24, జులై 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (349) : భండారు శ్రీనివాసరావు

“డాడీ లేరు తాతయ్యా!”
పొద్దున్నే ఫోను మోగింది. ఎత్తలేదు. ఉదయం పూట మా ఇంట్లో వాటర్ ఎమర్జెన్సీ. అరగంటలో నీళ్ళతో కావాల్సిన పనులన్నీ ముగించేయాల్సిందే. తప్పదు. లేకపోతే మర్నాటి వరకూ ఇంతే సంగతులు.
తర్వాత మొబైల్ తీసి చూస్తే కీర్తన్ అని వుంది. ఒకప్పుడు వాళ్ళు మా ఇంటి పక్క వాటాలోనే వుండే వారు. కాల్ బ్యాక్ చేసి అడిగాను ‘ ఏమిటి కీర్తన్ పొద్దున్నే ఫోన్ చేశారు?’
బదులుగా వాళ్ళ అమ్మాయి గొంతు.
“తాతయ్యా! డాడీ లేరు”
‘ఎక్కడికి వెళ్ళారమ్మా! ఇప్పుడే ఫోన్ చేశారు’
‘అది కాదు తాతయ్యా! నేనే చేశాను. డాడీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు’
షాక్ తిన్నాను. మా అబ్బాయి వయసు వాడు. ఇద్దరు పిల్లలు.
పాపం లక్ష్మి ! ఎంత కష్టం వచ్చిపడింది.
వెంటనే లేచి వాళ్ళ ఇంటికి బయలుదేరాను. మధ్యలో ఏటీఎం దగ్గర ఆగి కొంత డబ్బు డ్రా చేశాను.
మా ఏడుగురు బావల్లో ఇద్దరి అలవాట్లు దగ్గర వుండి గమనించేవాడిని. హనుమంత రావు బావగారు ఎవరికయినా ఒంట్లో బాగాలేదని తెలిస్తే చూడడానికి వెళ్ళినప్పుడు కొంత మొత్తం పట్టుకుని వెళ్లి ఇచ్చేవారు. మా అప్పారావు బావ గారి తరహా వేరు. దసరా నవరాత్రులు చాలా నిష్టగా చేసేవాడు. అయితే, పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలకు సాధారణంగా వెళ్ళే వాడు కాడు. ఎవరైనా చనిపోయిన కబురు తెలిస్తే మాత్రం రెక్కలు కట్టుకుని వెళ్ళేవాడు. వెళ్ళగానే వాళ్లకు ఎంతో కొంత డబ్బు ఇచ్చేవాడు. ఇలాంటి కార్యక్రమాలకు డబ్బు సాయం చేయడానికి చాలామంది జంకుతారు. కానీ ఈయన అలా కాదు. వీళ్ళ ఇద్దరి పద్దతి నాకు బాగా నచ్చేది.
ఉబెర్ లో వెడుతున్నంత సేపు నాకు కీర్తన్ వాళ్ళ ఆలోచనలే.
మా ఆవిడ చనిపోయిన తర్వాత, ఒకరోజు ఒక్కడినే ఇంటి పట్టున వుండి ఏదో రాసుకుంటున్నాను. తలెత్తి చూస్తే కీర్తన్, లక్ష్మి, వాళ్ళ పిల్లలు.
“అమ్మని చూడానికి వచ్చాను. అమ్మ పెట్టిన చీర కట్టుకుని”
లక్ష్మిగారు అంటున్నది ఏమిటో ముందు అర్ధం కాలేదు. మా ఆవిడ పోయిన రోజు వాళ్ళు మాతోనే వున్నారు. మరి చూడాలని వచ్చిన అమ్మ ఎవరు?
లక్ష్మి, కీర్తన్ లది ప్రేమ పెళ్లి. పైగా మతాంతరం. పెళ్లి చేసుకుని వచ్చి మా పక్క అపార్ట్ మెంటులో కాపురం పెట్టారు.
ప్రేమ పెళ్లి కదా! పెద్దవాళ్లు సర్దుకోవడానికి కొంత సమయం పట్టింది. ఈ నేపధ్యంలో మా ఆవిడే ఆమెకు అమ్మగా మారింది. కాదు లక్ష్మి మా ఆవిడను అమ్మగా చేసుకుంది. ఎప్పుడూ ‘అమ్మా’ అని పిలిచేది. ఆ బంధం మరింత బలపడుతూ వచ్చింది.
