10, డిసెంబర్ 2020, గురువారం

విని వూరుకున్నంత సుఖం లేదు - భండారు శ్రీనివాసరావు

 Long long ago, So long ago, Nobody can say how long ago అనగా ....

ఒకానొక కాలంలో నేను టీవీ చర్చలకు క్రమం తప్పకుండా అనుదినం వెడుతుండే బంగారు కాలంలో ఒకానొక రోజు...

టీవీ చర్చల విరామసమయంలో లేదా చర్చలకు, ముందూ తరువాత జరిగే తేనీటి సమావేశాల్లో చర్చలకు వచ్చిన రాజకీయ నాయకుకులు అనేక ఆసక్తికరమైన విశేషాలు చెబుతుంటారు. వాటిల్లో నిజంపాలెంతో తెలియదు కాని, విన్నప్పుడు నిజమేనేమో అనిపించేలా వుంటాయి ఆ కబుర్లు. అలాటి ఉదంతం ఒకటి.

చాలా ఏళ్ళ కిందటి సంగతి. అధికార పార్టీలో పైకి వచ్చిన నాయకుడొకరు, అప్పుడప్పుడే పైకి వస్తున్న మరో ఛోటా నాయకుడికి రాజకీయ గీతాబోధ చేసాడిలా.

'నాయనా! రాజకీయాల్లో పైకి రావడానికి ఎన్నో కావాలి. కానీ నా అనుభవం మీద చెబుతున్నాను. అన్నింటిలోకి అతి ముఖ్యమైనది మీడియా మేనేజిమెంటు'

'మేనేజిమెంటు అంటే ఏమిటి గురువుగారూ?' అడిగాడు ఛోటా నాయకుడు.

'అది తరువాత చెబుతా కాని మన జిల్లా రిపోర్టర్ పలానా వాడు వున్నాడు చూసావు కదా. అతడికేదో డబ్బవసరం పడినట్టువుంది. నేను ఇచ్చానని చెప్పి ఈ ఇరవై వేలు అతడికి ఇచ్చిరా. అలాగే, మన సీఎం గారి కారు డ్రైవర్ వున్నాడు తెలుసు కదా! అతడింటికి వెళ్ళి ఈ ఇరవై వేలూ నేనిచ్చానని చెప్పి ఇచ్చేసిరా' అన్నాడు.

ఛో.నా., బ. నా. చెప్పినట్టే వెళ్ళి చెప్పిన పని చప్పున చేసేసి తిరిగొచ్చిఆ సంగతి చెప్పాడు. చెప్పి తన మనసులో తొలుస్తున్న సందేహం బయట పెట్టాడు.

'రిపోర్టర్ కు ఇవ్వమన్నారు. సరే. బాగుంది. వాళ్ళకు మనతో, మనతో వాళ్లకు సవాలక్ష పనులుంటాయి. కానీ సీ ఎం గారి కారు డ్రైవర్ సంగతే నా మట్టి బుర్రకు అర్ధం అయి చావలేదు'

'అదేమరి. నేర్చుకో అని చెప్పింది అందుకే. సీఎం గారిని మన పార్టీ కార్యకర్తలు ఎక్కడ కలుస్తారు ? ఆయన కారు ఎక్కుతున్నప్పుడో, దిగుతున్నప్పుడో కదా! మామూలు వాళ్ళకి అవకాశం అలాటప్పుడే దొరుకుతుంది. మరి ఆయన కంట్లో పడాలంటే సీఎం గారి కారు కాసేపు అక్కడే ఆగాలి. ఆగాలి అంటే డ్రైవర్ కారు ఆపాలి. ఆపాలి అంటే డ్రైవర్ ని మనం మంచి చేసుకోవాలి. అప్పుడే, మనం కనబడగానే, డ్రైవర్ కాలును, కాసేపు బ్రేక్ మీద నొక్కిపెడతాడు. అర్ధం అయిందా? సమ్జే! అండర్ స్టాండ్!' అన్నాడు అన్ని భాషల్లో బ. నా.

'అయింది మహాప్రభో!' అనేసాడు ఛో.నా.

(తోకటపా: ఎవరా ఛో.నా. ? ఎవరా బ.నా.? ఇంతకీ ఎవరా రిపోర్టర్? ఇలాటి ప్రశ్నలు దయచేసి అడక్కండి. చెప్పినాయన చెప్పలేదు. అలా అడిగే అలవాటులేని నేనూ అడగలేదు, విని వూరుకున్నంత సుఖం మరోటి లేదు. ఇలాంటి వాటినే మీడియా  పరిభాషలో ఆఫ్ ది రికార్డ్ అంటారు)

 

ఇరానీ హోటల్ సమోసా – భండారు శ్రీనివాసరావు

 

నేను హైదరాబాదు వచ్చిన కొత్తల్లో అంటే సుమారుగా  కొంచెం అటూ ఇటూగా యాభయ్ ఏళ్ళ నాడు,  మిత్రుడు ఒకరు నాకో విషయం చెప్పారు.

హైదరాబాదులో వున్న వందలాది ఇరానీ రెస్టారెంట్లలో సమోసాలు అన్నీ ఒకే సైజులో, ఒకే రుచి ఉండేలా ఎలా తయారు చేస్తారు అనే నా సందేహానికి జవాబుగా అతడు చెప్పిన మాట ఏమిటంటే ఇవన్నీ ఒకే చోట తయారు చేసి వాటిని నగరంలోని అన్ని ఇరానీ హోటళ్ళకు సప్లయి చేస్తారని. దాంట్లో నిజమెంతో తెలుసుకోవడానికి ఇన్నేళ్ళలో నేనెప్పుడూ ప్రయత్నించలేదు.  

ఇప్పుడు సోషల్ మీడియాలో వివిధ రాజకీయ పార్టీల అభిమానులు షేర్ చేస్తున్న అభిప్రాయాలు, కేప్షన్లు, కార్టూన్లు చూస్తుంటే వాటి రంగూ, రుచీ, పోలిక ఒకే విధంగా ఉంటున్నాయి.

నా స్నేహితుడు చెప్పినట్టు ఇరానీ రెస్టారెంట్లలో సమోసాల  మాదిరిగా ఈ పోస్టులన్నీ  ఒకే చోట తయారయి  షేర్  సింగుల ద్వారా అందరికీ చేరడం లేదు కదా అనే అనుమానం కలుగుతోంది.  (10-12-2020)

9, డిసెంబర్ 2020, బుధవారం

సున్నకు సున్న హళ్ళికి హళ్ళి

 నేను టీవీ చర్చలకు వెళ్ళే రోజుల్లో నా మిత్రులు అంటుండేవారు 'నువ్వు తెరమీద కనిపించేది ఎక్కువ, మాట్లాడేది తక్కువ' అని.

యాంకర్ అడిగేవరకూ కల్పించుకుని మాట్లాడకూడదు అని నాకై నేను పెట్టుకున్న నియమం దానికి కారణం.

పోతే, నాకిది ఒకరకంగా కలిసి వచ్చింది కూడా. రాజకీయ పార్టీల ప్రతినిధులు చాలా మందిలో విషయ పరిజ్ఞానం వుంది. కొన్ని అంశాలను గురించి వాళ్ళు చక్కటి హోం వర్క్ చేసుకుని వచ్చేవారు. అనవసరమైన రాద్ధాంతాలు, వాదోపవాదాల వల్ల అది మరుగునపడేది. ఎప్పుడైనా వాళ్ళు మంచి విషయాలు చెప్పేటప్పుడు నేను శ్రద్ధగా వినేవాడిని.

అలాగే వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా, లేదా ప్రతికూలంగా మాట్లాడుతున్న వారి నుంచి ఏదైనా మంచి అదనపు సమాచారం తెలుస్తుందేమో అని చూస్తుంటే నిరాశే మిగులుతోంది. రాజకీయ కోణం మినహాయిస్తే ఇరు పక్షాల వాదనల్లో కూడా విషయం వుండడం లేదు.

ఫేస్ బుక్ లో కూడా ఇదే పరిస్థితి. ఎవరో పంపింది హడావిడిగా పోస్ట్ చేసి షేర్ చేయడమే తప్ప స్వంతంగా బిల్లులు చదివి ఆకళింపు చేసుకున్న దాఖలా కనపడడం లేదు.
ఇదొక విషాదం!

బిల్లులను సమర్థిస్తూ , వ్యతిరేకిస్తూ రెండు పెద్ద మెసేజెస్ నాకు వాట్సప్ లో వచ్చాయి. ఒక్కొక్కటి రెండు పేజీలు అదీ ఇంగ్లీషులో. పైగా పంపింది ఒక్కరే. అదీ నా స్నేహితుడే.. నాలాగే ఇంగ్లీషులో కాస్త పూర్. మరి ఇంత పెద్ద మెసేజ్ ఎలా రాసాడని ఆశ్చర్యపోతుంటే రెండోది వచ్చింది.
ఇలా తన దృష్టికి వచ్చిన ప్రతిదీ కనిపించిన ప్రతివాడికీ ఫార్వార్డ్ చేయడం అతడికి అలవాటు.
ఈ షేర్ సింగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది అని మాత్రం నాకు అర్ధం అయింది. 

(మళ్ళీ ఇదే మెసేజ్ అతగాడు నాకు ఫార్వార్డ్ చేసినా నేను ఆశ్చర్యపోను)

పొతే, ఓ డౌటేహం!

షేరింగ్, కట్ అండ్ పేస్ట్ ఆప్షన్లు తొలగిస్తే రాజకీయ పార్టీల సోషల్ మీడియా యూనిట్ల పరిస్తితి ఏమిటి?

 

Top of Form

Bottom of Form

 

5, డిసెంబర్ 2020, శనివారం

ఆ ఏడూ వాళ్ళవే – భండారు శ్రీనివాసరావు

 

2018 ఎన్నికలు. ఒక పక్క టీఆర్ఎస్. మరో పక్క మహాకూటమి. రాజకీయంగా ఉత్తర దక్షిణ ధృవాలయిన కాంగ్రెస్, టీడీపీ ఈ ఎన్నికల్లో చేతులు కలపడం ఓ విశేషం. ప్రచారాలు తారా స్థాయిలో సాగుతున్నాయి. ఫలితాలు గురించి అనేకరకాల ఊహాగానాలు.

కొందరు విలేకరులు ఒక పోలీసు ఉన్నతాధికారితో చిట్ చాట్ చేస్తున్నారు.

“మీ అంచనా ఏమిటి” ఓ విలేకరి ఆరా.

ప్రభుత్వ ఉద్యోగి. తెలిసిన సమాచారం అయినా, అలా బాహాటంగా ఎలా పంచుకుంటాడు? అదీ విలేకరులతో.
అందుకే చిన్నగా నవ్వాడు. నవ్వి చెప్పాడు.

“రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది అవేవీ నేను చెప్పను కానీ, ఆన్ రికార్డ్ ఒక విషయం నిర్ధారణగా చెప్పగలను. పాత బస్తీలో ఆ ఏడు సీట్లు వాళ్ళవే”

అలాగే జరిగింది.
రెండేళ్ల గడిచాయి.

తాజాగా, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు గురించి వెలువడిన సర్వేలు అన్నీ మటాష్ అయ్యాయి. కాకపొతే, ఒక్క ఎం.ఐ.ఎం. పార్టీ గురించి ఆ సర్వేల్లో వచ్చిన ఫలితాలు మాత్రం వాస్తవ ఫలితాలకు దగ్గరగా వున్నాయి.

ఆ అధికారి చెప్పినట్టుగా, ఆ పార్టీ విజయావకాశాలు గురించి అంచనా వేయడానికి ఏ సర్వేలు అక్కరలేదేమో!
(05-12-2020)

3, డిసెంబర్ 2020, గురువారం

రజనీ రాజకీయ రంగప్రవేశం

రజనీ రంగప్రవేశం - భండారు శ్రీనివాసరావు

‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు’ అంటుండే రజనీ కాంత్, తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పటికి వెయ్యిసార్లు చెప్పిన మాటను నిలబెట్టుకుంటారా లేదా అనేది గత మూడేళ్ళుగా ఆయన అభిమానుల్లో నలుగుతూ వస్తున్న సందేహం. రజనీ తన స్టైల్ లోనే ఒక్క ట్వీట్ తో దీన్ని పటాపంచలు చేశారు. ఈ నెల ముప్పయి ఒకటిన రాజకీయ పార్టీ ప్రకటన చేస్తానని రజనీ వెల్లడించడం ఆయన అభిమానులకు ఒకరకంగా నూతన సంవత్సర కానుకే అవుతుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన అభిమాన గణం సంబరాలు చేసుకోవడం మొదలయింది కూడా.

పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్టు మన దేశంలో తమిళనాడు రాజకీయాల తరహానే వేరు. అక్కడ అనేక సంవత్సరాలుగా రెండే రెండు, డి ఎం కె, ఏ ఐ డి ఎం కె అనే ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తోంది. రెంటికీ ఉమ్మడి పోలిక సినిమా రంగం నేపధ్యం. ఇక ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీల పరిస్థితి నామమాత్రం. వనరులు కలిగిన పెద్ద పార్టీలు కాబట్టి ఏదో విధంగా తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఈ విషయంలో కూడా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల పంచనే కాలం వెళ్లదీస్తున్నాయి. కాకపొతే అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ కేంద్రంలో అధికారం అనే ఒక కారణంతో ఆయా ప్రాంతీయ పార్టీల మీద కొద్దో గొప్పో పెత్తనం చెలాయించగలిగే పరిస్థితిలో వుండడం వాటికో ఊరట.

తమిళనాట సినీ ప్రభావం ఎక్కువ కావడం చేత చాలామంది సినీ హీరోలు తమ అదృష్టాన్ని రాజకీయ రంగంలో పరీ క్షించుకోవడం మొదలు పెట్టారు. ఈ జాబితా కూడా పెద్దదే. ఈ కారణం వల్ల కాబోలు ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సంఖ్య భారీగా వుంది. నిరుడు జరిగిన లోక సభ ఎన్నికలలోముప్పై మూడు పార్టీలు పోటీ చేసాయి. ఫలితాలు మాత్రం బాగా నిరాశ కలిగించాయి. అయినా కొత్త పార్టీలు పుట్టుకొస్తూనే వున్నాయి. తమిళనాడు రాజకీయాలను క్రీగంట శాసించిన జయలలిత, కరుణానిధి ఇద్దరూ కాలం చెయ్యడం వల్ల ఏర్పడ్డ రాజకీయ శూన్యత కూడా మరో కారణం.

రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనను, వీరిద్దరూ జీవించి ఉండగానే ఎప్పుడో 2017లోనే రజనీ కాంత్ వ్యక్తం చేశారు. వారు మరణించి చాలాకాలం అవుతున్నా ఆ ఆలోచన మాత్రం కార్యరూపం దాల్చకపోవడంతో, రాజకీయాల పట్ల రజనీకాంత్ అంత ఆసక్తిగా లేరని జనం అనుకునేవరకు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇవి ముదిరి పాకానపడ్డప్పుడల్లా రజనీ మధ్య మధ్య ఏవో ప్రకటనలు చేస్తూ వాటికి తెర దించుతూ వచ్చారు. ఓ వారం క్రితం రజనీకాంత్ మరోసారి తన అభిమాన సంఘాల వారిని పిలిపించుకుని ఓ సమావేశం పెట్టడంతో ఈసారి ఖచ్చితమైన ప్రకటన వస్తుందని అందరూ ఆశించారు. కానీ షరా మామూలుగా కొత్త విషయం ఏమీ రజనీ నోటివెంట రాలేదు. దానితో మరోరకమైన వదంతులు వ్యాపించాయి. ఆయన తటపటాయింపుకు కారణం అనారోగ్య సమస్యలు కాదుకదా అనేంత వరకూ అవి సాగాయి. ఇక వీటికి అడ్డుకట్ట వేయడం అవసరం అనుకున్నారేమో, రజనీ కాంత్ హఠాత్తుగా ఈ ట్వీట్ దెబ్బతీశారు.

షెడ్యూలు ప్రకారం 2021 మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. జనవరిలో పార్టీ పేరు ప్రకటిస్తే అప్పటికి కేవలం అయిదు నెలల వ్యవధానం మాత్రమే వుంటుంది. ఈలోగా ఎన్నికల కమిషన్ లో పార్టీని రిజిస్టర్ చేయించుకోవడం, పార్టీ గుర్తును ఎంచుకుని దానికి అనుమతి తెచ్చుకోవడం మొదలయిన ముఖ్యమైన కార్యాలు నెరవేర్చుకోవాల్సి వుంటుంది. ఇవన్నీ ఒక పద్దతిగా చక్కబెట్టగల యంత్రాంగం కూడా అవసరం. వ్యవధి తక్కువ కావడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం వుంటుంది. ఒకవేళ పార్టీని ఈ ఎన్నికలలో విజయపథంలో నడిపించి అధికారంలోకి తీసుకురాగలిగితే, తొమ్మిది మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికార పీఠంపై నిలబెట్టిన ఒకనాటి ఎన్టీఆర్ రికార్డును అధిగమించినట్టు అవుతుంది.

రాజకీయ పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క అభిమాన సంఘాల అభిమానం ఒక్కటే సరిపోదు. అభిమానులను కార్యకర్తలుగా రూపొందించుకోవాలి. పొతే, పెద్ద హీరోలు కొత్త పార్టీ పెట్టినప్పుడు వారికి ఎదురయ్యే పెద్ద సవాలుఏమిటంటే, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా లేదా ఎవరినైనా కలుపుకు పోవాలా! అనే సందిగ్ధత. ఈ ప్రశ్నకు జవాబు అంత తేలికకాదు. అభిమానులు తమ హీరోని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. అంతేకానీ మరో పార్టీని అధికారంలోకి తేవడానికి వారు ఇచ్చగించరు.

అలాగే ఒక సాధారణ రాజకీయ నాయకుడు పార్టీ పెడితే గెలుపోటములు లెక్కలోకి రావు. కానీ కోట్లాది అభిమానులను కలిగిన ఓ సినీ హీరో అలా ఛాన్స్ తీసుకోవడం కష్టం. ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంగా ఆ హీరో పరిగణించకపోయినా, అతడి అభిమానులు అలా అనుకోరు. తేలిగ్గా తీసుకోరు. ఒక సినిమా ఆడకపోయినా పెద్ద హీరోలకు మరో సినిమా అవకాశం వస్తుంది కానీ, రాజకీయాల్లో ఈ లెక్కలు వేరుగా వుంటాయి.

సినీ రంగంలో రజనీ స్నేహితుడు తోటి సూపర్ స్టార్ కమల్ హసన్ ఈ విషయంలో ఒక అడుగు ముందే వున్నారు. కానీ, నిరుడు జరిగిన లోక సభ ఎన్నికల రణ క్షేత్రంలో ఆయన వేసిన తొలి అడుగే తడబడింది. ఆయన చేసిన ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పైగా దారుణమైన నిరాశను కలిగించేవిగా వున్నాయి. పోటీ చేసిన స్థానాల్లో ఆయన నిలబెట్టిన అభ్యర్ధులకు ధరావత్తులు కూడా దక్కలేదు. అభ్యర్ధుల ఎన్నికల వ్యయ నిబంధనలకు లోబడి ఖర్చు చేయడం, ప్రత్యర్థి పార్టీలు విచ్చలవిడిగా ఖర్చు చేయడం వంటివి తమ MNM పార్టీ ఓటమికి కారణాలుగా చెప్పుకొస్తూ, ఈ ఓటమి వల్ల తాను ఏమీ చింతించడం లేదని, రాజకీయాల్లో నైతికవిలువలను కాపాడడమే ధ్యేయంగా పెట్టుకునే వారికి గెలుపు ఓటములు ప్రధానం కాదనీ వివరణ ఇచ్చుకున్నారు.

మరో రకంగా పరిశీలిస్తే కమల్ సాధించింది తక్కువేమీ కాదనిపిస్తుంది. కమల్ హసన్ పార్టీ మొత్తం 38 సీట్లలో 13
చోట్ల కమల్ హసన్ పార్టీ మూడో స్థానంలో వుంది. చెన్నై లో 10 శాతం ఓటు షేర్ తెచ్చుకుంది. పారిశ్రామిక వాడల్లో ఇది పదిహేను శాతం దాకా వుంది. ఆ ఎన్నికల్లో కమల్ పార్టీకి మొత్తంగా పదిహేను లక్షల ఓట్లు పోలయ్యాయి. పార్టీ స్థాపించిన పద్నాలుగు నెలల్లో ఈ స్థాయిలో ఓట్లు రావడం అంటే అసాధారణమే అని అన్నవాళ్లు కూడా వున్నారు.

2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం ముప్పయి మూడు పార్టీలు పోటీ పడ్డాయి. మూడు కూటములుగా ఏర్పడ్డాయి. ఏడు పార్టీలతో జయలలిత నాయకత్వంలోని ఏ ఐ డి ఎం కె కూటమి ఒకటి కాగా, కరుణానిధి నేతృత్వంలోని ఎనిమిది పార్టీల డి ఎం కె కూటమి రెండోది. ఏ ఐ డి ఎం కె కూటమిలోని పార్టీలు అన్నీ ఒకే గుర్తు, అంటే ఏ ఐ డి ఎం కె సింబల్ రెండు ఆకుల గుర్తుతోనే పోటీ చేయడం విశేషం. ఒక చిన్న స్థాయి ప్రాంతీయ పార్టీని కలుపుకుని బీజేపీ కూడా రంగంలో దిగింది. ఏ కూటమిలో కలవకుండా 10 ప్రాంతీయ పార్టీలు విడిగా పోటీ చేసాయి. ప్రధాన కూటముల నాయకులు జయలలిత, కరుణానిధికి ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు. 2016లో గెలిచి ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన జయలలిత తీవ్రమైన అనారోగ్యం పాలయి డెబ్బయి అయిదు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి అదే ఏడాది డిసెంబరులో కన్నుమూసారు. ఆ ఎన్నికల్లో త్రుటిలో విజయావకాశాలను చేజార్చుకుని ఓటమి పాలయిన కరుణానిధి 2018లో వృద్ధాప్యంతో మరణించారు.

తమిళనాట మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ రాష్ట్రంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు కులాలవారీగా రాజకీయ పార్టీలు వున్నాయి. వీటివల్ల ఓట్లలో చీలిక అనివార్యం.

మచ్చలేని మంచివాడనే గొప్ప పేరు రజనీ కాంత్ కు పుష్కలంగా వుంది. ఆ పేరుకు తగ్గట్టుగా అతి గొప్ప శ్రమ తోడయితేనే రజనీకాంత్ రాజకీయ ప్రయోగం విజయవంతమయే అవకాశాలు వుంటాయి.

ఏడు పదుల వయసులో ఆయన తీసుకున్న నిర్ణయం సరయినదా కాదా అనేది మరి కొద్ది నెలల్లో తమిళనాడు ఓటర్లు నిర్ణయిస్తారు. (03-12-2020)





1, డిసెంబర్ 2020, మంగళవారం

హాయిగా, ఇంకెంతో....

 ఓటు వేయడానికి ఇంట్లో బయలుదేరివెళ్లి మళ్ళీ ఐదో నిమిషంలో ఇంట్లో వున్నాను.

ఇంత తేలిగ్గా, ఇంత హాయిగా, ఇంత త్వరగా ఓటు వేసిన సందర్భం ఇదే.

GHMC ఓటరు స్లిప్ ప్రకారం చూస్తే పోలింగు బూతు మా ఇంటికి దగ్గరలోనే వుంది. గూగుల్ మ్యాప్ ప్రకారం నడిచి వెడితే రెండు నిమిషాలు. ఈరోజు రోడ్డు కూడా ఖాళీగా వుంది. అంచేత ఇంకా త్వరగానే చేరుకున్నాను. 


వరుస నెంబరు 888  రూము నెంబరు  4. అంతా నాకోసమే ఎదురుచూస్తున్నట్టుగా వాతావరణం. ఓటరు ఐ.డి. చూసి ఎడమ చేతి చూపుడు వేలు మీద పొడుగ్గా నామం దిద్ది సంతకం పెట్టించుకుని బ్యాలెట్ పత్రం చేతికి ఇచ్చారు. చాలా కాలం తర్వాత బ్యాలెట్ ఓటు కొత్తగా అనిపించింది.

ఓటు వేసి వస్తుంటే అక్కడ కుర్చీలో కూర్చున్న పోలీసు లేచి వచ్చి  నాతొ ఎందుకు చెప్పాడో తెలవదు. ‘అంతా బాగానే వుంది. మాకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పెట్టారు. ఇప్పుడే లంచ్ కూడా ఇచ్చారు. మాకయితే, పెద్ద పనిలేదు, ఇప్పటిదాకా అన్నాడు. కాస్త ఎక్కువ ఫీజులు వసూలు చేసే ఒక ప్రైవేటు  స్కూల్లో ఈ పోలింగు కేంద్రాన్ని ఇచ్చారు. ప్రతి గదిలో ఏసీలు, మంచి వసతిగా, చక్కగా వుంది. వెయిట్ చేయడానికి బయట  పెద్ద అందమైన షామియానా వేశారు. వెయిట్ చేసేవాళ్ళే లేరు.

తిరిగి వస్తుంటే దోవలో రోడ్డు పక్కన కుర్చీ బెంచీలు వేసుకుని ఓటరు స్లిప్పులు ఇచ్చే ఆయా  పార్టీల వాళ్ళు  ‘మన దగ్గరకు రాకుండానే ఓటేసి వెడుతున్నాడు’ అన్నట్టు ఓ చూపు చూసారు.

మొత్తం మీద నేను సైతం.......     

నోముల నరసింహయ్య ఇక లేరు

 

అసెంబ్లీ అనగానే గుర్తు వచ్చే పేరు నోముల నరసింహయ్య. ఆయన సభలో మాట్లాడుతుంటే ఆయన నోటి వెంట సామెతలు  అలవోకగా జారుతుండేవి. వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు చాలామంది మంచి వక్తలు కూడా అయివుండే అవకాశం ఎక్కువ. ఆ విధంగా నరసింహయ్య గారు మాట్లాడుతున్నారు అంటే  ప్రెస్ గేలరీలో విలేకరులు శ్రద్ధగా వినేవారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో వున్నప్పుడు, తర్వాత టీఆర్ఎస్ లో చేరిన పిదప కూడా ఆయనతో కలిసి అనేక సార్లు టీవీ చర్చల్లో పాల్గొనే అవకాశం నాకు దొరికింది. మనిషి నిరాడంబరంగా వుండేవారు. మాట కూడా అంతే!

కరోనాను జయించిన  మనిషి  గుండె పోటుకు గురయి మరణించడం విషాదం. ఆయనది మరీ పెద్ద వయసు కూడా కాదు.

రెండేళ్ల క్రితం టీ న్యూస్ చర్చలో నోముల నరసింహయ్య గారితో...