4, నవంబర్ 2021, గురువారం

జై భీమ్ సినిమా

 

తమిళ్ హీరో సూర్య నటించిన   జై భీమ్ డబ్బింగ్  సినిమాపై  సాంఘిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న  అనేక పోస్టులు చూస్తున్నప్పుడు ఈ సినీ కధకు ప్రేరణ అయిన జస్టిస్ చంద్రు గురించి ఎనిమిదేళ్ల క్రితం నా బ్లాగులో ఆయన్ని గురించి రాసిన వ్యాసం గుర్తుకు వచ్చింది.



 

పర్వాలేదు, మనం మంచి వాళ్ళ మధ్యనే ఉంటున్నాం – భండారు శ్రీనివాసరావు (2013)

ఒకరకంగా మన అందరం అదృష్టవంతులమే. ఎందుకంటే , జస్టిస్ చంద్రు వంటి అరుదయిన మంచి మనుషులు జీవిస్తున్న కాలంలోనే మనమూ బతుకుతున్నాము కాబట్టి.

జస్టిస్ చంద్రు చెన్నై హై కోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన్ని గురించిన నాలుగు మంచిమాటలు చెప్పుకునే ముందు మరో విషయం ప్రస్తావించడం అసందర్భం ఏమీ కాబోదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.వి.రావు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా న్యాయస్తానాలలో మూడుకోట్లకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోయివున్నాయనీ, ఇవన్నీ ఓ కొలిక్కి రావాలంటే 300 లసంవత్సరాలకు పైగా పడుతుందనీ జస్టిస్ రావు చెప్పారు. ఆయన చెప్పింది అక్షరసత్యమే కావచ్చుకాని, జస్టిస్ చంద్రు వంటి న్యాయమూర్తులు మరికొందరు వుండివుంటే, బహుశా కేసుల పరిష్కారానికి అంత సమయం అవసరం పడదేమో! ఎందుకంటే కేసుల పరిష్కారం విషయంలో జస్టిస్ చంద్రు నెలకొల్పిన రికార్డు అలాటిది మరి. న్యాయమూర్తిగా ఆయన అక్షరాలా యాభై నాలుగు వేల కేసులను పరిష్క రించారు. భారత న్యాయస్తానాల చరిత్రలో ఇదొక అరుదయిన రికార్డు.

సరే! విషయానికి వద్దాం.

ఏదయినా ఉద్యోగంలో వున్న వ్యక్తి యెంతటి సమర్ధుడైనా సరే, ఏదో ఒకనాడు పదవీ విరమణ చేయకతప్పదు. జస్టిస్ చంద్రుకు కూడా ఆ రోజు వచ్చింది.

మామూలుగా ఇలాటి సందర్భాలలో కొన్ని సంప్రదాయాలు వుంటాయి. న్యాయమూర్తి ఎవరయినా రిటైర్ అవుతున్నప్పుడు కోర్టులోనే అధికారికంగా ఒక వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ వగైరా హాజరవుతారు. వీడుకోలు ప్రసంగాలు చేస్తారు. పుష్పగుచ్చాలు అందచేస్తారు. తేనీటి విందు జరుగుతుంది. అందరూ కలసి ఫోటో దిగుతారు. వీలునుబట్టి, ఆ సాయంత్రం ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీడ్కోలు విందు ఏర్పాటుచేస్తారు.

కానీ జస్టిస్ చంద్రు తరహానే వేరు. అందువల్ల ఆయన పదవీ విరమణ ఆయన పద్దతిలోనే జరిగింది. ఏడేళ్ళపాటు జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యేముందు ఆయన ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయవద్దని అందులో ముందుగానే అభ్యర్ధించారు.

ఒక జడ్జి నిరాడంబరంగా పదవీ విరమణ చేయడం ఎన్నడూ జరగలేదా అంటే జరిగింది. కానీ ఎప్పుడూ? మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1929లో జరిగింది. ఆరోజుల్లో జస్టిస్ జాక్సన్ నాటి అడ్వొకేట్ జనరల్ తో చెప్పారు. ‘ నా రిటైర్ మెంటు విషయంలో అనవసరమైన హడావిడి ఏమీ చేయవద్దు. నా విధులు నేను నిర్వర్తించాను. వీడ్కోలు ఇవ్వాల్సిన అవసరం ఏమి వుంది?’

మళ్ళీ ఎనభై రెండేళ్ళ తరువాత జస్టిస్ చంద్రు అలాటి నిర్ణయం తీసుకోగలిగారు.

మార్చి ఎనిమిది, శుక్రవారం.

జస్టిస్ చంద్రు రోజుమాదిరిగానే కోర్టుకు వచ్చారు. తన ఆస్తిపాస్తుల వివరాలను స్వచ్చందంగా తెలియచేస్తూ ఒక డాక్యుమెంటును ప్రధాన న్యాయమూర్తికి అందచేసారు. తరువాత తన చాంబర్స్ కు వచ్చి అవసరమైన కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. మీడియా మిత్రులతో కూర్చుని తేనీరు సేవిస్తూ కొద్దిసేపు ముచ్చటించారు.

రిటైర్ అయినరోజున కూడా ఆయన అధికారిక వాహనాన్ని వాడుకోలేదు. అన్నిసంవత్సరాలుగా వెన్నంటివున్న డఫేదారునూ వెంటతీసుకోపోలేదు.

తరువాత హై కోర్టు బయటకు వచ్చి నడుచుకుంటూ సుభాష్ చంద్రబోస్ రోడ్డు దాటి అక్కడవున్న సంగీత రెస్టారెంటులో మిత్రులతో కాఫీ తాగుతూ ముచ్చట్లు చెబుతూ గడిపారు. ఆ పిదప, బీచ్ రోడ్డు స్టేషన్ కు వెళ్ళి వేలాచెర్రి వెళ్ళే ఎం.ఆర్.టీ.ఎస్. లోకల్ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు.

న్యాయమూర్తిగా వున్నప్పుడు కూడా జస్టిస్ చంద్రు ఉద్యోగంతోపాటు వచ్చే హంగులు ఆర్భాటాలకు దూరంగానే వుంటూ వచ్చారు. సాధారణంగా న్యాయమూర్తులు తమ చాంబర్ నుంచి కోర్టు హాలుకు వెళ్ళేటప్పుడు యూనిఫారం ధరించిన బిళ్ళ బంట్రోతు వొకరు చేత దండం ధరించి ముందు నడుస్తూ వెళ్లడం ఆనవాయితీ. జస్టిస్ చంద్రు దీనికి స్వస్తి చెప్పారు. తన అధికారిక వాహనానికి యెర్ర దీపం ఏర్పాటు తీసేయించారు. సెక్యూరిటీ సిబ్బందిని అవసరంలేదని చెప్పి వాపసు పంపేసారు. ఇంటివద్ద పనులకోసం బంట్రోతులను వాడుకోలేదు.

చెన్నై హైకోర్టులో జస్టిస్ చంద్రు చాంబర్ ముందు ఒక బోర్డు మీద ఇలా రాసివుండేది.

పూలు,బొకేలు పట్రాకండి – నేనేమీ దేవుడ్ని కాను

ఆకలితో లేనుకాబట్టి పళ్ళూ మిఠాయిలు తేకండి

చలితో గడగడలాడిపోవడం లేదు – శాలువల అవసరం ఏమీ లేదు

అలా అని మీనుంచి నేనేమీ ఆశించడంలేదనుకోకండి.

లోపలకు వచ్చేటప్పుడు శుభాశీస్సులు పట్టుకురావడం మాత్రం మరచిపోకండి.”

బహుశా ఇప్పుడాబోర్డు అక్కడ వుండి వుండదు. దాని అవసరం కూడా వుండకపోవచ్చు.

(09-04-2013)

 

3, నవంబర్ 2021, బుధవారం

పతి ప్రేమకు పరీక్ష – భండారు శ్రీనివాసరావు

 

ఒక అపార్ట్ మెంటులో ఆడవాళ్ళ కిట్టీ పార్టీ జరుగుతోంది. మాటల మధ్యలో మొగుళ్ళూ, ప్రేమలూ అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. భార్య పట్ల మొగుడికి యెంత ప్రేమ వుందో తెలుసుకోవడానికి అక్కడ వున్నవాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు.
‘ఏమండీ మీరంటే నాకెంతో ఇదీ, సాయంత్రం పెందరాడే ఇంటికి రండి’ అంటూ ఎవరి మొగుళ్ళకు వాళ్ళు విడివిడిగా ఎస్ ఎం ఎస్ లు పంపారు. వచ్చిన జవాబుల్లో ఒక దానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని కూడా అనుకున్నారు. అనుకున్నట్టే వాళ్ళ భర్తల నుంచి వెంటనే తిరుగు ఎస్ ఎం ఎస్ లు వాళ్ళ సెల్ ఫోన్లకు వచ్చాయి. అవి ఇలా వున్నాయి.
“హలో స్వీటీ నీ ఒంట్లో బాగుంది కదా!”
“ఇవ్వాళ కూడా హోటల్ కూడేనా కొంపతీసి”
“ఇంటి ఖర్చులకి ఇచ్చిన డబ్బులు అప్పుడే అయిపోయాయా”
“ఏవిటి సంగతి, ఇలా గారాలు పోతున్నావు”
“నువ్వా నేనా కల కంటున్నది. ఇది నిజమేనా”
“పక్కావిడ కొనుక్కున కొత్త చీర అంతనచ్చిందా”
“ఆఫీసరు ముండావాడితో వేగలేక ఇక్కడ చస్తుంటే, బుర్ర లేకుండా ఏవిటీ వెకిలి జోకులు,”
“ఎన్ని సార్లు చెప్పాను, నీకు ఆ వెధవ సీరియల్స్ చూడొద్దని”
“గెరేజ్ లో కారు తీసి మళ్ళీ ఏ గోడకో గుద్దావా ఏమిటి, నయగారాలు పోతున్నావు”
“సాయంత్రం స్కూలు నుంచి పిల్లల్ని నేనే తీసుకు రావాలన్న మాట. అర్ధమయింది, తప్పుతుందా”
చివరికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏ మెసేజ్ కి వచ్చిందంటే:
“ఎవడ్రా నువ్వు! మా ఆవిడ మొబైల్ నుంచి మెసేజులు పెడుతున్నావు?”
(వాట్స్ అప్ లో గిరికీలు కొడుతున్న ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం)

2, నవంబర్ 2021, మంగళవారం

రూపాయి నోటుపై సంతకం

“మీరు ఎవరు? మీ సంతకం పోల్చి చెప్పడానికి ఈ బ్యాంకులో మీకు తెలిసిన ఖాతాదారులెవరయినా వున్నారా?”

కౌంటర్ లోని వ్యక్తి అడిగిన ప్రశ్నకు భూతలింగం అనే పెద్ద మనిషికి ఏం జవాబు చెప్పాలో ఒక క్షణం తోచలేదు. కాసేపట్లో తేరుకుని ‘మీ దగ్గర రూపాయి నోటు ఉందా?’ అని కౌంటర్ లో ఉద్యోగిని అడిగాడు. నివ్వెరపోవడం ఇప్పుడు అతని వంతయింది, ‘తెలిసిన వాళ్ళు వున్నారా అంటే రూపాయి నోటు అడుగుతాడేమిటి చెప్మా’ అని.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే-
ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తరువాత చెన్నై నగరానికి వచ్చి స్థిరపడ్డారు భూతలింగం అనే ఆ పెద్దమనిషి. ఆ వూరికి వచ్చిన కొత్తల్లో డ్రాఫ్ట్ మార్చుకోవడానికి బ్యాంకుకి వెడితే జరిగిన కధ అది.
భూతలింగం గారు ఉద్యోగ విరమణ చేయడానికి పూర్వం చేసిన ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి. రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.
అయన సంతకంతో వున్న రూపాయి నోట్లు చెలామణీలో వున్నాయి కాని, ఆయన సంతకాన్ని పోల్చి చెప్పడానికి ఆ భూతలింగం గారికి వేరేవారి సాయం కావాల్సివచ్చింది.
ఆయన డ్రాఫ్ట్ మార్చుకున్నారా లేదా ఇక్కడ అప్రస్తుతం. అంత పెద్ద ఉద్యోగం చేసిన భూతలింగం గారు, సాధారణ వ్యక్తిగా కౌంటర్ క్యూలో నిలబడి వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడం అన్నది ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సిన విషయం.

తవ్వి తీసిన ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

 సీ.జీ.హెచ్.ఎస్.

కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న యాభై లక్షలమంది ఉద్యోగులకు, ముప్పై లక్షలమంది రిటైర్డ్ సిబ్బందికీ సుపరిచితమైన పదం. సిబ్బంది అనారోగ్యాలకు గురైనప్పుడు ఆదుకునేందుకు ఉద్దేశించిన సెంట్రల్ గగవర్నమెంట్ హెల్త్ స్కీమ్,(C.G.H.S.)

1975 నుంచి 2005 వరకు నేను ఆకాశవాణి, దూరదర్శన్ లలోనే ఉద్యోగం చేసాను. మధ్యలో ఓ అయిదేళ్ళు మాస్కో రేడియోలో పనిచేయడం కోసం మాస్కోలో వున్నాను. ఆ సమయంలో ఓ సారి 1989లో సెలవుమీద మాస్కోనుంచి హైదరాబాదు వచ్చినప్పుడు అనుకోకుండా మా ఆవిడను ఆస్పత్రిలో చేర్చాల్సివచ్చింది. అప్పుడే కొత్తగా మొదలయిన జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ వెంకట్రామరెడ్డి గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆ రోజుల్లో మొత్తం అంతా కలిపి ముప్పై వేలు అయివుంటాయి. నేను మాస్కోలో పనిచేస్తున్నందువల్ల సీజీహెచ్ఎస్ కిందికి రానని తేల్చారు. మాస్కోలో ఆపరేషన్ చేసివుంటే మొత్తం అణాపైసలతో (రూబుళ్ళు,కోపెక్కులతో) సహా మాస్కో రేడియో భరించేది. కావున మాకు సంబంధం లేదని వాళ్లు తేల్చారు. సరే! మా ఆవిడ ఆరోగ్యం ముఖ్యం కనుకా, విదేశాల్లో ఉద్యోగం కాబట్టి ఆసుపత్రి ఖర్చు సొంతంగా పెట్టుకున్నా పెద్ద భారం కాదు కనుకా అప్పటికి ఆ అంకాన్ని అలా ముగించాము. ఆ తరువాత ఆమెకే మళ్ళీ 2009 లో మరో ఆపరేషన్. ఈసారి స్టార్ ఆసుపత్రిలో డాక్టర్ గోపీచంద్, గుండెలో వాల్వ్ మార్చి కొత్తది వేసారు. అప్పటికి నేను కేంద్ర ప్రభుత్వంలో మాజీ ఉద్యోగిని. 2005 లో దూరదర్శన్ లో పదవీ విరమణ చేసినప్పుడు సీజీహెచ్ఎస్ కార్డు రెన్యూ చేయించుకోమని వాళ్ళూ చెప్పలేదు, నేనూ చేయించుకోలేదు. ఆ విధంగా మూడు దశాబ్దాల పైచిలుకు సర్వీసులో సీజీహేచ్ఎస్ సేవలను వాడుకోగల అవకాశం నాకు ఎన్నడూ దొరకలేదు. డీడీ లో నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారు సీజీహేచ్ఎస్ కార్డు అవసరాన్ని గురించి వెంటబడి చెబితే బేగంపేట పాత ఎయిర్ పోర్ట్ పక్కన వున్న సీజీహేచ్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. ప్రభుత్వ కార్యాలయాల్లో పని పడ్డప్పుడు కానీ అవి యెలా పనిచేస్తాయన్న విషయం బోధ పడదు. కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా పని పూర్తిచేశారు. పది రోజుల్లో వచ్చి కార్డు పట్టుకుపొమ్మన్నారు. వాళ్లు చెప్పిన తేదీకి, ఇచ్చిన సమయానికి వెడితే, ఫోటో కార్డులు తయారు చేయడానికి వొప్పుకున్న ఓ చెన్నై కంపెనీ మధ్యలోనే కాడి కిందపారేసిన కారణంగా 'కార్డు బదులు ఫోటోలు అతికించిన కాగితం ఇస్తాం తీసుకెళ్ళి లామినేట్ చేసుకొని వాడుకోండ'ని సలహా ఇచ్చారు. ఆరోజు రావాల్సిన సిబ్బంది రాలేదో, లేక అక్కడ అదే రివాజో తెలియదు కాని, ఫైలు చేతికిచ్చి పలానా రూములో పలానా అధికారి సంతకం పెట్టించుకురమ్మన్నారు. ఆయన దగ్గరకు వెడితే 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు వుందే' అంటూనే సంతకం పెట్టి మళ్ళీ ఫైలు నా చేతికి ఇచ్చారు. మొత్తానికి ఆ కార్యాలయంలో ఫైళ్ళ కదలికలో నేను కూడా పాలు పంచుకుని, ఇచ్చిన కాగితం పట్టుకుని, నేను సయితం సర్కారు ఆఫీసుల్లో పనులు చేసుకుని రాగలనన్న గర్వంతో బయట పడ్డాను.

కొసమెరుపు: ఇందులో ఏముంది అందరిలా మీదీ ఓ అనుభవం అంటారేమో. కానీ వుంది. బయటకు వచ్చిన తరువాత ఆ కాగితాన్ని తేరిపార చూస్తే 'VALID UPTO : 01-01-2099' అంటే అప్పటికే ఏడుపదులకు దగ్గర పడిన నేను మరో 80 ఏళ్ళకు పైగా ఈ కార్డు వాడుకోవచ్చు అన్నమాట.

ఆరోగ్య సేవల పధకం కదా! దీర్ఘాయుష్మాన్ భవ! అని దీవిస్తూ ఇచ్చివుంటారని సరిపెట్టుకున్నాను.

 

1, నవంబర్ 2021, సోమవారం

ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి….భండారు శ్రీనివాసరావు


నిప్పు ఉప్పులాంటి ఇద్దరు రాజకీయ పార్టీల ప్రతినిధులు టీవీ తెరలపై చాలాకాలంగా ఒకరిపై ఒకరు, ఒకరి పార్టీపై మరొకరు నిప్పులు చెరుగుతూ విమర్శలు చేసుకునేవారు.
కొంతకాలం తర్వాత, సరైన సమయం చూసుకుని పార్టీలు కూడా మారిపోయారు. పైగా ఆయన ఈ పార్టీలో, ఈయన ఆ పార్టీలో.
ఇన్నేళ్ళుగా వినిపించిన వారి వాదనలు కూడా చిత్రంగా మారిపోయాయి. అప్పటివరకు తాము ప్రాతినిధ్యం వహించిన పార్టీని చీల్చి చెండాడం, తమ నోటితో దూషించిన పార్టీని నెత్తికెత్తుకుని నాలుక మడతేసి మాట్లాడడం చూస్తూ నివ్వెరపోయిన ఓ విశ్లేషకుడు తేనీటి విరామ సమయంలో తన సందేహాన్ని బయట పెట్టాడు, ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నారు అని.
దానికి వారు వేర్వేరుగా జవాబు ఇచ్చినప్పటికీ సారాంశం మాత్రం ఒక్కటే.
“ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సింది ఏముంది?
“మీరు ఎన్టీఆర్ సావిత్రి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలు చూశారా! వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళుగా నటించిన రక్త సంబంధం సినిమా కూడా చూసే వుంటారు. నాయకీ నాయకులుగా ప్రేమ సన్నివేశాల్లో ఎంత తాదాత్మ్యంగా నటించి ప్రేక్షకులను ఎలా మెప్పించారో, ఏకోదరులైన అన్నా చెల్లెళ్లుగా అదే స్థాయిలో అనురాగం, ఆత్మీయత కురిపించి, ప్రేక్షకులను ఒప్పించారు. అలాగే మేము. వాదించే విధానాన్ని బట్టే మాకు డిమాండ్ వుంటుంది. ఇంకా అర్ధం కాకపొతే ఎప్పటికీ మీకు అర్ధం కాదు”
ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక అర్ధం కాకుండా ఎలా వుంటుంది చెప్పండి!
(01-11-2021)

పాత్రికేయ దిగ్గజం పొత్తూరివారికి జీవన సాఫల్య పురస్కారం

(ఏపీ ప్రభుత్వం సీనియర్ పాత్రికేయులు కీర్తిశేషులు పొత్తూరి వెంకటేశ్వరరావు గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని ఆయన మరణానంతరం వారి కుమారులకు అందించిన సందర్భంలో వారి యాదిలో...)
‘ఒక పత్రిక ఎడిటర్ అనేవాడు ఎలావుంటాడు? ఎలా వుండాలి?’ అని కళ్ళుమూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు కనబడే రూపమే శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు.
తెలంగాణా ముఖ్యమంత్రి సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు నేనూ కలిసి నాలుగేళ్ల క్రితం పొత్తూరి వారి ఇంటికి వెళ్లాం. వారు రాసిన ‘బులేనా’ పుస్తకం సంతకం చేసి ఇచ్చారు.
‘ఎలా వున్నారు, ఆరోగ్యం ఇప్పుడు కులాసా కదా’ అని మేము అడగడం తప్పిస్తే, ఆయన అంతట ఆయన తన అనారోగ్యం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు.
ఎంతో ఖరీదయిన వైద్యం. మామూలు మందులు కాక అదనంగా మూడు వారాలపాటు రోజుకొక కాప్స్యూల్ వేసుకోవాలి. ఒక్కొక్కటి అక్షరాలా వెయ్యి రూపాయలు. సాదా సీదా అట్టపెట్టెలోవున్న ఆ మాత్రల బాటిల్ ఇరవై వేల రూపాయలు అంటే నమ్మ బుద్దికాలేదు, కానీ కళ్ళెదుట కనబడుతున్న వాస్తవం అది.
వున్న ఆ కొద్ది సమయంలోనే ఆయన ఎన్నో కబుర్లు చెప్పారు. ప్రత్యేకతెలంగాణా ఉద్యమం కొన్ని దశాబ్దాల క్రితం సికిందరాబాదులోని ఒక హోటల్లో ఎలా ఊపిరి పోసుకున్నదో చెబుతూ ఆనాటి విశేషాలు వివరించారు.
ఇంట్లో పెంచుకుంటున్న ఈశ్వర నామం కలిగిన ఒక మొక్కను చూపించారు. పచ్చటి వర్ణం కలిగిన ఆకులు. వాటి మీద కపిల వర్ణంలో ‘నాగుపాము పడగ’ మీద వుండే కృష్ణ పాద ముద్రలు. ఆ మొక్క చాలా అరుదుగా దొరుకుతుందట. ఆ మొక్క వుంటే పాములు ఆ దరికి కూడా రావట. ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఈ మొక్కను గుర్తించగలరట. ప్రాచీన ఔషధీ శాస్త్రంలో ఇటువంటివి ఎన్నో వున్నాయని చెప్పారు.
నిజం కావచ్చు. నిజం కాదని నమ్మే వాళ్ళూ వుంటారు.
నమ్మేవారు మొక్కితే, రాయే సాయి, నమ్మనివారు తొక్కితే, అదే రాయి.
అదలా ఉంచి వెంకటేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన కొన్ని విశేషాలు నెమరు వేసుకుందాం.
ఈనాటి పత్రికారంగం వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు వాటిల్లో వున్నాయి.
పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?
ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.
అయితే దాన్ని గురించి ఒక పాత విషయం చెప్పారు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాల నాటి సంగతి.
అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.
విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై, రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్ ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్, చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు. పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి ఒక నివేదిక పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు.
గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు.
“నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా.
ఇంకా ఇలా అన్నారు.
“మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి”
ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు.
అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు.
గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు.
“మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి”
పొత్తూరివారి ఆరోగ్యం బాగాలేదని జ్వాలా ద్వారా తెలుసుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు స్వయంగా పొత్తూరి వారిని చూడడానికి విజయనగర్ కాలనీలోని వారి ఇంటికి వెళ్ళారు. అక్కడి పరిస్తితిని ఓ కంట గమనించిన కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. వారికి పూర్తి స్వస్థత చేకూరేవరకు ఆ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినప్పటికీ, సుదీర్ఘ కాలం ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపిన నేత అయినప్పటికీ ప్రాంతీయతత్వం ఏ కోశానా లేని కేసీఆర్, పొత్తూరి వారిని ఒక పాత్రికేయుడుగా గుర్తించారు కాని, అయన ఏప్రాంతం వారనే వివక్ష చూపలేదు. ఆయనలోని ఈ విలక్షణత్వం పొత్తూరివారికి కూడా తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు విలువలకు కట్టుబడి జీవిస్తూ వచ్చిన పాత్రికేయుడాయన. అంచేత కేసీఆర్ సాదరంగా ఇవ్వచూపిన సాయాన్ని వారు సున్నితంగా తిరస్కరించారు.

(01-11-2021) 





అమ్మకు వందనం


శ్రావణ మాసం అనగానే మా అందరికీ నువ్వే గుర్తుకు వస్తావు. జరిగి దాదాపు ముప్పయ్యేళ్ళు కావస్తున్నా ఆ రోజు మా అందరికీ ఇంకా బాగా జ్ఞాపకం వుంది. శుక్రవారం నోముకు అంతా సిద్ధం చేసుకున్న నలుగురు కోడళ్ళు, ఏ నిమిషాన ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో నీ పిల్లలం నలుగురం.
కోడళ్ళని కన్న కూతుళ్ళుగా చూసుకున్న నువ్వు వారి నోముకు అడ్డం ఎలా వస్తావు. పూజలు పూర్తయి, ముత్తయిదువులకు తాంబూలాలు ఇవ్వడం అయిపోయిన తరువాత కానీ నువ్వు దాటిపోలేదంటే అది నీ అవ్యాజ ప్రేమకు నిదర్శనం. ఆ రుణంతీర్చుకోలేనిది.
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యావత్ కుటుంబం కాశీ వెళ్లి అంతిమ సంస్కారాల క్రతువు ముగించడం అన్నది నీ ఒక్క విషయంలోనే జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు నీ ఆబ్దీకం అనేది చుట్టపక్కాలు అందరికీ ఒకచోట కలుసుకునే సందర్భంగా మారిపోయింది. మన ఇంట నలుగురూ కలిసి జరుపుకునే పర్వదినంగా పవిత్రతను సంతరించుకుంది.
నువ్వు ధన్యజీవివి. నీ కడుపునపుట్టి మేము కూడా ధన్యులమయ్యాం.
ఈరోజు నీ పుట్టిన రోజున నిన్ను స్మరించుకుంటూ...