లక్ష్మి కడుపుతో వున్నప్పుడు మా ఆవిడే నలుగుర్ని పిలిచి మా ఇంట్లోనే సీమంతం చేసింది. మా రెండో వదిన విమల వదిన గారు కూడా ఈ వేడుకలో సంతోషంగా పాల్గొన్నారు.
భార్యా భర్తా తమ పనులపై బయటకు వెళ్ళినప్పుడు, మా ఆవిడే వారి పిల్లల్ని తన పిల్లలుగా పెంచింది. అంతే కాదు ఓ అమ్మని తన కుమార్తెగా చేసుకుంది. తర్వాత వాళ్ళు ఇల్లు మారి వెళ్ళిపోయారు.
లక్ష్మి మంచి విద్యాధికురాలు. ఓ లెక్చరర్ కావాల్సిన అన్ని అర్హతలు వున్నాయి. కానీ అవకాశాలు దొరక్క మా ఇంటి దగ్గరలో ఓ చిన్న ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా చేరింది. అలా కష్టపడుతూ, అనుభవం పెంచుకుంటూ ఇప్పుడు ఓ కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తోంది.
ఇద్దరు పిల్లలు మా కళ్ళ ముందే పుట్టారు. నా భుజాల వరకు ఎదిగారు. తల్లి టీచర్. అంచేతనే వాళ్లు కూడా చదువులో ఫస్టు.
ఆ రోజు స్కూలుకు హోలీ సెలవు. అందుకని కీర్తన్ భార్య, పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చాడు.
మా ఆవిడ బతికి వున్నప్పుడు లక్ష్మిని ఏదో పండక్కు పిలిచి చీరె పెట్టిందట. అది కట్టుకుని వచ్చింది. నెలల పిల్ల నా మనుమరాలు జీవికకి, ఎండాకాలం కదా, సైజులు వెతికి వెతికి మరీ చిన్న చిన్న కాటన్ ఫ్రాకులు పట్టుకు వచ్చింది.
అప్పుడు వయసులో పెద్ద అయిన మా ఆవిడ, లక్ష్మికి అమ్మ. ఇప్పుడు నెలల పిల్ల నా మనుమరాలిని ‘అమ్మ’ అంటూ ఆవిడే పిలుస్తోంది. అమ్మే మళ్ళీ ఈ రూపంలో పుట్టిందని తెగ సంతోషపడింది.
అనుబంధాలకు అర్ధాలు ఒక పట్టాన అర్ధం కావు.
వెళ్లాను. మంచు పెట్టెలో సుదీర్ఘ నిద్రలో వున్న కీర్తన్ ని చూసాను.
నిర్వేదం. ఎంతటివారికయినా, మంచుపెట్టెలో చివరి నిద్ర తప్పదేమో!
నన్ను చూసి కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్న లక్ష్మి గారిని ఎలా ఓదార్చాలో తెలియదు. పక్కకు పిలిచి ‘ఏమీ అనుకోవద్దు, మీ నాన్నఇచ్చాడు అనుకోండి’ అని తెచ్చిన డబ్బు ఆవిడ చేతిలో పెట్టి, పిల్లల్ని పలకరించి వచ్చేశాను.
ఉపశృతి:
సబ్ కో సమ్మతి దే భగవాన్
చాలా ఏళ్ళ కిందటి సంగతి.
డ్యూ.
ఇంకా అప్పటికి ప్రాధమిక విద్యాస్తాయిలోనే వుంది. కీర్తన్, లక్ష్మి దంపతుల తొలి చూలు పిల్ల. తల్లి టీచరు. తండ్రి కళాకారుడు.
వాళ్ళు విశ్వాసం రీత్యా క్రైస్తవులు. ముస్లిం మతస్తులు నడుపుతున్న ఒక ప్రముఖ పాఠశాలలో ప్రవేశ పరీక్ష రాసి ఫస్టున పాసయింది. తలితండ్రుల ప్రోత్సాహంతో హిందూ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న సంగీత పాఠశాలలో చేరింది. ఆ పాప కృష్ణాష్టకం, శివాష్టకం చదివే తీరుకు ముగ్డులయిన ఆ పాఠశాల వాళ్ళు ఆ ఏడాది శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు డ్యూను ఎంపిక చేశారు.
డ్యూ అంటే మంచు బిందువు. తుషారం.
ఆ అమ్మాయి ఇప్పుడు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది.
పొద్దున్న తాతయ్యా అని ఫోన్ చేసింది ఈ అమ్మాయే!







(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: