దైవం మానుష రూపేణ - భండారు శ్రీనివాసరావు
‘ఈ చరాచర ప్రపంచంలో అత్యంత ఘోరంగా, అతి హేయంగా మీరు చీదరించుకునే ప్రాణి ఎవరు’ అని మా ఆవిడను అడిగితే సాలెపురుగు అంటుంది. మా మనుమరాలిని ఇదే ప్రశ్న అడిగితే ‘బల్లి’ అని జవాబిస్తుంది. కొన్నేళ్ళక్రితం వరకూ- ఇలాటి ప్రశ్నకు నా సమాధానం సోమమ్మగారు అనబడే సోమిదేవమ్మగారు.
బెజవాడ గవర్నర్ పేటలో లంకంతకొంపనీ ఇద్దరు ఆడపిల్లలనీ, ఆవిడకు వొదిలేసి – సోమమ్మగారి మొగుడు ఆమె చిన్నతనంలోనే కాలం చేసారు. పిల్లలను పెంచి, పెద్దచేసి, పెళ్ళిళ్ళు చేసి పెద్దరికంగా వుండాల్సిన ఆ పెద్దావిడ - ‘మడీతడీ’ అంటూ - ‘అంటూ సొంటూ’ అంటూ- అయినదానికీ, కానిదానికీ అందర్నీ ఆడిపోసుకునేది. కడవంత నోరు చేసుకుని చిన్నా పెద్దా తేడాలేకుండా శాపనార్ధాలు పెట్టేది. ఆమెను చూస్తుంటే చిన్నవాళ్లమయిన మా అందరికీ ఓ బ్రహ్మరాక్షసిలా కనిపించేది. ఇల్లు ఆవిడది కావడం మూలానా, అంత తక్కువ కిరాయికి మరో ఇల్లు దొరికే అవకాశం లేకపోవడం మూలానా - అక్కడ అద్దెకు వున్నవాళ్ళు ఎవ్వరూ – ఆమెకు ఎదురు నిలిచి మాట్లాడేవాళ్ళు కాదు. దానితో, ఇక ఆమె నోటి దురుసుకు ఎదురు లేకుండాపోయింది. మనిషేమో ఆజానుబాహువు. ‘మడీ దడీ’ పేరుతొ అరకొరగా మడిబట్ట చుట్టుకుని, 'అసింటా అసింటా' అంటూ అందరినీ కసురుకుంటూ అందరిళ్ళలో తిరిగేది. ఆమెని చూస్తే చిన్నతనం నుంచీ నాకు అదోకరకం అసహ్యం. పెరిగి పెద్దయిన తరవాత కూడా అది మరింత పెరిగిపోయిందే కానీ ఆ ఏహ్యభావం నన్ను వొదిలిపెట్టలేదు. నాతో పాటే పెరిగి పెద్దయిన ఆమె మనుమలు ఏదో ఉద్యోగాల్లో కుదురుకున్నారు. చిన్నవాడికి ఒక్కడికే ఇంకా పెళ్లి కావాల్సివుంది. అనుకోకుండా అతడికి బంగారం లాటి పెళ్లి సంబంధం వచ్చింది. ఒంట్లో ఇంట్లో బాగావున్న ఓ ఖామందు గారు పిల్లనిస్తామని ఏకంగా వాళ్ళ ఇంటికే వచ్చారు. బాపూ గారి సినిమా పాట మాదిరిగా ‘కట్నమెంత లావో - పిల్ల అంత లావు’. డబ్బా మజాకా! ఎగిరి గంతేసి వొప్పుకున్నారు. పెళ్ళున పెళ్లయిపోయింది. కానీ మూడు ముళ్ళు పడ్డ మూన్నెళ్లకే ఆ అమ్మాయి ఆసుపత్రిలో పురుడు పోసుకుని పండంటి పిల్లాడికి తల్లయింది. అప్పుడుకానీ అంత గొప్ప సంబంధం తమని వెతుక్కుంటూ ఎందుకు వచ్చిందన్న విషయం వాళ్లకు అర్ధం కాలేదు. సోమమ్మగారి సంగతి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ సంగతి తెలిసి ఏమాత్రం జాలిపడలేదు. పైగా అలాటి మనిషికి అలాగే కావాలని బాహాటంగానే నోళ్ళు నొక్కుకున్నారు. ఆ అమ్మాయి తలిదండ్రులు సరేసరి -కన్నె వయసులో కాలుజారిన కన్న కూతురికి పుట్టబోయే బిడ్డ - తమ బిడ్డ బంగారు భవిష్యత్తుకు అడ్డం కాకూడదని, హడావిడిగా పెళ్లి చేసి, ఆసుపత్రిలో పురుడు పోసి – ఆ పసికందుని అక్కడే వొదిలేసి కూతుర్ని తీసుకుని వెళ్లి పోయి చేతులు కడిగేసుకున్నారు. అప్పుడేమి జరిగిందన్నదే – ఈ కధ కాని కధకు క్లైమాక్స్.
సోమమ్మగారిది నిప్పులుకడిగే మడీ ఆచారం అని చెప్పుకున్నాము కదా. మనవడి భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రెవరో తెలియదు. ఇంటావంటా లేని ఘోరం జరిగిపోయింది. ఆచారాలకు నెలవయిన ఇంట్లో అనాచారం పురుడు పోసుకుంది. కన్న తల్లేమో నిర్ధాక్షిణ్యంగా రోజుల పిల్లవాడిని వాడిమానానికే వొదిలేసి వెళ్లి పోయింది. ఈ పరిస్తితుల్లో ఆమె మానసిక పరిస్తితి ఎలావుంటుందో తేలిగ్గా వూహించుకోవచ్చు. కానీ, అందరి వూహల్ని పటాపంచలు చేస్తూ సోమమ్మగారు సరాసరి ఆసుపత్రికి వెళ్ళింది. అంతా కళ్ళింత చేసుకుని చూస్తూ వుండగానే – ఎవరికీ అక్కరలేని ఆ అనాధ శిశువుని అబ్బారంగా వొడిలోకి తీసుకుంది. ‘అందరూ కాదనుకుని వెళ్ళినా - నీకు నేనున్నానంటూ’ ఇంటికి తీసుకు వచ్చింది. కన్నతల్లి కాదన్నా, ఆ తల్లిని కన్నవాళ్ళు కాదనుకున్నా, కట్టుకున్నవాడు బెల్లం కొట్టిన రాయిలా మిన్నకున్నా – అమ్మమ్మ గారు – ఆవిడిక నా దృష్టిలో సోమమ్మగారు కాదెంత మాత్రం కాదు – ‘అమ్మమ్మ గారే’ - ఆ చిన్ని వయస్సులోని ఆ చిన్నారికి అమ్మయింది.
అమ్మయి లాలించింది. అమ్మమ్మయి ఆడించింది. నాన్నయి నడిపించింది. నాన్నమ్మయి నీతి కధలు చెప్పి నిద్రపుచ్చింది. తల్లీతండ్రీ లేని ఆ అనాధ శిశువుకు సర్వస్వం అయింది. సర్వం తానే అయింది. ఇప్పుడు చెప్పండి !
ఆమెను ఛీత్కరించాలా! దైవసమానురాలని భావించి నమస్కరించాలా!
మనుషుల్ని కళ్ళతో చూసి కాకుండా మనసుతో చూసి అంచనా వేసుకోగలిగేలా ఎవరిని వారు సంస్కరించు కోవాలా!
నేను ఆమె పట్ల చేసిన పొరబాటు ఇంకెవ్వరూ చేయరనీ, చేయకూడదనీ మనసారా కోరుకుంటూ – మనసు పొరల్లో కదలాడుతున్న 'ఈ జ్ఞాపకాన్ని’ ఇన్నేళ్ళ తరవాత బయటకు తీస్తున్నాను. ఇందువల్ల ఎవరి మనసు అయినా బాధ పడితే క్షంతవ్యుణ్ణి. - మరణించిన తరవాత కూడా, నా మనస్సులో జీవించే వున్న ఆ ‘అమ్మమ్మగారి’ ఔన్నత్యాన్ని నలుగురికీ తెలపడమే ఒక్కటే ఇందులోని ఉద్దేశ్యం.
అందుకే అన్నారు - ప్రార్ధించే పెదవులకన్నా - సేవ చేసే చేతులు మిన్న
(30-08-2010)
ఇలాటి ఉన్నత మనస్కుల ఫోటోలు కడిగి గాలించినా ఎక్కడా దొరకవు. అందుకే ఈ బ్లాగులో ఫోటోలు లేవు.
10 కామెంట్‌లు:
this is the miracle of god. who will find the goodness in every one he is only god.well somidevamma garu.
నాకు తెలిసిన సోమిదేవమ్మ గారు దాదాపు అదే టైం లో అదే బెజావాడ లో ఉన్నారు. ఆవిడ ఇంట్లో వారాలు చేసుకు తిని పెద్ద వాళ్ళు అయిన వారు ఉన్నారు. భీమవరం కాలేజి లో ఒక పెద్ద ఆయన మా సోమిదేవమ్మ గారిని కౌగలించుకుని అమ్మా మీ దయ అంటే విస్తు పోయాను. జీవితం లో ఏమీ ఆశించకుండా అలా మంచి చేసుకు పోతూ ఉంటారు.
అటువంటి సోమిదేవమ్మ లు కావాలి. వాళ్ళు ఎంతో అవసరం. మీ మనస్సు లోది మాతో పంచుకున్నందుకు థాంక్స్.
nijamgaa
atuvamti maanavataa murtulu veyikokkarunnaa chaalu
రమేష్ గారికి – భగవంతుడనేవాడు వుంటే చూపండి చూద్దాం అని సవాలు చేసేవాళ్ళు సోమిదేవమ్మ లాటి దేవతామూర్తులను చూస్తె సరిపోతుంది. మీ వ్యాఖ్యకు నా ధన్యవాదాలు. – భండారు శ్రీనివాసరావు
లక్కరాజు శివరామకృష్ణారావు గారికి- ఇలా పాత రోజులు గురించి గుర్తు చేసుకునేటప్పుడు – ఆనాటి కాలమాన పరిస్తితులతో పాటు ప్రాదేశిక వివరాలను ప్రస్తావిస్తే చాలా ఉపయుక్తంగా వుంటుంది.(ఉదాహరణకు మాత్రమె సుమా!-ఏనుగుల వీరాస్వామి గారి కాశీ యాత్ర). కానీ, ఈ అంశంలో ‘కొన్ని’వివరాలు పేర్కొంటే - “కొందరి” మనస్సులు బాధపడే అవకాశం వుంది కాబట్టి – జర్నలిస్ట్ విలువలకు అనుగుణంగా వాటిని కావాలనే ఇవ్వలేదు.నమస్కారాలతో –భండారు శ్రీనివాసరావు
దుర్గేశ్వర గారికి –ధన్యవాదాలు-భండారు శ్రీనివాసరావు
మంచి మనిషిని గురించి మంచి విషయం తెలియజేశారు.
‘కొత్త పాళీ’ గారికి – మీ మంచి వ్యాఖ్యకు ధన్యవాదాలు – భండారు శ్రీనివాసరావు
somidevammagari loni daivatvanni miru chitrinchina thiru amogham! munde cheppinatlu mi telugu dhara entho hayiga sagi poye selayerulaga vuntundi srinivasa rao garu! oka manchi manishini gurinchi intha manchi tapa chadivinchinaduku entho kruthjnathalu!
చాల బాగుంది. సోమమ్మ గారు మనస్సున్న మహామనీషి
కామెంట్‌ను పోస్ట్ చేయండి