11, ఆగస్టు 2010, బుధవారం

జీవనస్రవంతి - భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి - భండారు శ్రీనివాసరావు





 


'తొమ్మిది నెలలు కడుపులో మోసి కన్నానురా కన్నా ' అనే రొటీన్ డైలాగ్ లకు రోజులు చెల్లిపోయే రోజులోస్తున్నాయి.
బోస్టన్ వైద్య పరిశోధనా కేంద్రంలో అమెరికన్ శాస్త్రవేత్తలు - తల్లి కడుపులో పిండం ఏ పరిస్తితుల్లో పెరుగుతుందో అలాంటి వాతావరణాన్ని కృత్తిమంగా సృష్టించి - పరిశోధనాశాలలోనే ఒక నకిలీ కడుపుని తయారు చేశారు. నెలలు నిండకుండానే పుట్టిన పసికందులను ఆ కడుపులో పెట్టి కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కడుపు చించుకున్నా కాళ్ళ మీద పడని ఈ నకిలీ కడుపు పుణ్యమా అని - చాలా మంది కడుపుతో వున్న స్త్రీలకు - నెలలు నిండని పిల్లలు పుడితే ఎలా అన్న భయం కడుపులో లేకుండా పోయిందట.



జీవనస్రవంతి






కొందరు తోచీతోచనమ్మలు తోడి కోడళ్ళ పుట్టిళ్ళకు వెళ్ళకుండా - ఏమీ తోచనప్పుడు వున్న ఇంటినే సర్దుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. పనికి రాకుండా పోయి- ముందు ముందు పనికొస్తుందన్న నమ్మకం బొత్తిగా లేని పనికి రాని సామాను ఇలాంటి సందర్భాల లోనే కళ్ళబడుతూ వుంటుంది. అయితే అలాంటి చెత్త సామాను వొదుల్చుకునే మహత్తర అవకాశాన్ని చేతులారా జారవిడుచుకోవడంలో సిద్దహస్తులయిన ఈ ఇల్లాండ్రు మాత్రం- ఈ బాపతు సామానుకు ఏ నాటికయినా పురావస్తు ప్రాముఖ్యం లభించక పోతుందా అన్న ముందు చూపుతో ఆ చెత్తనంతటినీ జాగ్రత్తగా ఇంట్లోనే సదిరేస్తుండడం కద్దు. అలాగే. పచ్చళ్ళూ కూరలూ. అవి మురిగిపోయి పాచిపడితే కాని కొందరికి పారవేయడానికి మనసు ఒప్పదు. ఇలాంటి ఇంటింటి కాలుష్యాల వల్ల పారిశ్రామిక కాలుష్యాల కంటే ఎక్కువ ప్రమాదం పొంచివుంటుందని ఇండొనీషియా శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు. ప్రతి ఇంట్లోను ఏర్పడే వంటింటి కాలుష్యం వంటికి పట్టి లేనిపోని జబ్బులు పట్టి పీడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తన వంటింటిని గుర్తుకు తెచ్చుకుంటూ మరీ హెచ్చరిస్తున్నారు.



జీవనస్రవంతి






హైదరాబాదులో ఒకావిడ పొద్దున్నే లేచి మొహం కడుక్కుని అద్దం చూసుకుంటే- మొహంలో అక్కడక్కడా పచ్చటి మచ్చలు కానవచ్చాయిట. ఇదేమిటిరా భగవంతుడా అని నెత్తి బాదుకోబోతుండగా అరచేతులు ఎర్రగా కందినట్టు అనిపించింది. డాక్టర్ గారికి ఫోన్ చేయాలా వద్దా అన్న మీమాంస తెగేలోగానే - ఆవిడ గారి మొగుడుగారికి ఎందుకో భార్య కట్టుకున్న కట్టుడు చీరె మీద అనుమానం కలిగింది. ఇంతకీ విచారించగా తేలింది ఏమిటంటే- వాయిదాల పద్దతిలో చవగ్గా వచ్చిందని కొనుక్కున్న ఆ చీరె - మొదటి వాయిదా కూడా కట్టకముందే - మొదటి వుతుక్కే రంగు వెలవడం ప్రారంభించింది. మొహం కడుక్కుని, చేతులు తుడుచుకున్నప్పుడు అంటిన కొంగు బంగారం రంగు చూసే ఆవిడ అంతగా గాభరా పడింది.



జీవనస్రవంతి






సరిగంగ స్నానాలయినా - సెలయేటి జలకాలయినా మన దేశానికి సరిపోలగల దేశం మరోటి లేదని చరిత్ర కారులంటున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన దేశం లోనూ, కొన్ని తూర్పు దేశాల్లోనూ స్నానం అన్నది నిత్య కృత్యం అయితే, పాశ్యాత్య దేశాల్లో అప్పటికి ఆ పదానికి అర్ధమే తెలియదంటున్నారు. స్పెయిన్ రాణి ఇసబెల్లా - తన జీవిత కాలంలో రెండే రెండు సార్లు - పుట్టినప్పుడు ఒకసారి- అత్తింట్లో మెట్టిన రోజున ఇంకోసారి - స్నానం చేసిందట. ఫ్రాన్సు చక్రవర్తి లూయిస్ - ఒకేఒక్కసారి జలకాలాడి- ఎందుకు చేసానా అని జీవితాంతం విచారించాడట. ఈ విచారం తన ప్రజలను పీడించకుండా ఉండేందుకు గాను దేశంలో స్నానాలానే నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసాడట.

 పోతే, అమెరికాలో పద్దెనిమిది వందల నలభయి రెండు వరకు స్నానాల గది అంటే ఏమిటో ఎవరికీ తెలియదట. పద్దెనిమిది వందల యాభయి ఎనిమిదిలో వైట్ హౌస్ లో మొట్టమొదటి బాత్ రూం నిర్మించారట. .



NOTE: All Images in this blog are copy righted to their respective owners

కామెంట్‌లు లేవు: