గత కాలానికి భూతకాలం అని పేరు పెట్టినవాడిని భూతాలకు ఆహారంగా వేయాలి.
నిజానికి గతకాలం అంత మేలయిన కాలం - మంచి కాలం మరోటి లేదు.
మొన్నీమధ్య ముగ్గురు మిత్రులం మూడు దశాబ్దాల తరవాత కలుసుకున్నాం. చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ వుంటే కాలం తెలియకుండానే గడిచిపోయింది.
ఎండిన మోడుని సయితం చిగురింపచేసేది స్నేహం
ఆ ముగ్గురమే మరో సందర్భంలో మరోసారి కలుసుకున్నాము. గతకాలపు విషయాలన్నీ గతంలో కలిసినప్పుడే మాట్లాడుకున్నామో ఏమోకానీ - ఈసారి చర్చ అంతా వర్తమానం వయిపు మళ్ళింది. ఉద్యోగాలూ, హోదాలూ, పిల్లలూ, వారి చదువులూ గురించిన ప్రసక్తి రాగానే మా మనస్సుల్లో అంతర్లీనంగా వున్న పొరపొచ్చాలు, అసూయలు తొంగి చూడడం ప్రారంభించాయి. జీతభత్యాల్లో వ్యత్యాసాలూ, అధికారహోదాల్లోని తేడాలూ, వర్తమానంలోని స్తాయీభేదాలూ అన్నీ కలిసి 'మనం' అన్న పదాన్ని 'నేను' గా మార్చేశాయి. గతంలో మాటసాయం చేసుకునే మా మాటల్లో మునుపటి మృదుత్వం మాయమయి , అంతరంగాలలోని తెలియని అంతరాలన్నీ మాకు తెలియకుండానే బయటపడ్డాయి. ఎదుటివారి యోగక్షేమాలు గురించి అడిగి తెలుసుకోవాలనే జిజ్ఞాస కంటే - ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవాలనే తాపత్రయమే కొట్టవచ్చినట్టు కానవచ్చింది.
మనిషి మారేనోయీ ఆతడి మనసు మారేనోయీ
అందరం ఒకే స్తాయినుంచి ఎదిగివచ్చినవాళ్ల మేకానీ మనసులే బాగా కుంచించుకు పోయాయనిపించింది.
హోదాల గోదాల్లోనే మావాదాలూ, వాదులాటలు చక్కర్లు కొట్టాయి.
ఇక మాటలు, ముచ్చట్లు అన్నీ అటకెక్కి కూర్చున్నాయి.
వర్తమానానికే గతి లేదు. ఇక రానున్న రోజుల గురించి తలచుకుంటే సంతోషించతగ్గ సంగతులేవీ తటాలున ఎవరికీ తలపుకు రాలేదు. 'మళ్ళీ కలుద్దాం' అనుకుంటూ 'విడిపోయాము' . బహుశా మనస్సులో ఆ ఉద్దేశ్యం ఎవరికీ లేదేమో.
అందుకే అన్నారేమో " గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్"
-భండారు శ్రీనివాసరావు -
NOTE: All Images in this blog are copy righted to their respective owners
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి