4, మార్చి 2021, గురువారం
Senior Journalist Bhandaru Srinivas Rao about YS Sharmila Party in Telan...
3, మార్చి 2021, బుధవారం
కోవిడ్ టీకాపై అవగాహన కోసం.....
కోవిడ్ టీకా వేయించుకునే వారికోసం, టీకా
వద్దు అని సందేహపడే వారి కోసం ఈ పోస్టు.
ఈరోజు నేను ఈ టీకా వేయించుకున్నాను. వేయించుకుని
కూడా చాలా గంటలు గడిచిపోయాయి. సమగ్రమైన పోస్టు పెడదాం, ఈలోపల
టీకా విషయంలో నాకున్న సందేహాలు (After effects వంటివి) తొలగిపోవడానికి సమయం దొరుకుతుంది అనే ఉద్దేశ్యంతో
కొంత ఆలస్యం చేసిన మాట నిజం.
మరో నిజం కూడా చెప్పాలి. ఈరోజు ఉదయం వరకు టీకా
తీసుకోవాలనే ఉద్దేశ్యం కూడా లేదు. దాదాపు ఏడాదిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు
ఇప్పుడీ టీకా గొడవ ఎందుకులే అని సంక్షేపించిన మాట కూడా వాస్తవం.
అయితే గత రెండు రోజులుగా అనేక వాట్సప్ గ్రూపుల్లో
నాకు తెలిసిన అనేకమంది టీకా వేయించుకున్నట్టు పోస్టులు పెట్టారు. ఇంకా చిత్రం
ఏమిటంటే వీరిలో ఓ పాతిక ముప్పయిమంది దాకా
మా దగ్గరి చుట్టపక్కాలే వున్నారు.
ఇక మనం మాత్రం ఎందుకు లేటు చేయాలి అని మామూలు ప్రొసీజర్
ఫాలో అయి ఓ ఇరవై మందిమి రిజిస్టర్ చేయించుకున్నాము. ఇందులో జ్వాలా కుటుంబం వుండడం
మాకు కలిసి వచ్చింది. పబ్లిక్ హెల్త్ శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు గారు సహాయ
హస్తం అందించారు.
పదకొండున్నర ప్రాంతంలో అందరం అక్కడ జమ
అయ్యాము. చక్కటి పకడ్బందీ ఏర్పాట్లు
చేశారు. ఆధార్ కార్డు, PAN
కార్డు నెంబర్లు తీసుకుని, ఓ ఫారం మీద మూడు
సంతకాలు, వేలి
ముద్ర పెట్టించుకుని ఒక చీటీ ఇచ్చారు. అది
తీసుకుని వేరే కౌంటర్ వద్దకు వెడితే బీపీ చెక్ చేసి మరో కౌంటర్ లో మొబైల్ నెంబరు వివరాలు రాసుకున్నారు. పక్కనే వున్న
మరో కుర్చీలో కూచోబెట్టారు. మంజుల అనే ఓ లేడీ
నర్స్ వచ్చి భుజం మీద ఇంజెక్షన్ చేసి చాలా సున్నితంగా టీకా మందు ఇచ్చారు. సూది చాలా సన్నగా వుంది. ఏమాత్రం నొప్పి
అనిపించలేదు. టీకా ఇవ్వగానే వేలి మీద
ఓటరుకు పెట్టినట్టు చుక్క గుర్తు వేశారు. పక్కన గదిలో కాసేపు కూర్చోమని చెప్పారు.
తాగేవారికి తేనీరు ఇచ్చారు. ఓ అరగంట
తర్వాత వెళ్ళిపోయి, ఇరవై ఎనిమిది రోజులు
విరామం ఇచ్చి ఇరవై తొమ్మిదో రోజున వచ్చి, మళ్ళీ రెండో డోసు టీకా తీసుకోమని చెప్పారు. దీనికి
సంబంధించి సెల్ ఫోన్
మెసేజ్ పంపుతారు. టీకా వేసిన చోట
దద్దురు రావడం కానీ, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలు మాకే కాదు, ఈరోజు
మాతో పాటు టీకా వేయించున్న ఏ ఒక్కరికీ
ఎదురవ్వలేదు. టీకా వేయక ముందు అందరి మొహాల్లో కనిపించిన ఆందోళన, వేసిన తర్వాత
మచ్చుకు కూడా కనిపించ లేదు. ప్రతి ఒక్కరూ
సంతోషంతో ఇళ్లకు వెళ్ళిపోయారు. మేము కూడా హాయిగా ఇళ్లకు తిరిగి వచ్చి భోజనాలు చేశాము. మా
బ్యాచ్ సంఖ్య పెద్దది కావడం వల్ల కొంచెం
ఎక్కువ సమయం పట్టింది. చిన్న కుటుంబం అయితే గంటలో అయిపోయేదేమో. రెండు డోసులు పూర్తయిన
తర్వాత కోవిడ్ టీకా సర్టిఫికేట్ జారీ చేస్తారు.
