16, ఆగస్టు 2021, సోమవారం
వాగ్ధాటికి మారుపేరు వాజ్ పాయ్
15, ఆగస్టు 2021, ఆదివారం
జాతికి ఇవ్వాల్సిన కానుక – భండారు శ్రీనివాసరావు
(ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)
దసరా, దీపావళి, సంక్రాంతి మొదలయిన పండగల సరసన చేర్చదగిన జాతీయ పర్వదినాలు ఆగస్టు పదిహేను, జనవరి యిరవై ఆరు.
పంద్రాగష్టును మొదటిసారి పండుగ రూపంలో స్వతంత్ర భరతజాతి యావత్తు ఒక్కటై జరుపుకున్ననాటికి నేను నెలల బిడ్డని. రెండో పండగ, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాన్ని తొలిసారి జరుపుకున్నప్పుడు నా వయస్సు అటూఇటుగా నాలుగేళ్ళు. అంటే దాదాపు నాతోపాటే పెరిగి పెద్దవుతూ వచ్చిన పర్వదినాలు ఇవి.
నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరిలో పాల్గొనే వాళ్ళం.
ప్రభాత్ భేరి అనే మాటకు అర్ధం తెలియని వయసు. అయినా అలా ఊరేగింపుగా బయలుదేరి 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది. 'జనగణమన' గీతంలో ఏఏ భాషల ప్రస్తావనవుందో, ఏఏ ప్రాంతాల ప్రసక్తి వుందో మాకు అప్పటికి తెలియదు. ఆ గీతాన్ని ఎవరు రాసారో, ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం.
జనగణమన చరణాలలోని 'న' ను 'న' లాగా, 'ణ' ను 'ణ' లాగా, తప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే అప్పుడు మాకు తెలిసింది. ఢిల్లీ ఎక్కడ వుందో తెలియదు, ఎర్రకోట అంటే తెలియదు, కానీ దానిపై చాచా నెహ్రూ జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.
అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?
'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలి' అంటే, ‘కాసేపు పడుకోనీ మమ్మీ, ఈ రోజు సెలవే కదా!' అని పిల్లలు నసిగే రోజులు వచ్చేసాయి. పండగదినం స్థానంలో సెలవురోజు వచ్చింది. తప్పులు లేకుండా ‘జనగణమన' పాడడం పోయి ఆ గీతంలో తప్పులెన్నే రోజు వచ్చింది. భారతీయ జండాకు బదులు మరో జండా ఎగురవేస్తామనే వితండవాదం కూడా పుట్టుకొచ్చింది. ఏటేటా జరిగే పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగా మారిపోయాయి. ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయం మధ్య, నిఘా పోలీసుల డేగ కళ్ళ పహరాల నడుమ , జాతీయ పండుగలు జరుపుకునే దుస్తితి దాపురించింది.
సైనిక కవాతులు, శస్త్రాస్త్ర ప్రదర్శనలు, భారీ టాంకులు, వైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతను, జాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే, మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి విషాదం?
శాంతి భారతంగా పేరొందిన భారతదేశంలో ఈనాడు ఎక్కడ ఏమిజరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్తితి పొటమరించడం యెంతటి దారుణం?
మతమన్నది మనకంటికి మసకయితే
గతమన్నది మనకంటికి కురుపయితే
మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు అన్న సూక్తులను వొంటబట్టించుకుని ఎదిగిన ఓ తరం వారు, ఈనాటి పరిస్తితులను చూసి, 'మనం కోరుకున్న స్వేఛ్చాభారతం ఇదేనా అని మధనపడాల్సిరావడం మరెంతటి దుస్తరం?
మతాల దురభిమానాలతో, కులాల కుంపట్లతో, ప్రాంతీయ ద్వేషాలతో దేశం యావత్తు అడ్డంగా నిలువుగా చీలిపోతుంటే,
స్వార్ధమే పరమావధిగా, సంపాదనే ఉపాధిగా, అడ్డదారుల్లో అందినంత స్వాహా చేయడమే అంతిమ లక్ష్యంగా , నీతికి దూరంగా, అవినీతికి ఆలంబనగా తయారయిన రాజకీయ దళారులంతా కలసి కుమ్మక్కై జాతి సంపదను నిస్సిగ్గుగా కొల్లగొడుతుంటే,
జనరంజకంగా పాలించాల్సిన అధికార యంత్రాంగం లంచాల మత్తులోపడి ప్రజల రక్తం పీలుస్తుంటే,
రాజ్యాంగం ఏర్పరచిన అన్ని వ్యవస్థలు, మారుతున్న కాలానికి అనుగుణంగా విలువలను నిలువు పాతర వేసి కుప్పకూలి కునారిల్లుతున్న సమయంలో, ‘నేనున్నానంటూ’ జనాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన మీడియా సయితం, తానూ ఆ తానులో ఓ ముక్కగా మారిపోతుంటే,
జనం నిస్సహాయంగా నిలబడి చూడాల్సి రావడం యెంత విషాదం, యెంత దారుణం, యెంత దుస్తరం, యెంత బాధాకరం?
అయితే ఏమిటట?
నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే, ప్రపంచం గర్వించదగిన గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు ఈ ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా, ఎంచుకున్న మార్గంలోనే అప్రతిహతంగా పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్థా నాన్ని పదిలం చేసుకుంది.
జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'ఓటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం.
అక్షరజ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' వారి ఆస్తి.
గిద్దెలు, సోలలు, శేర్లు, సవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది.
వీసెలు, మణుగుల తూకాల నుంచి కిలోగ్రాములకు, బస్తాలనుంచి క్వింటాళ్లకు, 'మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా ఇంకా 'మైలు'రాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేనివాళ్లనీ, ఎందుకూ పనికిరాని వాళ్ళనీ మనపై ఇతర దేశాల వారికి చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్లు, దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో ఓటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత ఒకే బాలట్ పేపరుపై ముద్రించిన అనేక పార్టీల గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే గుర్తుపట్టి ఓటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు.
'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం' అనే నిర్లిప్తస్థితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగా, ప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.
'చందమామ రావే' అంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్' వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితి తప్పించుకుని స్వయంసమృద్ధిని సాధించుకోగలిగాము.
ఏ ఇంగ్లీష్ వారితో తలపడి, అహింసా మార్గంలో వారితో పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో, ఆ ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని, దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.
అయితే , 'అంగట్లో అన్నీవున్నా అల్లుడి నోట్లో శని' అన్న సామెత చందంగా ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది. స్వతంత్ర భారతం ఆలపిస్తున్న స్వేఛ్చా గీతికల్లో వుండి వుండి అపశ్రుతి వినబడుతోంది.
వెడుతున్న దోవ మంచిదే. కానీ, నడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. కాలికి కాలే అడ్డంపడి గమ్యాన్ని మరింత దూరం చేస్తున్నాయి.
విభిన్న స్వరాలతో వినిపిస్తున్న సందేశం మంచిదే. కానీ మధ్య మధ్య వినబడుతున్న అపస్వరాలు అసలు అర్ధాన్నే మార్చివేస్తున్నాయి.
అందరూ మంచివాళ్ళే. కానీ మానసిక కాలుష్యమే వాళ్ళ మంచితనాన్ని మంచులా కరిగించి వేస్తోంది. హరించి వేస్తోంది.
స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగా, ధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా, అవలక్షణలక్షిత సమాజం కళ్ళముందే ఆవిష్కృతమవుతోంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమయిన పరిణామాలు అనివార్యం, అతి సహజం. కానీ అవి తాత్కాలికం కావాలి. శాశ్వతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం అందరిదీ.
ఒకరిపై మరొకరు నెపాలు మోపకుండా, తప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం. అభివృద్ధి సురుచిర సాధ్యం.
భారత స్వాతంత్ర దినోత్సవ శుభసమయంలో మనమందరం జాతికి కలసికట్టుగా ఇవ్వాల్సిన కానుక అదే.
(15-08-2021)
ఇలా కూడా చెప్పొచ్చు
ఎర్రకోట మీదనే ఎందుకు?
మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 న జరిగిన మొదటి జెండా వందనం ఎర్రకోట బురుజుల నుంచి జరగలేదు. పండిట్ నెహ్రూ పదిహేనవ తేదీనే ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వెంట ఆ నాటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ కూడా వున్నారు. ఆ బహిరంగ కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. సుమారు అయిదు లక్షల మంది ఆ ప్రాంతానికి ఉత్సాహంగా చేరుకున్నారు. వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము కావడంతో పోలీసులు చేతులు ఎత్తేసారు. కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన అనేకమంది విదేశీ దౌత్య వేత్తలు, మంత్రులు, ఇతర ప్రముఖులు, జన సందోహంతో నిండిపోయిన ఆ ప్రదేశానికి చేరుకోలేక వెనక్కి మళ్ళాల్సి వచ్చింది. ఆ జన సమ్మర్దంలో తప్పిపోయిన పిల్లలను వెతికే కార్యక్రమంలో నెహ్రూ, మౌంట్ బాటెన్ కూడా ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
14, ఆగస్టు 2021, శనివారం
నాస్తికవాద ప్రబోధి శ్రీ లవణం – భండారు శ్రీనివాసరావు
(ఈరోజు లవణం గారి వర్ధంతి)
13, ఆగస్టు 2021, శుక్రవారం
మంచి పలుకు
శ్రీ పీఠం ఆద్యాత్మిక మాస పత్రిక తాజా సంచికలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచించిన సుభాషితం:
జయాలకు అపజయం లేదు – భండారు శ్రీనివాసరావు
(గురువారం
నాడు శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన జి.ఎస్.ఎల్.వి. ఎఫ్.10 వైఫల్యం గురించిన వార్తలు
విన్నప్పుడు గుర్తుకువచ్చిన పాత సంగతి)
1987, మార్చి నెల
ASLV-1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి, గవర్నర్ కుముద్ బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్
టెర్రేస్ మీద నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆసీనులయివున్నారు. భారత
దేశానికి గర్వకారణం కాగల ఈ ప్రయోగాన్ని కళ్ళారా చూడడానికి సుమారు పదివేలమంది
ప్రేక్షకుల గేలరీలో వేచి వున్నారు.
అనుకున్న సమయానికి రాకెట్
ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ రాకెట్ గగనంలోకి దూసుకుపోయింది. రాకెట్ పైకి లేస్తుండగానే
వారందరూ ఒకరికొకరు అభివాదాలు తెలుపుకుంటూ, కరచాలనాలు
చేసుకుంటూ ఉద్విగ్నంగావున్న సమయంలో జరగరానిది జరిగిపోయింది. ప్రయోగించి నిమిషం
కూడా గడవకముందే రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. ఒక్క లిప్తపాటు భయంకర నిశ్శబ్దం.
అందరి మొహాల్లో ఆనందం తప్పుకుంది. విషాదం అలముకుంది.
రాజీవ్ గాంధి అందరికంటే ముందు
తేరుకున్నారు. ఇస్రో అధికారులను, సిబ్బందిని అనునయించారు. ఇటువంటి
శాస్త్రీయ ప్రయోగాలలో విజయాలే తప్ప, అపజయాలు
ఉండవన్నారు. ముందుకు దూసుకుపోవడానికి ఇదొక అవకాశంగా భావించాలని ధైర్యం చెప్పారు.
అలా పోగుపడిన ధైర్యమే ఈనాడు ఇస్రో
బృందాన్ని ప్రపంచ రికార్డు సొంతం చేసుకునేలా చేసింది.
అక్షరాలా నూట నాలుగు ఉపగ్రహాలను ఏక
కాలంలో అంతరిక్షంలోకి పంపేలా చేయగలిగింది.
నిజమే. అంతకు ముందు తెలియని విషయాలను
కనుగొనేముందు ఎన్ని అపజయాలు ఎదురయినా శాస్త్రవేత్తలు వెనక్కి తగ్గక పోవడం వల్లనే
ఈనాడు ప్రపంచానికి ఇన్ని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు అందుతున్నాయి. మొదటి
వైఫల్యానికే చతికిల పడివుంటే ఇప్పుడూ అక్కడే వుండేవాళ్ళం.
కాబట్టి గురువారం ప్రయోగం విఫలం
అయిందని కుంగిపోనక్కరలేదు. ఆ వైఫల్యం మరో ఘన విజయానికి సోపానం కావాలని కోరుకుందాం!