస్తున్నామని ఆయా పార్టీలూ, సంఘాలు అనుకుంటున్నాయో, ఆ సామాన్య జనాన్నే తమ విధానాలు మరింత చికాకు పరుస్తున్నాయన్న వాస్తవాన్ని అర్దం చేసుకోవాలి. పోరాటాల పేరుతోనో, ఇతరేతర రాజకీయ కారణాలతోనో బడుగుజీవి నడుం విరుస్తున్న ఈ అపబ్రంశపువిధానాలు ఏ నాగరిక దేశంలోనూ కానరావు. సాటి పౌరులకు ఇబ్బంది కలగని రీతిలో నిరసనలు ప్రకటించే పద్ధతులను సభ్యసమాజం పాటించి తీరాలన్న ప్రాధమిక స్పృహ మనదేశంలో కలికానికి కూడా కానరాదు.
ఒకసారి, సూర్యాపేట మీదుగా బస్సులో ఖమ్మం వెడుతుంటే నడుమ దారిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కారణం వాకబు చేయడానికి వెడితే కొంతదూరంలో ఏదో పార్టీకి చెందిన కార్యకర్త్గలు - పట్టుమని పదిమంది కూడా లేరు. - జండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ నడిరోడ్డు పై ధర్నా చేస్తున్నారు. ‘ఇలా ఎంతసేపు మీ తమాషా చూడాలనిగద్దిస్తే ఒక్క అరగంట ఓపిక పట్టండి సార్! ఫలానా టీవీ వాళ్ళు దోవలో ఉన్నామని ఇప్పుడే సెల్ ఫోన్లో చెప్పారు. అని వాళ్ళనాయకుడు జవాబిచ్చాడు. ఇలాంటి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోఖోలు ససేమిరా చూపించేది లేదని చానళ్ళన్నీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోగల్గితే మెరుగయిన సమాజం కోసం నిజంగా కృషి చేసినట్టవుతుంది. ప్రచారం కోసం కాకుండా ప్రజాక్షేమాన్ని కోరుకునే సంస్థలు కూడా తమ కార్యకర్తల్ని తక్షణం రంగంలోకి దింపి ‘ఇలా ప్రజలని ఇబ్బందుల పాలు చేసే వారికి దయచేసి ఓట్లు వెయ్యవద్దు అనే ప్లకార్డులను పట్టుకుని మౌనంగా ఆ పక్కన నిలబడితే, నవ్యత్వం కోసం పటుపడే ఛానెళ్ళన్నీ ఆ దృశ్యాలను ఒక్కమారైనా ప్రసారం చేయగలిగితే , ఇంకోసారి ఏపార్టీ, ఏయూనియన్ కూడా ఇలాంటి ఆందోళనలక్ సాహసించదు. కానీ సంచలనం ఒక్కటే సమస్తం అనుకునే ఈ పోటాపోటీ ప్రచార వ్యాపార యుగంలో ఇది నెరవేరని కలే.

కానీ, ఏదో ఒకరోజు ‘సామాన్యుడి రోజు’ కూడా వస్తుంది. నిరసనలని వ్యక్తం చేయడానికి ఎంచుకున్న విధానాల ద్వారా వేలాది మంది ప్రజలను అకారణంగా ఇబ్బంది పెట్టే హక్కు వీరికెవరిచ్చారన్న ప్రాధమిక ప్రశ్న ముందుకు వస్తుంది.


అర్భకుడు, అమాయకుడు అనుకున్న ఈ సామాన్యుడే తిరగబడి ‘ఇంకానా’ ఇకపై సాగదు!’ అంటూ హూంకరిస్తూ - తన జీవితంతో ఆటాడుకుంటున్న ‘వర్గాల’ మెడలు వంచే రోజు తప్పక వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

భండారు శ్రీనివాసరావు

NOTE: All images in this blog are copy righted to their respective owners

కామెంట్‌లు లేవు: