5, నవంబర్ 2012, సోమవారం

ప్రసిద్ధ జర్నలిస్ట్ ధర్మవరపు సీతారాం ఇక లేరు


ప్రసిద్ధ జర్నలిస్ట్ ధర్మవరపు సీతారాం ఇక లేరు
ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ ధర్మవరపు సీతారాం ఈ సాయంత్రం (సోమవారం)  హైదరాబాదు, సీతాఫల్ మండి లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 87  సంవత్సరాలు. కొద్దికాలంగా ఆయన అస్వస్తులుగా వున్నారు. జర్నలిజాన్ని ఒక నషాగా భావించే సీతారాం పెద్దగా చదువుకోలేదు. 1925 అక్టోబర్ ఆరోతేదీన నల్గొండ జిల్లా, హుజూర్ నగర్  సమీపంలోని  లక్కారం గ్రామంలో జన్మించిన సీతారాం హైదరాబాదు విమోచనకు ముందు హైదరాబాదు బులెటిన్అనే జర్నల్ లో జర్నలిస్టుగా  జీవితాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి పత్రికా రచయితగా అయిదు దశాబ్దాల సుదీర్ఘ జీవితం కొనసాగించారు. కొంతకాలం స్కై లైన్ అనే పత్రికను  నడిపారు. స్టేట్స్ మన్, ఇకనామిక్ టైమ్స్, పేట్రియాట్, లింక్ వంటి ప్రసిద్ధ ఆంగ్ల జాతీయ  పత్రికల్లో పనిచేశారు. యు.ఎన్.ఐ. వార్తాసంస్థకు హైదరాబాదు, కలకత్తా, మద్రాసు బ్యూరోల అధిపతిగా సేవలందించారు. వీ.వీ.గిరి రాష్ట్రపతిగా వున్నకాలంలో ఆయనతో కలసి యూరోపులో పర్యటించారు. నిర్భీతి, నిజాయితీ, ముక్కుసూటితనం ఆయన నైజం. జర్నలిస్టుగా ఆయన సాధించిన విజయాలు యువ జర్నలిస్టులు  నేర్చుకోవాల్సిన పాఠాలు. శ్రీ సీతారాం కాలంలో జర్నలిస్టుగా వున్నందుకు గర్విస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ‘జర్నలిజం ఒక నషాఅంటూ  ఆయన రాసిన ఒక వ్యాసంలోని కొన్ని విశేషాలతో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తాను.


శ్రీ డి.సీతారాం 

పదహారేళ్ళ వయస్సులో హైదరాబాదు బులెటిన్ లో కుర్ర రిపోర్టర్ గా చేరాను. సైకిల్ చేతిలో వుండేది. తొలి అనుభవాలనుంచే రిపోర్టర్ చాలా నేర్చుకుంటాడు.
నిజానికి జర్నలిజం ఒక వ్యామోహం. మానవ సహజమయిన సౌకర్యాలను గురించి పట్టింపు వుండేది కాదు. వీటన్నిటికీ పరిహారం ఏమిటంటే, మీకు లభించే గుర్తింపు. మీరంటే గౌరవిస్తారు. మీరంటే భయపడతారు.
ఒక్కోసారి పెద్ద ప్రయత్నం  లేకుండానే కొన్ని అద్భుతమైన  వార్తలు వచ్చి  విలేకరి వొళ్ళో  పడతాయి. 1967  లో నిజాం అస్వస్థతకు గురై మరణించినప్పటి వార్త నాకు అలానే అయాచితంగా దొరికింది. అప్పుడు యు.ఎన్.ఐ. ఆఫీసు నిజాం క్లబ్ ని ఆనుకుని వున్న రోషన్ మంజిల్ లో వుండేది. అప్పట్లో మూడు సంపన్న క్లబ్బుల్లో సభ్యత్వం కలిగిన ఏకైక జర్నలిష్టును నేనే. అక్కడ బ్యూరో చీఫ్ గా ఉద్యోగం చేస్తూనే నాలుగు ఆంగ్ల పత్రికలకు కరస్పాండెంట్ గా పనిచేసేవాడిని.సహజంగా క్లబ్బు పక్షులకు అన్ని రకాల వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుకునే వీలుంటుంది. పారిశ్రామికవేత్తలు, ఐ.యే.ఎస్., ఐ.పి.ఎస్. వంటి మూడక్షరాల బ్యూరోక్రాట్లు, జూదర్లు,లోఫర్లు,తిరుగుబోతులు అందరూ అక్కడ దర్శనమిస్తారు. రాజకీయ,అధికార సౌధాల్లోని ముచ్చట్ల నుంచి సామాజిక రంకు పురాణాల వరకు అక్కడ బయల్పడుతుంటాయి. నా నివాసం జాంబాగ్ లో. స్కూటర్ పై బయలుదేరి బొగ్గులకుంట మీదుగా యే అర్ధరాత్రికో ఇంటికి చేరుకోవడం అలవాటు. ఓ రాత్రి అలా  వస్తుండగా నిజాం రాజ భవనంలో దీపాలు వెలుగుతూ కనిపించాయి. ప్రధాన ద్వారం తెరిచివుంది. గార్డులు  సావధానంగా నిలబడి వున్నారు. ఒక కారు బయటకు వస్తోంది. కారులో వున్నది డాక్టర్ రామయ్య కాదుకదా అన్న అనుమానం కలిగింది. ఇంటికి వెళ్లి డాక్టర్ కు ఫోను చేసాను. రాజభవనంలో ఎవరో అస్వస్తులుగా వున్నారు. ఎవరని అడిగితే  కరక్టుగా జవాబు రాకపోవచ్చు. అందుకే ధైర్యం చేసి సూటిగా అడిగేశా. డాక్టర్, ముసలాయన తెల్లారేదాకా వుంటాడాఅని. ఆయన ముక్తసరిగా యెలా చెప్పగలను? మంచే జరుగుతుందని అనుకుందాంఅన్నాడు. ఇక ఆలశ్యం చేయకుండా ఫోను తీసుకుని ఆఫీసుకు ఫోను చేసి డ్యూటీలో వున్న ఆపరేటర్ కు  నిజాం కు తీవ్ర అస్వస్తతఅంటూ రెండు లైన్ల ఫ్లాష్ వార్త చెప్పాను. ఉద్దేశ్య పూర్వకంగానే స్తానిక పత్రికలకు ఈ వార్తను తెల్లవారు ఝాము వరకు విడుదల చేయకుండా ఆపాను. ఈ విధంగా చేయడం వల్ల ప్రత్యర్ధి న్యూస్ ఏజెన్సీ పీ.టీ.ఐ. కి వార్త లీక్ అయ్యే అవకాశం వుండదు. మరునాటికల్లా ఈ వార్త సంచలనంగా మారింది. నిజాం వంటశాలలో పనిచేసేవాడు మా ఆఫీసులో ప్యూను జానే జాద్  కు బంధువు. సమాచారం పట్టి సాయంత్రానికల్లా నిజాం మృతిఅంటూ స్నాప్ వార్త పంపాను. ప్రత్యర్ధి వార్తా సంస్థలు  అప్పటికి ఇంకా నిజాం అస్వస్థతకు సంబంధించిన వార్తలు మాత్రమే ఇస్తున్నాయి. ఆ సమయంలో మా వార్తాసంస్థ నిజాం మరణం గురించి ప్రపంచానికి తెలియచేసింది.
ఇలాటి ఆసక్తికర కధనాలు అనేకం ఆ వ్యాసంలో సీతారాం చెప్పుకొచ్చారు.  (05-11-2012) 

ఇద్దరు అధికారులు – ఒకే పాఠం - భండారు శ్రీనివాసరావు


ఇద్దరు అధికారులు – ఒకే పాఠం 
యెంత అల్పులమో తెలుసుకోవడానికి అనుదినం ఎదురయ్యే సంఘటనలను కొంత నిశితంగా పరిశీలిస్తే చాలని గత రెండు రోజుల అనుభవం నాకు మరోసారి తెలియపరిచింది.
మొన్న శనివారం నాడు దూరదర్శన్ సప్తగిరి ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్రభారతిలో స్వర సమరం అనే సంగీత పోటీ జరిగింది. గవర్నర్ శ్రీ నరసింహన్ ముఖ్య అతిధి. సతీసమేతంగా హాజరయి శాస్త్రీయ సంగీతం పట్ల తమ మక్కువను చూపారు. ఆద్యంతం తెలుగులో ప్రసంగిస్తూ ఇలాటి అద్భుత కార్యక్రమాలను నిర్వహించే శక్తి కేవలం దూరదర్శన్ కు మాత్రమే వుందని ఉద్ఘాటిస్తూ, ఆ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించడం ద్వారా శాస్త్రీయ  సంగీతాన్ని ప్రోత్సహించాలని ఉద్బోధించారు. సరే అసలు విషయం ఇది కాదు.
మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్.ప్రభాకర రావు, వారి శ్రీమతి వేదవతి  సంగీతం మీద వున్న ఆసక్తితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.   శ్రీ ప్రభాకర రావు పోలీసు శాఖలో అనేక ఉన్నత పదవులను నిర్వహించి సమర్ధుడైన అధికారిగా నిరూపించుకున్నారు. ఆయన్ని గుర్తుపట్టిన దూరదర్శన్ సిబ్బందిలో కొందరు వారిని మొదటి వరుసలో కూర్చోవాల్సిందిగా అభ్యర్ధించారు. అయినా సున్నితంగా తిరస్కరించి సాధారణ ప్రేక్షకుల మాదిరిగానే వారిద్దరూ వెనుక వరుసలోనే కూర్చుని కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించారు.


శ్రీ ప్రభాకరరావు,శ్రీమతి వేదవతి 

గవర్నర్ పాల్గొంటున్న దృష్ట్యా రవీంద్రభారతి ఆవరణలో కట్టుదిట్టమయిన పోలీసు బందోబస్తు చేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత  రంగస్థలం మీద కళాకారులను అభినందిస్తూ  నరసింహన్ దంపతులు  కొద్దిసేపు అక్కడే వుండిపోయారు. ప్రభాకరరావు దంపతులు ఈలోగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగా ద్వారం వద్దవున్న పోలీసు అధికారులు అడ్డగించారు. కొత్తగా ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్న ఆ సిబ్బందికి తాము అభ్యంతరం చెబుతున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తమ శాఖకు అత్యున్నత అధికారిగా పనిచేశారన్న విషయం తెలిసివుండక పోవచ్చు. మధ్యలో ఎవరో కల్పించుకుని ఆయన ఎవరో చెప్పబోతుంటే శ్రీ ప్రభాకర రావు వద్దని సైగచేసారు. ‘వారి డ్యూటీ వారిని చేయనీయండి’ అంటూ మళ్ళీ వెనక్కు వచ్చి హాలులో కూర్చుండిపోయారు.
రోజు తిరగకుండా మరో సారి మళ్ళీ ఇదేమాదిరి సంఘటన అనుభవంలోకి వచ్చింది. మర్నాడు  ఆదివారం గవర్నర్ శ్రీ నరసింహన్ పుట్టినరోజు. రాజభవన్ లో అనేకమంది వారిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేసారు. శ్రీ నరసింహన్ పూర్వాశ్రమంలో పోలీసు అధికారిగా పనిచేసినందువల్లనేమో లోగడ పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో పనిచేసిన అనేకమంది గవర్నర్ ను అభినందించడానికి రాజ్ భవన్ కు వచ్చారు. గతంలో రేడియోలో పనిచేసి నప్పుడు సన్నిహితంగా మెలిగిన అనేకమంది  అధికారులను చాలా సంవత్సరాల తరువాత అక్కడ కలుసుకోవడం జరిగింది. వారిలో శ్రీ రామస్వామి ఒకరు. ఆయన హైదరాబాదు పోలీసు కమీషనర్ గా  పనిచేశారు. నిబంధనల ప్రకారం తన సెల్ ఫోనును కారులో బయటే వుంచేసి లోపలకు రావడం చూసి ఆ విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే ‘పోలీసుశాఖలో ఇన్నేళ్ళు పనిచేసి మేమే రూల్స్ పాటించకపోతే యెట్లా’ అన్నట్టు చిరునవ్వే సమాధానం.
‘ఎదిగినకొద్దీ వొదగమ’ని ఓ సినీ కవి  చక్కని పాట రాశారు. విన్నప్పుడల్లా యెంత చక్కని పాట అని ఎన్నోసార్లు అనుకుంటాం. కాని సందర్భం వచ్చినప్పుడు మాత్రం గుర్తురాదు. ఉద్యోగం ద్వారా సమకూడిన హోదా ఒక్కటే గుర్తుంటుంది.
ఒక రోజు తేడాతో చూసిన ఈ రెండు సంఘటనలు మనసుపై మంచి ముద్రవేశాయి. అలా వుండగలిగితే  యెంత బాగుండు ఒక్క క్షణం అనిపిస్తుంది. కాని మనసు కోతి లాటిది. దానికి తోడు,  పాడు అహం ఆ ఆలోచనను అనుక్షణం చంపేస్తూనే వుంటుంది. ఏం చేస్తాం! (05-11-2012)                     

3, నవంబర్ 2012, శనివారం

దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు? – భండారు శ్రీనివాసరావు


దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు? భండారు శ్రీనివాసరావు
 
న్యాయబద్ధంగా, చట్ట బద్ధంగా ఒక కోటి రూపాయలు సంపాదించాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలి? యెంత కష్ట పడాలి?
అదే అక్షరాలా నలభయ్ మూడు వేల  కోట్లరూపాయలు సంపాదించాలంటే
ఇది కాలము,దూరము,  కాలము సమయము లెక్కకాదు లెక్కకట్టి చెప్పడానికి. కానీ ఈ ప్రశ్నకూ  ఈ మధ్య జవాబు  దొరికింది.
ఒక్క కేంద్ర మంత్రిని తప్పిస్తే చాలు అంత  డబ్బూ రెక్కలు కట్టుకుని వచ్చి వొళ్ళో వాలుతుందని అపర కుబేరుడు రిలయన్స్ సంస్థాపక అధినేత దీరూ భాయ్ అంబానీ పెద్ద కుమారుడు ముఖేష్ అంబానీ రుజువు చేశారు.        
ప్రభుత్వాలపై కార్పొరేట్  ప్రపంచం పట్టు ఎలాటిదో ఈ సంఘటన తెలియచెప్పింది.


పాలకులు సంపన్న వర్గాల నడుమ ఈ రకమయిన పరస్పరాధేయ సంబంధాలు అనేక  దేశాల్లో అనేకానేక రూపాల్లో కానవస్తాయి. రాజులు రాజ్యాల రోజుల్లో పాలకులపై పెత్తనాన్ని మత పెద్దలు పోషిస్తే, ఆధునిక కాలంలో బడా పారిశ్రామిక వేత్తలు ఈ పాత్రను సొంతం చేసుకున్నారు.
రాజకీయ పార్టీలకు అధికారం పరమావధి. ఎన్నికల సమరాంగణంలో గెలిచి పీఠం ఎక్కాలంటే డబ్బుది ప్రధాన భూమిక. డబ్బు ద్వారా అధికారం అన్నది వారి మార్గం అయితే, అధికారంలో వున్నవారిని లోబరచుకోవడం  ద్వారా డబ్బు సంపాదించడం పారిశ్రామికవర్గాల పన్నుగడ. అందుకే వీరి నడుమ సయోధ్యకు సానుకూలతలు అనేకం. అవగాహనకు అవకాశాలు అపారం. ఇచ్చి పుచ్చుకోవడాలకు వీలు సాళ్లు పుష్కలం.

అయితే, ప్రభుత్వాలపైనా, పాలకులపైనా రాజ్యాంగేతర శక్తులు పట్టుచిక్కించుకుంటే ముందు దెబ్బతినేది  పాలితులయిన ప్రజల ప్రయోజనాలే. పాలకులు, పారిశ్రామికవేత్తలకు నడుమ పైకి కనిపించకుండా  కుదిరే ఏవిధమయిన వొప్పందం అయినా అది సామాన్య  జనాలకు మేలు చేసేదిగా వుంటుందని అనుకోవడానికి వీలుండదు.
ఈ ప్రస్తావనకు ప్రాతిపదిక అయిన వర్తమానానికి వస్తే –
ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఎన్నికల సమరాంగణంలోకి దూకే  పోరాట జట్టుగా కొత్త మంత్రివర్గాన్ని ప్రధానే అభివర్ణించారు. ఇందుకోసం ఆయనా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కలసి పెద్ద కసరత్తే చేశారు. సీనియారిటీ లెక్కలు తీసారు. విధేయతను కొలిచి చూసారు. రాహుల్ కోరిక మేరకు యువకులను, కొత్తవారిని మంత్రులుగా తీసుకున్నారు. మొదటిసారి లోకసభకు ఎన్నికయినవారికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఈ క్రమంలో  కొందరు సీనియర్లకు ఉద్వాసన చెప్పారు. వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. మంత్రిపదవే పోయిన తరువాత ఇక కొత్తగా కట్టబెట్టే పార్టీ పదవులతో చేసేదేమిటన్న నిర్వేదం కొందరికి  మిగిల్చారు. తాజాగా  ఆరోపణల  మచ్చ పడ్డ  మరికొందరికి మాత్రం  మరింత మంచి శాఖలు పందారం చేశారు. వినయ విధేయతల ప్రాతిపదికపై  కొన్ని కొత్త ముఖాలకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. విధేయత విషయంలో అందరికంటే ఒక  ఆకు ఎక్కువ చదివిన సీనియర్లను సామాజిక సమతుల్యం పేరుతొ పక్కనబెట్టారు. ఇది రుసరుసలకు దారితీయడంతో చివరి నిమిషంలో  కొన్నిమార్పులు చేశారు. రోజులు గడవకముందే చేసిన మార్పులకు మరి కొన్ని చేర్పులు చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు. మరి ఇంత హైరానా పడి, రోజుల తరబడి కసరత్తులు చేసి సాధించింది ఏమిటన్న ప్రశ్న అలాగే వుంది. సరయిన గుర్తింపు లభించలేదని  అసహనంతో వున్నవాళ్ళు నెమ్మదించలేదు.  మార్పులు చేర్పుల్లో  మంచి హోదా లభిస్తుందని ఆశలు పెంచుకున్న వాళ్లకు కూడా  ఆ ఆనందం ఆఖరి క్షణంలో  ఆవిరై పోయింది. ఆశావహుల సంగతి ఎలావున్నా ఆంధ్ర ప్రదేశ్ కు స్వాతంత్ర్యం లభించిన తరువాత ఎన్నడూ కనీ వినీ ఎరుగని స్థాయిలో పది మందికి మంత్రివర్గంలో స్థానం లభించింది.  చిన్నవో పెద్దవో వివిధ మంత్రిత్వ శాఖలు  దొరికాయి. అంతవరకూ సంతోషించాలి. అయితే, ఈ ప్రక్రియలో తెలంగాణాకు అన్యాయం జరిగిందన్న ఆలోచన పురుడు పోసుకుంది. అది పెరిగి పెద్దది కాకుండానే మరో వాదం తెర ముందుకు వచ్చింది. అసలు తెలంగాణా ఇవ్వడానికే  ఇదంతా చేసారని, జైపాల్ రెడ్డికి చిన్న పోస్ట్ ఇచ్చి  రిజర్వ్ లో పెట్టింది ఇందుకోసమేనని  కొందరు భాష్యాలు చెప్పారు. 
కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే ఉత్తరాది మీడియా  బాంబు లాంటి వార్త పేల్చింది, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభీష్టం మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి మన రాష్ట్రానికి చెందిన సీనియర్ మంత్రి జైపాల్ రెడ్డిని తప్పిస్తున్నారని. రిలయన్స్ కు అనుకూలమయిన నిర్ణయాలు తీసుకోవడంలో జైపాల్ రెడ్డి విముఖత  ప్రదర్శిస్తూ  వుండడమే దానికి కారణమని కొన్ని  పత్రికలు ముక్తాయింపు కూడా  ఇచ్చాయి.
మీడియా వూహాగానాలను నిజం చేస్తూ జైపాల్ రెడ్డి శాఖ మారింది. చాలా చిన్న శాఖగా పరిగణించే శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖను జైపాల్ రెడ్డి వంటి సీనియర్ కు వొప్పగించిన తీరు చూసి నివ్వెర పోవడం అందరి వంతు అయింది. ఆయన మాత్రం నిబ్బరం కోల్పోలేదు. పెట్రోలియం శాఖ ఇచ్చినప్పుడు కొంత అసంతృప్తికి గురయ్యాను  కాని ఇప్పుడు శాస్త్ర సాంకేతిక శాఖ కేటాయించినప్పుడు ఎలాటి అసంతృప్తి లేదని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో పండిపోయిన మనిషి. యెలా స్పందించాలో ఆ మాత్రం తెలియని వ్యక్తి కాదు కదా.
అసలేం జరిగి వుంటుందన్న దానిపై కొత్త వూహాగానాలు మొదలయ్యాయి. ఇంకా పేరుపెట్టని కొత్త పార్టీ పెట్టి అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులపై  అవినీతి ఆరోపణాస్త్రాలు గుప్పిస్తూ మీడియాలో వెలిగిపోతున్న కేజ్రీ వాల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మరింత చెలరేగిపోయారు. అంతకుముందు తాను అవినీతి ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి ఖుర్షీద్ కు  శాఖల మార్పిడిలో పెద్దపీట వేయడం చూసి కేజ్రీ వాల్ కు పుండు మీద కారం రాసినట్టయింది. మీడియాలో వెల్లడయిన సమాచారానికి మరికొంత జోడించి తన అంబులపొదిలో  ఆరోపణాస్త్రాలకు కొదవలేదని  నిరూపించారు.
ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్  ఇండస్ట్రీస్ సంస్థకు  దేశ ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, ఇందులో భాగంగానే జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించారని కేజ్రీ వాల్  ఆరోపణ. 
ప్రభుత్వంతో  కుదుర్చుకున్న అవగాహనకు విరుద్ధంగా రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిని దాదాపు నిలిపివేసి  ధర పెంచాలని    అడ్డదారిలో వొత్తిడి తెస్తోందని అంటూ, సరకును దాచి పెట్టి కృత్రిమంగా రేట్లు పెంచాలని చూసే చిల్లర వ్యాపారుల  నైజంతో రిలయన్స్ దిగ్గజం వ్యవహారాన్ని కేజ్రీ వాల్ పోల్చారు. 
ముఖేష్ అంబానీ డిమాండ్లను అంగీకరిస్తే రిలయన్స్ సంస్థకు  అదనంగా 43  వేల కోట్ల  రూపాయల అదనపు లాభం  రాగలదని., కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై 53 వేల కోట్లు అదనపు భారం పడగలదని జైపాల్ రెడ్డి తయారుచేసిన నోట్ లో పేర్కొన్నారని కేజ్రీ వాల్ వెల్లడించారు. కృష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ అన్వేషణ విషయంలో ప్రభుత్వంపై అధిక భారం పడగల అనేక రాయితీలను గతంలో బీజేపీ సారధ్యంలోని ఎన్ డీ యే ప్రభుత్వం కూడా సమకూర్చి పెట్టిందని ఆయన గుర్తుచేశారు.
ఈ ఆరోపణలను రిలయన్స్ తీవ్రంగా ఖండించింది. వీటి వెనుక స్వార్ధపర శక్తుల ప్రచ్చన్న హస్తం వుందని ఎదురు దాడికి దిగింది.
కేజ్రీ వాల్ ఆరోపణలు ఎలావున్నా, వాటిపై ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం గమనార్హం.
ప్రతి ఆరోపణకూ సమాధానం చెప్పడం కుదిరేపని కాదని సమర్ధించుకోవచ్చు. కానీ విషయాలు ఇంత స్పష్టంగా వుండి సందేహాలకు తావిస్తున్నప్పుడు వివరణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోజాలదు. లేకపోతే దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు ? ప్రజలతో ఎన్నికయిన ప్రభుత్వాలా? ప్రభుత్వ రాయితీలతో సంపద పోగేసుకుంటున్న బడా పారిశ్రామికవేత్తలా?  అనే మరో ప్రశ్న తలెత్తుతుంది.  (03-11-2012)

26, అక్టోబర్ 2012, శుక్రవారం

కాలాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు


కాలాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ భండారు శ్రీనివాసరావు
ఎన్నికల కోయిల ముందే కూయొచ్చన్న సంకేతాలు ఏకంగా యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ నుంచే వెలువడిన నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ శ్రేణులను తుది సమరానికి సంసిద్ధులను చేయడంలో నిమగ్నమయ్యాయి. చివరి పోరు  అనడానికి కారణం వుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రెండు దఫాలుగా అధికారానికి దూరంగా వుంది. మూడోసారి కూడా అందలాన్ని అందుకోలేకపోతే మరో అయిదేళ్లపాటు పార్టీ శ్రేణుల్ని కట్టడి చేయడం ఒక ప్రాంతీయ పార్టీకి అలవికి మించిన పని అవుతుంది. పోతే, పాలక పక్షం కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే వరసగా మూడో పర్యాయం కూడా ప్రజలు పట్టం కలిగేంత గొప్ప పాలనను అందిస్తున్న దాఖలా అటు కేంద్రంలో కాని ఇటు రాష్ట్రంలో కానీ కానరాని స్తితి.  మరో జాతీయ పార్టీ బీజేపీ పరిస్తితి కూడా ఇలాగే వుంది. కాంగ్రెస్ తప్పిదాలను ఇక ఎంతమాత్రం జీర్ణించుకోలేని వోటర్లు కూడా ఆ పార్టీ పట్ల మొగ్గుచూపడానికి సిద్ధంగా వున్నారని చెప్పడానికి వీలు లేకుండా ఆ పార్టీ ప్రతిష్ట  నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారవుతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ ఉదంతం దీనికి తాజా ఉదాహరణ. పోతే, రాష్ట్రంలో మిగిలిన పార్టీల పరిస్తితి కూడా ఆశాజనకంగా లేదు.  ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న వై.ఎస్.ఆర్. పార్టీ అధినాయకుడు జగన్ మోహనరెడ్డి  జైలు నాలుగు గోడల నడుమనే  వుండిపోవడంతో ఆ పార్టీ సైతం నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. షర్మిల రూపంలో ఎదిగివచ్చిన ప్రత్యామ్నాయం కూడా పాదయాత్రల వరకు పనికిరావొచ్చేమో కాని,  ఎన్నికల సమరంలో  పార్టీని విజయపధంలో నడిపించే దక్షత ఒక్క జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే వుందని నమ్మేవారు ఆ పార్టీలోనే  చాలామంది వున్నారు. దర్యాప్తులు, విచారణల పేరుతొ ఒక పక్క సీబీఐ, మరోపక్క ఈడీ,   ఆ పార్టీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అనేక సమస్యల నడుమ చేస్తున్న వొంటరిపోరాటం మరెంతో కాలం కొనసాగించడం అసాధ్యమని, ఫలితంగా కార్యకర్తలు నిరుత్సాహానికి గురయి అయోమయంలో పడే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయం వినబడుతోంది. కాలం గడిచేకొద్దీ, అనేక కొత్త సమస్యలు ఆ కొత్త పార్టీని పట్టి పీడించే అవకాశాలు లేకపోలేదు. వీటి ప్రభావం ఆ పార్టీ విజయావకాశాలను ఏదో ఒక మేరకు దెబ్బతీసే ప్రమాదం కూడా వుంది. ప్రస్తుత పాలకపక్షం కాంగ్రెస్ నిష్క్రియాపరత్వం, దాన్ని సరిగ్గా  అంది పుచ్చుకుని రాజకీయ లబ్ధిని పొందడంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వైఫల్యం, వామపక్షాలతో సహా అన్ని పార్టీలు ప్రజాసమస్యల పట్ల అంటీముట్టనట్టు వుండడం ఇవన్నీ పాలకపక్షానికి  కలసివచ్చే అంశాలే. అయినా కానీ,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలదన్న పద్ధతిలో కాలం గడుపుతోంది. ప్రతి రోజూ పత్రికల్లో ఆ పార్టీలో పెచ్చరిల్లుతున్న లులుకల గురించిన  కధనాలే. నాయకుల నడుమ పెరిగిపోతున్న పొరపొచ్చాలు గురించిన వూహాగానాలే.  ముఖ్యమంత్రికీ, మంత్రులకు పడదు. మంత్రులకూ  మంత్రులకు పొసగదు. ముఖ్యమంత్రికీ, ఉపముఖ్యమంత్రికి కుదరదు. పీసీసీ అధ్యక్షుడి సంగతి సరేసరి. ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో ఇందిరమ్మ బాట ప్రోగ్రాం పెట్టుకుని పోదామనుకుంటే, అదే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి రానని మొరాయింపు. ముఖ్యమంత్రే స్వయంగా ఫోను చేసినా డిప్యూటీ సీ.ఎం. ఏమాత్రం  స్పందించలేదని మీడియా కోడై కూయడం ఈ మొత్తం వ్యవహారానికి కొసమెరుపు. కాగా, నాయకుల నడుమ సఖ్యత, సమన్వయం  సాధించడం కోసం పీసీసీ అధ్యక్షుడు గాంధీ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి వందమంది నాయకులను ఆహ్వానిస్తే దాదాపు మూడోవంతు మంది గైరు హాజరు. పదిహేనుమంది  మంత్రులు మొహం చాటేశారని సమాచారం. ఇక పార్టీకిచెందిన అనేకమంది పార్లమెంటు సభ్యుల జాడలేదు. ఉప ముఖ్యమంత్రి  కూడా బలవంతపెట్టగా వచ్చివెళ్లినట్టు భోగట్టా.
పార్టీలో ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియదు, కానీ ఏదో జరిగిపోతున్నట్టు వార్తలు. వూహాగానాల్ని ఖండించే  నాధుడు వుండకపోగా  పైగా వాటిని ప్రోత్సహించే సంప్రదాయం. జనం నోళ్ళల్లో సదా నలగడానికి, ఇతర విషయాలను ప్రజల దృష్టి నుంచి మళ్ళించడానికి  ఆ పార్టీ ఎంచుకున్న వ్యూహమేమో  తెలియదు.  
సాధారణంగా ఎన్నికల వేళ దగ్గరపడుతుంటే పాలకపక్షాలు కొన్ని ప్రజారంజక నిర్ణయాలు ఇష్టం వున్నా లేకపోయినా, భరించగలిగే స్తోమత వున్నాలేకపోయినా తీసుకోవడం కద్దు. కానీ, అదేమీ చిత్రమో రాష్ట్రంలో పరిస్తితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. గ్యాస్ సిలిండర్ల సంగతే ఇందుకు చక్కని దృష్ట్యాంతం. సరఫరా చేసే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నది కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే ప్రభుత్వం. ప్రజలనుంచి ఎదురయ్యే నిరసన గురించి అంచనా వేసుకున్న దరిమిలా  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మరో మూడు సిలిండర్లు అదనంగా  సబ్సిడీ ధరపై  ఇవ్వాలని ఆదేశించారు.  ఈ అవకాశాన్ని రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం యెగిరి గంతేసి అందిపుచ్చుకోవాలి. కానీ, కిరణ్ సర్కార్ ససేమిరా అంది. దీపం పధకం లబ్దిదారులవరకే ఆ రాయితీని పరిమితంచేసి మిగిలిన వారికి మొండి చేయి చూపింది. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ. హనుమంతరావు మండిపడ్డారు. ఏకంగా ముఖ్యమంత్రినే నిలదీసినట్టు వార్తలు. కానీ చివరికి ఏమయింది. సాధ్యం కాని పని అని ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పినట్టు ఆ వార్తలకు ముక్తాయింపు. పెట్రో ధరలు, ఫీజు రీయింబర్స్ మెంటు, రేషన్ కార్డుల కుదింపు ఇలా ఏది తీసుకున్నా కిరణ్ సర్కారు వైఖరి  వోటర్లను  ఆకట్టుకునేదిగా లేదు. ఒకరకంగా ఇది అభిలషణీయం.  ఎన్నికలను, వోటు బ్యాంకులను లెక్కచేయకుండా మొత్తం రాష్ట్ర ప్రగతిని దృష్టిలో వుంచుకుని నిర్ణయాలను తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. గాడితప్పిన రాష్ట్ర ఆర్ధిక పరిస్తితిని చక్కదిద్దడానికి ఇలా వ్యవహరిస్తే తప్పుపట్టాల్సింది ఏమీ వుండదు. కానీ, నిజంగా ఇంతటి సదుద్దేశ్యంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తున్నది అని అనుకోవడం అంత నమ్మదగినదిగా లేదు.
రాజకీయాల్లో రెండు తరహాల వాళ్లు వుంటారు. ఈ రకమయిన తెగింపు నిర్ణయాలను వారు  మాత్రమే తీసుకోగలుగుతారు. ఒకరు రాజకీయవేత్తలు. వీరికి రేపటితో నిమిత్తం లేదు. తిమ్మిని బమ్మిచేసయినా సరే, ఆచరణ  సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టయినా సరే ఏదోఒక విధంగా  అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూసేవారు. అయితే, ఇక ఏం చేసినా ప్రజలు నమ్మి తమకు అధికారం అప్పగించడం కల్ల అని నిర్ధారణకు వచ్చినప్పుడు  ఈ రకమయిన గట్టినిర్ణయాలు తీసుకోవాడానికి కూడా  సంకోచించరు. రెండో వారు రాజనీతిజ్ఞులు.  తక్షణ రాజకీయ ప్రయోజనాలను పక్కన బెట్టి, భవిష్యత్తు గురించి, భావితరాలను గురించి ఆలోచించే దూరదృష్టి కలిగినవారు.   కానీ ప్రస్తుతం ఈ రకం  రాజకీయ నాయకులు అంతరించిపోతున్న జాతుల జాబితాలో వున్నారు.
కాకపొతే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని బలంగా బలపరుస్తున్న కొందరు చెప్పేది వేరేగా వుంది. వీరు కాలాన్ని, కాలం తెచ్చే  మార్పుల్ని నమ్ముకుని రోజుల్ని ఏమారుస్తున్నవారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మధ్యంతరం వచ్చిపడితే తప్ప అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా ఏన్నర్ధం పైచిలుకు వ్యవధానం వుంది. పాదయాత్రల పేరుతొ జనాలకు వెడుతున్న రెండు ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కంటే, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడానికే ప్రాధాన్యతను ఇస్తూ వుండడం పాలక పక్షానికి వూరట కలిస్తోంది. ఈ నేపధ్యంలో   ప్రతిపక్షాల వోట్లు చీలక తప్పవన్న భరోసా కాంగ్రెస్ వారిది.  కోర్టులు, కేసులతో  జగన్  పార్టీని  బలహీనపరచగలిగితే, ఇప్పటికే ప్రాంతీయ ఉద్యమవేడితో ఒక ప్రాంతంలో బలహీనపడివున్న మరో  ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశాన్ని మరింత బలహీన పరచడం చేతిలో పని. అధికారం చేతిలో వుంది. అధికారులు కనుసన్నల్లో వుంటారు. పార్టీ శ్రేణులను కట్టడి చేయడానికీ, వోటర్లను ఎంతో కొంత ఆకట్టుకోవడానికీ పనికొచ్చే ఈ రెండు ఆయుధాలుతమ చేతిలోనే వున్నాయి. సమస్య పరిష్కారాన్ని కాలానికే వొదిలేసి నానబెట్టడం ద్వారా ప్రాంతీయ సమస్యను ఓ మేరకు అదుపుచేయగలిగామని నమ్మే నాయకులకు కాంగ్రెస్ లో కొదవ లేదు. బహుశా ఇలాటి ధీమాతోనే కాంగ్రెస్ తన సమస్యలను అన్నింటినీ కాలానికేవొదిలేసి నిశ్చింతగా కాలక్షేపం చేస్తోందని అనుకోవాలి. (26-10-2012)

17, అక్టోబర్ 2012, బుధవారం

జగన్ లేని జగన్ పార్టీ


జగన్ లేని జగన్ పార్టీ
వై.ఎస్.ఆర్. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం  ఇప్పట్లో  లేదని తేలిపోయింది. అంతేకాదు,  ఇంకెంతకాలం జెయిల్లో వుండాల్సి వస్తుందో ఇతమిద్ధంగా చెప్పలేని పరిస్తితి కూడా ప్రస్తుతం ఏర్పడింది. ఈ పరిణామాల నేపధ్యంలో ఆ పార్టీ అధ్యతన భవిష్యత్తు గురించి ఆ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ఇతర ప్రత్యర్ధి పార్టీల్లో కూడా చర్చ మొదలయింది.
జాతీయ పార్టీల సంగతి వేరు కాని ప్రాంతీయ పార్టీలకు నాయకుడి అవసరం ఎక్కువ. పార్టీని నమ్ముకున్నవారికి పార్టీ అధినాయకుడు అందుబాటులో వుండడం అన్నది ఆ పార్టీకి కలసి వచ్చే అంశం. పార్టీ అధ్యక్షుడు నెలల తరబడి  జైల్లో  వుంటున్నప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ ప్రబలడం సహజం. నిరాశ నిరాసక్తతగా మారి  నిస్పృహగా పరిణమించితే అది పార్టీ బలహీన పడడానికి దోహదం చేస్తుంది. ఇటీవలికాలంలో తారాజువ్వలా ఎదిగివచ్చిన వై.ఎస్.ఆర్. పార్టీని అడ్డుకోవడం,  అదుపుచేయడం ఎలాగో  చేతకాక తలలు పట్టుకుంటున్న మిగిలిన పార్టీలకు జగన్  మరికొంతకాలం, అదికూడా  ఎంతకాలం అన్నది తెలియనంతకాలం జైలు నాలుగు గోడల  నడుమే  వుండిపోవడం  కొంతవరకు  కలసివచ్చే విషయం. మరో ఆరుమాసాలపాటు జగన్ కు జైలు జీవితం తప్పదన్న సుప్రీం కోర్టు సంకేతాల దరిమిలా దొరికిన రాజకీయ ‘అవకాశాన్ని’ పూర్తిగా వాడుకోవడానికే ఇటు కాంగ్రెస్ అటు తెలుగుదేశం సంసిద్ధం అయినట్టే  కనబడుతోంది. జగన్ పై  ఎక్కుబెట్టిన అవినీతి ఆరోపణలను జనం యెందుకు పట్టించుకోవడం లేదని మధన పడుతున్న ఆ పార్టీలకు జగన్ జైల్లో వున్నప్పుడే పరిస్తితులను తమకు అనుకూలంగా చక్కదిద్దుకోవడం  ఒక తప్పనిసరి రాజకీయ అవసరంగా మారింది.  జనం ముందు నమ్మకపోయినా కాలం గడుస్తున్నకొద్దీ, అతడిపై పెట్టిన అవినీతి ఆరోపణల కేసు వివరాలు ఒక్కొక్కటిగా బయటపడేకొద్దీ ప్రజలు కొంతమేరకయినా మనసు మార్చుకునే  అవకాశం వుంటుందన్నది  కాంగ్రెస్ వ్యూహకర్తల్లో కొందరి ఉద్దేశ్యం. ఈ లోగా జారిన కాలును కూడదీసుకుని రకరకాల ఆకర్షక పధకాల ద్వారా పార్టీని ప్రజలకు దగ్గర చేయవచ్చన్నది కూడా వారి వ్యూహంలో భాగంగా తోస్తోంది. పార్టీ శ్రేణులను కట్టడి చేయడానికి, ప్రజలను ఆకట్టుకోవడానికీ ఇతర పార్టీల వద్ద లేనిదీ, తమవద్ద మాత్రమే వున్నదీ ఏమిటో వారికి తెలియనిది కాదు. ‘అధికారం’ అనే ఒకే ఒక బ్రహ్మాస్త్రంతో అటు పార్టీ కార్యకర్తలను, ఇటు జనాలను దగ్గర చేసుకోవచ్చని, వారికి మళ్ళీ దగ్గర కావచ్చనీ వారి వ్యూహంగా తోస్తోంది. చేతిలో అధికారం లేకుండా వుత్త చేతులతో  ఎవరు జనాలదగ్గరకు పోయి ఏవి చెప్పినా అవి కల్లబొల్లి మాటలే అని, ఏదేదో  చేస్తామని ఎవరు ఏదయినా  మాట ఇచ్చినా అది నెరవేర్చలేని  శుష్క వాగ్దానమే అనీ,   అధికారం చేతిలో వున్న తమ పార్టీ మాత్రమే ఏం చెప్పినా వెంటనే చేయగలుగుతుందని  అంటూ వెడితే ప్రజలు తమని మాత్రమే నమ్ముతారని వారి నమ్మకం, . ఒక రకంగా ఇది నిజం కూడా. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తమ విమర్శలతో ఎండగట్టగలవు కానీ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపలేవు. అలాగే పార్టీ కార్యకర్తలను, కింది స్తాయి నాయకులను కట్టడి చేయడానికీ, ఆకట్టుకోవడానికీ  పాలక పక్షానికి వున్న వెసులుబాటు, వనరులు  ప్రతిపక్షాలవద్ద వుండవు.
కాంగ్రెస్ వ్యూహకర్తల ఎత్తుగడలు ఇలావుంటే  పార్టీలో  నాయకుల కీచులాటలు ముదిరి పాకాన పడుతూ వుండడం ఆ పార్టీ కి వున్న పెద్ద మైనస్ పాయింటు. పార్టీ అధికారంలో వుండాలని, మరో మాటు  అధికారంలోకి రావాలని   అంతా  కోరుకుంటారు కాని ఎటొచ్చీ ఆ అధికారం తమ చేతిలోమాత్రమే  వుండాలని  కాంగ్రెస్ లో  ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటాడు. తమకు దక్కని అధికారం పార్టీలో తమ ప్రత్యర్ధికి కూడా అందకూడదని అనుకోవడం కూడా ఆ పార్టీలో  పరిపాటే. మూడోసారి వరసగా  ప్రభుత్వంలోకి రావడం  అంత సులభం కాదని కూడా తెలుసు కాబట్టి  ఎన్నికల్లో  తమ వ్యక్తిగత  గెలుపుకోసం ఏమయినా  కష్టపడతారేమో  కాని మొత్తం పార్టీని గట్టెక్కించడానికి తమకున్న స్తోమతను, సంపదను  ఖర్చు చేసే నాయకులు  కాంగ్రెస్ లో తక్కువమంది వుంటారు. ఒకవేళ  పార్టీ గెలిచినా అధికార  పగ్గాలు తమ చేతికే వస్తాయన్న నమ్మకం కాంగ్రెస్ లో ఏ ఒక్క నాయకుడికీ లేకపోవడమే ఈ నిర్లిప్తతకు కారణం.  మొత్తం పార్టీని విజయ తీరాలకు చేర్చే బాధ్యతను భుజాలకెత్తుకోవడానికి సిద్ధంగా వుండరు. ఎందుకొచ్చిన  కంచి గరుడ సేవ అని మిన్నకుండిపోతారు. అయితే గియితే, ఎదోరకంగా పార్టీ  గెలిస్తే అప్పుడు ఢిల్లీ వెళ్లి తేల్చుకోవచ్చు అంతే  కాని ఇప్పటినుంచి అనవసర లాయలాస ఎందుకనే తత్వం వారిది. ఈ నేపధ్యం వల్లనే, సరయిన నాయకత్వం కొరత కారణంగానే,  వరసగా రెండోసారి గెలిపించినా  తమకు దూరం కావడం మినహా దగ్గరయ్యే కనీస ప్రయత్నం కూడా ఆ పార్టీ చేయడం లేదన్న అభిప్రాయం జనాల్లో వుంది. ఈ ప్రభుత్వ  వ్యతిరేక వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ, వై.ఎస్.ఆర్. పార్టీలు ఓ పక్క పోటీ పడుతూనే మరో పక్క ఒకరిపై ఒకరు  కత్తులు దూసుకుంటున్నారు. ఇది కూడా  ఒక రకంగా కాంగ్రెస్ కు కలసి వచ్చే అంశమే. కానీ, దాన్ని వాడుకునే తీరిక, ఓపిక ఆ పార్టీ నాయకులకు లేవు. తమలో తాము కుమ్ములాడుకుంటూ అసలే  బలహీనంగా వున్న పార్టీ ప్రతిష్టను మరింత మసకబార్చే పనితోనే వారికి సరిపోతోంది.             

పోతే, తెలుగుదేశం పార్టీ పరిస్తితి మరోరకం. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొనివున్న పరిస్థితుల్లో  టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేసి ఇంట్లో కూర్చున్నా గెలిచి తీరాలి. వాతావరణం అంత అనుకూలంగా వుంది.  పాలక పక్షంపై నానాటికీ పెరిగిపోతున్న వ్యతిరేకతను అడ్డం  పెట్టుకుని ఎన్నికల్లో నెగ్గి , తిరిగి  అధికారంలోకి రావడం అనేది తెలుగుదేశం పార్టీకి నల్లేరు మీది నడక కావాల్సిన పరిస్తితి.  కానీ, దురదృష్టం ఏమిటంటే టీడీపీకి దక్కాల్సిన ఈ బంగారు అవకాశాన్ని  కాస్తా కొత్తగా పుట్టుకొచ్చిన వై.ఎస్.ఆర్. పార్టీ ఎగరేసుకుని పోతుంటే నిశ్శబ్దంగా చూస్తూ కూర్చోవాల్సిన దుస్తితిలో కూరుకుపోతోంది.   2009  అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కూడా తెలుగుదేశం పార్టీది ఇదే అనుభవం.  అప్పటి ఎన్నికల్లో ‘విజయం ఖాయం, అడుగు దూరంలో అధికారం’ అని   టీడీపీ పెంచుకున్న ఆశలపై  ఆ రోజుల్లో కొత్తగా పుట్టుకొచ్చిన  ప్రజారాజ్యం పార్టీ  నీళ్ళు చల్లింది.  తను గెలవకపోగా తమ గెలుపుకు ఆ పార్టీ గండి కొట్టిందన్న అభిప్రాయంతో వున్న  తెలుగు దేశం పార్టీకి, ఇప్పుడు మళ్ళీ  జగన్ రూపంలో అదే పరిస్తితి ఎదురవుతోంది. ఈ నిజం జీర్ణించుకున్నారు  కాబట్టే టీడీపీ నాయకులకు ఇప్పుడు జగనే  ప్రధాన ప్రత్యర్ధిగా కనిపిస్తున్నాడు.
2014 అసెంబ్లీ  ఎన్నికలకు ఏడాది పైచిలుకు వ్యవధానం మాత్రమే మిగిలి వుంది. మీనమేషాలు లెక్కించే వీలుసాళ్లు  ఇప్పుడు ఏపార్టీకి లేవు. అందరికీ ఎన్నికల పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కొందరు రాజకీయ పండితులు వూహించేదే నిజమయితే ఎన్నికల ఘంటారావం అనుకున్నదానికన్నా  ముందే వినబడే అవకాశం వుంది. అంటే ఎలాచూసినా అన్ని పార్టీలకి గడువు దగ్గర పడిందనే చెప్పాలి. అందుకే యాత్రల  పేరుతొ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసాయి. ఈ విషయంలో టీడీపీ కొంత ముందుంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం  చుట్టేసి ప్రజల మధ్యనే నడుస్తూ తిరుగుతున్నాడు. జనం మధ్యనే వుండడానికి  అలవాటుపడిన జగన్ మోహన రెడ్డికి  జైలు నుంచి బయటపడే సావకాశం ఇప్పట్లో లేదని తేలిపోవడంతో వై.ఎస్.ఆర్. పార్టీ నేతలు కూడా వై.ఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిలను  ఈనెల 18 నుంచి  పాదయాత్రకు రంగంలో దింపుతున్నారు.
ఈ రెండు యాత్రలూ సుదీర్ఘంగా సాగేవే కావడం గమనార్హం. చంద్రబాబు నాయుడు తన వయసుకు పొసగని  భారమయిన  బాధ్యతను మీదికెత్తుకుంటే, వై.ఎస్.ఆర్. పార్టీ తరపున ఆ పార్టీలో ఎటువంటి వ్యవస్తాగతమయిన హోదాలేని షర్మిల తలకు మించిన భారాన్ని తలకెత్తుకుంది. ఈ యాత్రల్లో ఓ రెండువారాలు ముందున్న చంద్రబాబునాయుడు దానికి తగ్గట్టుగానే కొంత మైలేజీ  సంపాదించుకున్నారు. యాత్రకు ముందు తలెత్తిన  సందేహాలను పటాపంచలు చేస్తూ బాబు పాద యాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తున్నందుకు ఆ పార్టీ వర్గాలు వూపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే షర్మిల పాదయాత్ర గురించి ప్రకటన వెలువడింది.  అప్పటినుంచి ఈ రెండు యాత్రలను పోలుస్తూ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. యాత్రల పట్ల ప్రజల స్పందన ఏ తీరుగా వుండబోతున్నది అన్న విషయంపై కూడా వూహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రలను  ఒకదానికొకటి పోటీగా పరిగణించడం అంత మంచి పద్దతి అనిపించుకోదు. ప్రజాస్వామ్యంలో ఈ రకమయిన పోటీ ప్రచార యాత్రలు తప్పనిసరి. పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికీ, నాయకులు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికీ కొన్ని సందర్భాల్లో పాదయాత్రలకు పూనుకుంటూ వుంటారు. పనిలో పనిగా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికీ, గ్రామస్థాయి నుంచి పార్టీ పునాదులను గట్టిపరచుకోవడానికీ ఈ పాదయాత్రలు బాగా ఉపయోగపడతాయి. అలాగే ప్రజల నడుమ హమేషా తిరుగుతూ వారి విశ్వాసాన్ని పొందడానికి నాయకులకు పాదయాత్రలకు మించిన మార్గం లేదు.  స్వామి కార్యం, స్వకార్యం అన్నట్టు అనుదినం మీడియాలో కనబడే అవకాశం కూడా వుంటుంది. రాజకీయ నాయకులను కూడా దగ్గరగా చూస్తూ వారు చెబుతున్న మాటల్లో తాలెంతో,బోలెంతో అంచనావేసుకునే వీలు ప్రజలకు చిక్కుతుంది. (17-10-2012)