కరోనా కట్టడి విషయంలో ముఖ్యంగా కోవిడ్ టీకాల
విషయంలో కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాల నడుమ అత్యంత చక్కని సమన్వయం నాకక్కడ కనపడింది.
చివర్లో చెప్పేది ఒక్కటే.
టీకా తీసుకోవడానికి ముందు పాటించాల్సింది ఏమిటి
అంటే అది ఒక్కటే.
“భయ సందేహాలను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లి
టీకా వేయించుకోండి”
(03-03-2021)
2, మార్చి 2021, మంగళవారం
కన్నీరు తెప్పించిన కదిలే ఫోటో
మా మూడో అన్నయ్య మనుమడు శైలేష్, చనిపోయిన మా ఆవిడ ఫోటోకు జీవం పోసి అమెరికా నుంచి నాకు గిఫ్ట్ గా పంపాడు. థాంక్స్ రా శైలేష్!
blob:https://web.whatsapp.com/42775b27-1064-4ed5-bee8-be0e07f7ced5
రాజకీయాల్లో ఇంత డబ్బు ఉందా?
మేకు జోకు - జోకు మేకు - భండారు శ్రీనివాసరావు
కొన్ని సందర్భాలలో జోకు మేకయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొన్ని జోకులు ఆడవారి మీద పేలిస్తే అవి రివర్స్ లో తగిలే ప్రమాదం వుంది. కాకపోతే ఇలాటి జోకులన్నీ స్త్రీ స్వాతంత్రం ఎక్కువగా వున్న దేశాల్లోనే ఎక్కువగా పుట్టి మన దగ్గరికి దిగుమతి అయ్యాయి. ఆ పరాయి జోకుల్ని సొంత భాషలోకి అనువదించాలనే ఉత్సాహపరులకి కొండొకచో కొన్ని పాట్లు (కామెంట్లు) తప్పవు. అయినా సరే, కామెంట్లే కదా సర్దిపుచ్చుకుందాం అని అనువాదం చేస్తే ఇదిగో ఆ జోకులు ఇల్లా వుంటాయి.
అమెరికా తండ్రికి కూతురు ఫోను చేసి
చెప్పింది.'సారీ డాడ్. నిన్న అనుకోకుండా నేను
పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నీకు ఫోన్ చేసి చెప్పే టైం లేకపోయింది'
తండ్రి: పర్వాలేదులే. మళ్ళీ ఇలాటి సందర్భం రాకపోదులే. అప్పుడు మాత్రం గుర్తుంచుకుని కబురు చెయ్యి'
ఇండియా పిల్లాడు తన అమెరికన్
స్నేహితుడితో చెప్పాడు, ' నాకు నలుగురు అక్కయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళు మరి నీ సంగతేమిటి?'
'నాకా! నాకు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు
ఎవ్వరూ లేరు. కాకపోతే నా మొదటి అమ్మద్వారా నలుగురు నాన్నలు, మొదటి నాన్న ద్వారా ముగ్గురు అమ్మలు'
"ఆడవాళ్ళు ముగ్గురి మాటే చెవిపెట్టి వింటారు. అంతే కాదు, వారు
చెప్పిన మాటలు అక్షరాలా ఆచరిస్తారు. అని ఓ మగ
పిశాచి ఉవాచ.
ఆ ముగ్గురు ఎవ్వరంటే ఒకడు టైలర్, రెండోవాడు ఫోటోగ్రాఫర్, మూడో వ్యక్తి బ్యుటీషియన్. వీళ్ళు
ముగ్గురు కాకుండా తలకిందుగా తపస్సు చేసినా సరే, ఆడంగులు
ఈ భూప్రపంచంలో ఎవ్వరి మాట వినరుగాక వినరు. కాకపోతే
కొందరు విన్నట్టు నటిస్తారుట"
1, మార్చి 2021, సోమవారం
ఇది నా జీవితం. కధకాదు.
అంచేత సాఫీగా
ఎలాంటి ముడులు, ఎత్తుగడలు లేకుండా చెబుతాను.
అసలు ఇలాంటి
విషయాలు మనసులో పెట్టుకోవాలి. కాగితం మీద పెట్టేవి కావనే స్పృహ లేనివాడిని కాదు.
కానీ పంచుకునే మనిషి మాయమై పోయింది. మంచీ చెడూ చెప్పే తోడు లేకుండా పోయింది. పిల్లలు, కోడళ్ళ పుణ్యమా అని కరోనా కాలంలో కూడా జీవితం సాఫీగా గడిచిపోతోంది. దేనికీ
లోటు లేదు, ఎవరూ తీర్చలేని ఆ
ఒక్క లోటుతప్ప. ఆదివారం సామాను సదిరే కార్యక్రమంలో ఓ కపిలకట్ట బయట పడింది. అందులో
ఏముంటాయో నాకు తెలుసు కాని మా అబ్బాయికి, కోడలికి తెలియదు. దాన్ని నేను పదిలంగా
తీసుకుని భద్రపరచుకున్నాను. మా ఆవిడకు అదంటే ప్రాణ సమానం. మేము మాస్కో వెళ్ళినా
మాతోటే వచ్చింది. తిరిగి మాతోటే ఇండియా వచ్చింది. హైదరాబాదులో ఎన్నో ఇళ్ళు మారినా
అది మాత్రం తను మరచిపోకుండా వెంట తెచ్చుకునేది. అందులో బంగారం ఏమీ లేదు. బంగారం లాంటి ఉత్తరాలు ఉన్నాయి. మా పెళ్ళికి
పూర్వం, యాభయ్ మూడేళ్ల క్రితం, రెండు మూడేళ్ళ
పాటు మా మధ్య ఉత్తరాయణం నడిచింది. నేను రాసినవన్నీ ఆవిడ దగ్గర భద్రంగా వున్నాయి.
తను రాసిన వాటిలో కొన్నే నా దగ్గర మిగిలాయి.
మిమ్మల్ని ఇలాంటి
వ్యక్తిగత విషయాలతో విసిగించడం నా ఉద్దేశ్యం కాదు. ప్రేమించిన ఆడదాని హృదయం ఎంత
గొప్పదో, అది ఎంతటి ఉదాత్త ప్రేమో చెప్పడం కోసమే ఈ ప్రయత్నం.
ఆమె రాసిన
వాటిల్లో అణువణువూ ప్రేమమయం. నా ఉత్తరాలు అన్నీ డాబుదర్పం. పెళ్ళయిన తర్వాత ఎలా
మెలగాలి, అత్తగారు, ఆడబిడ్డలతో ఎలా వుండాలి ఇలా అన్నమాట. నిజానికి అలా నిర్బంధించే అధికారం
నాకేమి వుంది. ఆమె నన్ను ప్రేమిస్తోంది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. అంతే! అలాంటప్పుడు నా ఈ పేను పెత్తనం ఏమిటి? అవి చదివి ఎంత
నొచ్చుకుని వుంటుంది. అయినా నన్ను పెళ్ళాడింది అంటే అది ఆమె గొప్పతనమే. ఇప్పుడు
తలచుకుంటే చాలా చిన్నతనం అనిపిస్తుంది.
నన్ను మన్నించు!
నన్ను క్షమించు ! అని ఎంతగా గొంతు చించుకున్నా నా మాటలు వినబడనంత దూరానికి వెళ్ళిపోయింది.
28, ఫిబ్రవరి 2021, ఆదివారం
ఓ కప్ప కధ
అనగనగా ఓ కప్ప. ఆ కప్పకు ఓ రోజు చెట్టెక్కాలని బుద్దిపుట్టింది. అనిపించిందే తడవు, నున్నగా సన్నగా వున్న ఓ చెట్టు చూసుకుని ఎక్కడం మొదలెట్టింది. మిగిలిన కప్పలు చుట్టూచేరి, 'వద్దు వద్దు, చెట్లెక్కడం మన ఇంటా వంటా లేదు. అందులోను అంత పొడుగు చెట్టు అసలెక్కలేవు. అక్కడినుంచి పడ్డావంటే జనాభా లెక్కల్లో లేకుండా పోతావు, దిగిరా దిగిరా' అని నిరుత్సాహపరుస్తూ బావురుమంటూ వెంటపడ్డాయి. అయినా లెక్కచేయకుండా ఆ కప్ప అమాంతం ఆ చెట్టెక్కి కూర్చుంది.
యెలా?
యెల్లా అంటే, ఆ కప్ప చెవిటిది.
ఒక్క ముక్కా వినబడదు. అందుకే తోటికప్పలు
బావురు బావురుమంటూ, 'వద్దు వద్దం'టూ ఇచ్చే ప్రతికూల సలహాలు దాని చెవికెక్కలేదు. అందుకే హాయిగా
చెట్టెక్కగలిగింది.
ఈ కప్ప కధలోని
నీతి ఏమిటంటే ఏ పనిచేయబోయినా 'వద్దు వద్దు ఆ పని
నువ్వు చెయ్యలేవు' అని నిరుత్సాహపరిచే వాళ్ళే ఎక్కువ వుంటారు.
సాహసాలు చేసేవాళ్ళు అలాటి మాటలు చెవిన పెట్టకూడదు. ఎవరేమన్నా ముందు అనుకున్న రీతిలోనే ముందుకు సాగిపోవాలి.