12, అక్టోబర్ 2012, శుక్రవారం

ఒరులేయవి యొనరించిన


ఒరులేయవి యొనరించిన  
1997 లో 28  ఏళ్ళ ఓ యువకుడిని సోనియా గాంధీ ముద్దుల కుమార్తె ప్రియాంక గాంధీ ప్రేమించి పెళ్ళాడినప్పుడు ఆ కుటుంబం సంగతి యేమో కాని దేశం యావత్తు నివ్వెరపోయింది. అంతకు 52 ఏళ్ళ క్రితమే  1942 లో జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని తండ్రి  అభీష్టానికి వ్యతిరేకంగా  పార్శీ కుటుంబానికి చెందిన   ఫిరోజ్  గాంధీని (వాస్తవానికి జాతిపిత మహాత్మా గాంధీకి ఈ ఫిరోజ్ గాంధీకి ఎలాటి బంధుత్వం లేదు) పరిణయం ఆడిన దగ్గరనుంచి ఇలాటి వివాహాలకు ఆ కుటుంబం బాగా అలవాటు పడిపోయిందనే చెప్పాలి. తదనంతర కాలంలో రాజీవ్ గాంధీ ఇటలీ వనిత సోనియాను, అతడి తమ్ముడు సంజయ్ గాంధీ,  మేనకా (మనేకా) గాంధీని పెళ్ళిచేసుకుని తమ తలిదండ్రుల సంప్రదాయాన్ని కొనసాగిస్తే, సోనియా గారాలపట్టి ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రా ను పెళ్ళాడి  మూడో తరంలో కూడా ప్రేమ వివాహాల వొరవడిని మరింత  ముందుకు తీసుకువెళ్ళింది. ఆమె తమ్ముడు రాహుల్ గాంధీ మాత్రం ప్రేమ వివాహం మాట సరే  అసలు పెళ్ళిమాటే తలపెట్టడంలేదు.


రాబర్ట్ వాద్రా

ఇక ప్రస్తుతానికి వస్తే, రాబర్ట్ వొధేరా అనాలో రాబర్ట్ వాద్రా అని పలకాలో ప్రియాంకాతో పెళ్లినాటికి  ఎవరికీ  అంతుపట్టని ఆ  వ్యక్తి ఈనాడు మీడియా దృష్టిని  ప్రముఖంగా ఆకర్షిస్తున్నాడు.  నిజానికి అతడీనాడు అంత అనామకుడేమీ కాదు. దేశ రాజకీయాలను శాసిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి, యూపీయే అధినాయకురాలు అయిన సోనియా గాంధీకి స్వయానా ఇంటల్లుడు కావడం, భావిభారత ప్రధాన మంత్రిగా చూడాలని  కాంగ్రెస్ పార్టీ  శ్రేణులన్నీ కోరుకుంటున్న  రాహుల్ గాంధీ అనుంగు సోదరి ప్రియాంక గాంధీని మనువాడడం కూడా అతడికింత ప్రచారం రావడానికి  కారణాలు కావచ్చు.  అయితే,  హమేషా మీడియా దృష్టి పడే కుటుంబానికి చెందినవాడే కాని మీడియా దృష్టిపెట్టాల్సినంత మనిషి కాదు రాబర్ట్ వాద్రా.  అయినా కానీ,  ఈనాడు  అందరి దృష్టీ అతడిపైనే వుంది. దీనికి కారకుడు ఎవరయ్యా అంటే,  ఇంకా  పేరు పెట్టని ఓ రాజకీయ పార్టీని కొత్తగా పెట్టిన కేజ్రీవాల్. అవినీతి వ్యతిరేక ఉద్యమనేత  అన్నా హజారే బృందంలో వుంటూ, ఇటీవలే  రాజకీయ అరంగేట్రం చేసిన కేజ్రీవాల్  ఆ  వెనువెంటనే ప్రయోగించిన తన తొలి ఆరోపణాస్త్రాన్ని  నేరుగా  రాబర్ట్ వాద్రా  మీదికే సంధించడంవల్లనే  ఇప్పుడు  వాద్రా  పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.
1969 లో జన్మించిన రాబర్ట్ వాద్రా పెద్ద  శ్రీమంతుల కుటుంబం నుంచి వచ్చినవాడేమీ కాదు. తండ్రి రాజేంద్ర వాద్రా ఒక సాధారణ వ్యాపారి. కొయ్యతో, ఇత్తడితో చేసిన బొమ్మలను, వస్తువులను విక్రయించే వ్యాపారం. తల్లి మౌరీన్ స్కాటిష్ జాతీయురాలు. ప్రియాంకాతో పెళ్ళయిన తరువాత రాబర్ట్ కు తండ్రితో పొసగలేదు. ఒక దశలో తండ్రికీ తనకూ సంబంధం లేదని పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు.
ఇక ఈ వివాదంలో చిక్కుకున్న మరో వ్యక్తి  కుశ్ పాల్ సింగ్. తన  మామగారినుంచి దక్కిన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం తన శక్తియుక్తులన్నీ ఉపయోగించాడు. మామ రఘువేంద్ర సింగ్ స్తాపించిన డీ.ఎల్.ఎఫ్. సంస్థ నస్తాల వూబిలో కూరుకుపోయివున్న ఒక  దశలో కుశ్ పాల్ సింగ్ అందులో  తన వాటాలను అమ్ముకోవాలని కూడా అనుకున్నారు. కానీ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్  గాంధీతో యాదృచ్చికంగా జరిగిన పరిచయం  కుశ్ పాల్ సింగ్ జీవితాన్ని సమూలంగా మార్చివేసింది. సింగ్ వ్యాపారాన్ని ఆకాశం అంచులకు తాకించింది. ఫలితంగా ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో ఆయన పేరు చేరింది. రాజకీయ ప్రాపకం వుంటే ఏదయినా సాధ్యం అని  కుశ్ పాల్ సింగ్ నిరూపించాడు. అత్యంత సంపన్నుడయిన సింగ్,  అత్యంత రాజకీయ ప్రాపకం వున్న రాబర్ట్ నడుమ వ్యాపార సంబంధాలు బలపడడంలో ఆశ్చర్యం లేదు. వారిరువురి  మధ్యా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో  సాగిన ఆర్ధిక లావాదేవీలనే  కేజ్రీవాల్ బయటపెట్టి సంచలనం సృష్టించారు. 
      
ఇంతకీ కేజ్రీవాల్, రాబర్ట్  వాద్రాపై ఎక్కుబెట్టిన బాణంలో పదునెంత? అది కలిగించే ప్రభావం యెంత? అనే విషయంపై మీడియాలో ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. వాద్రా సోనియా కుటుంబానికి చెందిన వ్యక్తి కాక పోతే కేజ్రీవాల్ చేసిన  ఆరోపణలకు ఇంతటి  ప్రచారం లభించి వుండేది కాదని భావించేవారు కూడా లేకపోలేదు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో డి.ఎల్.ఎఫ్  అనే ఓ  బడా  సంస్థకు  లాభం లేదా మేలు జరిగేలా సోనియా అల్లుడిగా రాబర్ట్ వాద్రా పలుకుబడి ఉపయోగపడిందని, దానికి ప్రతిఫలంగా వాద్రాకు డి.ఎల్.ఎఫ్. కొన్ని కోట్లు విలువచేసే  ఆస్తులను కట్టబెట్టిందని  కేజ్రీవాల్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో వున్న డి.ఎల్.ఎఫ్. సంస్థ, అరవై ఐదుకోట్ల రూపాయల  వడ్డీలేని, పూచీకత్తు అవసరం లేని రుణాన్ని  రాబర్ట్ వాద్రాకు ఇచ్చిందన్నది కేజ్రీవాల్ సంధించిన మొదటి అస్త్రం. వ్యాపార లావాదేవీల్లో  డబ్బు సర్దుబాట్లు చేసుకోవడం నేరం కాకపోవచ్చు. కానీ, ఇంతపెద్ద మొత్తాలు చేతులు మారుతున్నప్పుడు ఆ విషయం ఆదాయపు పన్ను శాఖకు తెలియకుండా జరగడానికి అవకాశం వుండదు. అయినా ఆ శాఖ మిన్నకుండా వున్నదంటే కచ్చితంగా రాబర్ట్ వాద్రా సోనియా కుటుంబంలో సభ్యుడు కావడమే కారణమని కేజ్రీవాల్ అభిప్రాయపడుతున్నారు.
ఆయన అంతటితో ఆగలేదు. మరికొన్ని ఆధారాలతో కూడిన కొత్త ఆరోపణలు చేశారు. నేను నీకీ పని చేసిపెడతాను. ప్రతిఫలంగా నువ్వు నాకు ఇది చేసిపెట్టు అనే పద్ధతిలో (ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని క్విడ్ ప్రోకొ  అని సంక్షిప్తంగా పేర్కొంటున్నారు) డీ.ఎల్.ఎఫ్.,  వాద్రాల  నడుమ అనేక రకాల  లావాదేవీలు సాగాయని కేజ్రీవాల్ వాదన.
అవినీతిని నిర్మూలించే  విషయంలో స్వపర భేదాలు లేకుండా సొంత పార్టీవారిని సైతం జైలు వూచలు లెక్కబెట్టిస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ నేతలకు ఈ వివాదం కొరుకుడు పడడం లేదు. సాక్షాత్తు పార్టీ అధినేత్రి అల్లుడిపై గురిపెట్టిన ఈ కొత్త సంకటం నుంచి యెలా బయటపడాలన్నది వారికి సవాలుగా మారింది. అయితే నూటపాతికేళ్ల ఘన చరిత్ర వున్న పార్టీ కాబట్టి తొందరగానే తేరుకుని ఎదురు దాడి మొదలు పెట్టింది. తమ అధినాయకురాలిపై  ఈగ వాలితేనే  సహించలేని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు ఒక్కుమ్మడిగా లేచి,  రాబర్ట్ వాద్రాపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతున్నాయి. ఆధారరహిత ఆరోపణలుగా కొట్టివేస్తూ కేజ్రీవాల్ వెనుక బీజేపీ ప్రచ్ఛన్న హస్తం వుందని ప్రత్యారోపణ చేస్తున్నాయి. ఈ ఎదురుదాడి బృందంలోని  కాంగ్రెస్ అధికార ప్రతినిధులతో కర్నాటక గవర్నర్ గా వుంటున్న   హెచ్.కె. భరద్వాజ్ సైతం   స్వరం కలపడం విచిత్రంగా వుంది.
కేజ్రీవాల్ ఆరోపణలపై కేంద్ర మంత్రి చిదంబరం స్పందన మరింత విడ్డూరంగా వుంది.
ప్రైవేటు లావాదేవీలపై కేంద్రం దర్యాప్తు చేయబోదని ఆయన చెబుతున్నారు. తనదాకా వస్తే కాని నొప్పి తెలియదన్నట్టు,  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ విషయంలో క్విడ్ ప్రోకో  అంటూ విచారణ జరుపుతున్న సంగతిని మర్చిపోయి చిదంబరం మాట్లాడుతుండడం విశేషం. జగన్ కేసు విషయంలో ఒకరకంగాను, వాద్రా కేసులో మరో రకంగాను వ్యవహరించడాన్ని జనం గమనించరని అనుకుంటే పొరపాటు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చక్కని అవకాశం. రాజకీయ ప్రత్యర్ధులను తొక్కిపట్టివుంచడానికి,  ఎగర్తించేవారిని మెడలు వంచి  కాడి కిందికి తేవడానికి కేంద్రంలోని యూ.పీ.ఐ. ప్రభుత్వం    సీ.బీ.ఐ. ని ఒక పనిముట్టుగా  వాడుకుంటోదన్న అపవాదును తిప్పికొట్టడానికి ఇది ఒక మహత్తర అవకాశం. ఎంతవారలయినా చట్టం ముందు సమానులే అని వల్లిస్తున్న చిలక పలుకుల్లో ఎలాటి డొల్లతనం లేదని నిరూపించుకోవడానికి ఇదే మంచి తరుణం.  భవిష్యత్తులో, ఏ ఒక్కరూ, రాజకీయ అధికారాన్నికాని, అధికార కేంద్రంతో తమకున్న  సంబంధాలను కానీ అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని, ప్రజల సంపదను నిర్లజ్జగా కొల్లగొట్టే  సాహసం చేయకుండా వుండాలంటే రాబర్ట్ వాద్రాపై వచ్చిన ఆరోపణలను రాగద్వేషాలకు అతీతంగా విచారించి నిగ్గుతేల్చడం కాంగ్రెస్ పార్టీకి ఒక చారిత్రిక అవసరం. 
నన్నయ మహాభారతంలో ఒక పద్యం వుంది.
‘ఒరులేయవి యొనరించిన  
నరవరయప్రియము తన మనంబునకగుదా
నొరులకునవి సేయకునికి
పరాయణము పరమధర్మపధములకెల్లన్’ -    
‘ఎవరు ఏమి చేస్తే నీకు అప్రియం అనిపిస్తుందో అదే పని నీవు ఇతరుల విషయంలో చేయకు’ అన్నది దాని తాత్పర్యం.
దీన్ని కొద్దిగా మార్చితే ప్రస్తుత రాజకీయ నాయకులకు అన్వయిస్తుంది. చట్టాన్ని అమలుచేయడంలో సమ్యక్ దృష్టి వుండాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని తేలిగ్గా చెప్పడం కాదు. చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూడాల్సిన బాధ్యత కూడా పాలకులపై వుంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.(12-10-2012)